జీవించే హక్కును వివరించే అధికరణ? | Article describes the right to life as per the rule of Constitution ? | Sakshi
Sakshi News home page

జీవించే హక్కును వివరించే అధికరణ?

Published Wed, Nov 6 2013 11:51 PM | Last Updated on Sat, Sep 2 2017 12:20 AM

Article describes the right to life as per the rule of Constitution ?

ఇండియన్ పాలిటీ
 ప్రాథమిక హక్కులు - ఆదేశిక సూత్రాలు

 వ్యక్తి పరిపూర్ణ అభివృద్ధికి, స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు ప్రాథమిక హక్కులు పెట్టని కోట. భారత ప్రజాస్వామ్యానికి ఇవి పునాదిరాళ్లు. ప్రాథమిక హక్కులను మన రాజ్యాంగానికి మాగ్నాకార్టాగా పేర్కొంటారు. వీటికి, ఆదేశిక సూత్రాలకు మధ్య సంబంధం విషయంలో.. న్యాయ శాస్త్రవేత్తలకు, రాజ్యాంగ నిపుణులకు, రాజనీతిజ్ఞులకు మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. న్యాయ సంరక్షణ లేని హక్కులుగా బి.ఎన్.రావు వర్ణించిన ఆదేశిక సూత్రాల స్థితిగతులపై అనేక వాదనలున్నాయి. రాజ్యాధికార దుర్వినియోగం, నియంతృత్వ చట్టాల నుంచి పౌరుల ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించే బాధ్యతను మన రాజ్యాంగం సుప్రీంకోర్టు, హైకోర్టులకు అప్పగించింది. తద్వారా ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ లభించింది.
 
 వీటి రక్షణ కోసం సుప్రీంకోర్టు  32వ అధికరణ ప్రకారం, హైకోర్టులు 226వ అధికరణ ప్రకారం రిట్లను జారీ చేస్తాయి. రాజ్యాంగంలోని 37వ అధికరణను అనుసరించి ఎలాంటి న్యాయ సంరక్షణ లేని ఆదేశిక సూత్రాలు అంతగా పట్టించుకోదగినవి కావని కె. సంతానం వ్యాఖ్యానించడం గమనార్హం. నిర్దేశిక నియమాలకు న్యాయసంరక్షణ లేకపోయినప్పటికీ సామాజిక మద్దతు ఉందని డా.బి.ఆర్. అంబేద్కర్ పేర్కొన్నారు. ప్రభుత్వాలు సమాజానికి, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఈ విషయాన్ని విస్మరించడానికి అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
 
 ప్రాథమిక హక్కులు - ఆదేశిక సూత్రాల మధ్య సంబంధం:
 ప్రాథమిక హక్కులు- ఆదేశిక సూత్రాల మధ్య వైరుధ్యాలు, తేడాలు మాత్రమే ఉన్నాయని, ఎలాంటి సంబంధం, సమన్వయం లేదనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో ఉంది. 19(1)(ఎ) అధికరణ వ్యక్తి భావ ప్రకటన, వాక్ స్వాతంత్య్రాల గురించి పేర్కొంటోంది. 21వ అధికరణ వ్యక్తి స్వేచ్ఛను తెలుపుతోంది. సాధారణంగా అన్ని రకాల ఆర్థిక వనరులను కలిగి రాజ్యాంగం, హక్కుల గురించి అవగాహన ఉన్నవారు వాటిని పొందడం పెద్ద సమస్య కాదు. కానీ పేదలు, నిరక్షరాస్యులు, ప్రాథమిక హక్కుల గురించి అవగాహనలేనివారు ఈ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను పొందడానికి ఆదేశిక సూత్రాల్లోని 39-ఎ అధికరణ ఉచిత న్యాయ సేవా సహాయ కేంద్రాల ద్వారా అవకాశం కల్పిస్తోంది.  పేదలకు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి ఉచిత న్యాయసేవా సహాయం అందించడానికి 1987లో లీగల్ ఎయిడ్ అథారిటీని ఏర్పాటు చేశారు.
 
 రాజ్యాంగంలోని 21వ అధికరణ జీవించే హక్కును వివరిస్తోంది. 41వ అధికరణ, 48ఎ అధికరణలు ప్రాథమిక హక్కులకు, ఆదేశిక సూత్రాలకు మధ్య అవినాభావ సంబంధాన్ని తెలుపుతున్నాయి. రాజ్యాంగంలోని 46వ అధికరణ వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగపరంగా ప్రత్యేక అవకాశాలను కల్పించాలని పేర్కొంటోంది. రిజర్వేషన్ల అమలు కోసం ప్రభుత్వాలు రూపొందించిన చట్టాలను 15(4), 15(5), 16(4), 16(4ఎ) అధికరణలు సమర్థిస్తాయి. ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కుల అమలులో ఒకదానికి మరొకటి సహకరించడంతో పాటు ఒక అంశాన్ని మరొక అంశం పటిష్టపరిచేందుకు దోహదపడడం గమనార్హం.
 
 ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య భిన్నత్వం:
 ప్రాథమిక హక్కులు ప్రధానంగా వ్యక్తి ప్రాతిపదికపై రూపొందించినవి. ఆదేశిక సూత్రాలు సమాజ సమష్టి ప్రయోజనం కోసం ఉద్దేశించినవి. హక్కులు వ్యక్తి స్వేచ్ఛను, రాజకీయ ప్రజాస్వామ్యాన్ని పెంపొందించేందుకు తోడ్పడతాయి.  ప్రాథమిక హక్కుల సంరక్షణ, అమలు కోసం పౌరులు ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు అవకాశం ఉండగా, వాటి సంరక్షణ కోసం న్యాయస్థానాలు కూడా ఆజ్ఞలు జారీ చేసే అధికారాన్ని కలిగి ఉంటాయి. ఆదేశిక సూత్రాలకు అలాంటి న్యాయ సంరక్షణ లేకపోవడం గమనార్హం. ప్రాథమిక హక్కులు ఎల్లప్పుడూ పౌరులకు అందుబాటులో ఉంటాయి. జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన సందర్భంలో మాత్రమే భారత రాష్ర్టపతి వాటిని తాత్కాలికంగా సస్పెండ్ చేయొచ్చు. కానీ నిర్దేశిక నియమాలు ఎల్లప్పుడూ సుప్తచేతనావస్థలో ఉంటాయి.
 
 అంటే వాటికి జీవం పోయాలంటే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు చట్టాలను చేసి అమలు పర్చాలి. ప్రాథమిక హక్కుల సంరక్షణ బాధ్యత న్యాయస్థానాలపై, నిర్దేశిక నియమాల అమలు బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. ఆదేశిక సూత్రాలు ప్రభుత్వాలకు సకారాత్మక దృక్పథాన్ని కల్పిస్తాయి. అంటే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు మార్గదర్శకాన్ని చూపుతాయి. ప్రాథమిక హక్కులు ప్రధానంగా ఏ పనులు చేయకూడదో తెలుపుతాయి. అంటే కొన్ని హక్కులు తప్ప మిగతావన్నీ నకారాత్మక దృక్పథాన్ని తెలుపుతాయి.
 
 ఆదేశిక సూత్రాలు రాజ్యాంగ సంక్షేమ లక్ష్యాలను తెలిపితే... ప్రాథమిక హక్కులు ఆ లక్ష్యాలను సాధించే సాధనాలు, మార్గాలుగా ఉపయోగపడతాయి. సంక్షేమ రాజ్యస్థాపనలో నిమగ్నమైన మన దేశంలో నిర్దేశిక నియమాలు.. ప్రభుత్వ శాసనాల రూపకల్పనలో, పరిపాలనా విషయంలో మాత్రమే కాకుండా న్యాయస్థానాల న్యాయ నిర్వహణలోనూ అధిక ప్రాధాన్యతను కలిగి ఉంటాయి.  
 
 ప్రాథమిక హక్కులు - ఆదేశిక సూత్రాల మధ్య వైరుధ్యం:
 
 ఆదేశిక సూత్రాలను అమలు పర్చాల్సిన బాధ్యత కేంద్ర-రాష్ర్ట ప్రభుత్వాలపై ఉంది. ఆదేశిక సూత్రాల అమలుకు ప్రభుత్వాలు రూపొందించే చట్టాలు... ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నప్పుడు ఉన్నత న్యాయస్థానాలు న్యాయ సమీక్ష నిర్వహించి ఆ చట్టాలు చెల్లవని ప్రకటిస్తున్నాయి.
 -    1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంలో మద్రాస్ రాష్ర్ట ప్రభుత్వం 46వ అధికరణను అమలు జరపడంలో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రత్యేక చట్టాన్ని రూపొందించింది. సమానత్వపు హక్కుకు రిజర్వేషన్లు విరుద్ధమని పేర్కొంటూ చంపకం దొరై రాజన్ మద్రాస్ హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై మద్రాస్ రాష్ర్ట ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. సుప్రీంకోర్టు కూడా రిజర్వేషన్ల చట్టం 13వ అధికరణ ప్రకారం ప్రాథమిక హక్కులకు విరుద్ధమని తీర్పునిచ్చింది.
 -    1950 లో వివిధ రాష్ర్ట ప్రభుత్వాలు 39(బి), 39(సి) అధికరణలను అమలు పర్చడంలో భాగంగా భూ సంస్కరణల చట్టాలను రూపొందించాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ హైకోర్టులు భూ సంస్కరణల చట్టాలను సమర్థించగా... బీహార్, పశ్చిమబెంగాల్ హైకోర్టులు ఈ చట్టాలు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాయి. కారణం అప్పట్లో ఆస్తిహక్కు ప్రాథమిక హక్కుగా ఉండడమే. అంతేకాకుండా దేశంలోని వివిధ హైకోర్టుల్లో వందలాది కేసులు విచారణలో ఉన్నాయి.
 -    రిజర్వేషన్లు, భూ సంస్కరణల చట్టాల విషయంలో ఉన్నత న్యాయస్థానాలిచ్చిన తీర్పులను దృష్టిలో ఉంచుకొని 1951 లో నెహ్రూ ప్రభుత్వం మొదటి రాజ్యాంగ సవరణను చేసింది. ఈ సవరణ ద్వారా భూ సంస్కరణల చట్టాలకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పిస్తూ 9వ షెడ్యూల్‌ను రాజ్యాంగంలో చేర్చారు. ప్రైవేట్ ఆస్తులను చట్టబద్ధంగా ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ 31(ఎ), 31(బి) అధికరణలను మన రాజ్యాంగంలో పొందుపర్చారు.
 -    రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధతను కల్పిస్తూ 15(4) అనే అధికరణను కూడా చేర్చారు. మొదటి రాజ్యాంగ సవరణ కూడా ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉందనే కారణంతో శంకరీ ప్రసాద్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
 -    1951లో శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు... మొదటి రాజ్యాంగ సవరణను, తద్వారా రాజ్యాంగంలో చేర్చిన అంశాలను సమర్థించింది. ఈ కేసులో ఒక ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించింది. 13వ అధికరణ ప్రకారం సాధారణ చట్టాలను మాత్రమే న్యాయ సమీక్షకు గురిచేయొచ్చని, 368 అధికరణ ప్రకారం చేసిన  రాజ్యాంగ సవరణలను న్యాయ సమీక్షకు గురిచేసే అవకాశం లేదని పేర్కొంది.
 -    బేలా బెనర్జీ వర్సెస్ పశ్చిమ బెంగాల్, కామేశ్వరీ సింగ్ వర్సెస్ బీహార్ మధ్య జరిగిన వ్యాజ్యాల్లో సుప్రీంకోర్టు... ప్రైవేట్ వ్యక్తుల వద్ద ఉన్న వ్యక్తిగత ఆస్తులను సమాజ ప్రయోజనం కోసం జాతీయం చేసినప్పుడు వారికి నష్టపరిహారం న్యాయబద్ధంగా చెల్లించాలని, అంటే మార్కెట్ విలువ ప్రకారం చెల్లించాలని తీర్పునిచ్చింది. దీంతో పార్లమెంట్ 4వ రాజ్యాంగ సవరణ చేసింది. వ్యక్తులకు చెల్లించే నష్టపరిహారాన్ని చట్టబద్ధంగా మాత్రమే చెల్లించాలని పేర్కొంది.
 -    సజ్జన్‌సింగ్ వర్సెస్ రాజస్థాన్ మధ్య జరిగిన వ్యాజ్యంలో కూడా సుప్రీంకోర్టు 1965లో 4వ సవరణను సమర్థించింది. కానీ, 1967లో గోలక్‌నాథ్ వర్సెస్ పంజాబ్ మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు... గత తీర్పులకు భిన్నమైన తీర్పునిచ్చింది. ఆదేశిక సూత్రాలను అమలు పర్చడానికి ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్‌కు లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ప్రాథమిక హక్కులను సవరించినట్లయితే.. ఆ సదరు సవరణలను కూడా న్యాయసమీక్షకు గురిచేస్తామని కోర్టు పేర్కొంది.
 -    1969లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 14 బ్యాంకులను జాతీయం చేసిన అంశాన్ని, 1970లో రాజభరణాలను రద్దు చేస్తూ రాష్ర్టపతి జారీ చేసిన ఆర్డినెన్‌‌సలు కూడా రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పులనిచ్చింది. దీంతో ఇందిరాగాంధీ ప్రభుత్వం 24, 25, 26వ రాజ్యాంగ సవరణలను చేపట్టింది.
 -    24వ సవరణ ప్రకారం... ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించే అధికారం పార్లమెంట్‌కు ఉంటుంది.
 -    25వ సవరణ ప్రకారం ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడు చెల్లించే నష్టపరిహారం అనే పదానికి బదులుగా కొంత మొత్తం చెల్లించాలని, ఈ అంశాన్ని ఏ న్యాయస్థానంలో కూడా సవాల్ చేసే అవకాశం లేదని పేర్కొంటూ ‘సి’ క్లాజును చేర్చారు.
 -    26వ సవరణ ప్రకారం రాజభరణాల రద్దుకు రాజ్యాంగబద్ధతను కల్పించారు.
 -    పై మూడు రాజ్యాంగ సవరణలను 1973లో కేశవానంద భారతి వర్సెస్ కేరళ మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. 24వ రాజ్యాంగ సవరణను సమర్థిస్తూ ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్‌కు ఉందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మాత్రం సవరించే అధికారం లేదని పేర్కొంది.
 -    25వ సవరణను సమర్థించినప్పటికీ అందులోని సి క్లాజు చెల్లదని తీర్పునిచ్చింది.
 -    26వ రాజ్యాంగ సవరణను సుప్రీకోర్టు సమర్థించింది.
 -    1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆదేశిక సూత్రాలను అమలు పర్చడానికి రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా పార్లమెంట్ సవరిస్తుందని, అలా సవరించిన అంశాన్ని ఏ న్యాయస్థానం ముందు ప్రశ్నించొద్దని, ఆ అంశాన్ని న్యాయ సమీక్షకు గురిచేసే అధికారం కూడా న్యాయస్థానాలకు లేదని పేర్కొంది.
-    42వ సవరణ ద్వారా చేర్చిన అంశాలను 1980లో జరిగిన మినర్వా మిల్స్ కేసులో ప్రశ్నించారు. మినర్వామిల్స్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు రెండూ పరస్పరం విరుద్ధమైనవి కావు, భారత ప్రజాస్వామ్యానికి రెండు రథచక్రాల వంటివి, ఈ రెండింటి మధ్య సమన్వయం సాధించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొంది. అంతేకాకుండా ఆదేశిక సూత్రాలన్నింటికీ కాకుండా 39(బి), 39(సి) అధికరణలకు  మాత్రమే న్యాయ సంరక్షణ ఉంటుందని పేర్కొంది. ప్రాథమిక హక్కులు మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని వెల్లడిస్తూ ఆదేశిక సూత్రాలపై ప్రాథమిక హక్కుల ప్రాధాన్యతను చాటి చెప్పింది.
 -    ఎం.హెచ్. హోస్‌కాట్ వర్సెస్ మహారాష్ర్ట మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు ఉచిత న్యాయ సేవా సహాయాన్ని అందించడం కూడా ప్రాథమిక హక్కుగా గుర్తించాలని తీర్పునిచ్చింది.
 -    1992లో మోహినీజైన్ కేసులో, ఉన్నికృష్ణన్ కేసులో ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు గుర్తించింది. ఇందిరాసహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య వ్యాజ్యంలో సంక్షేమ స్వభావం కూడా మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని పేర్కొంది.
-    ఆదేశిక సూత్రాల్లో పర్యావరణ పరిరక్షణ అనే అంశాన్ని కూడా సమర్థిస్తూ ఎం.సి.మెహతా కేసులో తాజ్‌మహాల్ చుట్టూ కాలుష్యాన్ని వెదజల్లే 18 రకాల పరిశ్రమలను మూసివేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
-    2006లో భారత పార్లమెంట్ 93వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యాసంస్థల్లో ఇతర వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లు కల్పించడాన్ని అశోక్‌కుమార్ ఠాకూర్ కేసులో  సుప్రీంకోర్టు సమర్థించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement