దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కుటుంబాన్ని, మరీ ముఖ్యంగా ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డిని నాలుగేళ్లనుంచి రకరకాలుగా వేధించు కుతిన్న తోడేళ్లు రాష్ట్రంలో నిలువనీడ దొరకని స్థితి ఏర్పడి తోకముడిచాయి. ఇక గుంటనక్కల వంతు వచ్చినట్టుంది. ఎన్నికల అనంతరం దేశాన్నేలేది తామేనని ఢంకాబజాయిస్తున్న బీజేపీ... ఈ బాపతు నేతలను వెంటేసుకు తిరగడమే వర్తమాన విషాదం. ఇలాంటివారి ఆసరాతో ఎన్నికల గోదారిని సులభంగా ఈదేయగలమని భావించడంద్వారా ఈ విషాదాన్ని బీజేపీ చేజేతులా కొనితెచ్చుకుంది. విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అపభ్రంశాలుగా మారినవారితో జతకలిసి ఏర్పాటుచేసిన ఫ్రంట్‌కు మొన్న జరిగిన తెలంగాణ ప్రాంత ఎన్నికల్లో జనం తిరుక్షవరం చేశారని పోలింగ్ సరళిని విశ్లేషించిన నిపుణులు చెబుతున్నారు.
అక్కడ కనీసం మూడోస్థానమైనా వస్తుందో రాదో తెలియని దుస్థితిలో బీజేపీ-టీడీపీలు ఉన్నాయి. మరో అయిదురోజుల్లో సీమాంధ్ర ప్రాంతం లోనూ ఆ అనుభవమే ఎటూ పునరావృతమవుతుంది. కానీ, ఈలోగా వివిధ ప్రాంతాల్లో బహిరంగసభలు పెట్టి వారు మాట్లాడే మాటలు విస్మయంగొలుపుతున్నాయి. ఒక మాటకు కట్టుబడలేక...కనీస నిజాయితీనైనా ప్రదర్శించలేక చంద్రబాబు ఊకదంచుతుంటే అపరిపక్వతను నిండా పులుముకున్న పవన్ పక్కతాళం వేస్తున్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ దీనికి మరికొంత అయోమయాన్ని జతచేస్తున్నారు. ఈ బృందగానాల తంతూ తమాషా నిజాన్ని కప్పెట్టలేవు. ఎందుకంటే నిజం నిప్పులాంటిది.
తెలంగాణ ఎన్నికల సభల్లో బాబు ఏమన్నారు? తెలంగాణ ఏర్పాటుకావడం తన ఘనతేనన్నారు. తాను ఇచ్చిన లేఖవల్లే అది సాధ్యమైందన్నారు. ఆ లేఖలో ఎక్కడా సీమాంధ్రుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోమని కోరలేదు. విభజనపై ఇరుప్రాంతాలవారితో మాట్లాడమని సూచించలేదు. కానీ, ఇప్పుడు మాత్రం బహిరంగసభల్లో ‘నేను ఇలా చెప్పాను...అలా చేశాను. సీమాంధ్రులకోసం ఎంతో పాటుబడ్డాను’అంటూ గప్పాలుపోతున్నారు. కాంగ్రెస్ కుట్రలో జగన్, కేసీఆర్ భాగస్వాములని నిందిస్తున్నారు.
నిజానికి ఇక్కడా, కేంద్రంలోనూ కాంగ్రెస్‌కు అన్నివిధాలా అండగా నిలబడిందీ, క్లిష్టస మయాల్లో ఆదుకున్నదీ చంద్రబాబే. రాష్ట్రంలో కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసతీర్మానం వచ్చినప్పుడు ఓటింగ్‌లో పాల్గొన వద్దంటూ విప్ జారీచేసిందీ...మల్టీబ్రాండ్ చిల్లరవర్తకంలో ఎఫ్‌డీఐలను అనుమతించడంపై రాజ్యసభలో ఓటింగ్ జరిగి యూపీఏ సర్కారు కూలి పోయే స్థితి ఏర్పడినప్పుడు ముగ్గురు ఎంపీలను గైర్హాజరు చేయించి గట్టెక్కించిందీ బాబే. తనపై ఉన్న అవినీతి కేసులు పైకిరాకుండా చూసి నందుకు, తన సలహాలకు అనుగుణంగా జగన్‌మోహన్‌రెడ్డిని వేధిస్తున్నం దుకూ కాంగ్రెస్‌కు బాబు ఇచ్చిన నజరానా ఇది.
ఆయనగారి అండదండ లతోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ నిండా ముంచింది. ఆఖరికి ఓటింగ్ రోజున పార్టీ ఎంపీలను రెండు ముఠాలుగా విభజించి ఒకరిని తెలంగాణ బిల్లుకు అనుకూలంగా, మరొకరిని వ్యతిరేకంగా నాటకం ఆడేలా ప్రోత్సహించారు.ఇక బీజేపీది మరో రకం అయోమయం. తెలంగాణను కాంగ్రెస్ ఇవ్వకపోతే అధికారంలోకొచ్చాక తామే ఇస్తామని బీజేపీ పలు సందర్భాల్లో ప్రకటించింది. లోక్‌సభ తలుపులు మూసి, ప్రత్యక్ష ప్రసారాలను సైతం నిలిపేసి, అత్యంత గందరగోళ పరిస్థితులమధ్య బిల్లు ఆమోదం పొందినట్టు ప్రకటించిననాడు సైతం అది అభ్యంతరం చెప్పలేదు. పైగా ఆ పార్టీ నాయకురాలు సుష్మాస్వరాజ్ ‘సహకరించిన ఈ చిన్నమ్మను మర్చిపోవద్దంటూ ఆ సభాంగణంనుంచే ఓట్ల వేటను ప్రారంభించారు.
బయటికొచ్చి ప్రత్యక్ష ప్రసారాలు ఆపిన సంగతే తమకు తెలియదని బుకాయించారు. రాజ్యసభలో బిల్లు చర్చకొచ్చినప్పుడూ ఆ పార్టీది ఇదే అవస్థ. ‘బిల్లు రాజ్యాంగవిరుద్ధమ’ని కాసేపు మాట్లాడినట్టే మాట్లాడి ఆనక దాన్ని సమర్ధించారు. ఈ మొత్తం డ్రామాలో వెంకయ్యనాయుడి పాత్ర గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఉరిశిక్ష అమలవుతున్నవేళ అది తప్పనిపిస్తే ఆపమని డిమాండుచేయాలి. అందుకోసం శాయశక్తులా పోరాడాలి. అంతేతప్ప, ఉరితీస్తే తీశారు... అంతిమ సంస్కారం ఎంత ఘనంగా చేస్తారో, అందుకు ఎంత ఖర్చుపెడతారో ముందుగా చెప్పాలని బేరమాడరు.
ఆరోజు పెద్దల సభలో వెంకయ్య చేసింది సరిగ్గా అదే. ఇప్పుడు తల్లిని చంపి బిడ్డను బతికించారని అర్ధంపర్ధంలేని ఉపమానాలు చెబుతున్నవారు దీనికేం సంజాయిషీ ఇస్తారు? ఇలా మాట్లాడిన నోటితోనే సీమాంధ్రను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతామని చెబుతున్నారు. 2000 సంవత్సరంలో ఏర్పాటుచేసిన మూడు రాష్ట్రాలనూ ఎలాంటి దుస్థితిలో ఉంచారో కళ్లముందు కనబడుతూనే ఉండగా ఈ మాటల్ని నమ్మేదెవరు? స్వర్ణాంధ్రకు ఓటేయాలని, స్కామాంధ్రకు చోటీయవద్దని అభ్యర్థిస్తూ వస్తున్న నరేంద్రమోడీ తన పక్కనే అలాంటి స్కాంలకు ఆద్యుడైన బాబును కూర్చోబెట్టుకోవడం వింతల్లోకెల్లా వింత.
డెరైక్టర్ చెప్పినట్టు వేషాలేసి, డైలాగులు వల్లించే పవన్‌కల్యాణ్ రాజకీయ అజ్ఞా నాన్ని అర్ధం చేసుకోవచ్చు. కానీ, ప్రధాని పదవి మోజులో ఉన్న మోడీ అజ్ఞానాంధకారాన్ని జనం క్షమించలేరు. బాబుపై తమ పార్టీ 1997లో ప్రచురించిన చార్జిషీటునూ... కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరించినందుకే జగ న్‌పై సీబీఐ కేసులు పెట్టారని బీజేపీ నేతలు సుష్మా, జైట్లీ వంటివారు ఇటీవలికాలంలో చెప్పిన సంగతినీ ప్రధాని పదవి కోసం ఆత్రపడటంలో మోడీ గుర్తుంచుకున్నట్టులేరు. బాధ్యత మరిచి, నిజాలు మరుగుపరిచి మాట్లాడేవారు వంచకులుగా మిగులుతారని మోడీ తెలుసుకోవాలి. అందుకు తనపక్కన ఆశీనుడైన బాబే సజీవ ఉదాహరణ.
వంచకుల వీరంగం!
Published Fri, May 2 2014 12:44 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement