
నేతాజీపై నిఘా!
సర్వకాలీనమూ, సర్వవ్యాపితమూ అయిన గూఢచర్యం అంశం మళ్లీ చర్చలోకి వచ్చింది.
సంపాదకీయం
సర్వకాలీనమూ, సర్వవ్యాపితమూ అయిన గూఢచర్యం అంశం మళ్లీ చర్చలోకి వచ్చింది. దేశం ఎంతగానో ప్రేమించే, ఆరాధించే స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాస్ చంద్రబోస్ సన్నిహిత బంధువులపై రెండు దశాబ్దాలపాటు కేంద్రం లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు నిఘా ఉంచాయని వెల్లడికావడం ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నది. తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కాలంనుంచి 1968 వరకూ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) కోల్‌కతాలోని బోస్ కుటుంబ సభ్యుల ఇళ్లపై గూఢచర్యం నిర్వహించిందని, ఆ ఇంటికి వెళ్లివచ్చేవారి గురించి ఆరా తీయడం తోపాటు... ఆ కుటుంబంలోనివారు ఎక్కడికెళ్లినా నీడలా వెంటాడేదని తాజాగా వెల్లడైన ‘అత్యంత రహస్య పత్రాలు’ చెబుతున్నాయి. నేతాజీ మరణం ఇప్పటికీ వివాదాస్పదమే. అప్పట్లో జపాన్ ప్రకటించినట్టు ఆయన విమాన ప్రమాదంలో మరణించారా లేక ఆయనను ఎవరైనా నిర్బంధంలో ఉంచారా అన్న అంశంపై ఎన్నో వాదాలున్నాయి. వివిధ సందర్భాల్లో ప్రభుత్వాలు అందుకు సంబంధించి విచారణ కమిషన్లను నియమించినా వాటి నివేదికలను బయటపెట్టలేదు. కనుక నిజానిజాలేమిటో నిర్ధారణ కాలేదు. ఈ విషయంలో ప్రభుత్వాలు పాటిస్తూ వస్తున్న గోప్యత మరిన్ని సంశయాలను పెంచడానికే దోహదపడింది. తాము అధికారంలోకొస్తే నేతాజీ మరణంపై అల్లుకున్న మిస్టరీని ఛేదిస్తామని నిరుడు జనవరిలో బీజేపీ ప్రకటించింది. కానీ, అయిదునెలలక్రితం ఈవిషయంలో సమా చార హక్కు చట్టంకింద దాఖలైన దరఖాస్తును కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. విదేశాలతో ఉన్న సంబంధాలు దెబ్బతింటాయి గనుక వెల్లడించలేమని సమాధానమిచ్చింది. గతంలో యూపీఏ ప్రభుత్వం సైతం ఇదే జవాబిచ్చింది.
నేతాజీ మరణ రహస్యం సంగతలా ఉండగానే ఆయన సన్నిహిత బంధువులపై సాగిందంటున్న గూఢచర్యం అందరినీ దిగ్భ్రాంతిపరిచింది. ఆ మరణ రహస్యానికీ, ఈ గూఢచర్యానికీ మధ్య సంబంధం ఉండొచ్చునన్న అనుమానాలను రేకెత్తించింది. నేతాజీకి చాన్నాళ్లపాటు సహాయకుడిగా, పాత్రికేయుడిగా పనిచేసిన ఏసీ నంబియార్...స్వాతంత్య్రం వచ్చాక స్విట్జర్లాండ్‌లో దౌత్యవేత్తగా నియమితులయ్యారు. ఆయన సుభాస్ అన్న కొడుకు అమీయనాథ్ బోస్‌కు రాసిన ఉత్తరాలను ఐబీ సేకరించడమే కాదు...వాటి కాపీలను బ్రిటన్ గూఢచార సంస్థ ఎంఐ5కు పంపిందని, వాటిపై ఆ సంస్థ మనోగతమేమిటో చెప్పమని కోరిందని తాజా పత్రాల ద్వారా తెలుస్తున్నది. ఇప్పుడు వెల్లడైన పత్రాలు సుభాస్ అన్న కొడు కులు అమీయనాథ్ బోస్, శిశిర్ బోస్‌లపై నిర్వహించిన గూఢచర్యానికి సంబంధిం చినవి. వారిద్దరూ రాజకీయంగా చురుకైన పాత్ర పోషించినవారు కాదు. కాంగ్రెస్‌కు గానీ, ప్రత్యేకించి నెహ్రూకుగానీ సవాలుగా నిలుస్తారన్న అభిప్రాయాన్ని కలగజేసిన వారు కాదు. పైగా నేతాజీ అన్న శరత్ బోస్ 1950 వరకూ జీవించివున్నారు. రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. బెంగాల్‌లో ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాన్ని(ఇప్పటి బంగ్లాదేశ్) పాకిస్థాన్‌తో కలపడాన్ని వ్యతిరేకించి కాంగ్రెస్ నుంచి తప్పుకున్నారు. అనంతరకాలంలో ఫార్వర్డ్ బ్లాక్‌లో పనిచేశారు. ఆయనపై నెహ్రూ సర్కారు గూఢచర్యం నెరపలేదా లేక అందుకు సంబంధించిన పత్రాలింకా రహస్యంగానే ఉన్నాయా అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం వెల్లడైన పత్రాల్లో ఆ కుటుంబ సభ్యుల లేఖలను బ్రిటన్ గూఢచార సంస్థకు అందజేసినట్టు ఉండటమే ఆశ్చర్యం కలిగించే విషయం. బ్రిటిష్ ప్రభుత్వంపై రాజీలేని పోరాటం నడిపిన వ్యక్తి కుటుంబ సభ్యులపై గూఢచర్యం నిర్వహించడమే అన్యాయమనుకుంటే... ఆ వివరాలను బ్రిటన్‌కు చేరేయడం అంతకన్నా దారుణం. స్వాతంత్య్రానంతర తొలినాళ్లలోనే విలువలు ఇంతగా పతనమయ్యాయంటే ఆశ్చర్యం కలుగుతుంది.
నెహ్రూ-నేతాజీలిద్దరూ కాంగ్రెస్‌లో సన్నిహితంగా కలిసిపనిచేశారు. పార్టీలోని రాడికల్ బృందంలో వారిద్దరూ ముఖ్యులు. అయితే అనంతరకాలంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని వెళ్లగొట్టడానికి జపాన్, జర్మనీలతో కలిసిపనిచేయాలన్న నేతాజీ నిర్ణయాన్ని గాంధీ, పటేల్‌తో పాటే నెహ్రూ కూడా వ్యతిరేకించారు. ఆ రకంగా వారిద్దరి మధ్యా దూరం పెరిగింది. అధికార పగ్గాలు చేపట్టిన తొలినాళ్లలో కాంగ్రెస్ లో మితవాదులుగా ఉన్న సర్దార్ పటేల్, బాబూ రాజేంద్రప్రసాద్‌ల నుంచి సవాళ్లు ఎదురైన నేపథ్యంలో... తన అభిప్రాయాలతో ఏకీభావం ప్రకటించే నేతాజీ రాకను నెహ్రూ స్వాగతించేవారు తప్ప వ్యతిరేకించేవారు కాదన్న వాదనలున్నాయి. అదే సమయంలో...నేతాజీ వస్తే తనకు పోటీ అవుతారని, పార్టీలో బలహీనపడతానని నెహ్రూ భావించారన్న వాదనలు మరోపక్క ఉన్నాయి. ఇప్పుడు వెల్లడైన పత్రాలు పరిమిత సంఖ్యలో ఉన్నాయి గనుక ఇలాంటి వాదనలకు అంత సులభంగా జవాబు లభించదు. కేంద్ర హోంశాఖ వద్ద నేతాజీ మరణరహస్యం, ఆయన బంధువులపై గూఢచర్యానికి సంబంధించి 70,000 పేజీల పత్రాలున్నాయని చెబుతు న్నారు. అవన్నీ సంపూర్ణంగా వెల్లడైతే తప్ప నిజానిజాలేమిటన్నది తెలిసే అవకాశం లేదు. 20, 30 ఏళ్లు గడిచాక రహస్యపత్రాలను వెల్లడించడం కొన్ని దేశాల్లో పాటిస్తున్న ఆచారం. అందువల్ల అత్యంత కీలకమైన సందర్భాల్లో ప్రభుత్వాలు ఎలా వ్యవహరించాయో, అందులోని తప్పొప్పులేమిటో తెలిసే అవకాశం పౌరులందరికీ లభిస్తుంది. వాటిపై జరిగే చర్చలు...పాలనా వ్యవహారాలు మరింత పదునుదేరడానికీ, ప్రజాస్వామిక విలువలు బలపడటానికి దోహదపడతాయి. కానీ పాలకులుగా ఉంటున్నవారు గోప్యతను ఇష్టపడినంతగా...పారదర్శకతను ప్రేమించరు. నేతాజీ అదృశ్యంపై బీజేపీ విపక్షంలో ఉండగా చేసిన ప్రకటనలకూ, ఇప్పుడు గద్దెనెక్కిన తర్వాత ఇస్తున్న జవాబులకూ ఉన్న తేడా ఈ సంగతినే రుజువుచేస్తున్నది. కనీసం నేతాజీ కుటుంబంపై గూఢచర్యానికి సంబంధించిన పత్రాలనైనా సంపూర్ణంగా బయటపెడితే ఎవరి తప్పొప్పులేమిటో తెలుస్తాయి. నిఘా సంస్కృతిలోని నైచ్యం బట్టబయలవుతుంది.