ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి
కరెంట్ అఫైర్స్ నిపుణులు
జాతీయం
ఆర్థిక స్వేచ్ఛలో గుజరాత్ అగ్రస్థానం
ఆర్థికాంశాల స్వేచ్ఛకు సంబంధించి రాష్ట్రాల వారీ జాబితాలో గుజరాత్‌కి అగ్రస్థానం దక్కింది. ఇదే విషయంలో అత్యంత వేగంగా స్కోరును మెరుగుపరుచుకున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. ప్రముఖ ఆర్థికవేత్తలు అశోక్ గులాటీ, బిబేక్ దేబ్రాయ్, లవీష్ భండారీ, జర్నలిస్ట్ స్వామినాథన్ అయ్యర్ రూపొందించిన ఈఎఫ్‌ఎస్‌ఐ-2013 నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
పాలనా యంత్రాంగం పరిమాణం, న్యాయ వ్యవస్థ, ప్రాపర్టీ హక్కులకు భద్రత, వ్యాపార, కార్మిక చట్టాల అమలు మొదలైన అంశాల ప్రాతిపదికగా దీన్ని రూపొందించారు. దీనిప్రకారం 2005లో అయిదో స్థానంలో ఉన్న గుజరాత్ ఆర్థిక స్వేచ్ఛతోపాటు వేగంగా పరిస్థితులను మెరుగు పరచుకునే విషయంలో కూడా అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో తమిళనాడు ఉండగా ఆంధ్ర ప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది.
హైకోర్టులలో 25 శాతానికి పెరగనున్న న్యాయమూర్తుల సంఖ్య
దేశంలోని అన్ని హైకోర్టులలో న్యాయమూర్తుల సంఖ్యను కేంద్రం 25 శాతానికి పెంచింది. పెండింగ్‌లో ఉన్న 40 లక్షల కేసులను పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి కేంద్ర న్యాయశాఖమంత్రి కపిల్ సిబాల్ మార్చి 19న హైకోర్టుల్లో భర్తీ చేయాల్సిన ఖాళీలకు సంబంధించి ప్రతిపాదనలు పంపవలసిందిగా అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను కోరారు. 25 శాతానికి పెంచితే ప్రస్తుతం ఉన్న న్యాయ మూర్తుల సంఖ్య 906 నుంచి 1112కి పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 49 నుంచి 61కి చేరుతుంది.
సామాజిక భద్రత పథకాలకు ఆధార్ తప్పనిసరికాదన్న సుప్రీం
సామాజిక భద్రత పథకాల కింద లబ్ధి పొందడానికి ఆధార్ కార్డు ఉండాలన్న నోటిఫికేషన్లను వెంటనే విరమించుకోవాలని సుప్రీంకోర్టు మార్చి 24న కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విద్యుత్, గ్యాస్, కుళాయి కనెక్షన్లు వంటి సేవలు పొందడానికి ఆధార్ కార్డు చట్టబద్ధం కాదని జస్టిస్ బీఎస్ చౌహాన్,జస్టిస్ జె. చలమేశ్వర్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఆధార్ సమాచారాన్ని సీబీఐతో పంచుకోవాలన్న గోవా కోర్టు ఇచ్చిన ఆదేశాలపై కూడా స్టే విధించింది.
అంతర్జాతీయం
రష్యాలో విలీనమైన క్రిమియా
రష్యాలో క్రిమియాను విలీనం చేసే ఒప్పందంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మార్చి 18న సంతకం చేశారు. దీంతో రష్యా సమాఖ్యలో క్రిమియా చేరినట్లయింది. 18వ శతాబ్దం నుంచి రష్యాలో భాగంగా ఉన్న క్రిమియాను 1954లో నాటి సోవియట్‌నేత నికితా కృశ్చేవ్ ఉక్రెయిన్‌కు బదిలీ చేశారు.
నాటి నుంచి క్రిమియాలో మెజారిటీ ప్రజలుగా ఉన్న రష్యా జాతీయులు క్రిమియాను రష్యాలో విలీనం చేయాలని కోరుకుంటున్నారని పుతిన్ తెలిపారు. క్రిమియాను రష్యా విలీనం చేసుకోవడంతో జీ-8 నుంచి రష్యాను సస్పెండ్ చేస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. దీంతో జూన్‌లో రష్యాలోని సోచిలో జరగాల్సిన జీ-8 సదస్సు నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఆగ్నేయాసియా దేశాల్లో టీబీ రోగులకు వైద్యం
ఆగ్నేయాసియా దేశాల్లో ఏటా టీబీ వ్యాధి సోకే మూడు మిలియన్లలో మూడింట ఒకవంతు రోగులకు వైద్య సేవలు అందుబాటులో లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డ బ్ల్యుహెచ్ ఓ) మార్చి 20న విడుదల చేసిన నివేదిక తెలిపింది. టీబీ వ్యాధి మరణాలను సున్నా స్థాయికు తీసుకువచ్చేందుకు వైద్య సేవలు అందని మిలియన్ మందిని గుర్తించి, వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా దేశాలను కోరింది.
ప్రపంచంలో ప్రతీ సంవత్సరం తొమ్మిది మిలియన్ల మందికి ఈ వ్యాధి సోకుతుంది. ఇందులో మిలియన్ మందికి వ్యాధి తీవ్రంగా ఉంటోంది. తద్వారా వ్యాధి ఇతరులకు విస్తరిస్తుంది. పౌష్టికాహార లోపం, పేదరికం, పర్యావరణం, అధిక స్థాయిలో ప్రజలను తరలించడం వంటి పరిస్థితులు టీబీకి కారణమవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియాప్రాంతీయ డెరైక్టర్ పూనమ్ ఖేత్రపాల్ తెలిపారు.
ఓకే పదానికి 175 ఏళ్లు
ఇంగ్లిష్ భాషలో అత్యధికంగా వాడుకలో ఉన్న పదం ఓకే (ైఓ)కి 175 వసంతాలు పూర్తయ్యాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అత్యంత ప్రజాదరణ గల నాటి పత్రిక ద బోస్టన్ మార్నింగ్ పోస్ట్‌లో ఓకే పదం తొలిసారిగా 1839 మార్చి 23న ప్రచురితమైంది.
మాల్దీవుల ఎన్నికల్లో పాలక సంకీర్ణం విజయం
మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌కు చెందిన ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవులు (పీపీఎం) తన సంకీర్ణ భాగస్వామ్య పార్ట్టీల కూటమి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించింది. మార్చి 22న జరిగిన ఎన్నికల్లో ఆ కూటమి పార్లమెంట్‌లోని మొత్తం 85 స్థానాలకు గాను 54 స్థానాల్లో గెలుపొందింది. మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్ నాయకత్వంలోని ప్రతిపక్ష మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (ఎండీపీ) 24 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.
ఈజిప్ట్‌లో 529 మందికి ఉరిశిక్ష
ఈజిప్ట్‌లో ఒకేసారి 529 మందికి ఉరిశిక్ష విధిస్తూ ఆ దేశంలోని మనియా కోర్టు తీర్పునిచ్చింది. వీరంతా ఆ దేశ పదవీచ్యుత అధ్యక్షుడు మహమ్మద్ మోర్సీ మద్దతుదారులని కోర్టు ప్రకటించింది. ముస్లిం బ్రదర్ హుడ్‌కు చెందిన వీరంతా ఓ పోలీసు అధికారి హత్యకేసు, ప్రజలపై దాడుల కేసులో దోషులుగా నిర్ధారిస్తూ ఈ శిక్షను విధించింది. ఆధునిక ఈజిప్ట్ చరిత్రలో ఇంతమందికి మరణదండన విధించడం ఇదే తొలిసారి.
సముద్రంలో కూలిన మలేషియా విమానం
తప్పిపోయిన తమ దేశ విమానం దక్షిణ హిందూ మహాసముద్రంలో కుప్పకూలి జలసమాధి అయిందని మలేషియా ప్రధానమంత్రి నజీబ్ రజాక్ మార్చి 24న ప్రకటించారు. ఉపగ్రహాల నుంచి లభించిన సమాచారం ఆధారంగా విమానం సముద్రంలో కూలి మునిగిపోయిందన్న నిర్ధారణకు వచ్చినట్లు ఆయన తెలిపారు. మార్చి 8న మలేషియన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఎం.హెచ్.-370 విమానం కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు బయలుదేరి వెళ్లింది. ఇందులో 239 మంది ప్రయాణికులు, 13మంది సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో ఐదుగురు భారతీయులున్నారు.
స్పెయిన్ తొలి ప్రధానమంత్రి అడోల్ఫ్ సూరెజ్ మృతి
స్పెయిన్ తొలి ప్రధానమంత్రి అడోల్ఫ్ సూరెజ్ (81) మాడ్రిడ్‌లో మార్చి 23న మరణించారు. 1975లో జనరల్ ఫ్రాన్సిస్‌కో ఫ్రాంకో మరణించిన తర్వాత సూరెజ్ స్పెయిన్ తొలి ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. స్పెయిన్‌లో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకున్న కాలంలో భాగం పంచుకున్న వారిలో మరణించిన చివరి వ్యక్తి సూరెజ్. నియంతృత్వాన్ని కూల్చి ప్రజాస్వామ్య సంస్కరణలు తీసుకురావడంలో సూరెజ్ నాయకత్వం వహించారు. 1976లో సూరెజ్‌ను ఆదేశ రాజు ప్రధానిగా నియమించారు.
వార్తల్లో వ్యక్తులు
రచయిత, పాత్రికేయుడు కుష్వంత్‌సింగ్ మృతి
ప్రముఖ రచయిత, పాత్రికేయుడు కుష్వంత్‌సింగ్ (99) న్యూఢిల్లీలో మార్చి 20న మృతి చెందారు. ఆయన 30 నవలలు రాశారు. ఇందులో స్వీయ కథ ట్రూత్, లవ్ అండ్ ఏ లిటిల్ మ్యాలీస్‌తో పాటు దసన్ సెట్ క్లబ్, కుష్వంత్ నామా, ద లెసన్స్ ఆఫ్ మై లైఫ్, ట్రైన్‌టు పాకిస్థాన్, విత్ మలైస్ టువార్డ్స్ వన్ అండ్ ఆల్, ఐ షల్ నాట్ హియర్ ద నైటింగేల్, ద కంపెనీ అండ్ ఉమెన్, ద మార్క్ ఆఫ్ విష్ణు అండ్ అదర్ స్టోరీస్, బ్లాక్ జాస్మిన్, పోట్రయిట్ ఆఫ్ ఎ లేడీ, వంటి అత్యంత ఆదరణ పొందిన రచనలు చేశారు. ఈయన 1915, ఫిబ్రవరి 2న జన్మించారు.
1947 తర్వాత విదేశీ సర్వీసుల్లో చేరారు. లండన్,పారిస్, ఒట్టావాలలో దౌత్యవేత్తగా పనిచేశారు. ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా, హిందూస్థాన్ టైమ్స్, నేషనల్ హెరాల్డ్ లో సంపాదకుడిగా పనిచేశారు. యోజన పత్రిక (1951-53)కు ఆయన వ్యవస్థాపక సంపాదకుడుగా పనిచేశారు. ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో ఆయన రాజ్యసభ (1980 -1986)కు నియమితులయ్యారు. 1974లో పొందిన పద్మభూషణ్‌పురస్కారాన్ని స్వర్ణమందిరంపై సైనిక చర్యకు నిరసనగా 1984లో తిరస్కరించారు.
ఈసీ ప్రచారకర్తగా అమీర్‌ఖాన్
బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రచార కర్తగా ఎంచుకుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో ఓటర్లలో చైతన్యం తీసుకువచ్చేందుకు అమీర్‌సేవలను వినియోగించుకోనుంది. ముఖ్యంగా యువత ఓటు హక్కును వినియోగించుకునేలా చేయడమే ఈసీ చేపట్టిన కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం. ఇప్పటికే ఈసీ తరపున మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్, భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ప్రచారకర్తలుగా సేవలందిస్తున్నారు.
ఐ.ఎన్.ఎలో పనిచేసిన బాల ఎ చంద్రన్ మృతి
నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐ.ఎన్.ఎ)కి చెందిన యూత్‌వింగ్ లో పనిచేసిన బాల ఎ చంద్రన్ (86) సింగపూర్‌లో మార్చి 20న మరణించారు. ఐ.ఎన్.ఎలో పనిచేసిన చివరి సభ్యుల్లో చంద్రన్ ఒకరు. కేరళకు చెందిన చంద్రన్ 1940లో ఏర్పాటు చేసిన ఐ.ఎన్.ఎ యూత్‌వింగ్ బాలక్ సేనలో పనిచేశారు.
ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ చక్రవర్తి రాజీనామా
రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్ కె.సి.చక్రవర్తి మార్చి 20న వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు. ఈ ఏడాది జూన్ 30న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఈయన 2009, జూన్ 15న ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా చేరారు. మడేళ్ల పదవీ కాలం 2012లో ముగియగా మరో రెండేళ్లు పొడిగించారు.
అవార్డులు
రాజేశ్ గోపకుమార్‌కు జి.డి.బిర్లా అవార్డు
2013 సంవత్సరానికి జి.డి. బిర్లా అవార్డు భౌతిక శాస్త్రవేత్త రాజేశ్ గోపకుమార్‌కు లభించింది. క్వాంటమ్ ఫీల్డ్ థియరీలో, స్ట్రింగ్ థియరీలో ఆయన చేసిన కృషికి ఈ పురస్కారం దక్కింది. శాస్త్ర పరిశోధనలో విశేష కృషి చేసిన వారికి ఈ పురస్కారం అందజేస్తారు.
సుబ్రాన్సు చౌదరికి డిజిటల్ యాక్టివిజమ్ అవార్డు
ఇండిపెండెంట్ జర్నలిస్ట్ సుబ్రాన్సు చౌదరికి యునెటైడ్ కింగ్‌డమ్ సంస్థ అందించే 2014 డిజిటల్ యాక్టివిజమ్ అవార్డు లభించింది. సెంట్రల్ గోండ్వానా నెట్ (సీజీ నెట్) స్వర కమ్యూనిటీ రేడియో నిర్వహణకుగాను ఈ అవార్డు దక్కింది. ఈ రేడియోను రాయ్‌పూర్‌లో 2004లో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ రేడియోను మధ్యప్రదేశ్‌లోని హాకర్ గ్రామం నుంచి నిర్వహిస్తున్నారు. మహిళా సంఘాల భాగస్వామ్యంతో ఈ రేడియో మధ్యప్రదేశ్‌లో బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ రేడియో తొలుత ఛత్తీస్‌గఢ్‌లో ప్రారంభమైనప్పటికీ దీని కార్యక్రమాలు ప్రస్తుతం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు కూడా విస్తరించాయి.
క్రీడలు
ఎయిరిండియాకు నేషనల్ ఎ డివిజన్ హాకీ చాంపియన్‌షిప్
నేషనల్ ఎ డివిజన్ హాకీ చాంపియన్‌షిప్‌ను ఎయిరిండియా గెలుచుకుంది. లక్నోలో మార్చి 23న జరిగిన ఫైనల్లో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) జట్టును ఓడించింది. మూడో స్థానాన్ని ఉత్తర ప్రదేశ్ హాకీ సాధించింది.
రైల్వేలకు హాకీ ఇండియా ఉమెన్స్ నేషనల్ చాంపియన్ షిప్
నాలుగో హాకీ ఇండియా ఉమెన్స్ నేషనల్ చాంపియన్‌షిప్‌ను రైల్వేస్ గెలుచుకుంది. మార్చి 23న భోపాల్‌లో జరిగిన ఫైనల్లో హర్యానాను ఓడించింది. జార్ఖండ్ మూడో స్థానంలో నిలిచింది. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా హర్యానా జట్టుకు చెందిన మోనిక ఎంపికైంది.
రాష్ట్రీయం
రాష్ట్రంలో మొదటి మహిళాబ్యాంక్ ఏర్పాటు
రాష్ట్రంలో భారతీయ మహిళా బ్యాంక్ మొదటి శాఖను హైదరాబాద్‌లో మార్చి 23న ఆ బ్యాంక్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరక్టర్ ఉషా అనంత సుబ్రమణియన్ ప్రారంభించారు. ఏడాదిలోగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 20 శాఖలను ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఆమె ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఇది 19వ మహిళా బ్యాంక్ శాఖ.
తూర్పు తీరానికి సుమేధ నౌక
ఐఎన్‌ఎస్ సుమేధ నౌక మార్చి 23న తూర్పు నావికాదళం ప్రధాన కేంద్రమైన విశాఖకు చేరింది. గోవా షిప్‌యార్డులో మార్చి7న ఈస్ట్రన్ నావల్ కమాండ్ కమాండింగ్ ఇన్ ఛీఫ్ వైస్ అడ్మిరల్ అనిల్‌చోప్రా దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. తూర్పు నౌకాదళంలో ఇటువంటి నౌక చేరడం ఇది తొలిసారి. ఇది మూడో తరం ఆఫ్‌షోర్ పెట్రోల్ వెసెల్ విభాగంలో మూడో నౌక.
ఈ నౌక యాంటీ పైరసీ, పెట్రోలింగ్, ఫ్లీట్ సపోర్ట్ ఆపరేషన్స్, మారిటైమ్ సెక్యూరిటీ, ఎస్కార్ట్ ఆపరేషన్స్, నేవీ ఆస్తుల పరిరక్షణ వంటి విధులను నిర్వహిస్తుంది. హెలికాప్టర్ ల్యాండింగ్ సదుపాయమున్న ఈ నౌకలో పలు రకాల ఆయుధాలు, తుపాకులు ఉన్నాయి. నౌకలో రెండు బోట్లు ఉంటాయి. ఆటోమేటిక్ పవర్‌మేనేజ్‌మెంట్ విధానంలో కమాండర్ నేతృత్వంలో పనిచేసే ఈ నౌకలో 9మంది అధికార్లు,వందమంది సెయిలర్లు ఉన్నారు.
రష్యాలో విలీనమైన క్రిమియా
Published Thu, Mar 27 2014 2:59 PM | Last Updated on Sat, Sep 2 2017 5:15 AM
Advertisement
Advertisement