కాంపిటీటివ్ కౌన్సెలింగ్
* నేను సివిల్స్ ప్రిలిమ్స్‌కు ప్రిపేర్ అవుతున్నాను. ప్రిలిమ్స్‌లో ఎకానమీని ఎలా ప్రిపేర్ కావాలో తెలియజేయండి?
- మహితా, సికింద్రాబాద్
సివిల్స్ ప్రిలిమినరీలో క్లిష్టమైనవిగా భావించే సబ్జెక్టుల్లో ఎకానమీ ఒకటి. ప్రిలిమినరీ గండం గట్టెక్కడంలో ఎకానమీ అత్యంత కీలకమైంది కూడా! గత ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే.. ప్రిలిమ్స్‌లో ఎకానమీ సంబంధిత అంశాలపై సగటున 15-20 ప్రశ్నలు అడిగారు. ఉపాధి, ప్రణాళికలు, అభివృద్ధి, ద్రవ్యం, బ్యాంకింగ్, విదేశీ వాణిజ్యం, వ్యవసాయం, అవస్థాపనా సౌకర్యాలు, ప్రభుత్వ విత్తం, జనాభా, పేదరికం నుంచి ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు. ముఖ్యంగా 2013 సివిల్స్ ప్రిలిమినరీ ప్రశ్న పత్రాన్ని గమనిస్తే ఎకానమీ నుంచి అన్నీ కాన్సెప్ట్ బేస్డ్ ప్రశ్నలే వచ్చాయి. కాన్సెప్ట్‌లపై అవగాహన కోసం ఎన్‌సీఈఆర్‌టీ 6వ తరగతి నుంచి 12వ తరగతి పుస్తకాలను అధ్యయనం చేయాలి. గత ప్రిలిమినరీలో బ్యాంకింగ్ నుంచి నాలుగు ప్రశ్నలు, అంతర్జాతీయ వాణిజ్యం నుంచి మూడు ప్రశ్నలు ఇవ్వడం విశేషం. ఉదాహరణకు Priority Sector Lending by banks in India constitutes the lending to.. a)Agriculture b)Micro and small enterprises c)weaker sections d)all of the above; Ans: d
కాబట్టి ప్రిలిమ్స్‌కు హాజరయ్యే విద్యార్థులు నివేదికలు, వ్యవసాయం, పారిశ్రామికరంగం, సేవారంగం, బ్యాంకింగ్, పన్నుల వ్యవస్థ, జాతీయాదాయం, యూఎన్‌డీపీ మానవాభివృద్ధి నివేదిక, 12వ ప్రణాళిక, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ప్రపంచ వాణిజ్య సంస్థ, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంక్, ద్రవ్యం-బ్యాంకింగ్, పేదరికం, సాంఘిక భద్రత, సుస్థిర అభివృద్ధి, ద్రవ్యోల్బణం వంటి అంశాలను అధ్యయనం చేయాలి. ప్రిపరేషన్‌లో కేవలం సిలబస్‌కే పరిమితం కాకుండా సంబంధిత అంశాలను కరెంట్ అఫైర్స్‌తో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి.
కార్పొరేట్ గవర్నెర్స్‌పై సెబీ జారీ చేసిన మార్గదర్శకాలు, ఇటీవల టోకు ధరల సూచి(WPI),), వినియోగదారుని ధరల సూచి(CPI) 2013-14 ఆర్థిక సంవత్సరంలో వివిధ రాష్ట్రాల వృద్ధి రేట్లు, ద్రవ్యలోటు; సామాజిక అభివృద్ధి సూచిక(సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్); ఏషియన్ డెవలప్‌మెంట్ అవుట్‌లుక్-2014, కేంద్ర బ్యాంకు కొత్త బ్యాంకులకు సంబంధించిన లెసైన్స్‌ల మంజూరు; కేంద్ర బ్యాంకు ద్రవ్య విధానంలో భాగంగా విధాన రేట్లలో మార్పు; బేసల్-3 నియమాలు; పీఎఫ్‌నకు సంబంధించి యూనివర్సల్ అకౌంట్ నంబర్; ఎన్నికల వ్యయం; కరెంట్ అకౌంట్ లోటు; రూపాయి మూల్యహీనీకరణ వంటి కరెంట్ టాపిక్స్‌తో సమన్వయం చేసుకుంటూ అధ్యయనం కొనసాగించాలి. ముఖ్యంగా పరీక్ష కోణంలో ఎప్పటికప్పుడు నోట్స్ రూపొందించుకోవాలి. ఆ నోట్స్‌ను ప్రతి రోజూ రివిజన్ చేసుకోవాలి. ప్రిపరేషన్ స్థాయిని తెలుసుకునేందుకు అభ్యర్థి ఎప్పటికప్పుడు తన పర్‌ఫార్మెన్స్‌ను సమీక్షించుకోవాలి.
రిఫరెన్స్ బుక్స్:
* ఇండియా ఇయర్ బుక్; ఇండియా ఎకనమిక్ సర్వే
* ఇండియన్ ఎకానమీ- ఎస్.కె.మిశ్రా అండ్ పూరి
* ఇండియన్ ఎకానమీ- ఉమా కపిల
* ఇండియన్ ఎకానమీ ఇన్ ద 21 సెంచరీ-
* రాజ్ కపిల అండ్ ఉమా కపిల
ఇన్‌పుట్స్ - తమ్మా కోటిరెడ్డి
* బ్యాంక్ పరీక్షల్లో జనరల్ అవేర్‌నెస్ విభాగం నుంచి ఎలాంటి ప్రశ్నలు అడిగేందుకు అవకాశం ఉంది?
- సంపంగి రేణుక, కర్మన్‌ఘాట్
అన్ని బ్యాంక్ పరీక్షల్లో జనరల్ అవేర్‌నెస్ సబ్జెక్ట్ కీలకమైంది. ఐబీపీఎస్(ఇండియన్ బ్యాంకింగ్ పర్సనల్ సర్వీసెస్) నిర్వహించే పీవోస్, క్లర్క్స్ పరీక్షల్లో జనరల్ అవేర్‌నెస్ విభాగం నుంచి 40 ప్రశ్నలు అడుగుతున్నారు. ఎస్‌బీఐ నిర్వహించే పీవోస్ పరీక్షలో 40, క్లర్క్స్ పరీక్షలో 25 ప్రశ్నలు ఈ విభాగం నుంచే వస్తున్నాయి. మొత్తం 40 ప్రశ్నల్లో బ్యాంకింగ్‌కు సంబంధించి 15 నుంచి 20 ప్రశ్నలు ఉంటున్నాయి. మిగతావి కరెంట్ అఫైర్స్, స్టాక్ జీకేకు సంబంధించినవి ఉంటున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌కు సంబంధించిన సమకాలీన సమస్యలను జోడిస్తూ అడుగుతున్నారు. గతవారం జరిగిన ఎస్‌బీఐ పీవో పరీక్షలో ఇటీవల నూతనంగా నియమితులైన ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఎవరు అని అడిగారు? దీనికి సమాధానం ఆర్.గాంధీ.
గ్రూప్-1, గ్రూప్-2, ఇతర పోటీ పరీక్షలతో పోలిస్తే జనరల్ అవేర్‌నెస్ ప్రిపరేషన్ చాలా సులభం. పరీక్ష సమయాని కంటే ఆరు నుంచి ఎనిమిది నెలల కరెంట్ అఫైర్స్ ఫాలో అయితే సరిపోతుంది. పరీక్షలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ విభాగాలకంటే చాలా సులువుగా అతి తక్కువ సమయంలో జనరల్ అవేర్‌నెస్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు. మిగిలిన సమయాన్ని కఠినంగా అనిపించే ప్రశ్నలకు కేటాయించుకోవడం ద్వారా విజయ అవకాశాలను మెరుగుపర్చుకోవచ్చు. బ్యాంక్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు జనరల్ అవేర్‌నెస్ విభాగంలో అత్యధిక మార్కులు తెచ్చుకోవాలంటే.. స్టాక్ జీకే కోసం మనోరమ ఇయర్ బుక్-2014 చదివితే సరిపోతుంది.
ఇన్‌పుట్స్ - ఎన్.విజయేందర్‌రెడ్డి