కొత్త రాష్ట్రంలో తొలిసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారంటే అందరిలోనూ సహజం గానే ఉత్కంఠ ఉంటుంది. అందులోనూ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించి, దాన్ని సాధించుకుని అధికారంలోకొచ్చిన పార్టీ గనుక టీఆర్‌ఎస్ సర్కారు ప్రవేశపెట్టే బడ్జెట్‌పై ఇది మరింతగా ఉంటుంది. దానికి తగినట్టే తనది అంకెల కసరత్తు లేదా జమాఖర్చుల పద్దు కాదని, ‘తెలంగాణ ప్రజల కలలు సాకారం చేసే సజీవ ఆర్థిక ప్రణాళిక’ అని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ అభివర్ణించారు.
ఇలా చెప్పాక రూ. 1,00,637 కోట్ల బడ్జెట్‌లో ప్రభుత్వ ప్రాథమ్యాలేమిటి, ఆర్థిక స్థితిగతులపై దాని వ్యూహమేమిటి, సామాన్యులకు అది చేయదల్చుకున్న మేళ్లేమిటి అని పరిశీలించడం కూడా సాధారణమే. ఇది గడిచిన అయిదు నెలలకాలంలో చేసిన వ్యయానికీ...వచ్చే అయిదునెలల్లో చేయబోయే వ్యయానికీ సంబంధించిన బడ్జెట్ గనుక ఆ రెండింటినీ పోల్చి చూడటం కూడా ఉంటుంది. ఆ కోణంలో ఈటెల బడ్జెట్‌ను చూస్తే ఆశానిరాశలు రెండూ కలుగుతాయి. బడ్జెట్‌ను లక్ష కోట్ల రూపాయల పరిమాణంలో రూపొందించాలన్న తహతహ మెచ్చదగినదే అయినా అందుకు దీటుగా ఆదాయ వనరులున్నాయో లేదో చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంటుంది.
పన్ను రాబడిగా చూపించిన మొత్తం తప్ప నికరంగా వచ్చే మరే ఇతర ఆదాయ వనరూ బడ్జెట్‌లో లేదంటున్న విపక్షాల విమర్శలో వాస్తవం ఉన్నది. సొంత పన్నుల ద్వారా రూ. 35,000 కోట్లు వస్తాయని అంచనావేసి...కేంద్రంనుంచి వివిధ రూపాల్లో ఏకంగా రూ. 42,250 కోట్లు రాగలవని ఈటెల లెక్కలేశారు. ఇది ఏరకంగా చూసినా అతిగా ఆశించడమే అవుతుంది. అలాగే, భూముల విక్రయం ద్వారా రూ. 6,500 కోట్లు రాగలవని వేసిన అంచనాల్లో వాస్తవంకన్నా ఆశ పడటమే ఎక్కువుంది. రియల్‌ఎస్టేట్ రంగం ఇప్పటికైతే ఆశాజనకంగా లేదు. రాగల అయిదు నెలల్లో ఈ పరిస్థితి మారగలదన్న భరోసా కూడా లేదు. ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకోవడాన్ని తప్పు బట్టనవసరంలేదు గానీ అవి వాస్తవాలకు దగ్గరలో ఉండాలి.
ప్రజా సంక్షేమ పథకాలుండే ప్రణాళికా వ్యయాన్ని ప్రభుత్వాలు క్రమేపీ వదిలించుకుంటున్న దశలో మొత్తం బడ్జెట్ వ్యయంలో 48 శాతాన్ని దానికి కేటాయించడం ప్రశంసనీయం. అలాగే మౌలిక సదుపాయాలకు... మరీ ముఖ్యంగా చెరువుల మరమ్మతు, అభివృద్ధికి రూ. 2,000 కోట్లు కేటాయించడం మెచ్చదగినది. చిన్న నీటి వనరులపై దృష్టి పెట్టడంవల్ల సంక్షోభంలో పడిన సాగురంగం కోలుకోవడానికి కాస్తయినా వీలవుతుంది. అయితే ఇది విజయవంతం కావాలంటే చిన్న నీటిపారుదల శాఖను కింది స్థాయినుంచీ పటిష్టపరచవలసి ఉంటుంది.
సంక్షేమ పథకాలకు కేటాయింపులు బాగున్నా ఫీజు రీయింబర్స్‌మెంట్ స్థానంలో ప్రవేశపెట్టిన ఫాస్ట్ పథకానికి ఇచ్చిన నిధులు అరకొరగానే ఉన్నాయి. ఆ నిధుల్లో కూడా అధిక భాగం పాత బకాయిలకే పోయే అవకాశం ఉంది. దాని సంగతలా ఉంచి మరో నాలుగైదు నెలల్లో విద్యా సంవత్సరం పూర్తికావస్తున్న దశలో ఫాస్ట్ పథకానికి సంబంధించి ఇంతవరకూ మార్గదర్శకాలే రూపొందలేదు. పంచాయితీరాజ్‌కు రూ. 8,641.61 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ. 5,415.45 కోట్లు కేటాయించారు. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధిలో సింహభాగం ప్రణాళికా వ్యయం ఉండటం గమనార్హం. ఇందులో సామాజిక భద్రతా పింఛన్లు, ఇతర సంక్షేమ కార్యక్రమాల కోసం రూ. 2,374 కోట్లు కేటాయించారు.
పంచాయతీరాజ్ కేటాయింపుల్లో నీటి సరఫరా, పారిశుద్ధ్యం పనులకు రూ. 2,914 కోట్లు లభించాయి. అధికారంలోకి రాగానే పోలీసు విభాగం అవసరాలపై ప్రత్యేక దృష్టిపెట్టిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం దానికి కొనసాగింపుగా బడ్జెట్‌లో హోంశాఖకు రూ. 2,804 కోట్లు కేటాయించింది. బడ్జెట్ ప్రసంగం మొదట్లో రైతుల ఆత్మహత్యల ప్రస్తావన ఉన్నా వాటిని ఆపడానికి ప్రభుత్వం చేయబోతున్నదేమిటో, వారి కుటుంబాలను ఆదుకోవడానికి చేయదల్చుకున్నదేమిటో బడ్జెట్‌లో స్పష్టంచేయలేదు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు బడ్జెట్‌లో భారీగా రూ. 7,531.44 కోట్లు కేటాయించారు.
అయితే, రుణమాఫీకి చెల్లించిన రూ. 4,250 కోట్లనూ చూపడంవల్ల ఇది పెద్ద మొత్తంగా కనబడుతున్నది. వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు పడిపోయినప్పుడు రైతును ఆదుకోవడం కోసం రూ. 400 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేయడం, రైతులకు సౌరశక్తి పంపు సెట్లను అందించేందుకు రూ. 200 కోట్లు కేటాయించడం, విత్తన భాండాగారం ఏర్పాటు ఆశాజనకమైనవి. కరెంటు కష్టాల వల్లనే ప్రధానంగా రైతుల ఆత్మహత్యలు జరుగుతుంటే ఆ రంగానికి చేసిన కేటాయింపులు సరిపడా లేవు. విద్యుత్ సబ్సిడీలకు ఈ ఏడాది రూ. 5,630 కోట్లు అవసరమని ట్రాన్స్‌కో అంచనావేయగా విద్యుత్ రంగానికి ప్రణాళికేతర వ్యయంకింద కేటాయించిన మొత్తం రూ. 3,241.89 కోట్లు మాత్రమే. ఇందులో విద్యుత్ సబ్సిడీల భాగం రూ. 3,000 కోట్లని ఈటెల చెప్పనే చెప్పారు.
టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో పెట్టిన ఇతర హామీల విషయంలో బడ్జెట్ శ్రద్ధ కనబరిచినా కీలకమైన నిరుపేదల ఇళ్ల నిర్మాణం విషయంలో మాత్రం తగినంత కేటాయింపులు లేవు. మొత్తంగా ఇళ్ల నిర్మాణానికి రూ. 1,041 కోట్లు కేటాయించగా అందులో ‘రెండు పడక గదుల ఇళ్ల పథకాని’కి దక్కింది కేవలం రూ. 85 కోట్లు మాత్రమే. వైద్యరంగానికి రూ. 2,282 కోట్లు కేటాయించి జిల్లా కేంద్రాల్లోని ప్రధాన ఆసుపత్రులకు రూ. కోటి చొప్పున ఇస్తామన్న వాగ్దానాన్ని నిలుపుకున్నారు.
అయితే, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఉపయోగపడే బీబీనగర్ నిమ్స్‌కు కూడా కోటి రూపాయలు మాత్రమే కేటాయించడం అసంతృప్తి కలిగించే అంశం. ఇక నిరుపేద రోగులకు ఉపయోగపడే ఆరోగ్యశ్రీకి చేసిన కేటాయింపులు కూడా తగినంతగా లేవు. మొత్తానికి తొలి బడ్జెట్ కసరత్తులో ఈటెల ఆశలు కల్పించడంతోపాటు అసంతృప్తినీ మిగిల్చారు.
‘భారీ’ ఆశల బడ్జెట్!
Published Wed, Nov 5 2014 11:26 PM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM
Advertisement
Advertisement