ఇంజనీరింగ్.. ఎవర్‌గ్రీన్ | Evergreen Engineering | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్.. ఎవర్‌గ్రీన్

Published Thu, Aug 14 2014 2:33 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

ఇంజనీరింగ్.. ఎవర్‌గ్రీన్ - Sakshi

ఇంజనీరింగ్.. ఎవర్‌గ్రీన్

ఇంజనీరింగ్.. దేశంలో అత్యధిక మంది విద్యార్థులు ఎంచుకుంటున్న వృత్తి విద్యా కోర్సు.. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో కలిపి దాదాపు 3,500కు పైగా కాలేజీలు.. పదుల సంఖ్యలో బ్రాంచ్‌లు.. లక్షల్లో విద్యార్థులు.. వెరసి మరే కోర్సుకు లేనంత ఆదరణనుఇంజనీరింగ్ సొంతం చేసుకుంది.. ఇంతలా ఇంజనీరింగ్ యువత కలల వేదికగా మారడానికి ఏయే అంశాలు ప్రాతిపదికగా నిలుస్తున్నాయి.. అసలు ఇంజనీరింగ్‌లో చేరడం వల్ల ఒనగూరే  ప్రయోజనాలేమిటి.. తదితర అంశాలపై నిపుణుల అభిప్రాయాలు..
 
 ఉన్నత స్థానాల్లోకి.. త్వరగా
 ఆధునిక కోర్సుల్లో ఇంజనీరింగ్ విద్యకు ఉన్నంత గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా మరే కోర్సుకు లేదని చెప్పొచ్చు. వస్తున్న మార్పులకనుగుణంగా అన్ని రకాల సాంకేతిక అంశాలను ఎప్పటికప్పుడు సిలబస్‌లో ప్రవేశపెట్టడం ద్వారా ఇంజనీరింగ్ కోర్సు నవ్యతను సంతరించుకుంటుంది. తద్వారా సంప్రదాయ, ఆధునిక అంశాల కలయికగా ఇంజనీరింగ్ రూపాంతరం చెందింది. తద్వారా ఉపాధి పరంగా అవకాశాలు మెరుగవుతున్నాయి. ఉన్నతవిద్య విషయానికొస్తే.. మరే కోర్సుకు లేనంత సరళత్వం (ఫ్లెక్సిబిలిటీ) ఇంజనీరింగ్ సొంతం. ఎందుకంటే సంబంధిత బ్రాంచ్‌లో వివిధ స్పెషలైజేషన్స్‌తో ఎంఈ/ ఎంటెక్ వంటి కోర్సులను అభ్యసించవచ్చు. అంతేకాకుండా మేనేజ్‌మెంట్‌పై ఆసక్తి ఉంటే ఎంబీఏ/ పీజీడీఎం వంటి కోర్సులను ఎంచుకోచ్చు.
 
 తద్వారా టెక్నికల్ రంగంలోనేకాకుండా మేనేజ్‌మెంట్ రంగంలో కూడా ఉన్నత స్థానాల్లో స్థిరపడే అవకాశం ఉంటుంది. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, నోకియా సీఈవో రాజీవ్ సూరి వరకు అగ్రస్థానంలో ఉన్న అన్ని కంపెనీ సీఈవోల్లో అత్యధిక శాతం మంది ఇంజనీరింగ్ నేపథ్యం ఉన్న వారే కావడం గమనార్హం. ఇంజనీరింగ్‌లో ఏబ్రాంచ్‌లోనైనా సబ్జెక్ట్ పరిధి విస్తృతం. నూతన ఆలోచనలు, ఆవిష్కరణలు వంటివి నేడు ప్రతి రంగంలో తప్పనిసరిగా మారిన నేపథ్యంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉన్నత విద్య మంచి అవకాశంగా నిలుస్తోంది. నాసా, మైక్రోసాఫ్ట్, రోల్స్‌రాయిస్, ఎయిర్‌బస్, బ్లాక్ బెర్రీ.. ఇలా ఏ కంపెనీ అయినా సృజనాత్మకత, సమస్యా సాధన నైపుణ్యం ఉన్న ఇంజనీర్లకు పెద్దపీట వేస్తున్నాయి. ఇటువంటి నైపుణ్యాలను పెంచుకోవడానికి ఇంజనీరింగ్ పీజీలు చక్కని వేదికలు. గమనించాల్సిన మరో అంశం..
 
 ఇంజనీరింగ్ అభ్యర్థులు వృత్తి పరంగా కూడా ఉన్నత స్థానాలకు త్వరగా చేరుకోవచ్చు. ఎందుకంటే విధుల్లో భాగంగా.. ఒక సమస్యను విశ్లేషించడం, పరిష్కరించడం వంటి అంశాలపై పని చేయాల్సి ఉంటుంది. తద్వారా నైపుణ్యాలు, సామర్థ్యాలు ప్రపంచానికి తెలుస్తాయి. అంతేకాకుండా ఉద్యోగుల మధ్య ఉండే పోటీతత్వం కూడా నిపుణులుగా (ప్రొఫెషనల్స్) ఎదగడానికి దోహదం చేస్తుంది. ఉద్యోగంపై ఆసక్తి లేకుంటే ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా స్థిరపడే క్రమంలో కావల్సిన పరిజ్ఞానం, నైపుణ్యాలను అందించడంలో ఇంజనీరింగ్ కోర్సుది ప్రత్యేక ఒరవడి.-డాక్టర్ బి. సుధీర్ ప్రేమ్ కుమార్,ప్రొఫెసర్ అండ్ హెడ్ (మెకానికల్),జేఎన్‌టీయూ-హైదరాబాద్.
 
 శాస్త్రీయ విజ్ఞానం సామాజిక అవసరాలకు
 చురుగ్గా, సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించే గుణం ఉన్న విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సుకు సరిగ్గా సరిపోతారు. ఇంజనీర్లకు సామాజిక బాధ్యత కూడా ఉంటుంది. ప్రాచీన కాలం నుంచి సమాజానికి ఉపయోగపడే ఎన్నో పనులకు ఇంజనీర్లే ఆద్యులుగా నిలుస్తున్నారు. శాస్త్రీయ విజ్ఞానాన్ని సామాజిక అవసరాలకు అన్వయించడంలో ఇంజనీర్లు ఎప్పుడూ ముందుంటున్నారు. అవసరాల నుంచి సౌకర్యం వరకు అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో ఇంజనీర్లదే ప్రధాన భూమిక. రవాణా, రక్షణ, విద్య, వైద్యం, ఇలా ప్రతి రంగంలో మానవ జీవితాన్ని సౌకర్యవంతంగా మలిచే విధంగా నూతన టెక్నాలజీలను ఆవిష్కరించడంలో ఇంజనీర్లు ఎప్పుడే ముందే ఉంటున్నారు.
 
 అంతేకాకుండా ప్రస్తుతం మానవాళిని వేధిస్తున్న వ్యాధులు, ఆకలి, కాలుష్యం, శక్తి వంటి అనేక సమస్యలకు పరిష్కారం చూపడంలో ఇంజనీర్ల పాత్ర కీలకంగా మారుతోంది. ఇంజనీరింగ్.. వివిధ శాస్త్రాలతో సహ సంబంధాన్ని కలిగి ఉంటుంది. తద్వారా ప్రపంచంలో ఎన్నో విషయాలకు సమాధానం ఇంజనీరింగ్ ద్వారానే సాధ్యమవుతుంది. ఉదాహరణకు సంప్రదాయ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా ఇతర వనరులను సూచించడం. అంతేకాకుండా సమాజంలో శాస్త్రీయ విజ్ఞానం పట్ల ఆసక్తి పెంచడంలో కూడా ఇంజనీర్లు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కాబట్టి సమాజానికి ఇంజనీర్ అవసరమనే కోణంలో కూడా ఇంజనీరింగ్ కోర్సు తన ప్రాముఖ్యతను చాటుకుంది.-ఇ. శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్,కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్-ఏఎన్‌యూ.
 
 ఆవిష్కరణలకు.. అవకాశాలకు కేరాఫ్
 ఇంజనీరింగ్ కోర్సు దశాబ్దాల నుంచి నిత్యనూతనంగా మనుగడ సాగిస్తున్న కోర్సు. ప్రస్తుత ఆధునిక కాలంలో ఈ కోర్సు ప్రాముఖ్యత మరింత పెరుగుతోంది. కారణం వ్యాపార, ఉత్పత్తి రంగాల్లో రోజుకో కొత్త ఆవిష్కరణ ఆవశ్యకమవుతోంది. రోజుకో కొత్త ఉత్పత్తి వినియోగదారుల ముందు ఉంటోంది. ఈ కొత్త ఉత్పత్తుల తయారీ వెనుక ఎంతో శ్రమ, పరిశోధన ఇమిడి ఉంటాయి. ఇదే క్రమంలో వీటికి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ కూడా విస్తృతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ అండ్ డీ, కొత్త ఆవిష్కరణలకు మార్గం వేసే కోర్సు ఇంజనీరింగ్. అందుకే అటు పరిశ్రమ వర్గాల నుంచి, ఇటు విద్యార్థుల నుంచి ఈ కోర్సుకు ఆదరణ ఏటేటా పెరుగుతోంది. ఇంజనీరింగ్ ఎవర్‌గ్రీన్ అనేది నిస్సందేహం. కానీ.. దీనికి అదనంగా విద్యార్థులు కూడా నైపుణ్యాల సాధనకు తీవ్రంగా కృషి చేయాలి.
 
 నాలుగేళ్ల కోర్సులో ప్రతి రోజు పకడ్బందీ ప్రణాళికతో సాగాలి. అప్పుడే కోర్సులో చేరిన ఉద్దేశం నెరవేరుతుంది. ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ ప్రకారం అధిక శాతం విద్యార్థుల్లో కంప్యూటర్ సైన్స్ క్రేజీ బ్రాంచ్‌గా నిలుస్తున్నప్పటికీ.. కోర్ బ్రాంచ్‌లతో(సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్) సుదీర్ఘ భవిష్యత్తు సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా ఇప్పుడు ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్‌కు ప్రాధాన్య పెరిగింది. ప్రతి రంగంలోనూ రెండు విభాగాల కలయికతో ఉత్పత్తులు ఆవిష్కృతమవుతున్నాయి. ఉదాహరణకు.. మెకానికల్ విభాగాన్నే పరిగణనలోకి తీసుకుంటే..
 
  కార్ల తయారీలో మెకానికల్‌తోపాటు సాఫ్ట్‌వేర్ నైపుణ్యం కూడా అవసరమవుతోంది. కాబట్టి విద్యార్థులు ఇంటర్ డిసిప్లినరీ దృక్పథం అలవర్చుకుంటే అవకాశాలు రెట్టింపు చేసుకోవచ్చు. ప్రస్తుతం అన్ని కంపెనీలు సబ్జెక్ట్ ఫండమెంటల్స్‌పై పట్టు వంటి అకడెమిక్ నైపుణ్యాలతోపాటు, కమ్యూనికేషన్ స్కిల్స్, మెంటల్ ఎబిలిటీ (మానసిక సామర్థ్యం)పై ప్రత్యేకంగా పరీక్షిస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని కమ్యూనికేషన్ స్కిల్స్, మెంటల్ ఎబిలిటీ స్కిల్స్ పెంచుకోవడానికి కృషి చేయాలి. ఇవి సిలబస్‌లో ఉండవు. ఏ బ్రాంచ్ అయినా మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా ఉపాధి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ఈ ఏడాది ఇంజనీరింగ్ కోర్సులో చేరే విద్యార్థులు నాలుగేళ్ల తర్వాత పరిస్థితుల గురించి ఆలోచిస్తూ.. ఆందోళన చెందకుండా అకడెమిక్స్‌పై పరిపూర్ణత దిశగా కృషి చేస్తే అవకాశాలు వాటంతటవే సొంతమవుతాయి.- ప్రొఫెసర్ పి. రవికుమార్,ఫ్యాకల్టీ ఇన్‌ఛార్జ్ (ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్)నిట్-వరంగల్
 
 ఆసక్తి, సామర్థ్యాలకు సరిపోయే బ్రాంచ్
 ఇంజనీరింగ్ కోర్సులో చేరిన విద్యార్థుల ముందు ఎన్నో అవకాశాలు. ఇతర కోర్సులతో పోల్చితే ఈ కోర్సులో విద్యార్థులకు తమ ఆసక్తి అనుగుణంగా స్పెషలైజేషన్స్‌ను ఎంచుకోవచ్చు. తద్వారా చక్కని అవకాశాలను అందుకోవడమేకాకుండా ఉన్నత స్థానాల్లో స్థిరపడొచ్చు. ఇంజనీరింగ్‌లో దాదాపుగా 25కుపైగా బ్రాంచ్‌లు ఉంటాయి. కేవలం సంప్రదాయ బ్రాంచ్‌లకే పరిమితం కాకుండా మారుతున్న అవసరాలకనుగుణంగా నూతన బ్రాంచ్‌లను కూడా ప్రవేశపెడుతున్నారు. ప్రస్తుతం సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కెమికల్, మెటలర్జీ, ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ వంటి బ్రాంచ్‌లకు మంచి డిమాండ్ ఉంది.
 
 ఇందులో కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్ అభ్యర్థులకు అవకాశాలు పుష్కలం. ఈ రెండు రంగాలు వేగంగా అభివృద్ధి దిశలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో వచ్చే దశాబ్దంలో సంబంధిత రంగాల్లో అవకాశాలు రెట్టింపవుతాయి. ఇంజీనిరింగ్ విద్యార్థులకు ఉన్న సౌలభ్యం ఏమిటంటే ఏ బ్రాంచ్ విద్యార్థులైనా కంప్యూటర్ రంగంలో స్థిరపడొచ్చు. నైపుణ్యాలు ఉంటే చాలు తగిన శిక్షణ ఇచ్చి సాఫ్ట్‌వేర్ సంబంధిత సంస్థలు ఇతర బ్రాంచ్‌ల విద్యార్థులను కూడా రిక్రూట్ చేసుకుంటున్నాయి. అదేవిధంగా ప్రభుత్వాలు విద్యుత్, సివిల్ (మౌలిక వసతులు) రంగాలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యతినిస్తున్నాయి. దాంతో సంబంధిత మానవ వనరులకు డిమాండ్ ఏర్పడుతోంది. బయోటెక్నాలజీ, కెమికల్ రంగాలకు సంబంధించి వచ్చే దశాబ్దం ఎంతో కీలకమైంది. పెరుగుతున్న పరిశోధనలు, ప్రభుత్వ ప్రోత్సహం కారణంగా ఈ రంగం స్వరూపం పూర్తిగా మారే అవకాశం ఉంది.
 
 తద్వారా విస్తృత ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఈ అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే ఇంజనీరింగ్‌లో ఏ బ్రాంచ్‌లో చేరినా అవకాశాల విషయంలో నిశ్చింతంగా ఉండొచ్చు. ఇటువంటి సరళత్వం (ఫ్లెక్సిబిలిటీ) కేవలం ఇంజనీరింగ్ కోర్సుకే సాధ్యం. కాబట్టి విద్యార్థులు తమ ఆసక్తి, సామర్థ్యాలకు సరిపోయే బ్రాంచ్‌ను ఎంచుకోవాలి. ఇక్కడ ఒక్క విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి. అవకాశాలను అందుకోవాలంటే మాత్రం కోర్సులో చేరిన మొదటి రోజు నుంచే సంబంధిత నైపుణ్యాలను పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. ఇంజనీరింగ్ కోర్సులో ఒక నైపుణ్యం నుంచి మరో నైపుణ్యంలోకి త్వరగా మారాల్సి ఉంటుంది. ఉదాహరణకు సమస్య సాధన నుంచి దాన్ని విశ్లేషించే వరకు వివిధ నైపుణ్యాలతో అవసరం ఉంటుంది. కాబట్టి ఇంజనీరింగ్ విద్యార్థుల్లో మేథో సామర్థ్యం కూడా పెరుగుతుంది.-ప్రొఫెసర్ పి. ఎస్. అవధాని, ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్,ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్-విశాఖపట్నం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement