ఇంజనీరింగ్‌లో బ్యాక్‌లాగ్‌ల భారం వదిలించుకోండి | Engineering Students have to clear all over back lock subjects | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌లో బ్యాక్‌లాగ్‌ల భారం వదిలించుకోండి

Published Wed, Aug 6 2014 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 11:25 AM

ఇంజనీరింగ్‌లో బ్యాక్‌లాగ్‌ల భారం వదిలించుకోండి

ఇంజనీరింగ్‌లో బ్యాక్‌లాగ్‌ల భారం వదిలించుకోండి

పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో 95 శాతం మార్కులతో పాసైన శ్రావణ్ ఇంజనీరింగ్ ఫస్టియర్‌లో రెండు సబ్జెక్టులు తప్పాడు. అప్పటివరకూ టాప్ మార్కులు సాధిస్తూ స్కూల్లో, కాలేజీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అతను.. ఫస్టియర్‌లోనే రెండు సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో ఒక్కసారిగా నిసృ్పహకు లోనయ్యాడు. అసలు తప్పు ఎక్కడ జరిగింది? ఇంతకుముందు వరకూ మంచి ర్యాంకులు తెచ్చుకున్నవారు ఇంజనీరింగ్‌లో ఎందుకు వెనుకంజ వేస్తున్నారు? ప్లేస్‌మెంట్స్‌కు వస్తున్న కంపెనీలు బ్యాక్‌లాగ్స్ ఉన్న విద్యార్థులను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడంలేదు? బ్యాక్‌లాగ్స్‌తో నష్టమేంటి? ఇంజనీరింగ్‌లో బ్యాక్‌లాగ్స్ లేకుండా చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం..   
 
 శ్రావణ్ ఫెయిల్ కావడానికి  కారణాలను పరిశీలిస్తే..
 - అతనికి కొన్ని సబ్జెక్టులు అర్థం కాలేదు. ఆయా సబ్జెక్టులను బోధించిన ప్రొఫెసర్లు తరగతి గదిలో ఈక్వేషన్లతో బోర్డు నింపేయడమే తప్ప వాటి గురించి ఎక్కువగా వివరించలేదు.
 - థియరీ, ఇంజనీరింగ్ సూత్రాలు.. పుస్తకాల్లో ఉన్నవి ఉన్నట్లుగా కాపీ చేస్తూ పోయారు. వాటికి ఆధారమైన బేసిక్ ప్రిన్సిపుల్స్‌ను మాత్రం వివరంగా చెప్పే ప్రయత్నం చేయలేదు.
 - బోర్డు మీద ప్రొఫెసర్ రాసినవే పాఠ్యపుస్తకాల్లో కూడా కనిపించడం, వాటిలో కూడా ఎక్కువ వివరణలు లేకపోవడం నిరుత్సాహపరచాయి.
 - పాఠ్యపుస్తకాల్లోని ఉదాహరణలకు, ప్రొఫెసర్ క్లాస్‌లో సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్‌కి, పరీక్షలో అడిగిన ప్రశ్నలకు సంబంధమే లేదు.
 - ఎక్స్‌పరిమెంట్ కోసం ల్యాబ్‌కి వెళ్లినా.. అసిస్టెంట్ ఇచ్చిన వాల్యూస్ రాసుకొని రావడమో లేదంటే బ్యాచ్‌లో ఒకరిద్దరు ఆ ప్రయోగం చేస్తే చూసి తెలుసుకోవాల్సి వచ్చింది.
 - క్లాసులో ఒకసారి ప్రొఫెసర్‌ను ఒక డౌట్ అడిగితే సంతృప్తికర సమాధానం రాలేదు.
 -  క్లాస్‌లో లెక్చరర్ చెప్పేది ఎలాగూ అర్థం
 
 కావట్లేదు కాబట్టి ఫ్రెండ్స్‌తో కబుర్లు, కామెంట్లతో కాలక్షేపం జరిగేది.
 నిపుణులు ఏమంటున్నారు
 - ఇంజనీరింగ్ ఫస్టియర్‌లో విద్యార్థుల్లో కొంత ఆందోళన, ఆతృత ఉంటాయి. ఇంటి నుంచి దూరంగా వచ్చినందుకు బెంగ, తల్లిదండ్రులతో పాటు ఎవరి కట్టడి లేకపోవడంతో చదువుపై దృష్టి కేంద్రీకరించడంలో ఆలస్యం చేస్తారు.
 - టెన్త్, ఇంటర్ వరకూ బట్టీపట్టి, పుస్తకాల్లో ఉన్నది ఉన్నట్లుగా పరీక్షల్లో రాసేసి అత్యధిక మార్కులు తెచ్చుకున్నవారు కూడా ఇంజనీరింగ్‌లో కొంత ఇబ్బంది పడతారు. అందుకు కారణం.. ఇంజనీరింగ్‌లో నేర్చుకుంటూ చదవాల్సిన సబ్జెక్టులు ఎక్కువగా ఉండడమే.
 - ‘మా ప్రొఫెసర్ వద్ద ఉన్న సబ్జెక్ట్ అంతా నాకు చెప్పేస్తారు. అది చదివి గుర్తు పెట్టుకుని పరీక్షల్లో రాసేస్తాను. మార్కులు కొట్టేస్తా ను. ఇప్పటివరకూ మా టీచర్లు, లెక్చరర్లు ఇలాగే చెప్పారు, నేనూ అలాగే రాశాను. నిజానికి నాకు వచ్చింది కూడా ఆ పద్ధతిలో చదవడమే..’ ఇదీ సగటు ఇంజనీరింగ్ విద్యార్థి మన:స్థితి.
 - ఇంజనీరింగ్ సిలబస్‌లో ప్రతీ సబ్జెక్టుకి రెండు మూడు రిఫరెన్స్ పుస్తకాలను ఇస్తారు. ప్రతి విద్యార్థి కనీసం రెండు బుక్స్ అయినా చదివి అర్థం చేసుకుంటాడని సిలబస్ రూపొందించిన వారు భావిస్తారు. కానీ విద్యార్థులు ఆల్-ఇన్-వన్‌లు, గైడ్లు ఫాలో అవుతారు. దీంతో ఒకే కాన్సెప్ట్‌ను రెండు మూడు పద్ధతుల్లో చదివి ఒకటైనా సరిగ్గా అర్థం చేసుకోలేక ఇబ్బంది పడతారు.
 - బీటెక్ పూర్తిచేసిన కొందరు ఒకటి రెండేళ్లు ఉద్యోగం కోసం ప్రయత్నించి ఎక్కడా దొరక్కపోతే తమ ఇంటికి దగ్గరలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్‌గా చేరతారు. వారికొచ్చిన సబ్జెక్టే అంతంత మాత్రం.. కాబట్టి విద్యార్థుల సందేహాలకు సంతృప్తికర సమాధానం ఇవ్వలేరు.
 
 ప్రశ్నించడం తప్పు కాదు
 మీకు ఒక అంశం అర్థం కాలేదనుకుందాం. మీకు ఎలా అయితే అర్థం అవుతుందనుకుంటున్నారో.. నిర్మొహమాటంగా అలాంటి జవాబు దొరికే ప్రశ్న వేయండి. ‘మీరు ఉదాహరణ ఇవ్వగలరా? మీరు చెప్పే ఆ యంత్రం ఎలా ఉంటుందో ఇమేజ్ ఇవ్వగలరా? ఇప్పుడు రాసిన ఆ ఈక్వేషన్ ఎలా సాధించారు? ఈ సిద్ధాంతాన్ని నిజజీవితంలో ఎలా ఉపయోగిస్తాం?’ వంటి ప్రశ్నలు ప్రొఫెసర్‌ను అడగవచ్చు. నిజానికి మీకున్న అనుమానాలే క్లాసులో చాలా మందికి ఉంటాయి. మీరు చొరవ చూపడం వల్ల భవిష్యత్తులో అవసరమైన నాయకత్వ లక్షణాలు మీలో పెంపొందుతాయి.
 
  ప్రొఫెసర్‌ను ప్రశ్నించడం తప్పు కాదు. అలాగని అదే పనిగా అవసరం ఉన్నా లేకున్నా ప్రశ్నలు అడిగితే మీరు సమయాన్ని వృథా చేయడానికే ప్రశ్నలు వేస్తున్నారని భావించే అవకాశముంది.  ప్రొఫెసర్ మానసిక స్థితి, క్లాసులో మిగిలిన సమయాన్ని బట్టి సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ప్రయత్నించండి. క్లాసులో కుదరదనుకుంటే లెక్చరర్‌ను స్టాఫ్ రూమ్‌లో విడిగా కలిసి, సందేహాలు తీర్చుకోండి. సాధారణంగా అధ్యాపకులు విద్యార్థులు తమను ప్రశ్నించాలని, వారి అనుమానాలను నివృత్తి చేయాలని కోరుకుంటారు. ఒక లెక్చరర్ సంతృప్తికర సమాధానం ఇవ్వకుంటే అదే సబ్జెక్టును డీల్ చేస్తున్న మరో ప్రొఫెసర్‌ను అడగండి. ఆ సమయంలో అదే సందేహం ఉన్న నలుగురైదుగురు కలిసి వెళితే ఆయా ప్రొఫెసర్లకు ఉత్సాహంగానూ ఉంటుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే.. మీరు ఆ సమస్యను అర్థం చేసుకోవడానికి, పరిష్కరించడానికి ఎంత శ్రమపడ్డారో తెలియజేసే రఫ్‌వర్క్, నోట్స్ వంటి ఆధారాలను కూడా చూపించండి. అప్పుడే మీ ప్రశ్నకు విలువ పెరుగుతుంది.
 
 అంకితభావం, నిబద్ధత
 సిలబస్ బుక్‌లో ప్రతి సబ్జెక్టుకి ఇచ్చిన పాఠ్యపుస్తకాన్ని ఫాలో అయ్యేందుకు ప్రయత్నించండి. ఒక రచయిత ఇచ్చిన వివరణపై మీకు అనుమానం వచ్చినా,  సంతృప్తి చెందకపోయినా.. మరో రచయిత పుస్తకాన్ని పరిశీలించండి. అప్పుడు అన్నిరకాల ఇన్ఫర్మేషన్ ఒక్కచోట చేరడంతోపాటు ఆయా కాన్సెప్ట్‌ల బేసిక్స్ కూడా లభిస్తాయి. పాఠ్యపుస్తకాలు, రిఫరెన్స్ బుక్స్ చదవడం వల్ల మీ సందేహాలను తీర్చే వివరణలు, ఆయా సిద్ధాంతాలపై ఎక్కువ ఉదాహరణలు లభిస్తాయి. ఇవి మీరు ఆ కాన్సెప్ట్‌ను బాగా తెలుసుకోవడానికి, పరీక్షల్లో వివరణాత్మకంగా సమాధానాలు రాయడానికి ఉపయోగపడతాయి.
 
 ఒక సమస్యను సొంతంగా సాధించేందుకు మరీ ఎక్కువసార్లు ప్రయత్నించకండి. కాసేపటికి మీ మనసు దానిని వదిలేద్దామని పోరుపెడుతుంది. కొత్త కోణంలో ఆలోచించేందుకు నిరాకరిస్తుంది. అలాంటి సమయంలో స్నేహితుల సహాయం తీసుకోండి. గ్రూప్ స్టడీస్‌లో సమస్యను చర్చించండి. మీరు ఆలోచించని కోణంలో మీ స్నేహితుల నుంచి పరిష్కారం లభించే అవకాశముంది. ఇది మీతోపాటు గ్రూపులోని ఇతరులకూ సహాయం చేస్తుంది. పై పద్ధతులన్నీ జవాబులు పొందడంలో మీకు ఉపయోగపడకపోతే..  సబ్జెక్ట్ నిపుణుడిని కలిసి సమస్యను వివరించండి. ఒక సబ్జెక్ట్ అర్థం కాకపోవటంలో మీవైపు అనాసక్తి, ఇతర విషయాలపై దృష్టి మరలడం వంటి అంశాల ప్రభావం లేకుండా చూసుకోండి.
 
 ఏరోజు పాఠాలు ఆ రోజే
 ముఖ్యంగా ఏకాగ్రతను పెంచుకుంటూ ఏరోజు పాఠాలను ఆరోజే పూర్తిచేసుకోండి. సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోండి. కాలేజీకి హాజరు వంద శాతం ఉండేటట్లు చూసుకోండి. క్లాస్‌కు వెళ్లేముందు ఆ రోజు జరిగే అంశానికి సంబంధించి చదివి వెళ్లండి. లెక్చరర్ నోట్స్‌తోపాటు రిఫరెన్‌‌స పుస్తకాల సహాయంతో నోట్స్ సిద్ధం చేసుకోండి. ప్రతిరోజూ ఆ నోట్స్‌ను చదువుకుంటూ.. పరీక్షలప్పుడు పాత ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయండి. అలా చేస్తే.. మీకు సబ్జెక్ట్ ఫెయిల్ అవడం కాని, బ్యాక్‌లాగ్‌‌స సమస్య కాని ఉండదు.  
 
 ఇంజనీరింగ్ విజయవంతంగా పూర్తి చేయాలంటే
 ఇంజనీరింగ్ విద్యను ఆచరణాత్మక విధానంలో అభ్యసించాలి. బట్టీ పట్టడం, గుర్తుపెట్టుకుని రాయడం వంటివి పనికిరావు. అనుభవపూర్వకంగా నేర్చుకుంటే తప్ప ఇంజనీరింగ్‌లో రాణించలేరు. కాబట్టి మీకు సందేహాలొస్తే మీరే చొరవగా లెక్చరర్లను అడిగి నివృత్తి చేసుకోవాలి. మీకు వచ్చిన సమస్యను మీరే  పరిష్కరించుకోవాలి. అందుకు కావలసిన జ్ఞానాన్ని మీరే పెంపొందించుకోవాలి. ఎందుకంటే.. కాలేజీ పూర్తయి ఉద్యోగంలో అడుగుపెడితే ప్రతీరోజూ ఒక పరీక్షలానే ఉంటుంది. అక్కడ సమస్యలను పరిష్కరించడమే తప్ప పాఠాలు, పరీక్షలో మార్కులు ఉండవు. మీలాగే ఇంజనీరింగ్ కోర్సు చదివేటప్పుడు సగటు విద్యార్థిగా ఉండి, తరగతి గ దిలో మీ కంటే ఎక్కువగా ఇబ్బంది పడినవారు ఎంతో మంది ఇప్పుడు ఎంతో సమర్థంగా రోజువారీ బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు!!  
 
 
 నాలుగు పద్ధతులు..
 విద్యార్థులు ఏ విషయాన్నైనా నాలుగు పద్ధతుల్లో నేర్చుకుంటారని పరిశోధనల్లో తేలింది. వాటిలో మీకు ఏ పద్ధతిలో సబ్జెక్టు  అర్థం అవుతుందో, మీరు త్వరగా నేర్చుకోగలరో గుర్తించాలి. అవి..
 1. నేను ఆచరణాత్మక, నిజజీవిత సంఘటనలను చూసి ప్రభావితమవుతాను. 2. నేను ఉదాహరణలతో వివరించినప్పుడు బాగా అర్థం చేసుకుంటాను.
 3. నేను ఫార్ములాలు, సిద్ధాంతాలు కాకుండా ఒక యంత్రం పనిచేసే విధానం తెలుసుకోవడం వల్ల నేర్చుకుంటాను.
 4. నాకు బొమ్మలు, ఫ్లో ఛార్టులు, ఇతర వివరణాత్మక అంశాలపై ఆసక్తి ఉంది. వాటి సహాయంతో పుస్తకాలను చదివిన దానికంటే ఎక్కువగా అర్థం చేసుకుంటాను.  
 
 ప్రాక్టికల్‌గా నేర్చుకోవాలి
 ఇంజనీరింగ్‌లో బ్యాక్‌లాగ్స్.. విద్యార్థుల మానసిక సామర్థ్యంతోపాటు భవిష్యత్తు అవకాశాలపైనా ప్రతికూల ప్రభావం చూపుతాయి. విద్యార్థులపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి. దీని ప్రభావం తర్వాత సెమిస్టర్ పరీక్షలపై పడి విద్యార్థికి మోయలేని భారంగా మారతాయి. కేవలం పరీక్షల సమయంలో కష్టపడి పాసైనా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే.. బ్యాక్‌లాగ్స్ కారణంగా మార్కుల శాతమూ తగ్గిపోతుంది. చాలా కంపెనీలు ప్రథమ శ్రేణి మార్కులతోపాటు బ్యాక్‌లాగ్‌లు లేని విద్యార్థులకే ప్రాధాన్యతనిస్తున్నాయి. ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఉద్యోగం కోసం వెళ్లినప్పుడు మీ బ్యాక్‌లాగ్స్‌కు కారణాలను క ంపెనీలు ప్రశ్నించవు. ప్రస్తుత పోటీ వాతావరణంలో కంపెనీలకు ఆ అవసరమూ లేదు. మెరుగైన అకడమిక్ రికార్డు ఉన్నవారికే ఉద్యోగాలిస్తాయి. కాబట్టి విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. ఇంజనీరింగ్ ఏ క్లాసునూ నిర్లక్ష్యం చేయొద్దు. తరగతి గదిలో చురుగ్గా పాల్గొనాలి. సందేహాలుంటే అదే రోజు ప్రొఫెసర్‌ను సంప్రదించి నివృత్తి చేసుకోవాలి. విద్యార్థులు తమ బ్రాంచికి సంబంధించిన ప్రతి సబ్జెక్ట్‌పై సంపూర్ణ పట్టు సాధించడానికి ప్రయత్నించాలి.
 
బేసిక్స్, ముఖ్య నియమాలు, సిద్ధాంతాలన్నింటినీ సమగ్రంగా తెలుసుకోవాలి. అంతేకానీ పరీక్షల సమయంలో బట్టీ పట్టడం, అప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాలని ప్రయత్నిస్తే ప్రయోజనం ఉండదు. ఇంజనీరింగ్‌లో ప్రతి అంశాన్నీ ప్రాక్టికల్‌గా నేర్చుకుంటేనే రాణించడానికి అవకాశం ఉంటుంది. ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం మొదటి సెమిస్టర్‌లోపు ఎలాంటి బ్యాక్‌లాగ్స్ లేకుండా జాగ్రత్త వహించాలి. అప్పటివరకు కోర్సులో ఎంత పర్సంటేజీ వచ్చింది? డిస్టింక్షన్ ఉందా? అని పరిశీలించుకుంటూ ముందుకు సాగాలి. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు కనీసం 60 శాతం మార్కులు సాధించడంపై దృష్టిసారించాలి. ఫైనల్ ఇయర్‌లో వీలైనన్ని ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలి.   
 - డా.బి.సుధీర్ ప్రేమ్‌కుమార్
 హెడ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్
 జేఎన్‌టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement