ఇంటర్నెట్ విప్లవానికి 30 ఏళ్లు... | Current Affairs - 2013 in Science & Technology | Sakshi
Sakshi News home page

ఇంటర్నెట్ విప్లవానికి 30 ఏళ్లు...

Published Thu, Jan 2 2014 1:43 PM | Last Updated on Sat, Sep 15 2018 7:39 PM

Current Affairs - 2013 in Science & Technology

 2013- సైన్స్ అండ్ టెక్నాలజీ
 
అంగారక గ్రహం దిశగా భారత్ ప్రయాణం.. సెల్‌ఫోన్ వ్యవస్థపారంభమై 40 సంవత్సరాలు.. ఇంటర్నెట్ విప్లవానికి 30 ఏళ్లు.. బీవో5 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతమైన క్షణాలను చూసింది.
 
‘ఇంటర్‌నెట్’ ఆవిర్భవించి 2013, జనవరి 1 నాటికి 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఇంటర్‌నెట్‌ను 1983, జనవరి 1న అమెరికా రక్షణ శాఖ అధికారికంగా ప్రారంభించింది. ఇంటర్‌నెట్ ప్రొటోకాల్ సూట్ సమాచార వ్యవస్థను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోగలిగేలా రూపొందించిన ‘ఆర్పానెట్’ నెట్‌వర్క్ ప్రకారం ఇంటర్‌నెట్ 1983, జనవరి 1న అధికారికంగా ప్రారంభమైంది. కంప్యూటర్లను అనుసంధానం చేసే ‘ఆర్పానెట్’ అనే పద్ధతే తర్వాత ‘వరల్డ్ వైడ్ వెబ్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ)’ ఆవిర్భావానికి మార్గం సుగమం చేసింది.
 
పునర్వినియోగ ఇంధనాలపై ప్రపంచ అట్లాస్‌ను అంతర్జాతీయ పునర్వినియోగ ఇంధన సంస్థ (ఐఆర్‌ఈఎన్‌ఏ) జనవరి 13న ఆవిష్కరించింది.
 
100వ సైన్స్ కాంగ్రెస్‌ను కోల్‌కతాలో జనవరి 3న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. ‘భారత్ భవిష్యత్ తీర్చిదిద్దేందుకు శాస్త్రం’ అనే ఇతివృత్తంతో ఈ కాంగ్రెస్‌ను నిర్వహించారు.
 
అతి పెద్ద గస్తీ నౌక ‘ఐఎన్‌ఎస్ సరయు’ను నౌకాదళంలో ఎయిర్ మార్షల్ పి.కె. రాయ్ గోవాలోని వాస్కోలో జనవరి 21న ప్రవేశ పెట్టారు.
 
భారత్ జనవరి 27న విశాఖపట్నం తీరంలోని బంగాళాఖాతంలో ‘బీవో5’ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. దీంతో ఇప్పటివరకు గగనతలం, భూతలం నుంచే అణ్వస్త్ర క్షిపణులను ప్రయోగించే సత్తా ఉన్న భారత్ ఇకపై సముద్ర గర్భం నుంచీ న్యూక్లియర్ మిస్సైళ్లను ఎక్కుపెట్టే సామర్థ్యాన్ని సమకూర్చుకున్నట్లైంది. జలాంతర్గామి(సబ్ మెరైన్) నుంచి ప్రయోగించేలా భారత్  పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసిన తొలి అంతర్‌జల అణ్వస్త్ర క్షిపణి ఇదే.
 
హెలికాప్టర్ ‘రుద్ర’ను బెంగళూరులో ఫిబ్రవరి 8న ఏరో ఇండియా-2013ప్రదర్శనలో సైన్యానికి అప్పగించారు.
 
 ఫిబ్రవరి 15న, 2012 డీఏ 14 అనే గ్రహశకలం భూమికి దగ్గరగా వచ్చింది. వాతావరణం, కమ్యూనికేషన్‌‌స సేవలందించే ఉప గ్రహాల (శాటిలైట్లు) మధ్యగా ఆ శకలం దూసుకెళ్లింది. ఇది మళ్లీ 2019 ఫిబ్రవరి 15న భూమికి చేరువగా వస్తుంది.
 
 సౌర కుటుంబం వెలుపల అతి చిన్న గ్రహాన్ని నాసా శాస్త్రవేత్తలు ఫిబ్రవరి 21న కనుగొన్నారు. దీనికి కెప్లర్-37బి అనే పేరు పెట్టారు.
 
 ఇస్రో ఫిబ్రవరి 25న శ్రీహరికోటలోని షార్ నుంచి నిర్వహించిన పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ)-సీ20 ప్రయోగం విజయవంతమైంది.
 
 భారత వాయుసేన (ఐఏఎఫ్) ఫిబ్రవరి 22న తొలిసారిగా పగలు-రాత్రి విన్యాసాలతో ‘ఉక్కు పిడికిలి 2013’ పేరిట తన యుద్ధ పాటవాన్ని ప్రదర్శించింది.
 
 మొబైల్‌ఫోన్ వాడకం ప్రారంభమై 2013 ఏప్రిల్ 3 నాటికి 40 ఏళ్లు పూర్తయ్యాయి. తొలిసారి మొబైల్ ఫోన్‌ను అమెరికాలోని న్యూయార్క్‌లో మోటరోలా ఇంజనీర్ మార్టిన్ కూపర్ 1973 ఏప్రిల్ 3న చేసిన కాల్‌తో మొబైల్ ఫోన్ వాడకం మొదలైంది. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం ప్రస్తుతం 6 బిలియన్ల సెల్‌ఫోన్ వాడకందార్లు ఉన్నారు.
 
 కొత్త తరం యుద్ధ విమానం ‘మిగ్ 29కే’ మే 11న భారత నౌకాదళంలో చేరింది.
 
 రొటా వైరస్ డయేరియా (అతిసారం)కు భారత శాస్త్రవేత్తలు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ‘ద రొటావాక్‌‘ టీకాను అభివృద్ధి చేశారు. ఈ టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను మే 14న విడుదల చేశారు.
 
 జలాంతర్గామి విధ్వంసక లాంగ్ రేంజ్ విమానం.. బోయింగ్ పీ81 ని తమిళనాడులోని అరక్కోణం నావల్ ఎయిర్ స్టేషన్ రాజాలీలో మే 15న నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు.
 
 చైనాకు చెందిన తియాన్హే-2 సూపర్ కంప్యూటర్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కంప్యూటర్ అని జూన్ 17న ప్రకటించిన టాప్-500 సర్వే తెలిపింది. ఇది కేవలం సెకను వ్యవధిలో 33,860 లక్షల కోట్ల ఆపరేషన్లు నిర్వహించగలదు.
 
 భారతదేశ రెండో ప్రత్యేక వాతావరణ ఉపగ్రహం ఇన్‌శాట్-3డీని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) జూలై 19న ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించింది.
 
భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) అందించిన పరిజ్ఞానంతో అమెరికా.. పేలుడు పదార్ధాలను గుర్తించేందుకు ఎక్స్‌ప్లోజివ్ డిటెక్షన్ కిట్‌ను ఆగస్టు 2న వాషింగ్టన్‌లో విడుదల చేసింది.
 
తొలిసారిగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) మాట్లాడే రోబో కిర్భాను జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ ఆగస్టు 4న పంపింది.
 
భారత్ తొలి అణు విద్యుత్ సామర్థ్యంగల ఐఎన్‌ఎస్ అరిహంత్ జలాంతర్గామిలో అణు విద్యుత్ రియాక్టర్ ఆగస్టు 10న క్రిటికాలిటీ సాధించింది. దీంతో 83 మెగావాట్ల లైట్-వాటర్ రియాక్టర్‌లో అణు విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ మొదలైంది. ప్రస్తుతం రష్యా, అమెరికా, ఫ్రాన్స్, చైనా, బ్రిటన్‌ల వద్ద మాత్రమే అణు జలాంతర్గాములు ఉన్నాయి.
 
 స్వదేశీ విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను ఆగస్టు 12న కోచిలో ప్రారంభించారు. దీంతో నౌక తొలి దశ నిర్మాణం పూర్తయింది.
 
 స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అణ్వస్త్ర సామర్థ్యం గల పృథ్వీ-2 క్షిపణిని భారత్ ఆగస్టు 12న విజయవంతంగా పరీక్షించింది.
 
 క్లోమగ్రంధి వ్యాధి (పాంక్రియాటైటిస్)కి జన్యుపరమైన మార్పులే ప్రధాన కారణమని సీసీఎంబీ, ఏఐజీ ప్రతినిధులు ఆగస్టు 18న హైదరాబాద్‌లో వెల్లడించారు. మానవ శరీరంలో చిన్న అవయవమైన క్లోమ గ్రంధి పనిచేయకపోవడానికి ఇప్పటివరకు ఆల్కహాల్, మాల్ న్యూట్రిషన్ కారణమని భావించేవారు.
 
ఐఎన్‌ఎస్ సింధు రక్షక్ జలాంతర్గామిలో ఆగస్టు 13న వరుస పేలుళ్లు సంభవించాయి. దీంతో ముంబై కొలాబా డాక్‌యార్డ్‌లో ఉన్న సింధు రక్షక్ సగం వరకు మునిగిపోయింది.
 
జమ్మూ-కాశ్మీర్‌లోని లడక్‌లో ఉన్న దౌలత్‌బేగ్ ఓల్దీ వైమానిక స్థావరంలో భారత వాయుసేన.. సి-130 జె-30 సూపర్ హెర్క్యులస్ రవాణా విమానాన్ని ఆగస్టు 20న దింపింది. ఈ స్థావరం ప్రపంచంలోనే ఎత్తై ప్రదేశంలో ఉంది.
 
భారత నౌకాదళం కోసం చేపట్టిన జీశాట్-7 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ఈ సైనిక ఉపగ్రహాన్ని ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియాన్-5 రాకెట్ ద్వారా ఆగస్టు 30న ప్రయోగించారు. దీనికి రుక్మిణిగా పేరు పెట్టారు.
 
అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ప్రయోగించిన వ్యోమ నౌక వాయేజర్-1 సౌర కుటుంబం దాటి నక్షత్రాంతర రోదసి (రెండు నక్షత్రాల మధ్య ప్రాంతం)లో ప్రవేశించింది. సౌర కుటుంబం దాటి అవతలికి ప్రవేశించిన తొలి మానవ నిర్మిత వస్తువు వాయేజర్-1. సౌర కుటుంబం ఆవలి నక్షత్రాంతర రోదసిని అధ్యయనం చేసేందుకు 1977లో నాసా వాయేజర్-1, వాయేజర్-2లను ప్రయోగించింది. 36 ఏళ్లుగా సాగుతున్న యాత్రలో వాయేజర్-1.. 1900 కోట్ల కి.మీ ప్రయాణించింది. ఈ యాత్రకు సంబంధించిన సమాచారాన్ని సెప్టెంబర్ 12 సంచికలో ‘సైన్స్’ పత్రిక ప్రచురించింది.
 
భారీ రవాణా విమానం సీ-17 గ్లోబ్‌మాస్టర్-3ని రక్షణమంత్రి ఎ.కె ఆంటోనీ ఉత్తర ప్రదేశ్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌లో సెప్టెంబర్ 2న వైమానిక దళంలో ప్రవేశపెట్టారు.
 
జవహర్‌లాల్ నెహ్రూ సోలార్ మిషన్‌లో భాగంగా 2022 నాటికి 20 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
 
భారత రైల్వేల కోసం తొలిసారిగా అత్యంత శక్తివంతమైన 5500 హెచ్‌పీ రైలు ఇంజిన్‌ను సెప్టెంబర్ 26న ప్రారంభించారు. వారణాసిలోని డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ (డీఎల్‌డబ్ల్యూ) ఈ ఇంజిన్‌ను రూపొందించింది. ఇది ప్రపంచంలో 22 యాక్సిల్ లోడ్‌తో రూపొందించిన అతిపెద్ద లోకోమోటివ్.
 
ఇంటర్నెట్‌ను అనుసంధానం చేసే కొత్త విధానం లై-ఫైని చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది వై-ఫైకి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ఈ కొత్త విధానంలో కాంతి కోసం ఉపయోగించే బల్బుల ద్వారా ఇంటర్నెట్ సంకేతాలను చేరుస్తారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న వై-ఫైలో రేడియో ఫ్రీక్వెన్సీతో సంకేతాలను పంపిస్తారు.
 
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ‘ప్రగతి’ క్షిపణిని దక్షిణ కొరియాలో జరిగిన సియోల్ ఇంటర్నేషనల్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ (ఎడెక్స్)-2013లో అక్టోబర్ 29న ప్రదర్శించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణి 60-
 170 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.
 
అంగారక గ్రహాన్ని అధ్యయనం చేయడానికి చేపట్టిన మంగళయాన్ ఆర్బిటర్‌ను పీఎస్‌ఎల్‌వీ-సీ25 రాకెట్ ద్వారా భారత్ ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి నవంబర్ 5న పీఎస్‌ఎల్‌వీ - సీ25 మార్స్ ఆర్బిటర్‌ను భూకక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇది భూమి చుట్టూ 25 రోజులు పరిభ్రమిస్తుంది. తర్వాత అక్కడ నుంచి 300 రోజులపాటు 400 మిలియన్ కిలోమీటర్లు ప్రయాణించి 2014 సెప్టెంబర్ 24న అంగారక గ్రహాన్ని చేరుకుంటుంది. వివిధ దేశాలు అంగారకుడిపైకి 51 ప్రయోగాలు చేపట్టగా 21 మాత్రమే విజయవంతమయ్యాయి.
 
అంగారక గ్రహంపై వాతావరణ పరిశోధన చేపట్టేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా.. మార్స్ అట్మాస్పియర్ అండ్ ఓలటైల్ ఎవల్యూషన్ (మావెన్) అనే ఉపగ్రహాన్ని నవంబర్ 18న ప్రయోగించింది.
 
విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య రష్యా సముద్ర తీరంలో నవంబర్ 16న భారత నౌకాదళంలో చేరింది.
 
ఆధునీకరించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని భారత సైన్యం నవంబర్ 18న రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్‌లో విజయవంతంగా పరీక్షించింది.
 
సైనిక దళాలకు చెందిన వ్యూహాత్మక దళాల కమాండ్ (ఎస్‌ఎఫ్‌సీ) ధనుష్ క్షిపణిని నవంబర్ 23న ఒడిశా తీరంలో విజయవంతంగా పరీక్షించింది.
 
ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన విద్యుత్ సరఫరా లైన్‌ను వార్దా - ఔరంగాబాద్ మధ్య 1200 కె.వి. లైన్ నెలకొల్పనున్నారు. వచ్చే రెండేళ్లలో దీని సామర్థ్యాన్ని 1200 కె.వి.కి పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ పెంచనుంది. అల్ట్రా హై వోల్టేజి (యుహెచ్‌వీ) విధానాలను ఈ లైన్ ఏర్పాటులో వినియోగిస్తారు. ప్రస్తుతం చైనా వాణిజ్యపరంగా 1100 కె.వి. లైన్‌ను ఉపయోగిస్తోంది.
 
వినియోగ పరీక్షల్లో భాగంగా అణు సామర్థ్యం గల అగ్ని-3 క్షిపణిని సైన్యానికి చెందిన వ్యూహాత్మక దళాల కమాండ్ డిసెంబర్ 23న ఒడిశా తీరంలో వీలర్ ఐలాండ్‌లో విజయవంతంగా పరీక్షించింది.
 
75 సంవత్సరాల వ్యక్తికి ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు తొలిసారిగా కృత్రిమ గుండెను విజయవంతంగా డిసెంబర్ 20న అమర్చారు. ఫ్రాన్స్‌కు చెందిన బయోమెడికల్ సంస్థ కార్మట్ ఈ కృత్రిమ గుండెను రూపొందించింది. లిథియం అయాన్ బ్యాటరీలు ఉపయోగించిన గుండెను డచ్‌కు చెందిన యూరోపియన్ ఏరోనాటిక్స్ డిఫెన్స్ అండ్ స్పేస్ కంపెనీ అభివృద్ధి చేసింది. ఈ గుండె రోగికి ఐదేళ్ల అదనపు జీవితాన్నిస్తుంది. దీని బరువు దాదాపు కిలోగ్రాము ఉంటుంది.
 
అతి భారమైన కొత్త మూలకం కనుగొన్నట్లు జర్మనీ శాస్త్రవేత్తలు ఆగస్టు 28న ప్రకటించారు. 115 పరమాణువు సంఖ్యతో పీరియాడిక్ టేబుల్‌లో దీన్ని త్వరలో చేరుస్తారు. దీనికి పేరు పెట్టాల్సి ఉంది.
 
 
 ఇంటర్‌నెట్ వినియోగంలో భారత్ మూడో స్థానానికి చేరింది. మొదటి స్థానంలో చైనా, రెండో స్థానంలో అమెరికా ఉన్నాయి. భారత్‌లో ప్రస్తుతం 74 మిలియన్లకు పైగా ఇంటర్‌నెట్ వినియోగదారులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement