సివిల్స్‌ మెయిన్స్‌..‘ఆప్షనల్‌’ ఎంపికలో..! | Civils mains | Sakshi
Sakshi News home page

సివిల్స్‌ మెయిన్స్‌..‘ఆప్షనల్‌’ ఎంపికలో..!

Published Mon, Jul 24 2017 2:07 AM | Last Updated on Tue, Sep 5 2017 4:43 PM

సివిల్స్‌ మెయిన్స్‌..‘ఆప్షనల్‌’ ఎంపికలో..!

సివిల్స్‌ మెయిన్స్‌..‘ఆప్షనల్‌’ ఎంపికలో..!

సివిల్స్‌ మెయిన్‌ ఎగ్జామినేషన్‌లో మెరిట్‌ జాబితా రూపకల్పనకు పరిగణనలోకి తీసుకునే ఏడు పేపర్లలో రెండు పేపర్లు ఆప్షనల్‌ సబ్జెక్టుకు సంబంధించినవి. అభ్యర్థులు యూపీఎస్సీ నిర్దేశించిన ఆప్షనల్‌ సబ్జెక్టుల జాబితా నుంచి దీన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఫలితాలపై ఆప్షనల్‌ సబ్జెక్టు చూపే ప్రభావం గురించి అభ్యర్థుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ‘ఫలానా ఆప్షనల్‌ స్కోరింగ్‌గా ఉందని లేదా ఫలానా ఆప్షనల్‌లో సిలబస్‌ సులభంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. అయితే ఏ సబ్జెక్టు అయినప్పటికీ యూపీఎస్సీ.. మూల్యాంకన కోణంలో స్కేలింగ్‌ విధానాన్ని అనుసరిస్తూ అన్ని సబ్జెక్టుల అభ్యర్థులకు సమన్యాయం చేసేలా వ్యవహరిస్తోందని నిపుణులు అంటున్నారు. అందువల్ల ఆప్షనల్‌ విషయంలో ఆందోళనకు గురికాకుండా స్వీయ సామర్థ్యం మేరకు సబ్జెక్టును ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఆసక్తికి ప్రాధాన్యం
ఆప్షనల్‌ సబ్జెక్టు ఎంపిక విషయంలో అభ్యర్థులు ముందుగా తమ ఆసక్తికి ప్రాధాన్యం ఇవ్వాలనేది నిపుణుల అభిప్రాయం. వ్యక్తిగత ఆసక్తితో ఆప్షనల్‌ను ఎంపిక చేసుకుంటే ఆ సబ్జెక్టు సిలబస్‌ ఎంత క్లిష్టంగా ఉన్నప్పటికీ విజయం సాధించొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మ్యాథమెటిక్స్‌ అంటే అకడమిక్‌ పరీక్షల విషయంలోనే విద్యార్థులు ఇబ్బందికరంగా భావిస్తారు. అలాంటి సబ్జెక్టును సివిల్స్‌–2014 మెయిన్స్‌లో 351 మంది ఆప్షనల్‌గా ఎంపిక చేసుకున్నారు. వీరిలో 35 మంది విజేతలుగా నిలిచారు. మెడికల్‌ సైన్స్‌ సబ్జెక్టును 356 మంది ఎంపిక చేసుకోగా, 71 మంది విజేతలుగా నిలిచారు. ఆసక్తి ఉంటే ఏ సబ్జెక్టును ఎంపిక చేసుకున్నప్పటికీ విజయం సాధించొచ్చనే దానికి ఈ గణాంకాలే నిదర్శనం.

సిలబస్‌ పరిశీలన
తర్వాతి దశలో అభ్యర్థులు సంబంధిత ఆప్షనల్‌ సిలబస్‌ను పరిశీలించాలి. అందులోని అంశాలపై పరీక్ష సమయానికి తాము సంసిద్ధత పొందగలమా? లేదా? అని బేరీజు వేసుకోవాలి. కేవలం స్కోరింగ్‌ పేరుతో ఒక ఆప్షనల్‌ను తీసుకుంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. సిలబస్‌తో పాటు సదరు ఆప్షనల్‌ సబ్జెక్టు గత ప్రశ్నపత్రాలను కూడా పరిశీలించడం ద్వారా మరింత స్పష్టత వస్తుంది.

మెటీరియల్‌ లభ్యత
సాధారణంగా పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, జాగ్రఫీ, హిస్టరీ, లాంగ్వేజ్‌ లిటరేచర్‌ వంటి ఆప్షనల్స్‌కు మార్కెట్లో ప్రామాణిక మెటీరియల్‌ లభ్యత బాగుంటుంది. మరోవైపు తమ అకడమిక్‌ నేపథ్యానికి అనుగుణంగా కోర్‌ సబ్జెక్టులను ఎంపిక చేసుకునే అభ్యర్థులకు మాత్రం మెటీరియల్‌ లభ్యత కొంత తక్కువే. వీరు తమ అకడమిక్‌ పుస్తకాలను, ఇతర ఐసీటీ టూల్స్‌ ఆధారంగా చేసుకొని ప్రిపరేషన్‌ సాగించాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో కొంత సమయం వృథా అవుతుంది. అయితే.. అకడమిక్స్‌ పరంగా అన్ని విభాగాల్లో మెరుగ్గా ఉన్న అభ్యర్థులు సంబంధిత ఆప్షనల్‌ను ఎంపిక చేసుకున్నప్పటికీ సులువుగానే విజయావకాశాలను మెరుగుపరచుకోవచ్చు.

స్వీయ ప్రిపరేషన్‌
ఇటీవల కాలంలో కొందరు అభ్యర్థులు ఉద్యోగాలు చేస్తూనో, లేదా శిక్షణ పొందే అవకాశాలు లేకపోవడం కారణంగా స్వీయ ప్రిపరేషన్‌ సాగించి విజయం సాధిస్తున్నారు. వీరికి దోహద పడుతున్న అంశం ఆప్షనల్‌ ఎంపికలో శాస్త్రీయ దృక్పథంతో వ్యవహరించడం. ఈ అంశాన్ని ఔత్సాహికులు గుర్తించాలి.

సరితూగే సబ్జెక్టు లేకుంటే..
ప్రస్తుతం సివిల్స్‌ మెయిన్‌ ఎగ్జామినేషన్‌లో భాషా సాహిత్యం సహా అందుబాటులో ఉన్న ఆప్షనల్‌ సబ్జెక్టుల సంఖ్య 27. ఈ సబ్జెక్టులను అకడమిక్‌గా అన్ని నేపథ్యాల వారికి
సరితూగే విధంగా నిర్దేశించారు.

అయితే వీటిలో ఏ సబ్జెక్టు కూడా నచ్చని అభ్యర్థులు లేదా కాంపిటీటివ్‌ ఎగ్జామ్‌ కోణంలో సదరు సబ్జెక్టుల సిలబస్‌ విషయంలో ఆందోళన చెందే అభ్యర్థులు... తాము హైస్కూల్‌ స్థాయిలో ఆసక్తి కనబరిచిన సబ్జెక్టును అవలోకనం చేసుకుని.. దాని ఆధారంగా ఆప్షనల్‌ సబ్జెక్టును ఎంపిక చేసుకోవడం ద్వారా కొంతమేరకు సమస్యను అధిగమించొచ్చు.

భాషా సాహిత్యం ఆప్షనల్‌ ఎంపికలో
ఇటీవల కాలంలో పలువురు భాషా సాహిత్యం సబ్జెక్టును ఆప్షనల్‌గా ఎంపిక చేసుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నారు. మెటీరియల్‌ లభ్యత, గైడెన్స్, సులువుగా అవగతం చేసుకునే అవకాశాలే దీనికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా మాతృభాషలో ప్రజెంటేషన్‌ వల్ల వేగం, కచ్చితత్వంతో వ్యవహరించొచ్చనే ఉద్దేశంతో లాంగ్వేజ్‌ లిటరేచర్‌ను ఆప్షనల్‌గా ఎంచుకుంటున్నారు. 2014లో తెలుగు లిటరేచర్‌ ఆప్షనల్‌తో 122 మంది హాజరవగా.. 2015లో ఆ సంఖ్య 132. సక్సెస్‌ రేటు కూడా రెండేళ్లకు కలిపి సగటున 10.5 శాతంగా నమోదైంది. మాతృభాష (తెలుగు)లో పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల పరంగానూ తెలుగు లిటరేచర్‌ను ఆప్షనల్‌గా తీసుకునే వారి సంఖ్య దాదాపు పది శాతం వరకు ఉంటోంది.

పోటీ తక్కువ ఉండే సబ్జెక్టులు
మెయిన్స్‌ ఆప్షనల్‌ ఎంపిక విషయంలో కొంత వినూత్నంగా వ్యవహరించడం ద్వారా విజయావకాశాలను మెరుగుపరచుకోవచ్చు. ఈ క్రమంలో పోటీ తక్కువ ఉండే సబ్జెక్టులను ఎంపిక చేసుకోవడం మేలు చేస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అకడమిక్‌ స్థాయిలో సదరు సబ్జెక్టుపై పూర్తి స్థాయిలో పట్టు సాధించిన అభ్యర్థులు అదే సబ్జెక్టును ఆప్షనల్‌గా ఎంపిక చేసుకుంటే పరీక్షలో మెరుగ్గా వ్యవహరించొచ్చు. ఉదాహరణకు ఎకనామిక్స్, మేనేజ్‌మెంట్, లా వంటి సబ్జెక్టులను తీసుకుంటే వీటిని ఎంపిక చేసుకునే వారి సంఖ్య సగటున 200 ఉంటోంది. అంతేకాకుండా వీటి సక్సెస్‌ రేటు కూడా ఇతర క్రేజీ సబ్జెక్టుల తరహాలోనే ఉంటోంది.

పాపులర్‌ ఆప్షన్స్‌గా నిలుస్తున్న ఇతర సబ్జెక్టులు
ఇటీవల కాలంలో స్కోరింగ్‌ పరంగా పాపులర్‌ ఆప్షన్‌గా నిలుస్తున్న ఇతర సబ్జెక్టుల విషయానికొస్తే.. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, జాగ్రఫీ, ఫిలాసఫీ, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ ముందు వరుసలో నిలుస్తున్నాయి. 15 వేల నుంచి 16 వేల మంది వరకు హాజరయ్యే మెయిన్‌ ఎగ్జామినేషన్‌లో ఈ సబ్జెక్టుల అభ్యర్థులే దాదాపు తొమ్మిది నుంచి పది వేల మంది వరకు ఉంటున్నారు. వీటికి సంబంధించి మెటీరియల్‌ లభ్యత, సరళీకృత అంశాలు, గైడెన్స్‌ పరంగా ఫ్యాకల్టీ లభ్యత వంటి అంశాలు ఇందుకు కారణంగా నిలుస్తున్నాయి. అభ్యర్థులు.. తాము ప్రిపరేషన్‌కు కేటాయించే మొత్తం సమయంలో 30 నుంచి 40 శాతం సమయాన్ని ఆప్షనల్‌ సబ్జెక్టుకు కేటాయించాలి.

రిసోర్సెస్‌ లభ్యతను పరిగణనలోకి తీసుకోవాలి
ఆప్షనల్‌ ఎంపికలో అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టు సిలబస్‌ అంశాలను బేరీజు వేసుకొని, దానికి సంబంధించి రిసోర్సెస్‌ లభ్యతను పరిగణనలోకి తీసుకోవాలి. కొందరు అకడమిక్‌గా ఒక సబ్జెక్టులో మెరుగైన ప్రతిభ చూపినప్పటికీ.. పోటీ పరీక్షల కోణంలో రాణించలేరు. అలాంటి అభ్యర్థులు కొంచెం సులువుగా ఉండే హ్యుమానిటీస్‌కు సంబంధించిన ఆప్షనల్స్‌ తీసుకోవడం మేలు. అందుకే ఇటీవల కాలంలో బీటెక్, మ్యాథమెటిక్స్‌ నేపథ్యం ఉన్న అభ్యర్థులు కూడా పాలిటీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ వంటి వాటిని ఎంపిక చేసుకుంటున్నారు.    
– వి.గోపాలకృష్ణ, బ్రెయిన్‌ ట్రీ అకాడమీ.

సత్తాను బేరీజు వేసుకోవాలి
అకడమిక్‌ నేపథ్యానికి సంబంధించిన ఆప్షనల్‌ను ఎంపిక చేసుకునే క్రమంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అందులో రాణించే సత్తాను బేరీజు వేసుకోవాలి. అకడమిక్స్‌కు పూర్తి భిన్నమైన సబ్జెక్టును ఆప్షనల్‌గా ఎంచుకుంటే (ఉదాహరణకు ఇంజనీరింగ్‌ విద్యార్థులు సోషియాలజీ, సైకాలజీ వంటివి) ప్రిపరేషన్‌ పరంగా అన్వయ సామర్థ్యంపై అవగాహన పెంపొందించుకొని నిర్ణయం తీసుకోవాలి. అంతేకాకుండా తెలుగు మీడియంలో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు.. ఇంగ్లిష్‌ మీడియంలో ఉండే మెటీరియల్‌ను తెలుగులోకి అనువాదం చేసుకోవడంలో సులభంగా ఉండే సబ్జెక్ట్‌లను ఎంపిక చేసుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది.
– పి.అన్వేష రెడ్డి,
సివిల్స్‌ విజేత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement