‘మార్గదర్శి’ పేరిట రామోజీ సామ్రాజ్య విస్తరణ.. ఆర్‌బీఐ చట్టానికి విరుద్ధంగా డిపాజిట్ల సేకరణ
ఆ ముసుగులో భారీగా నల్లధనం దందా
సాక్షి, అమరావతి: పచ్చళ్ల వ్యాపారి... చిట్‌ఫండ్ సంస్థ యజమాని... పత్రికాధిపతి... ఫిల్మ్ సిటీ అధినేత... ఇవన్నీ చెరుకూరి రామోజీరావు ధరించిన లొసుగుల ముసుగులే! దశాబ్దాలుగా సాగించిన అక్రమ డిపాజిట్లే ఆయన దోపిడీకి రాచబాట. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీ సేకరించినవి అక్రమ డిపాజిట్లేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) సుప్రీంకోర్టుకు నివేదించడంతో కేసు కీలక మలుపు తిరిగింది. రామోజీరావు ఓ ఆర్థిక నేరస్తుడే అన్నది స్పష్టమైంది.
చిట్‌ఫండ్స్ బోర్డు.. ఫైనాన్సియర్స్ పేరిట భారీగా అక్రమ డిపాజిట్లు
2006 వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రశ్నించే వరకు ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ అనే సంస్థ ఉన్నట్లు కూడా సామాన్యులకు తెలియదు. రాష్ట్రం అంతటా ‘మార్గదర్శి చిట్ ఫండ్స్’ కార్యాలయాలే కనిపించేవి. ఆ కార్యాలయాల్లోనే గుట్టు చప్పుడు కాకుండా ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ పేరిట మరో కంపెనీ ఆర్థిక కార్యకలాపాలు సాగించిందనే విషయం బయటి ప్రపంచానికి తెలియదు.
అలా 1997 నుంచి 2006 వరకు మార్గదర్శి ఫైనాన్సియర్స్ యథేచ్ఛగా అక్రమ కార్యకలాపాలు సాగించింది. ఆర్‌బీఐ చట్టం 45ఎస్ ప్రకారం కంపెనీల చట్టం కింద నమోదైన ఇన్‌కార్పొరేటెడ్ కంపెనీలు మాత్రమే ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాలి. రామోజీ తన గ్రూపు సంస్థలను ‘హిందూ అవిభాజ్య కుటుంబం(హెచ్‌యూఎఫ్) కింద నమోదు చేసినట్టుగా పేర్కొన్నారు. హెచ్‌యూఎఫ్ కింద నమోదైన కంపెనీలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయకూడదు.
2006లో మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చే నాటికి ఏకంగా రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్లను సేకరించడం విభ్రాంతికర వాస్తవం. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై కేసు న్యాయస్థానంలో విచారణలో ఉండగా మరో రూ.2 వేల కోట్ల వరకు అక్రమ డిపాజిట్లు సేకరించారని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టుకు నివేదించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
లెంపలేసుకుని.. ‘మార్గదర్శి’ షట్టర్ క్లోజ్
మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల దందా బయటపడటంతో రామోజీరావు కంగుతిన్నారు. నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు రంగాచారిని విచారణ అధికారిగా నియమించింది. సీఐడీ తరపున న్యాయ స్థానాల్లో కేసులు దాఖలు చేసేందుకు టి.కృష్ణంరాజును అధీకృత అధికారిగా నియమించింది.
మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట ఏకంగా రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించినట్టు వీరు గుర్తించారు. సెక్షన్ 45 ఎస్ ప్రకారం హెచ్‌యూఎఫ్‌లు డిపాజిట్లు సేకరించకూడదని ఆర్‌బీఐ స్పష్టం చేయడంతో రామో జీ తాము తప్పు చేసినట్టు అంగీకరించారు. నగదు రూపంలో డిపాజిట్లు వసూలు చేసినట్లు వెల్లడించారు. డిపాజిట్ దారులకు వారి డిపాజిట్లను తిరిగి చెల్లించి మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను మూసి వేస్తామని న్యాయస్థానానికి లిఖిత పూర్వకంగా తెలిపారు.
అంతా నల్లధనం దందానే
మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించిన ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ ముసుగులో రామోజీరావు భారీగా నల్లధనం దందాను సాగించారు. సీఐడీ సోదాల్లో, ఆదాయ పన్ను శాఖ తనిఖీల్లో ఆ విషయం వెలుగు చూసింది. అందుకనే డిపాజిట్‌దారుల వివరాలను వెల్లడించేందుకు రామోజీరావు మొండికేశారు. డిపాజిట్ల ముసుగులో టీడీపీ పెద్దలు భారీగా నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చారు.
♦ కేంద్ర ఆదాయపన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించి రామోజీ నల్లధనం దందా నడిపారు. రూ.20 వేలకు మించిన లావాదేవీలు నగదు రూపంలో తీసుకోకూడదని ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 269 స్పష్టం చేస్తోంది. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌లో దాదాపు అన్ని డిపాజిట్లు నగదు రూపంలోనే తీసుకోవడం గమనార్హం.
నగదు రూపంలో డిపాజిట్లు స్వీకరించి తమ సిబ్బంది ద్వారా డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ), పే ఆర్డర్లు(పీఓ)ల రూపంలోకి మార్చినట్టు ఆదాయ పన్ను శాఖ అధికారుల తనిఖీల్లో బయట పడింది. డిపాజిట్ చేసిన మొత్తాలను రూ.50 వేల కంటే తక్కువ మొత్తాలుగా విభజించి మరీ డీడీలు, పీఓలుగా మార్చారు.
♦ మార్గదర్శి ఫైనాన్సియర్స్ రశీదు రూపంలో సేకరించిన డిపాజిట్ల పత్రాలను పరిశీలిస్తే అదంతా నల్లధనం బాగోతమేనన్నది స్పష్టమవుతోంది. డిపాజిట్‌దారుల పాన్ నంబర్లు, పూర్తి చిరునామాలు కూడా లేకుండానే డిపాజిట్లు సేకరించడం గమనార్హం.
♦ రామోజీరావు 2008లో సమర్పించిన అఫిడవిట్‌లో రూ.1,864.10 కోట్లు డిపాజిట్‌దారులకు చెల్లించేశామని తెలిపారు. మరి మిగిలిన దాదాపు రూ.750 కోట్ల డిపాజిట్లు ఏమయ్యాయనే విషయంపై మౌనం వహించారు. గుట్టుచప్పుడు కాకుండా రికార్డుల నుంచి తొలగించిన ఆ డబ్బంతా రామోజీకి అత్యంత సన్నిహితుడైన టీడీపీ పెద్దలు, ఆయన గ్యాంగ్‌వేనని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment