సమస్య ముదిరి చేతులు దాటిన జాడలు కనిపించినప్పుడు తప్ప...సాధారణ సమయాల్లో దాని పరిష్కారానికి ఏమాత్రం ప్రయత్నించ ని పాలకుల వైఖరి పర్యవ సానంగా ఈశాన్యం మరోసారి నెత్తురోడింది.
సమస్య ముదిరి చేతులు దాటిన జాడలు కనిపించినప్పుడు తప్ప...సాధారణ సమయాల్లో దాని పరిష్కారానికి ఏమాత్రం ప్రయత్నించ ని పాలకుల వైఖరి పర్యవ సానంగా ఈశాన్యం మరోసారి నెత్తురోడింది. మూడురోజులక్రితం మణిపూర్‌లోని చందేల్ జిల్లాలో మిలిటెంట్లు దాడిచేసి 20మంది జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. ఇరవైయ్యేళ్ల వ్యవధిలో ఇంత భారీయెత్తున దాడి జరగడం ఇదే ప్రథమం. అంతేకాదు, ఈ దాడిలో మిలిటెంట్లు తొలిసారి రాకెట్ చోదిత గ్రెనేడ్లు ఉపయోగిం చారు. ఈ దాడికి కొనసాగింపుగా హిమాచల్ ప్రదేశ్‌లోని పారా మిలిటరీ దళం శిబి రంపై మిలిటెంట్లు ఆదివారం దాడిచేశారు. ఈ దాడిలో అదృష్టవశాత్తూ ప్రాణనష్టం లేదు. ఈశాన్యం... అందునా మణిపూర్ రాష్ట్రం మిలిటెంట్ల కార్యకలా పాలకు పెట్టిం ది పేరు. ఒక్క మణిపూర్‌లోనే 30 రకాల వేర్పాటువాద గ్రూపులున్నాయి.
వీటిల్లో మయన్మార్ స్థావరంగా పనిచేస్తున్న నేషనల్ సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగా లాండ్(ఎన్‌ఎస్‌సీఎన్)- ఖప్లాంగ్ వర్గం బలమైనది. ఇదిగాక అందులోంచి ఇటీవల చీలిన ఎన్‌ఎస్‌సీఎన్-(కెకె) వర్గం, ఇసాక్-ముయువా వర్గం వంటివి చాలా ఉన్నాయి. ఈశాన్య ప్రాంతాన్ని ప్రాదేశిక భద్రత దృష్టితో తప్ప అక్కడి సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఏంచేయాలన్న విషయంలో కేంద్రం సరిగా పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు చాన్నాళ్లనుంచి ఉన్నాయి. వనరులు విరివిగా ఉన్నా వాటిని వినియోగించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు అక్కడ కరువు. భిన్న సంస్కృతి, సంప్రదాయాలున్న 200పైగా తెగలు ఈశాన్య రాష్ట్రాల్లో ఉంటాయి. యువతకు విద్యా, ఉపాధి కల్పనా అవకాశాలు లేకపోవడం, అంతంతమాత్రంగా ఉన్న రవాణా సదుపాయాలు ఆ ప్రాంతానికి శాపంగా మారాయి. ఉన్న పరిమిత అవకాశాలను, సదుపాయాలను మరొకరితో పంచుకోవాల్సివచ్చేసరికి తమ కష్టాలకు అవతలివారే కారణమన్న ద్వేషభావనలు పెరుగుతున్నాయి.
ఇలాంటివన్నీ వేర్పాటువాద గ్రూపుల ఉనికికి ఊపిరిపోస్తున్నాయి. ఈశాన్య ప్రాంత సామాజిక, ఆర్థికాభివృద్ధికి చేయూతనందిం చేందుకు ప్రయత్నించకుండా స్థానికంగా వివిధ తెగల్లో పలుకుబడి ఉన్న నేతలను గుర్తించి వారికి ప్రభుత్వ కాంట్రాక్టులు, ప్రభుత్వపరంగా అమలు చేసే ఇతర పథకాల బాధ్యతలు కట్టబెడు తున్నారు. ఆచరణలో ఇలాంటివన్నీ కొంతమంది దళారులను తయారు చేస్తు న్నాయి తప్ప ఆ ప్రాంత వెనకబాటుతనాన్ని రూపుమాపడానికి ఏమాత్రం దోహదపడలేకపోతున్నాయి. మరోపక్క మిలిటెంట్ల కార్యకలాపాలను కట్టడి చేసేందుకు అమలు చేస్తున్న సాయుధ దళాల(ప్రత్యేకాధికారాల) చట్టం ఆ కృషిలో విజయం సాధించలేకపోగా దుర్వినియోగమై జనంలో పాలకులపై వ్యతిరేకతను పెంచుతున్నది. అది మిలిటెంట్లకు అనుకూలమైన వాతావరణం ఏర్పరుస్తున్నది.
స్థానిక అవసరాలేమిటో, అక్కడివారి సంస్కృతి, సంప్రదాయాలు ఎలాంటివో, అక్కడ లభ్యమవుతున్న వనరులతో ఏమి చేయవచ్చునో అధ్యయనం చేసి దానికి అనుగుణంగా పథకాలు రూపొందిస్తే...అందులో స్థానికుల ప్రమేయం ఉండేలా చేస్తే విజయం సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఆ పని జరగడంలేదు. న్యూఢిల్లీలో తయారయ్యే పథకాలను అక్కడ అమలు పరచడం, అది కూడా ఎంచుకున్న కొందరి ద్వారా జరగడంవంటి చర్యల వల్ల ఆశించిన ఫలితాలు రావడంలేదు. కేంద్రంలో ఈశాన్య ప్రాంత అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించడం కోసమని 2004లో ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేసినా తగిన ఫలితాలు రాకపోవడానికి ప్రధాన కారణం ఇదే. ఇక మిలిటెంట్ గ్రూపులతో వ్యవహరించే తీరు కూడా లోపభూయిష్టంగా ఉంటున్నది.
సమస్య పరిష్కారానికి ఆత్రుత ప్రదర్శించాల్సి ఉండగా బలమైన ఫలానా మిలిటెంటు గ్రూపుతో చర్చలు సాగుతున్నాయి కదా...కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది కదా అన్న అవగాహనతో మౌలిక సమస్యల పరిష్కారాన్ని ఉపేక్షించడం మామూలైంది. ఇక క్షేత్రస్థాయిలో గస్తీ తిరిగే దళాల్లో సైతం ఇది రొటీనే కదా అన్న భావన ఏర్పడింది. గస్తీ తిరిగేటపుడు పాటించాల్సిన నిబంధనలను జవాన్లు సరిగా పట్టించుకోకపోవడంవల్లే మిలిటెంట్లది పైచేయి అయిందని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థను పటిష్టం చేయడం, స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని కదలడంవంటి జాగ్రత్తలు పాటించకపోవడంవల్ల ఈ ఘటన చోటుచేసుకున్నదని చెబుతున్నారు.
నిజానికి ఇటీవల ఈశాన్యంలో చోటుచేసుకున్న పరిణామాలు గమనిస్తే మిలిటెంట్లు దాడికి దిగే అవకాశం ఉండొచ్చని ఎవరికైనా అర్థమవుతుంది. తనను కాదని వేరే గ్రూపులకు ప్రాధాన్యతనిస్తున్నదన్న ఆగ్రహంతో ఎన్‌ఎస్‌సీఎన్(కె) కాల్పుల విరమణ ప్రక్రియ నుంచి వైదొలగుతున్నట్టు మొన్న మార్చిలో ప్రకటించింది. మరోపక్క ఎన్‌ఎస్‌సీఎన్(కె)తోపాటు అనేక ఇతర గ్రూపులు కలిసి ఇటీవల పశ్చిమ ఆగ్నేయాసియా యునెటైడ్ లిబరేషన్ ఫ్రంట్ (యూఎన్‌ఎల్ ఎఫ్‌డబ్ల్యూ) పేరిట సమాఖ్యగా ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఒకటి రెండుచోట్ల జవాన్లపై దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం పెరుగుతుంది. ఇంతవరకూ అనుసరిస్తూ వచ్చిన విధానాలపై సమీక్ష జరగాలి. అవి సక్రమంగా అమలైనట్టు లేవు. మనకు మయన్మార్‌తో 1,643 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. వేర్పాటువాద గ్రూపులన్నీ మయన్మార్‌ను స్థావరంగా చేసుకుని కార్యకలాపాలు సాగిస్తున్నాయి. మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్‌లలో ‘పన్నులు’ వసూలు చేస్తూ ఆ డబ్బుతో ఆయుధాలు సమకూర్చుకుంటున్నాయి.
మయన్మార్ ప్రభుత్వం స్థానికంగా ఉన్న వివిధ సాయుధ తెగలతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకోవడంవల్ల ఎన్‌ఎస్‌సీఎన్(కె)వంటి గ్రూపులపై చర్య తీసుకోవడంలేదు. ఈ విషయంలో మయన్మార్‌తో మన దేశం మాట్లాడవలసి ఉంటుంది. అలాగే, సరిహద్దు గస్తీ బలహీనంగా ఉన్నదని నిపుణులు చెబుతున్న మాట. అస్సాం రైఫిల్స్‌కు 46 బెటాలియన్లు ఉంటే అందులో 15 బెటాలియన్లు మాత్రమే సరిహద్దులను కాపలా కాస్తున్నాయి. మిగిలిన బెటాలియన్లు మిలిటెంట్ గ్రూపుల కార్యకలాపాలను అరికట్టడంలో నిమగ్నమై ఉన్నాయి. ఇలాంటి లోపాలన్నిటినీ సవరించుకోవడంతోపాటు, అభివృద్ధికి చోటిస్తే ఈశాన్యప్రాంతం కూడా ప్రశాంతంగా మనగలుగుతుంది. ఆ దిశగా కేంద్రం చర్యలుండాలి.