మోడీ ప్రభుత్వం ముందున్న సవాళ్లు | Five big challenges for Modi's new government | Sakshi
Sakshi News home page

మోడీ ప్రభుత్వం ముందున్న సవాళ్లు

Published Wed, Jun 4 2014 11:13 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

మోడీ ప్రభుత్వం ముందున్న సవాళ్లు - Sakshi

మోడీ ప్రభుత్వం ముందున్న సవాళ్లు

తెల్లదొరల దాస్య శృంఖలాల నుంచి స్వేచ్ఛ పొందిన 67 ఏళ్ల స్వతంత్ర భారతావని ఇంకా కొన్ని సమస్యలతో సహవాసం చేస్తోంది. ఆర్థిక, సామాజికపరమైన చిక్కుముడులు, నిరుద్యోగం, అవినీతి.. ఇలా ఒకటేమిటి పలు రూపాల్లో జాడ్యాలు పట్టిపీడిస్తున్నాయి. వీటిని సమూలంగా అణగదొక్కి స్వచ్ఛమైన పరిపాలన అందిస్తామని ఇప్పటిదాకా అందలమెక్కిన ఏలిక లెవ్వరూ విజయవంతం కాలేకపోయారు. సంకీర్ణాల నేపథ్యంలో కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్న చందంగా సాహసోపేత నిర్ణయాలను తీసుకోలేక, నొప్పింపక తానొవ్వక అన్న చందంగా  ఎలాగో ఐదేళ్లూ  నెట్టుకొచ్చారే తప్ప దేశం ఎక్కడ ఉంది? ఏమైపోతోంది? అని ఆలోచించడమే మానేశారు. పర్యవసానం దేశ ఆర్థిక, సామాజిక స్థితులు గతుకుల బాట పట్టాయి. పురోగతి ఆనవాళ్లే కనిపించలేదు. ముఖ్యంగా గత ఐదేళ్లలో రూపాయి పతనం  ఏ స్థాయిలో దిగజారిందో వేరే చెప్పనక్కర్లేదు. ఓవైపు నిరుద్యోగిత మరోవైపు పెచ్చరిల్లిన అవినీతి పంకిలం ప్రజలను నిస్పృహకు గురి చేసింది.
 
 ప్రత్యామ్నాయం:
 ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అభివృద్ధి అంటే ఇలా ఉండాలని రుజువు చేస్తూ ముచ్చటగా మూడోసారి గుజరాత్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన నరేంద్ర మోడీ యావద్దేశానికీ కేంద్ర బిందువయ్యారు. హ్యాట్రిక్ విజయంతో తన దృష్టి ఇక ఢిల్లీ వైపేనంటూ సంకేతాలూ ఇచ్చారు. 16వ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి, సుపరిపాలన మ్యానిఫెస్టోగా ప్రజాకర్షక పథకాలకు అంతగా ప్రాధాన్యతనీయలేదు. అయినా ఏకపక్ష ఆధిక్యతతో ఢిల్లీ పీఠాన్ని హస్తగతం చేసుకున్నారు.
 
 అవస్థల్లో ఆర్థిక వ్యవస్థ:
 గత కొంత కాలంగా ఆర్థిక వృద్ధి క్షీణిస్తున్న నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థను పురోగమనం వైపు మళ్లించడం కొత్త ప్రభుత్వం ముందున్న సవాలుగా పేర్కొనవచ్చు. అధిక వడ్డీరేటు, దడపుట్టిస్తోన్న ద్రవ్యోల్బణం, స్తంభించిన ప్రభుత్వ విత్త స్థితి, బ్యాంకింగ్ రంగంలో పెరుగుతున్న నిరర్థక ఆస్తులు వంటి అంశాలు ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి ప్రతిబంధకాలుగా నిలిచాయి. గత ప్రభుత్వం నుంచి రూ.లక్ష కోట్లకు సమానమైన చెల్లింపులు చేయాల్సిన ఆవశ్యకత ప్రస్తుత ప్రభుత్వానికి బదిలీ అయింది. 2010 నుంచి యూపీఏ ప్రభుత్వం రాష్ర్ట ప్రభుత్వాలకు కేంద్ర అమ్మకం ఆస్తి పన్నుకు సంబంధించిన నష్టపరిహారం చెల్లింపును నిలిపివేసింది. ఆర్థిక మంత్రిత్వశాఖ అంచనా ప్రకారం ఈ మొత్తం రూ. 50,000 కోట్ల నుంచి రూ. 60,000 కోట్ల వరకు ఉండగలదు. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో చమురు మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించాల్సిన రికవరీ మొత్తం రూ. 35,000 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. ఆర్థికవృద్ధి క్షీణత, రూపాయి విలువలో ఒడిదుడుకులు వంటి అంశాల కారణంగా పెట్టుబడి దారుల్లో ఆర్థిక వ్యవస్థ పట్ల విశ్వాసం సన్నగిల్లింది. జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం, విత్త నిర్వహణ సమర్థత (ఫిస్కల్ కన్సాలిడేషన్) విషయంలో ఆర్థిక వ్యవస్థ స్థితి సంతృప్తికరంగా లేదు. 2014 ఫిబ్రవరిలో టోకు ధరల సూచీ 4.68 శాతం కాగా, ప్రస్తుతం 5.2 శాతంగా నమోదయింది. ఆహార ద్రవ్యోల్బణం 0.910 శాతానికి చేరింది.
 
 చుట్టుముడుతున్న సమస్యలు:
 వాతావరణ శాఖ అంచనా ప్రకారం ప్రస్తుత రుతుపవన కాలంలో సాధారణ సగటు కంటే తక్కువ వర్షపాతం  ఉండవచ్చు. ఈ స్థితి వ్యవసాయరంగ ఉత్పత్తి,ఉత్పాదకత పెంపు పై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. తద్వారా రాబోయే కాలంలో ఆహార ద్రవ్యోల్బణం తీవ్రమై ప్రజల జీవన ప్రమాణంపై ప్రభావం చూపగలదు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో పలు స్థూల ఆర్థిక చలాంకాల మధ్య సమతౌల్యం దెబ్బతింది. విత్తరంగం ఏ విధమైన ఆధునికీకరణకు నోచుకోలేదు. అవస్థాపనా రంగంలో ప్రైవేటురంగ పెట్టుబడులు క్షీణించాయి. దేశంలో నల్లధన ప్రవాహం అధిక ద్రవ్యోల్బణ సమస్యకు కారణంగా నిలిచింది.
 
 పబ్లిక్ ఫైనాన్‌‌స-ద్రవ్యలోటు:
 2013-14 ఆర్థిక సంవత్సరంలో సవరించిన ద్రవ్యలోటు జీడీపీలో 4.6 శాతం సాధనలో భాగంగా యూపీఏ ప్రభుత్వం 13 బిలియన్ డాలర్ల వ్యయాన్ని తగ్గించింది. దీంతోపాటు 6 బిలియన్ డాలర్ల రాయితీ వ్యయాన్ని కొత్త ఆర్థిక సంవత్సరానికి అందించింది. 2007-08లో పన్ను జీడీపీ నిష్పత్తి 12.5 శాతం కాగా, ప్రస్తుతం 10.2 శాతానికి తగ్గింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు లక్ష్యాన్ని జీడీపీలో 4.1 శాతంగా నిర్వహించాల్సినప్పుడు ప్రభుత్వ వ్యయంలో వృద్ధిని 10.9 శాతానికి తగ్గించుకోవాలి. ఇటీవల కాలంలో ప్రభుత్వ వ్యయవృద్ధి సగటున 15 శాతంగా నమోదైంది. ప్రభుత్వ వ్యయంలో తగ్గుదల ఏర్పడితే ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక, సాంఘిక అవస్థాపనలపై చేసే వ్యయం తగ్గుతుంది. ఈ స్థితి ఆర్థికాభివృద్ధి సాధనకు ప్రతిబంధకంగా నిలుస్తుంది. 2013-14లో సబ్సిడీ వ్యయం జీడీపీలో 2.2 శాతంగా నమోదైంది. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చే క్రమంలో ఈ వ్యయంలో పెరుగుదల సంభవించగలదు.
 
 బ్యాంకింగ్ రంగంలో నిరర్థక ఆస్తులతోపాటు పునర్నిర్మాణ (రీస్ట్రక్చరింగ్) రుణాల విలువ 100 బిలియన్ డాలర్లుగా అంచనా. మొత్తం రుణాల్లో వీటి వాటా 10 శాతం.కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ఉమ్మడి ద్రవ్యలోటులో పెరుగుదల ఆందోళన కలిగించే పరిణామం. అధిక వడ్డీ రేట్ల కారణంగా వినియోగ వ్యయంలో క్షీణత ఏర్పడింది. గత దశాబ్ద కాలంలో స్థూల దేశీయ పొదుపు, స్థూల దేశీయ పెట్టుబడుల మధ్య వ్యత్యాసం పెరిగింది. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ఉమ్మడి రుణంలోనూ పెరుగుదల ఏర్పడింది. ఈ నేపథ్యంలో 13వ ఆర్థిక సంఘం సూచించిన విధంగా 2015 మార్చినాటికి ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం నియమావళి సంతృప్తిపరిచే విషయంలో చాలా రాష్ర్ట ప్రభుత్వాలు విఫలమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
 
 వెతల్లో విద్యుత్ రంగం:
 దేశంలో బొగ్గు ధరల పెరుగుదల, బొగ్గు లభ్యత తక్కువగా ఉండటం, విద్యుత్ ప్లాంట్లు అవస్థాపిత సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడంలో వైఫల్యం కారణంగా విద్యుత్ రంగం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. అనేక రాష్ర్ట ప్రభుత్వాల విద్యుత్ బోర్డుల రుణభారం పెరిగింది. వినియోగదారుల బకాయిలు ఎక్కువవుతున్న కారణంగా విద్యుత్ బోర్డులకు నష్టాలు పెరుగుతున్నాయి. అధికస్థాయిలో ట్రాన్‌‌సమిషన్, పంపిణీ నష్టాలు పెరిగాయి.  
 
 దేశంలో అధిక బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ..అవసరం మేరకు సరఫరాలో కోల్ ఇండియా విఫలమవుతోంది. విద్యుత్ సామర్థ్యం తగినంతగా లేకపోవడం తయారీ రంగం, అవస్థాపనా రంగం అభివృద్ధికి అవరోధంగా నిలిచింది. విద్యుత్ ట్రాన్‌‌సమిషన్, పంపిణీ నష్టాలను తగ్గిస్తూ పంపిణీ కంపెనీల ఫైనాన్సింగ్‌ను పటిష్టపరిచే విధంగా ఎలక్ట్రిసిటీ చట్టం 2003లో తీసుకొచ్చిన సవరణలు నామమాత్రంగానే ఉన్నాయి. బొగ్గు రంగం స్థితి మెరుగుపర్చడం ద్వారా బొగ్గు లభ్యత పెంచే క్రమంలో సమస్యలు ఎదురవుతున్నాయి. పరిపాలనా సంబంధమైన సవాళ్లు, పారదర్శకత లోపించడం, ధరల విధానం లోపభూయిష్టంగా ఉండటం, రవాణా, అవస్థాపనా సౌకర్యాల కొరత, విద్యుత్ రంగంలో సంస్కరణలు లేకపోవడం వంటి విధానాల కారణంగా బొగ్గు రంగం సమస్యలతో సతమతమవుతోంది.
 
 ఆర్థిక వ్యవస్థ పురోగమించాలంటే:

 ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి కేంద్రంలో కొలువుదీరిన మోడీ సర్కారు కొన్ని చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు.వ్యవసాయ వస్తువులకు సంబంధించి డేటాబేస్ నిర్వహించడం ద్వారా నిత్యావసరాల నిర్వహణ (కమాడిటీ మేనేజ్‌మెంట్ )ను సక్రమంగా అమలు చేయాలి.వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విషయంలో ఏ ఉత్పత్తులను ఎగుమతి చేయాలి, వేటిని చేయకూడదు అనే అంశాలపట్ల విధాన నిర్ణయాలు అవసరం.
 
 ఆహార ధాన్యాలకు సంబంధించి అధికస్థాయిలో ఉన్న వృథాను తగ్గించడానికి భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)ను పునర్ని ర్మించాలి. భారత వ్యవసాయరంగంలో అధిక పెట్టుబడులు అవసరం. ప్రైవేటు రంగ పెట్టుబడులు వ్యవసాయ రంగంపై ప్రోత్సహించే విధంగా అభిలషణీయమైన విధానాలు అనుసరించాలి. ద్రవ్యోల్బణం నియంత్రణలో భాగంగా ఇంధన ధరలు, ఎల్‌పీజీ సిలెండర్ ధరల యాజమాన్యం సక్రమంగా ఉండాలి. ఇంధన ధరల రాయితీ అధిక స్థాయికి చేరుకున్న క్రమంలో ప్రభుత్వం వైపు నుంచి పటిష్ట నిర్ణయాలు అవసరం. చమురు కంపెనీల రాబడిపై ఏ విధమైన ప్రభావం లేకుండా పన్నులను తగ్గించాలి. ప్రపంచంలో ఇంధనంపై అధిక పన్ను విధించే దేశాల్లో భారత్ ఒకటి. ప్రభుత్వ వ్యయం తగ్గినప్పుడు ప్రభుత్వ పన్ను విధింపు కూడా తగ్గుతుంది.
 
 గుజరాత్‌లో విద్యుత్ రంగంలోని సంస్కరణలు మంచి ఫలితాలనిచ్చాయి. ఈ క్రమంలో భారత్‌లో విద్యుత్ రంగ పునర్నిర్మాణ విషయంలో మోడీ ప్రభుత్వంపై అనేక ఆశలున్నాయి. విద్యుత్ రంగంలో సంస్కరణలు అవసరం. సంస్కరణల కారణంగా బొగ్గు ధరలు, ఇతర ఇంధన ధరలు సక్రమ యాజమాన్యాలతోపాటు అధిక సబ్సిడీ భారం తగ్గాలి. విద్యుత్ రంగంలో ట్రాన్‌‌సమిషన్, పంపిణీ నష్టాలు తగ్గించాలి. తయారీ రంగంలో చైనాతో పోటీ పడాలంటే విద్యుత్ రంగ సంస్కరణల ఆవశ్యకత ఎంతో ఉంది.పరోక్ష పన్నుల సంస్కరణలలో భాగంగా వస్తు, సేవలపై పన్ను (ఎఖీ) ప్రవేశ పెట్టాలి. రుణ యాజమాన్య విధిని కేంద్రబ్యాంకు పరిధి నుంచి తొలగించాలి. ద్రవ్య విధాన లక్ష్యాల సాధనపై కేంద్రబ్యాంకు దృష్టి నిలిపేలా రుణ యాజమాన్య విధిని కేంద్ర బ్యాంకు నుంచి తప్పించాలి. అధిక వడ్డీరేటు విధానం పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ద్రవ్యలోటు తగ్గించనిదే వడ్డీరేట్లు తగ్గవు. ఈ క్రమంలో ద్రవ్యలోటు తగ్గించుకోవాలంటే జనాకర్షక పథకాలపై ప్రభుత్వ వ్యయం తగ్గాలి.
 
 ద్రవ్యలోటును తగ్గించుకుంటూ ఆర్థికవృద్ధిని వేగవంతం చేసే క్రమంలో కొత్త ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ విధానం ప్రవేశపెట్టి వనరుల సమీకరణపై దృష్టి కేంద్రీకరించాలి. రక్షణ రంగంలో దిగుమతుల తగ్గుదలకు, ఆయుధాల ఆధునికీకరణలో భాగంగా విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహానికి చర్యలు అవసరం. బీమారంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టబడుల పరిమితిని 26 నుంచి 49 శాతానికి పెంచాలి. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టిన భారీ ప్రాజెక్ట్‌లకు, మూలధన కల్పనకు సంబంధించి భీమా రంగంలో సంస్కరణలు అవసరం.ఫైనాన్షియల్ రంగంలో ఆధునికీకరణ ఆవశ్యకత ఉంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభ నేపథ్యంలో ఈ రంగం అంతరాయానికి గురైంది. పొదుపు, పెట్టుబడుల మధ్య సమతుల్యత ద్వారా ఆర్థికవృద్ధి రేటు పెంపునకు ప్రయత్నించాలి. ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణకు ఆర్థిక రంగం తగిన తోడ్పాటును అందించాలి.
 
 ఉపాధి సామర్థ్యత రంగమైన తయారీ రంగంలో ఉపాధి కల్పనకు అవసరమైన శ్రామిక చట్టాల్లో సంస్కరణలు లేవు. సంస్కరణల ద్వారా ఈ రంగంలో ఉపాధి కల్పన రేటును పెంచాలి. జీడీపీలో తయారీరంగ వాటాను పెంచాలి. మెట్రోపాలిటన్ నగరాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే సగటు పౌరుడు భద్రతను కోరుకుంటున్నాడు. మావోయిస్టుల దాడులతోపాటు మరోవైపు మతోన్మాద మూకల నుంచి పౌరుల రక్షణ బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అంతర్గత భద్రతను పెంపొందించుకొనే చర్యలు అవసరం.విద్యుత్, రవాణా, పట్టణాభివృద్ధి రంగాలపై పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఉంది. అవస్థాపనా రంగం, తయారీ రంగ ప్రాజెక్ట్‌లను ప్రభుత్వం చేపట్టే విధంగా పటిష్టమైన సంస్థాగతమైన యంత్రాంగం అవసరం.
 
 ఎన్‌డీఏ విజయంతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగిన కారణంగా రూపాయి బలపడింది. ఈ నేపథ్యంలో సంస్థాపరమైన, ప్రణాళికబద్ధమైన (సిస్టమేటిక్ పాలసీ ఇన్షీయేటివ్) విధానాలు తీసుకురాగలిగితే పెట్టుబడులు పెరుగుతాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుంది. రూపాయి బలపడుతున్న కారణంగా ఉపాధి కల్పన మెరుగవుతుంది. రూపాయి బలపడుతున్న కారణంగా భారత్ దిగుమతుల వ్యయం తగ్గుతుంది. ఇంధన ధరల్లో క్షీణత ఏర్పడింది. తయారీ రంగం, దిగుమతి పరికరాలు ఉపయోగించే రంగాల్లో ద్రవ్యోల్బణం తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గుతున్న క్రమంలో వడ్డీరేట్లు తగ్గించాలి. తద్వారా పెట్టుబడిదారులు వివిధ రంగాల్లో అధిక పెట్టుబడులు పెట్టగలుగుతారు. ఈ స్థితి ఉపాధి కల్పన సామర్థ్యం మెరుగుదలకు దోహదపడుతుంది.
 
 ముందుంది అసలు పరీక్ష:

 ఇప్పటికే భారతావనిలో ఎలాంటి సమస్యలు పట్టిపీడిస్తున్నాయో మోడీ సర్కారు గుర్తించింది. ఈ పరిణామం హర్షణీయమే. అయితే సమస్యను గుర్తించినంత మాత్రాన ఒరిగిందేమీ లేదు. కష్టాల నుంచి గట్టెక్కించాలి. ఆ చేవ తమలో ఉందన్న భరోసా ప్రజల్లో కలిగించాలి. ప్రజలు కూడా మోడీ సామర్థ్యంపై కోటి ఆశలు పెట్టుకున్నారు. అభివృద్ధి, సుపరిపాలన నినాదాన్ని నిజం చేసి తానేంటో నిరూపించుకుంటారా? లేదా ఆ తానులో ముక్కనే అని సగటు రాజకీయ నాయకునిగా మిగిలిపోతారా? కాలమే నిర్ణయించాలి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement