గస్తీ నౌక ఆయుష్‌ ప్రారంభం | first unified Heliport in South Asia | Sakshi
Sakshi News home page

గస్తీ నౌక ఆయుష్‌ ప్రారంభం

Published Thu, Mar 9 2017 12:17 AM | Last Updated on Tue, Sep 5 2017 5:33 AM

గస్తీ నౌక ఆయుష్‌ ప్రారంభం

గస్తీ నౌక ఆయుష్‌ ప్రారంభం

జాతీయం
దక్షిణాసియాలో తొలి ఏకీకృత హెలీపోర్ట్‌
సమీప ప్రాంతాలకు హెలికాఫ్టర్‌ల ద్వారా రాకపోకలు సాగించేందుకు వీలుగా న్యూఢిల్లీలో నిర్మించిన అధునాతన ఏకీకృత హెలీపోర్ట్‌ను కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు ఫిబ్రవరి 28న ప్రారంభించారు. ఇది దక్షిణాసియాలోనే తొలి ఏకీకృత హెలీపోర్ట్‌ అని అధికారులు తెలిపారు. ఇందులో హెలికాఫ్టర్ల ల్యాండింగ్, టేకాఫ్‌లతోపాటు ప్రత్యేకంగా గగనతల రద్దీ నియంత్రణ (ఏటీసీ), ఇంధన సేవలు అందుబాటులో ఉన్నాయి.

దేశంలో తగ్గిన శిశు మరణాల రేటు
గత పదేళ్లలో శిశు మరణాల రేటు (ఐఎంఆర్‌) దేశ వ్యాప్తంగా గణనీయంగా తగ్గిందని ఫిబ్రవరి 28న విడుదల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–4) తెలిపింది. 2005–06లో ప్రతి 1000 మంది శిశువులకు 57 మంది చనిపోగా 2015–16 నాటికి ఆ సంఖ్య 41కి పడిపోయిందని పేర్కొంది. త్రిపుర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, అరుణాచల్‌ ప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాల్లో ఐఎంఆర్‌ సుమారు 20 శాతానికి తగ్గింది. తాజా సర్వే ప్రకారం జనన సమయంలో లింగ నిష్పత్తి జాతీయ స్థాయిలో 914 నుంచి 919కి పెరిగింది.

పాతనోట్లపై జరిమానాకి రాష్ట్రపతి ఆమోదం
పది కంటే ఎక్కువ సంఖ్యలో రద్దయిన పాతనోట్లు ఉంటే వాళ్లకు కనీసం రూ.10,000 వరకు జరిమానా విధించేలా తీసుకొచ్చిన చట్టంపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఫిబ్రవరి 27న సంతకం చేశారు.

70 శాతం సింహాలు భారత్‌లోనే
ప్రపంచ వన్య ప్రాణుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 3న న్యూఢిల్లీలో ప్రపంచ వైల్డ్‌లైఫ్‌ క్రైమ్‌ కంట్రోల్‌ బ్యూరో (డబ్ల్యూసీసీబీ) ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న కేంద్ర పర్యావరణశాఖ మంత్రి అనిల్‌ దవే మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న మొత్తం సింహాల్లో 70 శాతం మేర భారత్‌లోనే ఉన్నాయని వెల్లడించారు. సుమారు దేశంలో 2400 సింహాలు ఉన్నాయని తెలిపారు.

 స్త్రీ–పురుష సమానత్వంపై ఐరాస సంస్థతో ఒప్పందం
క్షేత్ర స్థాయి నుంచి స్త్రీ–పురుష సమానత్వం సాధించేందుకు ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందానికి కేంద్ర మంత్రివర్గం మార్చి 6న ఆమోదం తెలిపింది. ఐరాస స్త్రీ, పురుష సమానత్వ, మహిళా సాధికార సంస్థ (యూఎన్‌–
ఉమెన్‌), పంచాయతీరాజ్‌ శాఖల మధ్య ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదిరింది.

అంతర్జాతీయం
అమెరికా కాంగ్రెస్‌లో కాల్‌ సెంటర్‌ బిల్లు
కాల్‌ సెంటర్లను విదేశాలకు తరలించే అమెరికా కంపెనీలకు ప్రభుత్వ గ్రాంట్లు, పూచీకత్తు రుణాలు దక్కకుండా చేసే బిల్లును అమెరికా కాంగ్రెస్‌లో మార్చి 2న తిరిగి ప్రవేశపెట్టారు. ‘ది యూఎస్‌ కాల్‌ సెంటర్‌ అండ్‌ కన్జ్యూమర్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌’ అనే ఈ బిల్లును డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన జీన్‌ గ్రీన్, రిపబ్లిక్‌ పార్టీకి చెందిన డేవిడ్‌ మెక్‌ కిన్లేలు ప్రవేశపెట్టారు.

ముగ్గురు శాస్త్రవేత్తలకు బ్రెయిన్‌ ప్రైజ్‌
కోరికలు, నిర్ణయాలు తీసుకోవడం, మనోవైకల్యం వంటి అన్ని అంశాల వెనుక మెదడులోని నాడీ నిర్మాణాల పాత్ర (మెదడు రివార్డు వ్యవస్థ)ను విశ్లేషించిన శాస్త్రవేత్తలు పీటర్‌ డయాన్, రాయ్‌డోలన్, వోల్‌ఫ్రమ్‌ షల్జ్‌లు సంయుక్తంగా మార్చి 6న ప్రతిష్టాత్మక బ్రెయిన్‌ ప్రైజ్‌ అందుకున్నారు. ఈ ముగ్గురు 30 ఏళ్లుగా మెదడు పనితీరుపై పరిశోధనలు జరుపుతున్నారు. డెన్మార్క్‌లోని లండ్‌బెక్‌ ఫౌండేషన్‌ నాడీ
కణశాస్త్రంలో అద్భుత పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలకు ఏటా ఈ అవార్డును అందిస్తోంది.

వార్తల్లో వ్యక్తులు
జాతీయ ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా నంద్‌ కుమార్‌ సాయి
షెడ్యూల్డ్‌ తెగల జాతీయ కమిషన్‌ చైర్మన్‌గా పార్లమెంట్‌ మాజీ సభ్యుడు, ఛత్తీస్‌గఢ్‌ గిరిజన నేత నంద్‌ కుమార్‌ సాయి ఫిబ్రవరి 28న బాధ్యతలు చేపట్టారు.

ఐఓసీ చైర్మన్‌గా సంజీవ్‌ సింగ్‌
ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) చైర్మన్‌గా సంజీవ్‌ సింగ్‌ ఫిబ్రవరి 28న నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని కేంద్ర మంత్రివర్గ నియామకాల కమిటీ ఆమోదించింది. సంజీవ్‌ ఐదేళ్లపాటు ఐఓసీ చైర్మన్‌గా కొనసాగనున్నారు.

పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌గా
లే బర్మన్‌
సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌గా డీఆర్‌ డోలే బర్మన్‌ మార్చి 1న బాధ్యతలు స్వీకరించారు.

∙సీవీ ఆనంద్‌కు ఇన్నోవేటివ్‌ లీడర్‌షిప్‌ అవార్డ్‌
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మంచి ఫలితాలు రాబట్టినందుకు తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ సీవీ ఆనంద్‌కు వినూత్న నాయకత్వ
(ఇన్నోవేటివ్‌ లీడర్‌షిప్‌) అవార్డును రాజస్థాన్‌ ప్రభుత్వం మార్చి 3న అందజేసింది.

ఆర్థికం
∙ఎస్‌బీఐ ఖాతాలో కనీస నగదు తప్పనిసరి
ఎస్‌బీఐ ఖాతాలో కనీస మొత్తంలో నగదు లేకపోతే ఖాతాదారులకు జరిమానా విధించనున్నారు. ఇది ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని ఎస్‌బీఐ మార్చి 3న వెల్లడించింది. మహానగరాల్లోని బ్యాంక్‌ శాఖల ఖాతాల్లో కనీస నగదు నిల్వ రూ.5,000, నగరాలు, పట్టణాల్లో రూ. 2,000, గ్రామీణ ప్రాంతాల్లోని శాఖల్లో రూ.1000 ఉండాలని నిబంధన విధించారు. నెలలో మూడు కంటే ఎక్కువ లావాదేవీలు జరిపితే రూ.50 ఛార్జ్‌గా విధిస్తారు. ఏటీఎంల నుంచి నెలకు పదిసార్లు ఉచితంగా నగదు తీసుకోవచ్చు.

∙2016–17లో 7.1 శాతంగా వృద్ధిరేటు
పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2016–17) సంబంధించి రెండో సత్వర అంచనాలను కేంద్ర గణాంకాధికార కార్యాలయం ఫిబ్రవరి 28న విడుదల చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2017–18) వృద్ధిరేటు 7.3 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.

∙కేంద్ర, సమగ్ర జీఎస్‌టీ బిల్లుల ముసాయిదాకు ఆమోదం
కేంద్ర జీఎస్‌టీ (సీజీఎస్‌టీ), సమగ్ర జీఎస్‌టీ (ఐజీఎస్‌టీ) బిల్లుల తుది ముసాయిదాలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ నేతృత్వంలోని జీఎస్‌టీ మండలి 11వ సమావేశం మార్చి 4న ఆమోదం తెలిపింది. ఇందులో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రాల జీఎస్‌టీ (ఎస్‌జీఎస్‌టీ), కేంద్రపాలిత ప్రాంతాల జీఎస్‌టీల ముసాయిదాల బిల్లులపై మార్చి 16న జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

క్రీడలు
ముర్రేకు దుబాయ్‌ ఓపెన్‌ టైటిల్‌
దుబాయ్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను ఆండీ ముర్రే (బ్రిటన్‌) గెలుచుకున్నాడు. దుబాయ్‌లో మార్చి 4న జరిగిన ఫైనల్లో ఫెర్నాండో వెర్దాస్కో (స్పెయిన్‌)పై విజయం సాధించాడు.

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత్‌కు 5వ స్థానం
న్యూఢిల్లీలో మార్చి 2న ముగిసిన ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌లో భారత్‌ ఐదో స్థానంలో నిలిచింది. తొలిసారి దేశంలో జరిగిన పోటీల్లో భారత్‌ ఒక స్వర్ణం, రెండు రజత, రెండు కాంస్య పతకాలను సాధించింది. పతకాల పట్టికలో చైనా, ఇటలీలు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.

అవార్డులు
నంది పురస్కారాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2012, 2013 సంవత్సరాలకు నంది పురస్కారాలను మార్చి 1న ప్రకటించింది. 2012 సంవత్సరానికిగానూ ‘ఈగ’, 2013 సంవత్సరానికిగానూ ‘మిర్చి’ ఉత్తమ చిత్రాలుగా ఎంపికయ్యాయి. 2012 సంవత్సరానికి ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి (ఈగ), ఉత్తమ నటుడిగా నాని, ఉత్తమ నటిగా సమంత (ఎటో వెళ్లిపోయింది మనసు) నిలిచారు. 2013 సంవత్సరానికి ఉత్తమ దర్శకుడిగా దయా కొడవగంటి (అలియాస్‌ జానకి), ఉత్తమ నటుడిగా ప్రభాస్‌ (మిర్చి), ఉత్తమ నటిగా అంజలి పాటిల్‌ (నా బంగారు తల్లి)లకు అవార్డులు లభించాయి.

2012కుగానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా కీరవాణి–ఇళయరాజాల ద్వయం, ఉత్తమ గాయకుడిగా శంకర్‌ మహదేవన్, ఉత్తమ గాయనిగా గీతామాధురి ఎంపికయ్యారు. 2013 సంవత్సరానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవీశ్రీప్రసాద్, ఉత్తమ గాయకుడిగా కైలాష్‌ఖేర్, ఉత్తమ గాయనిగా కల్పనలు అవార్డులు దక్కించుకున్నారు.

రాష్ట్రీయం
∙ఏపీ నూతన అసెంబ్లీ భవనం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ నూతన అసెంబ్లీ భవన సముదాయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు వెలగపూడిలో మార్చి 2న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, శాసనమండలి చైర్మన్‌ చక్రపాణి, పలుపురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

సేవల్లో ఆర్‌జీఐఏకు మొదటి స్థానం
ప్రయాణీకులకు అందించే విమానాశ్రయ సేవల విషయంలో హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రపంచంలోనే మొదటి స్థానం దక్కింది. 2016 సంవత్సరానికి సంబంధించి 50 లక్షలు–కోటిన్నర ప్రయాణికుల విభాగంలో ఈ ర్యాంక్‌ను ఎయిర్‌పోర్ట్స్‌ కౌన్సిల్స్‌ ఇంటర్నేషనల్‌ (ఏసీఐ) అందించినట్లు జీఎంఆర్‌ మార్చి 6న ఒక ప్రకటనలో తెలిపింది.

హైదరాబాద్‌లో జెడ్‌ఎఫ్‌ టెక్నాలజీస్‌ సెంటర్‌ ప్రారంభం
ఆటోమోటివ్‌ టెక్నాలజీ దిగ్గజం.. జెడ్‌ఎఫ్‌ టెక్నాలజీస్‌ భారత్‌లో తన తొలి అభివృద్ధి కేంద్రాన్ని హైదరాబాద్‌లో మార్చి 2న ప్రారంభించింది.

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
సేవల నుంచి యుద్ధనౌక విరాట్‌ విరమణ
భారత నౌకాదళానికి 30 ఏళ్లపాటు సేవలందించిన విమానవాహక నౌక ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను మార్చి 6న విధుల నుంచి విరమింపచేశారు. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో నౌకాదళాధిపతి అడ్మిరల్‌ సునీల్‌ లాంబా సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విరాట్‌ మొత్తం 11 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఇది మొత్తం గ్లోబును 27 సార్లు చుట్టొచ్చిన దానికి సమానం.

∙విజయవంతమైన సూపర్‌సోనిక్‌ క్షిపణి పరీక్ష
దేశీయంగా రూపొందించిన సూపర్‌సోనిక్‌ ఇంటర్‌సెప్టర్‌ క్షిపణిని భారత్‌ మార్చి 1న విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ (ఐటీఆర్‌)లోని మూడో క్షిపణి ప్రయోగ వేదిక నుంచి పృథ్వి క్షిపణిని ప్రయోగించారు. ఇది తక్కువ ఎత్తులో దేశంపైకి వచ్చే ఎలాంటి బాలిస్టిక్‌ శత్రు క్షిపణినైనా నాశనం చేయగలదు. భారత్‌కు వివిధ స్థాయిల్లో క్షిపణి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో భాగంగా దీన్ని అభివృద్ధి చేశారు.

∙గస్తీ నౌక ఆయుష్‌ ప్రారంభం
తీర ప్రాంత రక్షణ బలోపేతానికి తోడ్పడే గస్తీ నౌక ఆయుష్‌ మార్చి 6న కోస్ట్‌గార్డ్‌లో చేరింది. దీన్ని ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం ఓడరేవులో  కోస్ట్‌గార్డ్‌ డీఐజీ అనిల్‌ కుమార్‌ హర్‌బోల ప్రారంభించారు.

∙కల్వరి జలాంతర్గామి క్షిపణి పరీక్ష విజయవంతం
నౌకా నిరోధక క్షిపణిని భారత నావికాదళం మార్చి 2న విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్షను దేశీయంగా రూపొందించిన కల్వరి జలాంతర్గామి నుంచి నిర్వహించారు. అరేబియా సముద్రంలో క్షిపణిని పరీక్షించగా విజయవంతంగా లక్ష్యాన్ని చేధించింది.

ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి
కరెంట్‌ అఫైర్స్‌ నిపుణులు,
ఆర్‌సీ రెడ్డి స్టడీ సర్కిల్, హైదరాబాద్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement