
పెద్ద నోట్లు రద్దు చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించి నేటికి ఏడా దవుతోంది. నిరుడు నవంబర్ 8 రాత్రి పెద్ద నోట్లన్నీ ఈ క్షణం నుంచి చిత్తు కాగితాలవుతాయని ఆయన చెప్పినప్పుడు అందులోని అంతరార్ధాన్ని అవగాహన చేసుకున్నది చాలా తక్కువమంది. తెల్లారాక వారందరికీ తత్వం బోధపడింది. ఉన్న పెద్ద నోట్లను జమ చేయడానికి, చిన్న నోట్లుగా మార్చుకోవడానికి బ్యాంకు లకు పోతే అవన్నీ కిక్కిరిసి కనబడ్డాయి. అక్కడ గంటల తరబడి ఓపిగ్గా నిలబడ వలసి వచ్చింది. ఏటీఎంలు సరేసరి... అవి మూతబడ్డాయి. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, పేద వర్గాల ప్రజలు ఊపిరి సలపని స్థితిలో కొట్టుమిట్టాడారు. ప్రధాని ప్రకటన తర్వాత వారం రోజులకే పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని గట్టిగా నిల దీస్తాయని, ఏదోమేరకు ఉపశమనం లభించగలదని భావించిన జనానికి నిరాశే ఎదురైంది. ఉభయ సభలూ వాయిదాలతో కాలక్షేపం చేశాయి. పార్టీలన్నీ సభా నిబంధనల చుట్టూ గిరికీలు కొట్టాయి. ఒకపక్క వీధుల్లో బ్యాంకుల ముందూ, కొన్నాళ్లకు వాటితోపాటు ఏటీఎంల ముందూ జనం గంటల తరబడి లైన్లలో నిలబడి నిస్త్రాణలో పడుతుంటేæ– నోట్ల రద్దుపై ప్రధాని మాట్లాడాలా లేక కేంద్ర ఆర్థికమంత్రి మాట్లాడితే సరిపోతుందా? ప్రభుత్వ ప్రకటన తర్వాత సభ్యులు చర్చించాలా లేక చర్చ అయ్యాకే ప్రభుత్వ ప్రకటన ఉండాలా? ప్రభుత్వం జవాబిచ్చాక సభ్యులు మళ్లీ ప్రశ్నించవచ్చా... లాంటి అంశాలపై చెలరేగిన వివా దాలతో కాలం గడిచిపోయింది. దేనిపైనా అంగీకారం కుదరక సభలు స్తంభిం చాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుల్లో అధికభాగం మూజువాణి ఓటుతో ఆమోదం పొందాయి. ఉభయ సభలూ 20 శాతంలోపే పనిచేశాయి. నల్లడబ్బు వెలికి తీయడానికి, అవినీతిని అంతమొందించడానికి, ఉగ్రవాదం, తీవ్రవాదం వంటి సమస్యలు లేకుండా చేయడానికి పెద్ద నోట్ల రద్దు చర్య తీసుకుంటున్నామని నరేంద్రమోదీ చెప్పారు. అనంతరకాలంలో ‘నగదు రహిత లావాదేవీలు పెంచ డం’ వీటికి అదనంగా వచ్చిచేరింది.
నిజానికి పెద్ద నోట్ల రద్దు బీజేపీ ప్రచారం చేసుకున్నట్టు ఇదే తొలిసారి కాదు. 1978లో ఆనాటి జనతాపార్టీ ప్రభుత్వం వెయ్యి, అయిదువేలు, పదివేల నోట్లను రద్దు చేసింది. ఆ నోట్ల వాటా మొత్తం చలామణిలో ఉన్న కరెన్సీలో ఒక శాతం మించలేదు. రెండురోజుల్లో ఆ డబ్బంతా బ్యాంకులకు చేరిపోయింది. న్యూఢిల్లీ, ముంబై లాంటిచోట్ల మినహా మిగిలిన నగరాల్లోని బ్యాంకు శాఖల ముందు పెద్దగా క్యూలు లేవు. పలుకుబడి ఉన్నవారు వీటితో సంబంధం లేకుండానే సుల భంగా నోట్లు మార్చుకున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత నిరుడు జరి గిన పెద్ద నోట్ల రద్దు సమయంలో సైతం పలుకుబడి ఉన్నవారికి సమస్యలు ఎదు రుకాలేదు. చలామణిలో ఉన్న కరెన్సీలో 86 శాతం వాటా ఉన్న పెద్ద నోట్ల రద్దు వల్ల చిరు ఉద్యోగాలు చేసుకుంటున్నవారు, చిన్న వృత్తులవారు, కార్మికులు, వ్యవ సాయ కూలీలు విలవిల్లాడారు. పనులు దొరక్క, అప్పు పుట్టక అలమటించారు. క్యూ లైన్లలో నిలబడి. తోపులాటల వల్ల ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు జరి గాయి. అసంఘటిత రంగంలో దాదాపు 15 లక్షల ఉద్యోగాలు గల్లంతయ్యాయని ఒక అంచనా. రద్దయిన నోట్ల స్థానంలో చాన్నాళ్లకు వచ్చిన రూ. 2,000, రూ. 500 నోట్లు వ్యవహారం మరో ప్రహసనం. ఆ నోట్ల సైజు ఏటీఎంల సాఫ్ట్‌వేర్‌కు అను గుణంగా లేకపోవడంతో సమస్య తీరడానికి మరికొన్నాళ్లు పట్టింది.
పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రభుత్వ అంచనాలు ఏమేరకు నెరవేరాయో గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. రద్దయిన నోట్లలో అత్యధిక భాగం బ్యాంకులకు తిరిగొచ్చింది. మొన్న సెప్టెంబర్‌లో రిజర్వ్‌బ్యాంకు విడుదల చేసిన నివేదిక ప్రకారం రద్దయిన నోట్లలో 99 శాతం అంటే... రూ. 15.28 లక్షల కోట్ల డబ్బు తిరిగి ఖజానాకు చేరింది. అంటే ప్రభుత్వం లెక్కేసినంతగా నల్లడబ్బు చలామ ణిలో లేదు. ఇక అవినీతి అంతం గురించి చెప్పనవసరమే లేదు. ఇంకా ఏటీఎం లకు కూడా చేరని పెద్ద నోట్లు నేరుగా బడా బాబుల ఇళ్లకే కట్టలు కట్టలుగా వెళ్లాయి. చెన్నైలో బడా వ్యాపారి శేఖర్‌రెడ్డి ఇంట్లో అప్పట్లో భారీయెత్తున రద్దయిన పెద్ద నోట్లు రూ. 96.89 కోట్లు పట్టుబడ్డాయి. రూ. 33 కోట్ల విలువైన రూ. 2,000 నోట్లు దొరికాయి. వీటి వెనకున్న లోగుట్టును రిజర్వ్‌బ్యాంక్, సీబీఐ ఈనాటికీ చెప్పలేకపోయాయి. ఇక జమ్మూ–కశ్మీర్‌లో మిలిటెన్సీ ఇంతక్రితం కంటే బాగా పెరిగింది. నగదు రహిత లావాదేవీలు మునుపటితో పోలిస్తే పెరిగిన మాట వాస్తవమే అయినా ఇప్పటికీ డబ్బు చలామణియే అధికంగా ఉంది. ఒకేసారి 86 శాతం వాటా ఉండే నోట్లు రద్దు కావడం వల్ల వెనువెంటనే ఆన్‌లైన్ చెల్లింపులు పెరిగాయనడంలో సందేహం లేదు. కానీ రద్దయిన నోట్ల స్థానంలో కరెన్సీ విడు దలయ్యాక ఆ లావాదేవీలు బాగా తగ్గాయి. పెద్ద నోట్ల రద్దుకు ముందు నెలలో డెబిట్ కార్డు లావాదేవీల విలువ రూ. 29,942 కోట్లుంటే రద్దు తర్వాత నెల్లాళ్లకు దాని విలువ రూ. 58,000 కోట్లకు చేరింది. కానీ మొన్న ఆగస్టులో డెబిట్ కార్డు లావాదేవీల విలువ రూ. 36,000 కోట్ల మేర ఉంది. నల్లడబ్బు అధికంగా పోగు బడి ఉంటుందని అందరూ భావించే రియల్‌ఎస్టేట్ రంగంలో మాత్రం ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగాయి. అయితే అది మునుపటిలా కళకళలాడటం లేదు.
పెద్దనోట్ల రద్దు వ్యవహారం సంఘటిత లూటీ అని మాజీ ప్రధాని మన్మోహన్ అన్నందుకు కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ నొచ్చుకున్నారు. కనీసం తగినంత కరెన్సీని సిద్ధం చేసుకుని ఈ చర్యకు దిగితే సాధారణ ప్రజానీకానికి ఇన్ని ఇబ్బందులు ఎదురయ్యేవి కాదు. ప్రభుత్వపరంగా ముందస్తు వ్యూహం లేక పోవడం వల్ల పెద్దనోట్ల రద్దు వల్ల జనం పడరాని పాట్లుబడ్డారు. ఈ చర్య వల్ల దీర్ఘకాలంలో సత్ఫలితాలుంటాయని ప్రభుత్వం చెబుతోంది. అలాంటి భవిష్యత్తు ఉంటుందన్న భరోసా కల్పించాల్సింది వర్తమానమే. అది భారంగా మారిన ప్పుడు భవిష్యత్తు గురించి కలలు కంటూ కూర్చోవడం ఎలా సాధ్యమో పాలకులే చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment