ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి
కరెంట్ అఫైర్స్ నిపుణులు
జాతీయం
ఐరాస సాధారణ సభ సమావేశం
ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 68వ సమావేశంలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ సెప్టెంబర్ 28న ప్రసంగించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు శాశ్వత, తాత్కాలిక సభ్యత్వాలు కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. దాని కోసం భద్రతా మండలి పునర్నిర్మాణం జరగాలని, సంస్కరణలు చేపట్టాలని కోరారు. ఉగ్రవాదాన్ని అణచి వేయడానికి ఐరాస మరింత నిబద్ధతతో పనిచేయాలన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే దేశాలపై ఎలాంటి ఉపేక్ష చూపించరాదన్నారు. ఇదే సందర్భంలో ఉగ్రవాదానికి కేంద్ర స్థానంగా ఉన్న పాకిస్థాన్‌ైపై కూడా నిప్పులు చెరిగారు. భారత దేశంలో జమ్మూ కాశ్మీర్ అంతర్భాగమేనని నొక్కి చెప్పారు.
ఈ విషయంలో ఎవరి జోక్యాన్ని తాము సహించబోమన్నారు. పాక్ భూభాగంపై రూపుదిద్దుకుంటున్న ఉగ్రవాద కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలన్నారు. కాగా, పేదరికాన్ని పారదోలడానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని సభ్య దేశాలకు సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల మందిపైగా పేదరికంలో మగ్గుతున్నారని, వారికి నేరుగా సంక్షేమ పథకాలు అందచేయడం ద్వారా పేదరికం తగ్గించాలన్నారు. శాంతి, భద్రత, మానవహక్కులు, పాలన వంటివి పరిష్కరించాల్సిన ప్రధాన అంశాలన్నారు. నీరు, ఇంధనం, మహిళల పట్ల వివక్షత వంటి అంశాలకు 2015 తర్వాత అజెండాలో ప్రాధాన్యత నివ్వాలని కోరారు.
ఇక సిరియా సంక్షోభం గురించి మాట్లాడుతూ.. ఆ సమస్యకు మిలటరీ చర్యలు పరిష్కారం కాదని చెప్పారు. దీనిని పరిష్కరించడానికి బహుళ దేశాల సదస్సును వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. అయితే రసాయన ఆయుధాల వినియోగాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పారు. ఇజ్రాయెల్, పాలస్తీనా సమస్యను ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవాలన్నారు. ఇక అణు నిరాయుధీకరణకు అన్ని దేశాలు పూర్తిగా అంగీకరించాలని, నిర్ణీత కాలంలో, వివక్ష లేకుండా పూర్తి చేయాలని కోరారు.
దాణా కుంభకోణంలో దోషిగా లాలూప్రసాద్
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను పశు దాణా కుంభకోణంలో సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా పేర్కొంది. సెప్టెంబర్ 30న ఇచ్చిన తీర్పులో లాలూతోపాటు మరో 44 మందిని దోషులుగా తేల్చింది. వారిలో మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాతోపాటు ప్రస్తుత ఎంపీ జగదీశ్ శర్మ, నలుగురు ఐఏఎస్ అధికారులున్నారు. 1996 నాటి దాణా కుంభకోణంలో 37.7 కోట్ల రూపాయల మేరకు అవినీతికి పాల్పడ్డారని వారిపై అభియోగం. వీరికి శిక్ష ను ఖరారు చేయాల్సి ఉంది.
తొలి 5500 హెచ్‌పీ రైలు ఇంజన్
భారత రైల్వేల కోసం తొలిసారిగా అత్యంత శక్తివంతమైన 5500 హెచ్‌పీ రైలు ఇంజన్‌ను సెప్టెంబర్ 26న ప్రారంభించారు. వారణాసిలోని డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ (డీఎల్‌డబ్ల్యు) ఈ ఇంజన్‌ను రూపొందించింది. ఇది ప్రపంచంలో 22 యాక్సిల్ లోడ్‌తో రూపొందించిన అతిపెద్ద లోకోమోటివ్. అనేక దేశాల్లో దీనికంటే శక్తివంతమైన ఇంజన్లు ఉన్నప్పటికీ అవి అధిక యాక్సిల్ లోడ్‌ను ఉపయోగించేవి. ఈ ఆధునిక రైలు ఇంజన్‌ను నార్త్ సెంట్రల్ రైల్వే పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రవేశపెట్టింది.
గంటకు 100 కి.మీ వేగంతో నడిచే ఈ ఇంజన్‌లో అత్యాధునిక టెక్నాలజీ ఇమిడి ఉంది. ఇది అధిక ఇంధన సామర్థ్యంతో, ఉద్గారాల నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. పెద్ద ఇంజన్లు వాడటం వల్ల రవాణా సామర్థ్యాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి, ప్రయాణీకుల రైళ్లకు అధిక ర వాణా సదుపాయాలు కల్పించడానికి వీలవుతుంది.
అభ్యర్థులను తిరస్కరించే హక్కు కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే తిరస్కరించే హక్కును కల్పిస్తూ సుప్రీంకోర్టు సెప్టెంబర్ 27న తీర్పునిచ్చింది. దీంతో పోటీచేస్తున్న అభ్యర్థిని వ్యతిరేకించడం గాని లేదా అందరిని తిరస్కరించే హక్కు ఓటరుకు ఉంటుంది. ఇందుకోసం బ్యాలెట్ పత్రాలు, ఓటింగ్ యంత్రాల్లో ‘పై వారెవరూ కాదు’ (నన్ ఆఫ్ ది అబౌ) అనే బటన్ ఉండాలని కోర్టు పేర్కొంది. ఓటర్లకు తిరస్కరించే హక్కు ఉండాలంటూ ‘పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్’ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన కోర్టుపై తీర్పునిచ్చింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించే హక్కును నిరాకరిస్తే భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనని పేర్కొంది. ఇదిలావుంటే.. రాబోయే ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ‘తిరస్కరించే హక్కు’ను అమలులోకి తెచ్చే అవకాశముందని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. కాగా ఎన్నికల్లో తనకు నచ్చని అభ్యర్థిని తిరస్కరించే విధానం అమలు చేస్తున్న ఫ్రాన్స్, బ్రెజిల్, ఫిన్లాండ్, అమెరికా, బెల్జియం, గ్రీస్, ఉక్రెయిన్, చిలీ, బంగ్లాదేశ్, ఫిన్లాండ్, స్వీడన్, స్పెయిన్ దేశాల సరసన భారత్ చేరనుంది.
సుప్రీంకోర్టుకు ప్రత్యేక పోస్టల్ పిన్‌కోడ్
భారత సుప్రీంకోర్టుకు పోస్టల్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేక పిన్‌కోడ్ - 110201ను సెప్టెంబర్ 26న ప్రవేశపెట్టింది. పెద్ద మొత్తంలో పోస్ట్ పొందే వినియోగదారులకు ప్రత్యేక పిన్‌కోడ్ కేటాయిస్తారు. సుప్రీంకోర్టుకు ప్రత్యేక పిన్‌కోడ్ కేటాయించడం వల్ల సార్టింగ్ ఆఫీసు నుంచి నేరుగా మెయిల్ పొందే అవకాశం ఏర్పడుతుంది. మధ్యలో డెలివరీ పోస్ట్ ఆఫీసు జోక్యం ఉండదు. చేరవేసే కాల వ్యవధిని సగం రోజుకు, పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కు నిర్వహణ వ్యయాన్ని తగ్గిస్తుంది. త్వరలో అన్ని హైకోర్టులకు కూడా ప్రత్యేక పిన్‌కోడ్స్ కేటాయిస్తారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం తెలిపారు.
నాగేశ్వర రెడ్డికి మాస్టర్ ఆఫ్ వరల్డ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అవార్డు
హైదరాబాద్‌లో ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డికి మాస్టర్ ఆఫ్ వరల్డ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అవార్డు లభించింది. చైనాలోని షాంఘైలో సెప్టెంబర్ 23న జరిగిన ప్రపంచ గ్యాస్ట్రో ఎంట్రాలజీ సదస్సులో ఆ సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ హెన్రీ కోహెన్ బహూకరించారు. ఈ అంతర్జాతీయ అవార్డును ప్రతి నాలుగేళ్లకొకసారి ప్రదానం చేస్తారు. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయుడు నాగేశ్వర్‌రెడ్డి.
జమ్మూలో ఉగ్రవాదుల దాడిలో 12మంది మృతి
సైనిక దుస్తుల్లో సరిహద్దులు దాటి భారత భూభాగంలోకి చొరబడ్డ ముగ్గురు ఉగ్రవాదులు సెప్టెంబర్ 26న జమ్మూ ప్రాంతంలో జంట దాడులకు పాల్పడ్డారు. తొలుత హీరా నగర్ పోలీస్ స్టేషన్‌పైన, తర్వాత ఒక సైనిక శిబిరంపైన దాడులు చేశారు. ఈ దాడుల్లో 12 మంది మరణించారు. సైన్యం ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు కూడా మరణించారు. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే - ఇ- తోయిబా ఈ దాడికి పాల్పడినట్లు సైనిక అధికారులు తెలిపారు.
అంతర్జాతీయం
కంబోడియా ప్రధాన మంత్రిగా హున్‌సేన్ ఎన్నిక
కంబోడియా ప్రధానమంత్రిగా మరో ఐదేళ్ల కాలానికి హున్‌సేన్‌ను పార్లమెంట్ సెప్టెంబర్ 23న ఎన్నుకుంది. గత 30 ఏళ్లుగా ప్రధానమంత్రిగా కొనసాగుతున్న హున్‌సేన్‌ను కొత్త కేబినెట్ ఏర్పాటు చేయాల్సిందిగా రాజు నోర్‌డమ్ సిహమోనీ కోరారు. హున్‌సేన్‌కు చెందిన కంబోడియన్ పీపుల్స్ పార్టీ (సీపీపీ) ఇటీవల జరిగిన ఎన్నికల్లో 68 స్థానాలు గెలుచుకుంది. ప్రతిపక్ష కంబోడియన్ నేషనల్ రెస్క్యూ పార్టీ (సీఎన్‌ఆర్‌పీ)కి 55 స్థానాలు దక్కాయి.
‘క్లింటన్ గ్లోబల్ సిటిజన్స్ అవార్డులు’
భారత పర్యావరణ వేత్త బంకర్ రాయ్, పాకిస్థాన్ విద్యా హక్కుల కార్యకర్త మలాలాలు 2013 సంవత్సరానికి క్లింటన్ గ్లోబల్ సిటిజన్స్ అవార్డులు అందుకున్నారు. వీరికి న్యూయార్క్‌లో సెప్టెంబర్ 25న ఈ అవార్డులు ప్రదానం చేశారు. బంకర్ రాయ్ బేర్‌పుట్ కళాశాల వ్యవస్థాపకుడు. ఆయన గత 40 ఏళ్లుగా గ్రామీణ సమస్యల పరిష్కారం కోసం ఆ సంస్థ ద్వారా కృషి చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1,300కు పైగా ప్రాంతాల్లో 2.39 లక్షల మందికిపైగా విద్యార్థులకు స్వచ్ఛమైన మంచినీటిని అందించేందుకుగాను 10 లక్షల లీటర్ల వర్షపు నీటిని వాడకంలోకి తెస్తున్నారు. పాకిస్థాన్‌లో విద్యాహక్కులకు పోరాడుతున్న మలాలా (16) తాలిబన్ల దాడికి గురైంది. ఆమె మలాల నిధి పేరిట తన కృషిని కొనసాగిస్తోంది.
మిస్ వరల్డ్‌గా మెగాన్ యంగ్
ఫిలిప్పీన్స్ సుందరి మెగాన్ యంగ్ (23) మిస్ వరల్డ్-2013గా ఎంపికైంది. ఇండోనేసియాలోని బాలి దీవిలో సెప్టెంబర్ 28న జరిగిన 63వ మిస్ వర్డల్ పోటీల ఫైనల్‌లో ఆమె విజేతగా నిలిచింది. ఈ పోటీలో ఫ్రాన్స్‌కు చెందిన మేరీన్ లోర్ఫెలిన్ రెండో స్థానంలో, ఘనాకు చెందిన నా ఒకాయిలే షూటర్ మూడో స్థానంలో నిలిచారు. భారత్ తరఫున మిస్ ఇండియా వరల్డ్ నవనీత్ కౌర్ థిల్లాన్ ఈ పోటీలో పాల్గొన్నా, తొలి పది స్థానాల్లో చోటు దక్కించుకోలేకపోయింది. కౌర్‌కు మిస్ మల్టీమీడియా పతకం దక్కింది.
కొలంబియా సర్క్యూట్ కోర్టు జడ్జిగా శ్రీనివాసన్
అమెరికాలోని కొలంబియా సర్క్యూట్ కోర్టు న్యాయమూర్తిగా భారత సంతతికి చెందిన శ్రీనివాసన్ (46) సెప్టెంబర్ 27న బాధ్యతలు స్వీకరించారు. తద్వారా అమెరికాలో రెండో అత్యున్నత న్యాయస్థానంగా భావించే సర్క్యూట్ కోర్టు జడ్జిగా నియమితులైన తొలి భారతీయ అమెరికన్‌గా చరిత్ర సృష్టించారు. శ్రీనివాసన్ గతంలో యునెటైడ్ స్టేట్స్ ప్రిన్సిపల్ డిప్యూటీ సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. శ్రీనివాసన్ చంఢీగఢ్‌లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు 1970లో అమెరికాకు వలస వెళ్లారు.
ఐపీసీసీ నివేదిక
ఐక్యరాజ్యసమితికి చెందిన వాతావరణ మార్పుపై అంతర్ ప్రభుత్వ ప్యానెల్ (ఐపీసీసీ) భూ వాతావరణం వేగంగా వేడెక్కుతున్నట్లు హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన నివేదికను స్టాక్‌హోమ్‌లో సెప్టెంబర్ 27న విడుదల చేసింది. భూతాపానికి మానవులు కారణంగా పేర్కొంటూ ఈ శతాబ్దంలో ఉష్ణోగ్రత 0.3 నుంచి 4.8 డిగ్రీల సెల్సియస్ పెరుగుతుందని అంచనా వేసింది. సముద్ర మట్టాలు 2100 నాటికి 26 నుంచి 82 సెంటీమీటర్లకు పెరుగుతాయి.
వడగాల్పులు, వరదలు, కరువు అధికం అవుతాయని పేర్కొంది. వాతావరణం మరింత క్షీణించకుండా అడ్డుకునేందుకు శిలాజ ఇంధనాల వాడకాన్ని తక్షణం తగ్గించాలని తెలిపింది. పారిశ్రామికీకరణ ముందు నుంచి చూస్తే వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ 40 శాతం పెరిగిందని నివేదిక తెలిపింది. గత మూడు దశాబ్దాలపాటు వరుసగా భూ ఉపరితలం వేడెక్కిందని, ఇది 1850 నుంచి ఏ దశాబ్దంతో పోల్చినా ఎక్కువగా ఉందని పేర్కొంది.
గత 1400 సంవత్సరాల్లో 1983-2012 మధ్య 30 ఏళ్ల కాలం అత్యధిక వేడి తో కూడిందని తెలిపింది. గ్రీన్‌హౌస్ ఉద్గారాలను అదుపు చేసేందుకు ప్రభుత్వాలు వెంటనే వాతావరణ కార్యాచరణను ఏర్పాటు చేయాలని, 2015లో ఒప్పందాన్ని రూపొందించాలని ఐపీసీసీ అధిపతి క్రిష్టినా ఫిగ్యురీస్ తెలిపారు.
కత్వారీకి కవనాగ్ కవితా పురస్కారం
భారతీయ అమెరికన్ కవి రఫీక్ కత్వారీ ప్రతిష్టాత్మక ఐరిష్ అంతర్జాతీయ ప్యాట్రిక్ కవనాగ్ పొయెట్రీ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన కవితా సంపుటి ‘ఇన్ అనదర్ కంట్రీ’కి 2013 సంవత్సరానికిగాను ఈ అవార్డును ప్రకటించారు. 41 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన ఈ పురస్కారాన్ని ఐరిష్ జాతీయేతర వ్యక్తికి ప్రకటించడం ఇదే తొలిసారి.
క్రీడలు
లలిత్‌మోడీపై జీవితకాల నిషేధం
ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్‌మోడీపై బీసీసీఐ సెప్టెంబర్ 25న జీవితకాల నిషేధం విధించింది. తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యం, అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. ఇకపై బీసీసీఐకి చెందిన కమిటీల్లో, ఆఫీసుల్లో ఎటువంటి బాధ్యతలు చేపట్టే హక్కు మోడీకి ఉండదు.
ఆసియా మహిళల హాకీలో భారత్‌కు కాంస్యం
8వ ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్‌లో భారత్‌కు కాంస్య పతకం లభించింది. కౌలాలంపూర్‌లో సెప్టెంబర్ 27న జరిగిన మ్యాచ్‌లో చైనాను ఓడించింది. దక్షిణ కొరియాను ఓడించి జపాన్ ఆసియా కప్‌ను గెలుచుకుంది.
ఆసియా రోయింగ్‌లో స్వరణ్ సింగ్‌కు స్వర్ణం
చైనాలోని లువాన్ నగరంలో సెప్టెంబర్ 29న ముగిసిన ఆసియా రోయింగ్ పోటీల్లో పురుషుల సింగిల్ స్కల్
ఈవెంట్‌లో స్వరణ్ సింగ్ పసిడి పతకాన్ని గెలుచుకున్నాడు. మొత్తం మీద భారత్‌కు ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు లభించాయి.
బీసీసీఐ అధ్యక్షుడిగా శ్రీనివాసన్
బీసీసీఐ అధ్యక్షుడిగా శ్రీనివాసన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న శ్రీనివాసన్ తిరిగి 2014 వరకు అధ్యక్షుడిగా కొనసాగుతారు. ఐపీఎల్ చైర్మన్‌గా ఒరిస్సా క్రికెట్ సంఘం అధ్యక్షుడు రంజిబ్ బిశ్వాల్ ఎన్నికయ్యారు.
సానియాకు పాన్ పసిఫిక్ డబుల్స్ టైటిల్
జింబాబ్వే క్రీడాకారిణి కారా బ్లాక్, సానియా మీర్జా (భారత్) జంట పాన్ పసిఫిక్ ఓపెన్‌లో మహిళల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
హంపికి తాష్కెంట్ గ్రాండ్ ప్రి టైటిల్
ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి తాష్కెంట్ గ్రాండ్ ప్రి టోర్నమెంట్‌లో విజేతగా నిలిచింది. మరో భారత గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక ఐదోస్థానంలో నిలిచింది.