‘అగ్ని’ అగర్వాల్‌ ఇక లేరు | Aerospace Engineer R N Agarwal passes away In Hyderabad On Aug 15th | Sakshi
Sakshi News home page

అగ్ని క్షిపణి రూపకర్త ఆర్‌ఎన్‌ అగర్వాల్‌ కన్నుమూత

Published Thu, Aug 15 2024 3:05 PM | Last Updated on Thu, Aug 15 2024 5:13 PM

Aerospace Engineer R N Agarwal passes away In Hyderabad On Aug 15th

భారత్‌కు చెందిన ప్రముఖ ఏరోస్పెస్‌ ఇంజనీర్‌ రామ్‌ నారాయణ్‌ అగర్వాల్‌ ఇక లేరు. 84 ఏళ్ల వయసులో హైదరాబాద్‌లోని నివాసంలో గురువారం(ఆగస్టు 15) ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. భూతల (surface-to-surface missile)  క్షిపణి.. భారత క్షిపణుల్లో మణిహారంగా పేర్కొనే ‘అగ్ని’ని రూపొందించడంలో ఈయనదే ప్రముఖ పాత్ర. అందుకే ఆర్‌ఎన్‌ అగర్వాల్‌ను ఫాదర్‌ ఆఫ్‌ ది అగ్ని సిరీస్‌ ఆఫ్‌ మిస్సైల్స్‌గా పిలుస్తుంటారు.

రామ్ నారాయణ్ అగర్వాల్ రాజస్థాన్‌లోని జైపూర్‌లో వ్యాపారుల కుటుంబంలో జన్మించారు. బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. అనంతరం ప్రోగ్రాం డైరెక్టర్‌గా (AGNI), డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లాబొరేటరీ డైరెక్టర్‌గా పనిచేశారు.

అగర్వాల్ 1983 నుంచి అగ్ని ప్రయోగానికి నాయకత్వం వహించారు. 33 ఏళ్ల క్రితం మే 22 1989న.. ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌గా ఉన్న అగర్వాల్‌.. తన బృందంతో కలిసి 1000 కిలోల పేలోడ్‌తో 800 కి.మీపైగా అగ్ని క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. ఈ మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని ఒడిశా తీరంలోని బాలాసోర్‌లోని చండీపూర్‌లో ప్రయోగించారు.

రక్షణ రంగంలో ఈయన చేసిన కృషికి గానూ భారత ప్రభుత్వం 1990లో పద్మశ్రీ, 2000 సంవత్సరంలో పద్మభూషణ్‌ అవార్డులతో సత్కరించింది. దేశ రక్షణ కోసం అవిరామంగా కృషి చేసిన అగర్వాల్‌.. స్వాతంత్ర దినోత్సవం నాడే కన్నుమూయడం గమనార్హం.

 

 
ఆర్‌ ఎన్‌ అగర్వాల్‌ మృతితో.. దేశం ఓ గొప్ప సైంటిస్ట్‌ను కోల్పోయింది. అగ్ని క్షిపణి కోసం అగర్వాల్‌ విశేషంగా పని చేశారు. తన కృషిని విస్తృతస్థాయికి తీసుకెళ్లి.. వేరుర్వేరు క్షిఫణుల తయారీకి దోహదపడ్డారు. క్షిపణి రంగంలో అనేక వ్యవస్థలను ఏర్పాటు చేశారాయన. 

::: జి. సతీష్‌రెడ్డి, ఏరోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌, డీఆర్‌డీవో మాజీ చైర్మన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement