ఆ నోట్లు 99% తిరిగొచ్చాయి! | RBI says received 99 per cent of scrapped Rs 500/1000 notes | Sakshi
Sakshi News home page

ఆ నోట్లు 99% తిరిగొచ్చాయి!

Published Thu, Aug 31 2017 8:55 AM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

ఆ నోట్లు 99% తిరిగొచ్చాయి! - Sakshi

ఆ నోట్లు 99% తిరిగొచ్చాయి!

రద్దయిన నోట్లపై ఆర్బీఐ ప్రకటన
► రూ. 15.44 లక్షల కోట్లకు గానూ
► రూ. 15.28 లక్షల కోట్లు డిపాజిట్‌ అయ్యాయి
► వెయ్యి నోట్లలో 1.4 శాతమే తిరిగి రాలేదు
► మండిపడ్డ కాంగ్రెస్‌; ఆర్బీఐకి సిగ్గుచేటని వ్యాఖ్య


ముంబై: అవినీతి, నల్లధనంపై పోరాటంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయమైన నోట్ల రద్దు తదనంతర ఫలితాలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) వెల్లడించింది. నోట్ల రద్దు నాటికి చలామణిలో ఉన్న రూ. 1000, రూ. 500 నోట్లలో రద్దు అనంతరం 99%  బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయని పేర్కొంది. రూ. 15.44 లక్షల కోట్ల విలువైన రద్దయిన నోట్లలో రూ. 15.28 లక్షల కోట్లు తిరిగి బ్యాంకుల్లో జమ అయ్యాయని తెలిపింది. అంటే, కేవలం రూ. 16, 050 కోట్లు మాత్రమే తిరిగి బ్యాంకుల్లో డిపాజిట్‌ కాలేదని వెల్లడించింది. అలాగే, రద్దు నిర్ణయం అనంతరం రూ. 1000 నోట్లలో కేవలం 1.4% మాత్రమే తిరిగి బ్యాంకింగ్‌ వ్యవస్థలోనికి రాలేదని, 98.6% నోట్లు బ్యాంకుల్లో జమ అయ్యాయని పేర్కొంది.

అలాగే, రద్దు నాటికి సంఖ్యాపరంగా, 1,716.5 కోట్ల రూ. 500 నోట్లు చలామణిలో ఉన్నాయని తెలిపింది. అయితే, రద్దయిన రూ. 500 నోట్లలో ఎన్ని తిరిగి వచ్చాయనే కచ్చితమైన సంఖ్యను ఆర్బీఐ వెల్లడించలేదు. 2016–17 ఆర్థిక సంవత్సర వార్షిక నివేదికను బుధవారం విడుదల చేసిన ఆర్బీఐ.. అందులో నోట్ల రద్దు తదనంతర వివరాలను వెల్లడించింది. దేశంలో నల్లధనాన్ని రూపుమాపే లక్ష్యంతో గత సంవత్సరం నవంబర్‌ 8న రూ. 1000, రూ. 500 నోట్లను ప్రభుత్వం రద్దు చేసింది. అసాధారణ డిపాజిట్లపై విచారణ జరుపుతామని పేర్కొంటూ.. రద్దయిన నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసుకునేందుకు డిసెంబర్‌ చివరి వరకు గడవు విధించింది.

ఎన్‌ఆర్‌ఐలు సహా కొన్ని వర్గాలకు మాత్రం షరతులతో జూన్‌ 30, 2017 వరకు పాత నోట్లను డిపాజిట్‌ చేసుకునేందుకు అవకాశమిచ్చింది.  అనంతరం, కొత్త డిజైన్‌లో రూ. 500 నోట్లను, కొత్తగా రూ. 2 వేల నోట్లను మార్కెట్లోకి ఆర్బీఐ విడుదల చేసింది. తాజాగా, రూ. 200, కొత్త డిజైన్‌లో రూ. 50 నోట్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. రూ. 1000 నోటును మాత్రం మళ్లీ తీసుకురాలేదు. కాగా, 2016, డిసెంబర్‌ 2న నోట్ల రద్దు వివరాలను ఆర్థిక శాఖ సహాయమంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ లోక్‌సభకు తెలిపారు. అప్పుడు, రద్దయిన రూ. 1000 నోట్ల సంఖ్యను ఆయన 685.8 కోట్లుగా పేర్కొన్నారు. అప్పటికి మార్కెట్లో ఉన్న రూ. 1000, రూ. 500 నోట్ల మొత్తం విలువ రూ. 15.44 లక్షల కోట్లని తెలి పారు. ఆ వివరాలకు, బుధవారం ఆర్బీఐ వెల్లడించిన వివరాలకు తేడా ఉండటం గమనార్హం.

వారికి నోబెల్‌ ఇవ్వాలి: చిదంబరం
నోట్ల రద్దును సిఫారసు చేసిన ఆర్బీఐ ఇప్పుడు ఈ వివరాలతో సిగ్గుపడాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత చిదంబరం మండిపడ్డారు. ‘నోట్ల రద్దు.. బ్లాక్‌మనీని వైట్‌గా మార్చుకొనే పథకమా? అని ప్రశ్నించారు. నోట్ల రద్దుకు ప్రణాళిక రచించినవారికి నోబెల్‌ బహుమతి ఇవ్వాలంటూ ఎద్దేవా చేశారు. రూ. 15.44 లక్షల కోట్లలో రూ. 16 వేల కోట్లు మాత్రమే వెనక్కురాకపోవడంపై స్పందిస్తూ.. ‘రూ. 16 వేల కోట్లు సంపాదించి.. కొత్త నోట్ల ప్రింటింగ్‌ కోసం రూ. 21 వేల కోట్లను పోగొట్టుకుంది’ అని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటరీ కమిటీకి తప్పుడు వివరాలు ఇచ్చినందుకు ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌పై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెడ్తానని సమాజ్‌వాదీ నేత నరేశ్‌ అగర్వాల్‌ హెచ్చరించారు.

నోట్ల రద్దు విజయవంతం: జైట్లీ
నోట్లరద్దు నిర్ణయం విఫలమైందన్న వాదనను ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తోసిపుచ్చారు. ‘నల్లధనం నిర్మూలన, ఆర్థిక వ్యవస్థలో నగదు చలామణిని తగ్గించడం, పన్ను చెల్లింపుదారుల విçస్తృతి తదితర నోట్ల రద్దు లక్ష్యాలను సాధించగలిగాం’ అన్నారు. బ్యాంకుల్లో డిపాజిట్‌ అయి న నగదులో గణనీయ భాగం నల్లధనమయ్యే అవకాశముందని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో  పేర్కొంది.

ఆర్బీఐ నివేదికలోని వివరాలు
సంఖ్యాపరంగా.. 632.6 కోట్ల వెయ్యి నోట్లలో 8.9 కోట్ల నోట్లు మాత్రమే బ్యాంకుల్లో జమ కాలేదు. అంటే 623. 7 కోట్ల నోట్లు తిరిగి వ్యవస్థలోకి వచ్చాయి. విలువ పరంగా.. రూ. 6.326 లక్షల కోట్లలో రూ. 8,900 కోట్లు మాత్రమే బ్యాంకుల్లోకి తిరిగి రాలేదు.
మార్చి 31, 2017 నాటికి 588. 2 కోట్ల కొత్త, పాత రూ. 500 నోట్లు మార్కెట్లో ఉన్నాయి. అలాగే, మార్చి 31, 2016 నాటికి మార్కెట్లో ఉన్న రూ. 500 నోట్ల సంఖ్య 1,570.7 కోట్లు.  
కరెన్సీ నోట్ల ప్రింటింగ్‌ ఖర్చు భారీగా పెరిగింది. 2015–16లో రూ. 3,421 కోట్లు ఖర్చు కాగా, 2016–17లో అది రెండింతలు దాటి రూ. 7,965 కోట్లకు చేరింది.  
♦  చలామణిలో ఉన్న నగదు విలువ 2017 మార్చి నాటికి 13.1 లక్షల కోట్లు. గత సంవత్సరం కన్నా ఇది 20.2% తక్కువ.
♦  గత మార్చి నాటికి చలామణిలో ఉన్న నగదు విలువలో రూ.2 వేల నోట్ల వాటా 50.2% (సంఖ్యాపరంగా 328.5 కోట్ల నోట్లు).
2016 ఆర్థిక సంవత్సరంలో గుర్తించిన నకిలీ నోట్ల సంఖ్య 6.32 కోట్లు కాగా, 2017లో అది 7.62 కోట్లు.
ఆర్బీఐ శాంపిల్‌ సర్వేలో నోట్ల రద్దు నాటికి చలామణిలో ఉన్న పది లక్షల రూ. 500 నోట్ల లో సగటున 7.1 నోట్లు, 10 లక్షల రూ. వెయ్యి నోట్లలో 19.1నోట్లు నకిలీగా తేలాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement