జీ-20 సదస్సు ఆర్థిక నిర్ణయాలు.. విశ్లేషణ | Economic decisions .. Analysis on G -20 Convention | Sakshi
Sakshi News home page

జీ-20 సదస్సు ఆర్థిక నిర్ణయాలు.. విశ్లేషణ

Published Thu, Sep 26 2013 2:02 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

జీ-20 సదస్సు ఆర్థిక నిర్ణయాలు.. విశ్లేషణ - Sakshi

జీ-20 సదస్సు ఆర్థిక నిర్ణయాలు.. విశ్లేషణ

ప్రపంచంలో 20 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలకు చెందిన ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్లకు సంబంధించిన గ్రూపును జీ-20గా వ్యవహరిస్తారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో వివిధ అంశాలకు సంబంధించి ఆయా దేశాల సహకారం, చర్చల కొనసాగింపునకు వీలుగా జీ-20 గ్రూపు ఏర్పాటును కెనడా మాజీ ప్రధానమంత్రి పాల్‌మార్టిన్ ప్రతిపాదించారు. జీ-20ని 1999 సెప్టెంబర్‌లో ప్రకటించగా.. మొదటి సమావేశం అదే ఏడాది డిసెంబర్‌లో జరిగింది. తాజాగా జీ-20 దేశాల నేతలు సెప్టెంబర్ 5, 6 తేదీల్లో రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో సమావేశమయ్యారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే దిశగా సభ్య దేశాలు కలిసి పని చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
 
 డా॥తమ్మా కోటిరెడ్డి,
 ప్రొఫెసర్, ఐబీఎస్ హైదరాబాద్.
 
 జీ-20 దేశాల విజయాలను పరిశీలిస్తే.. బ్రిక్స్ (BRICS) వంటి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల పాత్ర ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పటిష్టంగా ఉంది. దీనివల్ల  అంతర్జాతీయ విత్త సంస్థల పటిష్టత, ఆర్థిక నియంత్రణల నాణ్యతలో పెరుగుదల సంభవించింది.
 
 పీటర్‌‌సబర్‌‌గ సమావేశం- నిర్ణయాలు:
 ఐదు సంవత్సరాల క్రితంతో పోల్చితే ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పరిస్థితులు కొంత వరకు మెరుగయ్యాయి. ఆర్థిక వృద్ధిరేటు వేగవంతమైనప్పటికీ.. మరోవైపు అనిశ్చితి కూడా పెరిగింది. ఈ క్రమంలో సెయింట్ పీటర్‌‌సబర్‌‌గలో జరిగిన జీ-20 సమావేశం పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా అధిక వృద్ధి, ఉపాధి కల్పన మెరుగుపడగలదని అభిప్రాయపడింది. సమర్థమైన నియంత్రణల అమలుతోపాటు మార్కెట్లపై విశ్వాసం పెంపొందించే చర్యలు చేపట్టాలని కూడా ఈ సమావేశం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సెయింట్ పీటర్‌‌సబర్‌‌గ కార్యాచరణ ప్రణాళిక ను రూపొందించారు. బడ్జెట్‌లోటు తగ్గుదల, సమగ్రమైన నిర్మాణాత్మక సంస్కరణల అమలును మధ్యకాలిక లక్ష్యాలుగా నిర్ణయించారు. నిర్మాణాత్మక సంస్కరణల్లో భాగంగా శ్రామిక మార్కెట్, పన్నుల వ్యవస్థపై నియంత్రణ, మానవ మూల ధనం పెంపు, అవస్థాపనా సౌకర్యాల మెరుగుదల, వస్తు మార్కెట్ నియంత్రణ విధానాలను అమలు చేయాలని సూచించారు. ఈ చర్యలు విత్త మార్కెట్‌ను పటిష్టపరచడంతోపాటు అభివృద్ధిలో ప్రైవేటు పెట్టుబడిదారుల పాత్రను పెంచాల్సిన అవసరాన్ని వివరించాయి.
 
 అభివృద్ధి వ్యూహం:
 జీ-20 నేతలు సెయింట్ పీటర్‌‌సబర్‌‌గ అభివృద్ధి వ్యూహాన్ని ఈ సమావేశంలోనే వెల్లడించారు. అల్పాదాయ దేశాలకు ఆర్థిక సహాయం అందించే క్రమంలో అనుసరించాల్సిన ప్రాధాన్యత అంశాలను ఈ వ్యూహంలో పేర్కొన్నారు.
 అవి:
 ఎ)ఆహారభద్రత
 బి)ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్
 సి)ఫైనాన్షియల్ లిటరసీ
 డి)ఆధునిక అవస్థాపనా సౌకర్యాల కల్పన
 ఇ)మానవ మూలధనం పెంపు, వేగంగా అభివృద్ధి చెందుతున్న (ఎమర్జింగ్) వ్యవస్థలలో స్వదేశీ వనరుల సమీకరణ.
 
 పాత్ర కీలకం:
 ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పురోగమనం దిశగా మళ్లించడంలో జీ-20 దేశాల పాత్ర కీలకమన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. వృద్ధి రేటును పటిష్టం చేయడం ద్వారా ఉపాధి కల్పన పెంచాలని ఈ సమావేశంలో తీర్మానించారు. పటిష్టమైన, సుస్థిర, సంతులిత వృద్ధి సాధన దిశగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగమించాలని ఆయా దేశాల నేతలు అభిప్రాయపడ్డారు. సుస్థిర వృద్ధి సాధన పెట్టుబడులపై ఆధారపడి ఉండడంతో.. పెట్టుబడులకు సంబంధించి సమగ్ర విధానాన్ని రూపొందించాలని ఈ సందర్భంగా భావించారు. ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత పెంపుతోపాటు విదేశీ పెట్టుబడిదారులకు విశ్వాసం కలిగించే విధంగా సమర్థమైన నియంత్రణ విధానం ఉండాలని కూడా సమావేశం పేర్కొంది. ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు సభ్య దేశాలు పరస్పర సహకారంతో పని చేయాలని ఆయా దేశాల నేతలు సూచించారు.
 
 సుస్థిరత సాధించేందుకు:
 విత్త యాజమాన్యాన్ని సమర్థంగా నిర్వహించడంతోపాటు విత్త మార్కెట్‌లో సుస్థిరత సాధించేందుకు ప్రయత్నించాలని.. తద్వారా ఆర్థిక వ్యవస్థలు పురోగమిస్తాయన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో నిరుద్యోగం, అల్ప ఉద్యోగిత పెరిగింది. ఈ నేపథ్యంలో యువత కోసం నాణ్యతతో కూడుకున్న ఉత్పాదకత గల ఉపాధిని పెంపొందించే దిశగా చర్యలు చేపట్టాలని సమావేశంలో నేతలు వ్యాఖ్యానించారు. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే ప్రభుత్వ విధానాల మధ్య సమన్వయం ఉండాలి. స్థూల ఆర్థిక విధానాల అమలు ద్వారా విద్య, నైపుణ్యం, నవకల్పనలు, ఉపాధి, ద్రవ్య, సాంఘిక భద్రత పెంపొందించే చర్యలు అవసరమని ఈ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. శ్రామిక మార్కెట్‌లో సంస్కరణల అమల్లో భాగంగా సమ్మిళిత శ్రామిక మార్కెట్‌ల ఏర్పాటుకు అవసరమైన మద్దతు కొనసాగించాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు.
 
 పెట్టుబడులు పెంచే క్రమంలో దీర్ఘకాల రుణ మార్కెట్ల అభివృద్ధి ఆవశ్యకతను సమావేశంలో పేర్కొన్నారు. అవస్థాపనా రంగం, చిన్న, మధ్య తరహా సంస్థలకు పెట్టుబడుల ప్రవాహం పెరగాలని.. ఆయా రంగాల్లో పెట్టుబడుల పెరుగుదల అధికవృద్ధి సాధనకు తోడ్పడటమే కాకుండా ఉపాధి కల్పనకు దోహదపడగలదని పేర్కొన్నారు.
 
 బహుళ దేశాలతో వాణిజ్యం:
 పటిష్టమైన బహుళ దేశాలతో వాణిజ్యం (Multi lateral Trading) పెంపుపై దేశాలు దృష్టి కేంద్రీకరించాలని ఈ సమావేశం పిలుపునిచ్చింది. ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్యత్వం పొందిన దేశాలు మరింత సరళీకరణ (flexibility) కనబరచి ఈ సంవత్సరంలో జరిగే మల్టీ లేటరల్ ట్రేడ్ నెగోషియేషన్‌‌స ద్వారా ఆశించిన ఫలితాలు సాధించాలని సమావేశం పేర్కొంది. పటిష్టమైన, సుస్థిర, సంతులిత వృద్ధి ద్వారా ప్రజలందరూ లబ్ధి పొందే అవకాశం ఉండాలని నేతలు అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగమనాన్ని అతి ముఖ్యమైన అంశంగా ఈ సమావేశం పేర్కొంది.
 
 ఇతర చర్యలు:
 సెయింట్ పీటర్‌‌సబర్‌‌గ సమావేశం గవర్నెన్‌‌సకు సంబంధించి ప్రపంచీకరణ విధానాల అమలుపై దృష్టి కేంద్రీకరించింది. 1991లో సోవియట్ యూనియన్ పతనం తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరస్పర ఆధారిత వ్యవస్థగా రూపాంతరం చెంది అధిక వృద్ధి వైపు పయనించింది. భారత్‌తోపాటు అనేక దేశాలు నియంత్రణ విధానాలను విడనాడాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటు, దిగుమతులపై పరిమాణాత్మక ఆంక్షల తొలగింపు, అంతర్జాతీయ వాణిజ్య వృద్ధి, మూల ధన ప్రవాహాలపై వివిధ దేశాల ఆంక్షలు తొలగించడం, చైనా, భారత్‌తోపాటు ఇతర వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అధిక వృద్ధి సాధించడంలో తోడ్పడటం లాంటి పరిమాణాలు సంభవించాయి. ఆర్థిక సంక్షోభం అనంతర కాలంలో పరస్పర ఆధారిత దేశాలన్నీ లబ్ధి పొందేరీతిలో జీ-20 ప్రక్రియ ప్రారంభమైంది. తదుపరి కాలంలో బేసెల్ కమిటీ ఆన్ బ్యాంకింగ్ సూపర్‌విజన్, ది ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డు, ది ఫైనాన్షియల్ ఆప్షన్ టాస్క్‌ఫోర్‌‌స, ది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ కమిషనర్‌‌స, ది ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ లాంటి ప్రస్తుతం నిర్వహణలో ఉన్న పలు సంస్థలు ఏర్పాటయ్యాయి.
 
 ప్రగతిపై సమీక్ష:
 గత కొంతకాలంగా వరుసగా వివిధ దేశాల ఆర్థిక స్థితి క్షీణించింది. ఈ క్రమంలో అగ్రెసివ్ టాక్స్ ప్లానింగ్, పన్నులు ఎగవేతలకు ఆస్కారం లేనివిధంగా అంతర్జాతీయ సహకారం పెంపొందించడానికి జీ-20 కృషి చేసింది. సభ్య దేశాల్లో విధాన నిర్ణయాల అమలు ప్రగతిని జీ-20 సమీక్షించింది. భారత్ వస్తు, సేవలపై పన్ను విధింపును ప్రకటించింది. ఎగుమతుల తగ్గింపు ద్వారా స్వదేశీ వినియోగ పెంపునకు చైనా అనుమతించింది. జపాన్ ఆర్థిక సహాయంతో ఢిల్లీ - ముంబై పారిశ్రామిక కారిడార్‌ను పూర్తి చేయడానికి భారత్ సంకల్పించింది. పారదర్శకత పెంపు ద్వారా అవినీతి నిర్మూలనకు జీ-20 కట్టుబడి ఉంది. ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి అవస్థాపనా రంగంపై పెట్టుబడులు పెరగాలి. భారత్ అవస్థాపనా సౌకర్యాలపై ఆశించిన మేర పెట్టుబడులు ఆకర్షించకపోవడం అధిక ఆర్థికవృద్ధి సాధనకు అవరోధంగా మారింది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో అవస్థాపనా రంగంపై పెట్టుబడుల పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా సమిష్టి డిమాండ్‌ను పెంచగలదు.
 
 ముగింపు:
 పటిష్టమైన, సుస్థిర, సంతులిత వృద్ధి సాధన లక్ష్యాన్ని సెయింట్ పీటర్‌‌సబర్‌‌గ సమావేశం సదర్భంగా జీ-20 దేశాలు ప్రకటించాయి. ఆయా దేశాల్లో సమానత్వం సాధించకుండా ప్రతిపాదిత లక్ష్యాల సాధన సాధ్యం కాదు. జీ-20 దేశాల్లో కొన్ని ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలను లక్షిత వర్గాల ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు నాణ్యతతో కూడిన విద్య, ఆరోగ్య సంరక్షణ, అధికవేతన స్థాయి ప్రజలు పొందగలగాలి. తలసరిశక్తి వినియోగం, తాగునీరు, స్వచ్ఛమైన గాలి (క్లీన్ ఎయిర్) వంటి సౌకర్యాలు పెంపొందించాలి. ఆయా దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలు వేర్వేరుగా ఉండటాన్ని ఈ సందర్భంగా గమనించవచ్చు. పన్ను ప్రోత్సాహకాలు కల్పించడం ద్వారా పన్ను ఎగవేతను నివారించే ఉద్దేశంతో పన్నుల విధానంలో సంస్కరణలను ఆయా దేశాల్లో అత్యవసరంగా ప్రవేశపెట్టాలి. రీజనల్ ట్రేడ్ ఒప్పందాలతో పారదర్శకతను పెంపొందించేందుకు ప్రయత్నించాలి.
 
 
 ఆర్థిక సంక్షోభం- భారత్ చర్యలు
 అమెరికా సంక్షోభానికి ముందు కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యవస్థగా నిలిచింది. 2005-07 మధ్య కాలంలో 9.6 శాతం వృద్ధి సాధించగా 2008 -09లో సంక్షోభం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి 6.7 శాతానికి పరిమితమైంది. సంక్షోభం కారణంగా భారత్‌లో టెక్స్‌టైల్, వజ్రాలు, ఆభరణాలు వంటి ఎగుమతి ప్రాధాన్యత పరిశ్రమల్లో, ఉపాధి క్షీణత సంభవించింది. ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి ప్రభుత్వం 2008 డిసెంబర్, 2009 జనవరి, ఫిబ్రవరిలో మూడు విడతలుగా విత్త మద్దతు ప్రకటించింది. ప్రభుత్వ విధానం ముఖ్యోద్దేశ్యం సమ్మిళిత వృద్ధి. ప్రభుత్వ వ్యయం పెంపు ద్వారా గ్రామీణ ఆదాయాలు పెరిగి తద్వారా వడ్డీరేటు తగ్గి స్వదేశీ డిమాండ్ పెరగగలదని విధాన నిర్ణేతలు భావించారు. విత్త మద్దతులో భాగంగా...
 ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో చేపట్టిన రహదారులు (హైవేస్), నౌకాశ్రయాలు, విద్యుత్ రంగానికి సంబంధించిన అవస్థాపనా ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించడం.
 విత్త సంస్థల నిధుల సమీకరణను రీజినల్ ఇన్‌స్టిట్యూషన్‌‌స లేదా మల్టిలేటరల్ సంస్థల నుంచి అనుమతించారు.
 టెక్స్‌టైల్, హ్యాండ్లూమ్, హ్యాండిక్రాఫ్ట్, వజ్రాలు, ఆభరణాలు, తోలు రంగానికి సంబధించి పన్ను రాయితీలు
 ఆర్థిక వ్యవస్థలో మూలధన ప్రవాహం పెంపు. ఆస్తుల కొనుగోలు, ప్రభుత్వం లేదా కేంద్ర బ్యాంకు రుణాలు, ద్రవ్యత్వం పెంపు వంటి చర్యల ద్వారా మూలధన ప్రవాహం పెంపు.
 గ్రామీణ ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరిచే క్రమంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం, అవస్థాపనా రంగం, సుపరిపాలనా సంస్కరణలకు సంబంధించి జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ ఏర్పాటు, భారత్ నిర్మాణ్ కార్యక్రమాల అమలు సంక్షోభకాలంలో దేశంలో స్వదేశీ డిమాండ్ పెరుగుదలకు దోహదపడ్డాయి.
 
 
 ప్రపంచ ఆర్థిక వ్యవస్థ - ప్రస్తుత సవాళ్లు
 ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగించడంతోపాటు నిరుద్యోగం పెరుగుతోంది.
 ఈ పరిస్థితి పలు దేశాల్లో సమ్మిళిత వృద్ధి సాధన ఆవశ్యకతను తెలియజేస్తుంది.
 ఐరోపాలో విత్త మార్కెట్ సంక్షోభం.
 వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ వ్యవస్థలో మందగించిన వృద్ధి
 ప్రపంచ వ్యాప్తంగా మూలధన ప్రవాహానికి సంబంధించిన ఒడిదుడుకులు నమోదు కావడం.
 వివిధ దేశాల్లో ప్రైవేట్ పెట్టుబడులు కావల్సినంతగా లేకపోవడంతోపాటు మార్కెట్‌లో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి.
 వివిధ దేశాల ప్రభుత్వ రుణ భారం అధికంగా ఉండటం.
 ప్రపంచవ్యాప్తంగా సమిష్టి డిమాండ్ తగ్గుదల.
 వివిధ దేశాల ప్రభుత్వాల కోశ విధానంలో అనిశ్చిత పరిస్థితులు కొనసాగడం
 వస్తు ధరల ఒడిదుడుకులతోపాటు ఫైనాన్షియల్ కండీషన్‌‌స (ఆర్థిక పరిస్థితులు)
 కఠినంగా ఉండటం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement