అగ్ని–5 క్షిపణి పరీక్ష విజయవంతం
జాతీయం
భారత్–కిర్గిజిస్థాన్ మధ్య ఆరు ఒప్పందాలు
కిర్గిజిస్థాన్ అధ్యక్షుడు ఆల్మాజ్‌బెక్ అతంబయేవ్ భారత పర్యటనలో భాగంగా డిసెంబర్ 20న ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అమలుకు విస్తృత ప్రాతిపదికను ఖరారు చేశాయి. తీవ్రవాదం, అతివాదంపై కలసికట్టుగా పోరాడతామనే కృతనిశ్చయాన్ని ప్రకటించాయి. దీంతోపాటు ఇరు దేశాలు ఆరు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇందులో వ్యవసాయం, పర్యాటక రంగం, సాంస్కృతిక, ప్రసార, యువజన వ్యవహారాల్లో సహకారానికి ఉద్దేశించిన అవగాహన ఒప్పందాలు ఉన్నాయి.
వ్యర్థ పదార్థాలను తగలబెట్టడంపై నిషేధం
కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను తగలబెట్టడాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) పూర్తిగా నిషేధించింది. చెత్త డంపింగ్ ప్రదేశాలతో సహా ఎక్కడ చెత్తను దగ్ధం చేసినా సంబంధిత వ్యక్తి లేదా సంస్థకు రూ.25,000 జరిమానా విధించనున్నట్లు ఎన్‌జీటీ పేర్కొంది. తక్కువ మొత్తంలో చెత్తను తగలబెడితే రూ.5000 జరిమానాగా విధిస్తామని ఎన్‌జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ నేతృత్వంలోని బెంచ్ డిసెంబర్ 22న ప్రకటించింది.
శివాజీ స్మారకానికి జలపూజ చేసిన మోదీ
ముంబై తీరానికి సమీపంలో సముద్రంలో నిర్మించే ఛత్రపతి శివాజీ భారీ స్మారక (ఎత్తు 192 మీటర్లు) నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 24న జల పూజ చేశారు. ఈ స్మారకాన్ని దక్షిణ ముంబైలోని సముద్ర తీరం నుంచి 1.5 కి.మీ దూరంలో రూ.3,600 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ప్రధాని.. కోస్ట్‌గార్డ్ ప్రత్యేక నౌకలో అరేబియా సముద్రంలోని స్మారకం నిర్మించే ప్రాంతానికి వెళ్లి జల పూజ చేశారు. మహారాష్ట్రలోని అన్ని జిల్లాల నుంచి తీసుకొచ్చిన మట్టి, వివిధ నదుల నుంచి తెచ్చిన నీటిని ప్రధాని సముద్రంలో చల్లారు. ఈ స్మారకంలో శివాజీ విగ్రహం, మ్యూజియం, ఆడిటోరియం, రంగస్థల వేదిక, ఎగ్జిబిషన్ గ్యాలరీ ఉంటాయి.
అవార్డులు
బెంగాలీ రచయిత శంఖ ఘోష్‌కు జ్ఞాన్‌పీ
ప్రముఖ బెంగాలీ కవి శంఖ ఘోష్‌కు 2016 సంవత్సరానికి అత్యున్నత సాహిత్య పురస్కారం జ్ఞాన్‌పీuŠ‡ అవార్డు లభించింది. ఆయన్ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు జ్ఞాన్‌పీuŠ‡ ఎంపిక బోర్డ్ డిసెంబర్ 23న ప్రకటించింది. సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం ఏటా ఈ పురస్కారాన్ని అందిస్తోంది. ఘోష్‌కు గతంలో పద్మభూషణ్, సరస్వతీ సమ్మాన్, సాహిత్య అకాడమీ పురస్కారాలు దక్కాయి.
2016 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు
కేంద్ర సాహిత్య అకాడమీ 2016 వార్షిక అవార్డులను డిసెంబర్ 21న ప్రకటించింది. కవిత్వం నుంచి ఎనిమిది మందికి, ఏడుగురు కథకులకు, ఐదుగురు నవలా రచయితలకు, ఇద్దరు విమర్శకులకు, ఒక వ్యాసకర్తకు, ఒక నాటక రచయితకు కలిపి మొత్తం 24 మందికి ఈ సంవత్సరం అవార్డులు దక్కాయి. 2017, ఫిబ్రవరి 22న జరిగే అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో అవార్డులకు ఎంపికైన వారికి తామ్ర పత్రంతో పాటు లక్ష రూపాయల చెక్కును అందిస్తారు. గుంటూరుకు చెందిన పాపినేని శివశంకర్ రాసిన రజనీగంధ కవితా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించగా, విజయవాడకు చెందిన ప్రసాదరావుకు భాషా సమ్మాన్ అవార్డు లభించింది.
మేరీకోమ్‌కు ఏఐబీఏ లెజెండ్స్ అవార్డు
భారత స్టార్ బాక్సర్లు మెరీకోమ్, వికాస్ కృష్ణన్‌లకు అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య అవార్డులు దక్కాయి. మేరీకోమ్‌కు ఏఐబీఏ లెజెండ్స్ పురస్కారం లభించగా, వికాస్‌కు ఏఐబీఏ ప్రో బాక్సింగ్ ఉత్తమ బాక్సర్ అవార్డు దక్కింది. డిసెంబర్ 21న స్విట్జర్లాండ్‌లోని మాంట్రిక్స్‌లో ఏఐబీఏ వార్షికోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేశారు.
ఆర్థికం
తొలి నగదు రహిత ప్రాంతంగా డామన్ డయ్యు
అరేబియా తీరంలోని కేంద్ర పాలిత ప్రాంతం డామన్ డయ్యు.. దేశంలోనే తొలి నగదు రహిత ప్రాంతంగా రికార్డుకెక్కింది. నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు శిక్షణ ఇచ్చేందుకు ఇక్కడ 190 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీటిలోని వలంటీర్లు 25,000 కుటుంబాలకు డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించారు. ప్రజలు డిజిటల్ లావాదేవీలను జరిపేందుకు వీలుగా పరిపాలనా యంత్రాంగం ఉచిత వైఫై సదుపాయాన్ని కల్పించింది.
వార్తల్లో వ్యక్తులు
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ రాజీనామా
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ డిసెంబర్ 22న తన పదవికి రాజీనామా చేశారు. 1973 బ్యాచ్ ఐఏఎస్ అధికారైన నజీబ్ జంగ్ మధ్యప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వంలో పలు కీలక శాఖల్లో పనిచేశారు. 2013, జూలై నుంచి ఆయన ఢిల్లీకి 19వ లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి, నజీబ్‌జంగ్ మధ్య అనేక వివాదాలు చెలరేగాయి.
ఎన్‌సీసీ డీజీగా లెఫ్టినెంట్ జనరల్ వినోద్
నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) నూతన డైరెక్టర్ జనరల్‌గా వినోద్ వశిష్ట్ట్ డిసెంబర్ 26న బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన గయలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో కమాండెంట్‌గా విధులు నిర్వర్తించారు.
ఎంపీ పదవికి మిథున్ చక్రవర్తి రాజీనామా
బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి డిసెంబర్ 26న తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అనారోగ్యం కారణంగానే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మిథున్ చక్రవర్తి 2015, ఫిబ్రవరిలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున పశ్చిమబెంగాల్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు.
పాప్ గాయకుడు జార్జ్ మైఖేల్ మృతి
ప్రముఖ పాప్ గాయకుడు జార్జ్ మైఖేల్ (53) లండన్‌లో డిసెంబర్ 25న మృతి చెందారు. 1980లో జార్జ్ పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. 1963లో లండన్‌లో జన్మించిన మైఖేల్ వామ్ పాప్ గ్రూప్‌తో గాయకుడిగా జీవితం ఆరంభించారు. తర్వాత సొంతంగా ఆల్బమ్‌లు రూపొందించారు. ఆయన నాలుగు దశాబ్దాల కెరీర్‌లో 10 కోట్లకు పైగా ఆల్బమ్స్ అమ్ముడయ్యాయి.
క్రీడలు
ఐసీసీ మేటి క్రికెటర్‌గా రవిచంద్రన్ అశ్విన్
2016 సంవత్సరానికి ఉత్తమ క్రికెటర్స్ అవార్డులను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) డిసెంబర్ 22న దుబాయ్‌లో ప్రకటించింది. ఇందులో రవిచంద్రన్ అశ్విన్ ఒకే ఏడాది ఐసీసీ మేటి క్రికెటర్, ఐసీసీ మేటి టెస్ట్ క్రికెటర్ అవార్డులను దక్కించుకున్నాడు. రాహుల్ ద్రవిడ్ (2004) తర్వాత ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా అశ్విన్ నిలిచాడు
ఐసీసీ అవార్డులు – విజేతలు
మేటి క్రికెటర్‌కు ఇచ్చే సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ: రవిచంద్రన్ అశ్విన్. గతంలో భారత్ నుంచి రాహుల్ ద్రావిడ్ (2004), సచిన్ (2010) మాత్రమే ఈ ట్రోఫీని అందుకున్నారు.
ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: రవిచంద్రన్ అశ్విన్
వన్డే క్రికెటర్: క్వింటన్ డికాక్ (దక్షిణాఫ్రికా)
మహిళల వన్డే క్రికెటర్: సుజీ బేట్స్ (న్యూజిలాండ్)
మహిళల టీ20 క్రికెటర్: సుజీ బేట్స్ (న్యూజిలాండ్)
టీ20 ఉత్తమ ప్రదర్శన: కార్లోస్ బ్రాత్‌వెట్ (10 బంతుల్లో 34 నాటౌట్)
వర్ధమాన క్రికెటర్: ముస్తాఫిజుర్ రెహ్మాన్ (బంగ్లాదేశ్)
అంపైర్: మరాయిస్ ఎరాస్మస్ (దక్షిణాఫ్రికా).
అండర్ 19 ఆసియా కప్ గెలుచుకున్న భారత్l
ఆసియా కప్ అండర్ 19 క్రికెట్ టోర్నమెంట్‌లో భారత యువ జట్టు వరసగా మూడోసారి విజేతగా నిలిచింది. కొలంబోలో డిసెంబర్ 23న జరిగిన ఫైనల్లో శ్రీలంకను భారత్ ఓడించింది. భారత కెప్టెన్ అభిషేక్ శర్మ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును, హిమాన్షు రాణా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును గెలుచుకున్నారు.
పంకజ్ అద్వానీకి 6 రెడ్ స్నూకర్ టైటిల్
భారత క్యూ స్పోర్ట్స్ (స్నూకర్, బిలియర్డ్స్) స్టార్ పంకజ్ అద్వానీ స్నూకర్‌లో షార్ట్ ఫార్మాట్‌గా భావించే 6 రెడ్ స్నూకర్ జాతీయ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ముంబైలో డిసెంబర్ 23న జరిగిన ఫైనల్లో ఇష్‌ప్రీత్ చద్దాపై పంకజ్ గెలుపొందాడు. ఈ విజయంతో జాతీయ, ఆసియా, ప్రపంచ స్థాయిల్లో 6 రెడ్ స్నూకర్ టైటిల్స్ నెగ్గిన ఏకైక ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు.
సైన్స్ అండ్ టెక్నాలజీ
అగ్ని–5 క్షిపణి పరీక్ష విజయవంతం
అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఖండాంతర విధ్వంసక క్షిపణి అగ్ని–5ను ఒడిశాలోని బాలాసోర్‌లో అబ్దుల్ కలాం ద్వీపం నుంచి డిసెంబర్ 26న భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఈ బాలిస్టిక్ క్షిపణి పరిధి 5 నుంచి 6 వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది. అగ్ని–5 పరిధిలో చైనా, రష్యా దేశాలు పూర్తిగా.. సగానికిపైగా యూరప్, ఆఫ్రికా ఖండాలు ఉన్నాయి. అగ్ని–5ను నాలుగు విడతల్లో విజయవంతంగా పరీక్షించడం వల్ల వ్యూహాత్మక బలగాల కమాండ్ (ఎన్‌ఎఫ్‌సీ)లోకి దీన్ని ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమమైందని రక్షణ శాఖ పేర్కొంది. 17 మీటర్ల పొడవు, 50 టన్నుల బరువు, రెండు మీటర్ల వ్యాసార్ధమున్న ఈ క్షిపణికి 3 దశల్లో పనిచేసే ఇంజన్లను అమర్చారు. ఇది 1500 కిలోల అణ్వాయుధాలను మోసుకెళ్లగలదు. అవసరమైతే చాలా తక్కువ సమయంలోనే అగ్ని–5ను లాంచింగ్ కోసం సిద్ధం చేయవచ్చు. ఇందులో అత్యంత కచ్చితత్వం కలిగిన రింగ్ లేజర్ గైరో ఆధారిత ఇనర్షియల్ నేవిగేషన్ సిస్టమ్ (ఆర్‌ఐఎన్‌ఎస్), అధునాతన మైక్రో నేవిగేషన్ వ్యవస్థ (ఎన్‌ఐఎస్‌ఎస్) ఉన్నాయి.
కార్బన్ డై ఆక్సైడ్ పరిశీలనకు ఉపగ్రహ ప్రయోగం
గ్లోబల్ కార్బన్ డై ఆక్సైడ్ పరిశీలనకు తాన్‌శాట్ అనే ఉపగ్రహాన్ని డిసెంబర్ 21న చైనా ప్రయోగించింది. ఈ ఉపగ్రహం వాతావరణ మార్పును అధ్యయనం చేసేందుకు తోడ్పడుతుంది. దీని బరువు 620 కిలోలు. తాన్‌శాట్ ఉపగ్రహాన్ని లాంగ్‌మార్చ్–2డీ రాకెట్ ద్వారా చైనాలోని గోబి ఎడారి నుంచి ప్రయోగించారు. తాన్‌శాట్‌తో పాటు హై రిజల్యూషన్ మైక్రో నానో శాటిలైట్, రెండు స్పెక్ట్రమ్ మైక్రో–నానో ఉపగ్రహాలను కూడా ప్రయోగించారు. ఇవి వ్యవసాయం, అడవులపై అధ్యయనం చేయనున్నాయి. అమెరికా, జపాన్ తర్వాత చైనా సొంత ఉపగ్రహాలతో గ్రీన్‌హౌస్ ఉద్గారాలను అధ్యయనం చేస్తుంది. వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ సాంద్రత, విస్తరణ, పయనం వంటి అంశాలను తాన్‌శాట్ పరిశీలిస్తుంది.
ఐదో తరానికి చెందిన ఎఫ్‌సీ–31 యుద్ధవిమానాన్ని చైనా పరీక్షించినట్లు చైనా మీడియా డిసెంబర్ 26న పేర్కొంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఫైటర్లను తయారుచేస్తున్న పశ్చిమ దేశాలకు దీటుగా చైనా ఎఫ్‌సీ–31 యుద్ధవిమానాన్ని రూపొందించింది. జే–31 జెట్‌లను మరింత అభివృద్ధి చేసిన చైనా వాటికి ఎఫ్‌సీ–31 గైర్ ఫాల్కన్‌గా నామకరణం చేసింది. చైనా డిసెంబర్ 23న ఈ యుద్ధ విమాన పరీక్షను నిర్వహించింది.