ఇంటర్మీడియెట్ ఎఫ్‌ఏక్యూస్
తెలుగు రాష్ట్రాల్లో వార్షిక పరీక్షల వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా ఇంటర్మీడియెట్ ఎంపీసీ, బైపీసీ కోర్సుల విద్యార్థులు వార్షిక పరీక్షల్లో అత్యధిక మార్కుల కోసం తీవ్రమైన కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ-అడ్వాన్స్‌డ్, మెయిన్స్ పరీక్షల తేదీలు సైతం వెల్లడయ్యాయి. మరికొద్ది రోజుల్లో ఎంసెట్ తేదీలు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ పరీక్షల్లో ఇంటర్మీడియెట్ మార్కులకు కూడా వెయిటేజీ కల్పిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఎంతో ఆందోళన. అత్యధిక మార్కులు ఎలా సొంతమవుతాయి? ఎంసెట్, జేఈఈ మెయిన్‌కు ప్రిపరేషన్ ఎలా? అక డమిక్, కాంపిటీటివ్ పరీక్షలకు ఎలా సిద్ధమవ్వాలి?
వంటి ప్రశ్నలకు నిపుణులు అందిస్తున్న సలహాలు.. సూచనలు..
ప్ర:ఎంసెట్ తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఎలాంటి ప్రిపరేషన్ వ్యూహం అనుసరించాలి?
జ:ముందుగా మూడు సబ్జెక్ట్‌లకు సంబంధించి ఆబ్జెక్టివ్ ప్రశ్నలపై దృష్టి పెట్టాలి. వీటిని ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల కోణంలో లఘు సమాధాన ప్రశ్నలతో అనుసంధానం చేసుకుంటూ అధ్యయనం చేస్తే అత్యధిక మార్కులు సాధించొచ్చు.
ప్ర:ద్వితీయ సంవత్సరం విద్యార్థులు సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి?
జ:ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో మూడొంతుల సమయాన్ని పోటీ పరీక్షలకు, ఒక వంతు సమయాన్ని ఇంటర్మీడియెట్ పరీక్షలకు కేటాయించాలి. జనవరి రెండో వారం నుంచి ఫిబ్రవరి రెండో వారం వరకు ఇంటర్మీడియెట్ సబ్జెక్ట్‌లకు మూడొంతుల సమయం కేటాయించాలి. ఇక ఫిబ్రవరి 15 నుంచి పూర్తిగా ఇంటర్మీడియెట్ పరీక్షల ప్రిపరేషన్‌కు కేటాయించాలి.
ప్ర:రివిజన్ సులువుగా చేసేందుకు మార్గాలు?
జ:ప్రతి సబ్జెక్ట్‌లోని ప్రతి పాఠాన్ని/యూనిట్‌ను క్షుణ్నంగా చదివి అధ్యయనం చేయాలి. అదే సమయంలో వాటిలోని ముఖ్యమైన అంశాలు, ఫార్ములాలతో ఇప్పటి నుంచే షార్ట్ నోట్స్ రూపొందించుకుంటే రివిజన్ సులువుగా ఉంటుంది.
ప్ర:ఎంసెట్‌కు కూడా ఉపయోగపడేలా సన్నద్ధం కావడం ఎలా?
జ:మూడు సబ్జెక్ట్‌లకు సంబంధించి ఫార్ములాలు, కాన్సెప్ట్‌లను అధ్యయనం చేయడంతోపాటు వాటిని అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో చదివితే ఎంసెట్ ప్రిపరేషన్ సులువవుతుంది.
ప్ర:ఎంపీసీ విద్యార్థులు అనుసరించాల్సిన టైం ప్లాన్?
జ:ఇంటర్ పరీక్షలతోపాటు ఎంసెట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు రోజూ క్లాస్ రూం అధ్యయనం తర్వాత సొంతంగా ఆరు గంటల సమయం కేటాయించే విధంగా సమయపాలన రూపొందించుకోవాలి. అంతేకాకుండా రోజూ ప్రిపరేషన్ ప్రారంభించే ముందు.. అంతకుముందు రోజు చదివిన అంశాల పునశ్చరణకు కనీసం పావుగంట నుంచి అరగంట సమయం కేటాయించాలి.
ప్ర:క్లిష్టమైన చాప్టర్లను విస్మరించొచ్చా?
జ:ఎంసెట్‌లో నెగెటివ్ మార్కింగ్ ఉండదు. కానీ జేఈఈ-అడ్వాన్స్‌డ్, మెయిన్స్‌లో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి సబ్జెక్ట్‌లోని అన్ని టాపిక్స్ పూర్తయ్యే విధంగా అధ్యయనం చేయాలి. పబ్లిక్ పరీక్షల్లో లభించే ఛాయిస్ విధానాన్ని దృష్టిలో పెట్టుకుని క్లిష్టమైన చాప్టర్లను విస్మరించకూడదు. ఇది ఎంసెట్‌లో కాకపోయినా, జేఈఈలో ప్రతికూల ప్రభావం చూపుతుంది. మరీ కష్టంగా భావించే చాప్టర్లు ఉంటే వాటికి సంబంధించి కనీసం మూల భావనలు, కాన్సెప్ట్‌లనైనా పరిశీలించాలి.
ప్ర:బైపీసీ విద్యార్థులు ఇంటర్‌తోపాటు ఎంసెట్‌కు ఎలా ప్రిపేరవ్వాలి?
జ:ఇంటర్మీడియెట్ సిలబస్ టాపిక్స్‌ను చదువుతున్నప్పుడే ప్రతి అధ్యాయం నుంచి ముఖ్యమైన పాయింట్లను గుర్తించి వాటిని నోట్స్ రూపంలో రాసుకోవాలి. వారంలో కనీసం రెండుసార్లు వాటిని ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేస్తే ఎంసెట్ ప్రిపరేషన్‌కు ఉపయోగపడుతుంది.
ప్ర:బైపీసీ విద్యార్థుల టైం ప్లాన్ ఎలా ఉండాలి?
జ:బైపీసీ విద్యార్థులు ముఖ్యంగా ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు డిసెంబర్ రెండో వారం వరకు మొదటి సంవత్సరం టాపిక్స్‌ను పునశ్చరణ చేసుకోవాలి. ఆ తర్వాత జనవరి చివరి వరకు పోటీ పరీక్షల కోణంలో చదవాలి. ఇక ఫిబ్రవరి నుంచి పూర్తిగా ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు కేటాయించాలి. ముఖ్యంగా ఇప్పటి నుంచి దాదాపు 90 శాతం సమయాన్ని గ్రూప్ సబ్జెక్ట్‌ల ప్రిపరేషన్‌కు కేటాయించాలి.
ప్ర:మంచి మార్కులు పొందేందుకు మార్గాలు?
జ:తెలుగు అకాడమీ పుస్తకాల్లో ప్రతి యూనిట్ చివర ఉన్న ఎక్సర్‌సైజ్ కొశ్చన్స్‌ను తప్పనిసరిగా నేర్చుకోవాలి. అంతేకాకుండా సమాధానాల్లో ముఖ్యాంశాలు ఉండేలా చూసుకోవాలి. దీనికి ప్రిపరేషన్ సమయం నుంచే సన్నద్ధత పొందాలి.
ప్ర:డయాగ్రమ్స్ విషయంలో ఎలా వ్యవహరించాలి?
జ:బోటనీ, జువాలజీల్లో డయాగ్రమ్స్‌పై పట్టు ఎంతో కీలకపాత్ర పోషిస్తుంది. డయాగ్రమ్స్‌ను కేవలం పరిశీలించడమే కాకుండా సొంతంగా గీయడం, ముఖ్యమైన భాగాలను గుర్తించడం వంటివి ఎంతో ముఖ్యం. ఇందుకోసం ప్రత్యేక సమయం కేటాయించాలి. ముఖ్యమైన భాగాలతోపాటు వాటి గురించి వివరించే నైపుణ్యం కూడా అలవర్చుకోవాలి. కొన్ని సందర్భాల్లో డయాగ్రమ్స్‌ను వాటి భాగాలతో సహా ఇచ్చి.. ఏదైనా ఒక భాగం గురించి వివరించమనే ప్రశ్నలు అడగొచ్చు.
ఇంటర్మీడియెట్ ఎంపీసీ ఎఫ్‌ఏక్యూస్
ప్ర: జూనియర్ ఇంటర్మీడియెట్ ఫిజిక్స్‌లో ముఖ్యాంశాలు?
జ: సింపుల్ హార్మోనిక్ మోషన్; రొటేటరీ మోషన్; కైనమేటిక్స్; వెక్టార్స్; కైనటిక్ గ్యాస్ థియరీ; గ్యాస్, లిక్విడ్, సాలిడ్ వ్యాపనాలు ముఖ్యమైనవి. వెక్టార్స్‌లోని భౌతిక సిద్ధాంతాలను ఔపోసన పట్టడం ద్వారా ఈ చాప్టర్‌పై పట్టు సాధించవచ్చు. రొటేటరీ మోషన్, యాంగులర్ మూవ్‌మెంట్, పొజిషన్ వెక్టార్, యూనివర్సల్ గ్రావిటేషనల్ లా, ఆర్బిటాల్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీ అతి ముఖ్యమైనవి.
ప్ర: సీనియర్ ఇంటర్మీడియెట్ ఫిజిక్స్‌లో ముఖ్యాంశాలు?
జ: మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నటిజం; కరెంట్ ఎలక్ట్రిసిటీ; రే ఆప్టిక్స్, ఆప్టికల్ ఇన్‌స్ట్రుమెంట్స్; పరమాణువు; కేంద్రకం, సెమీ కండక్టర్ పరికరాలు; కమ్యూనికేషన్ సిస్టమ్స్; పొటెన్షియల్ కెపాసిటర్‌లు ముఖ్యమైన యూనిట్లు.
ప్ర: ఎంపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మ్యాథ్స్‌లో ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అంశాలు?
జ: మ్యాథ్స్‌లో ఇంటెగ్రల్ కాలిక్యులేషన్స్, వర్గ సమీకరణాలు, ద్విపద సిద్ధాంతం, సంభావ్యత, పరావలయం అంశాలు కష్టమైనవిగా భావిస్తారు. ఆయా అంశాల సిలబస్ పరిధి వల్ల భయపడుతుంటారు. ప్రాథమిక అంశాలపై పట్టు సాధించి, ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమిస్తే ఎలాంటి కష్టమైన సమస్యను అయినా సులువుగా సాధించవచ్చు.
ప్ర: ఎంపీసీ మ్యాథమెటిక్స్ 2-బిలో వెయిటేజీ ఆధారంగా ముఖ్యమైన యూనిట్లు?
జ: వృత్తాలు-22 మార్కులు; వృత్తాల వ్యవస్థ-6 మార్కులు; పరావలయం- 8 మార్కులు; దీర్ఘవృత్తం- 8 మార్కులు; అతి పరావలయం- 6 మార్కులు; సమాకలనాలు-18 మార్కులు; నిశ్చిత సమాకలనాలు- 15 మార్కులు; అవకలన సమీకరణాలు- 10 మార్కులు.
ప్ర: ఎంపీసీ మ్యాథమెటిక్స్ 2-ఎలో ఏ యూనిట్లకు ఎంత వెయిటేజీ ఉంటుంది?
జ: సంకీర్ణ సంఖ్యలు- 8 మార్కులు; డిమూవర్స్ సిద్ధాంతం- 9 మార్కులు; వర్గ సమీకరణాలు- 6 మార్కులు; థియరీ ఆఫ్ ఈక్వేషన్స్-9 మార్కులు; ప్రస్తారాలు, సంయోగాలు- 12 మార్కులు; ద్విపద సిద్ధాంతం-16 మార్కులు; పాక్షిక భిన్నాలు- 4 మార్కులు; సాంఖ్యక శాస్త్రం- 9 మార్కులు; సంభావ్యత- 15 మార్కులు; ర్యాండమ్ వేరియబుల్స్- 9 మార్కులు.
ప్ర: మ్యాథ్స్‌లో ఎలాంటి ప్రిపరేషన్ చేస్తే సులువుగా సమాధానాలు ఇవ్వొచ్చు?
జ: ముందుగా మ్యాథమెటిక్స్ 2-ఎ, 2-బిలలోని అతి స్వల్ప సమాధాన ప్రశ్నలపై ఎక్కువ దృష్టి సారించాలి. ఈ తరహా ప్రశ్నలు ఫార్ములాలు, కాన్సెప్టుల సమ్మేళనంగా ఉంటాయి. ప్రతి చాప్టర్ చివర వీటికి సంబంధించిన ఉదాహరణ సమస్యలు ఉంటాయి. వాటిని తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత వ్యాసరూప సమాధాన ప్రశ్నలపై దృష్టి సారించాలి. వీటిని పేపర్ల వారీగా ప్రాధాన్యత క్రమంలో ప్రాక్టీస్ చేయాలి. 2-ఎలో ద్విపద సిద్ధాంతం; మాత్రికలు; నిర్ధారకాలు; సంకీర్ణ సంఖ్యలు; ర్యాండమ్ వేరియబుల్స్; స్టాటిస్టిక్స్; 2-బిలో పరావలయం, కలన గణితం, వృత్తాలు యూనిట్లను ఎట్టి పరిస్థితుల్లో విస్మరించకూడదు.
ప్ర: మ్యాథమెటిక్స్ మొదటి సంవత్సరం విద్యార్థులు ఎక్కువ దృష్టి పెట్టాల్సిన యూనిట్లు?
జ: గత పరీక్షల్లో వెయిటేజీకి అనుగుణంగా మ్యాథమెటిక్స్‌లోని యూనిట్లను గుర్తించి వాటిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఈ క్రమంలో మ్యాథమెటిక్స్ 1-ఎలో మాత్రికలు (22 మార్కులు); వెక్టార్ అల్జీబ్రా (20 మార్కులు), మ్యాథమెటికల్ ఇండక్షన్ (7 మార్కులు); ఫంక్షన్స్ (9 మార్కులు) చాప్టర్లను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. అదేవిధంగా 1-బిలో అవకలనాలు (15 మార్కులు); సరళ రేఖా యుగ్మాలు (14 మార్కులు); 3-డి జామెట్రీ (11 మార్కులు); అప్లికేషన్స్ అండ్ డెరివేటివ్స్ (26 మార్కులు); బిందుపథం(4 మార్కులు); అక్షీయ పరివర్తనం (4మార్కులు) ముఖ్యమైన యూనిట్లు.
ప్ర: సీనియర్ కెమిస్ట్రీలో వెయిటేజ్‌పరంగా ముఖ్యమైన చాప్టర్లు?
జ: సాలిడ్ స్టేట్-4 మార్కులు; ద్రావణాలు-6 మార్కులు; విద్యుత్ రసాయన శాస్త్రం-10 మార్కులు; సర్ఫేస్ కెమిస్ట్రీ-4 మార్కులు; లోహ శాస్త్రం- 6 మార్కులు; పి బ్లాక్ మూలకాలు-12 మార్కులు; డి, ఎఫ్ బ్లాక్ మూలకాలు-6 మార్కులు; పాలిమర్స్-4 మార్కులు; బయో మాలిక్యూల్స్-4 మార్కులు; నిత్య జీవితంలో కెమిస్ట్రీ-4 మార్కులు; ఏౌ్చ్చజ్చ్ఛుట, ఏౌ్చ్చట్ఛ్ఛట-4 మార్కులు; ఇ, ఏ, ై కలిగిన ఆర్గానిక్ పదార్థాలు- 8 మార్కులు; నైట్రోజన్ కలిగిన ఆర్గానిక్ పదార్థాలు- 4 మార్కులు.
ప్ర: జూనియర్ ఇంటర్ కెమిస్ట్రీలో ముఖ్యమైన చాప్టర్లు?
జ: రసాయన బంధం, పరమాణు నిర్మాణం, ఆవర్తన పట్టిక, కర్బన రసాయన శాస్త్రం, బోర్న్ హేబర్ వలయం, హైడ్రోజన్ స్పెక్ట్రం, అయనైజేషన్ పొటెన్షియల్, పీరియాడిక్ ప్రాపర్టీస్, నేమ్డ్ రియాక్షన్స్, ప్రాపర్టీస్, జనరల్ కెమిస్ట్రీలోని ౌ్టజీఛిజిజీౌఝ్ఛ్టటడ, కెమికల్ కైనటిక్స్, ఎనర్జిటిక్స్‌లోని కాన్సెప్టులు ముఖ్యమైనవి.
ప్ర: కెమిస్ట్రీలో ఈక్వేషన్స్, ఫార్ములాలు గుర్తుంచుకోవడానికి చిట్కాలు ఉంటే చెప్పండి?
జ: చాలామంది విద్యార్థులు కెమిస్ట్రీలోని అంశాలను కేవలం చదవడానికి మాత్రమే ప్రాధాన్యమిస్తారు. దీనివల్ల పరీక్ష సమయంలో అవి గుర్తుకు రావు. దీనికి పరిష్కారం.. ఆయా అంశాలను చదువుతున్నప్పుడే రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఉదాహరణకు.. ఆర్గానిక్ కెమిస్ట్రీలోని అన్ని ప్రశ్నల సమాధానాలను ప్రాక్టీస్ చేస్తూ వాటిని నోట్స్ రూపంలో రాసుకోవడం.
ప్ర: ఫిజిక్స్‌లో అంశాలను గుర్తుంచుకోవడం ఎలా?
జ: ఫిజిక్స్‌లో దాదాపుగా అన్ని అంశాలు నిజ జీవితంలో అన్వయించుకోదగినవే. దీన్ని అనుకూలంగా మలచుకోవాలి. ఒక అంశాన్ని చదివేటప్పుడు దాన్ని నిజజీవితంలో ఎలా వినియోగిస్తున్నాం అనే ఉత్సుకతతో చదివితే ఆ అంశాలు సులువుగా గుర్తుంటాయి. ఫిజిక్స్ అంటే క్లిష్టం అనే భావన కూడా పోతుంది.
ప్ర: ఫిజిక్స్‌లో అనుసరించాల్సిన ఇతర ముఖ్య వ్యూహాలు?
జ: ఇంటర్మీడియెట్ మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు డెరివేటివ్స్, కాన్సెప్ట్స్, సిద్ధాంతాలను నోట్స్ రూపంలో రాసుకోవాలి.
ఎప్పటికప్పుడు సందేహాల నివృత్తి
సీనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థులు ముందుగా అధిక మార్కులు పొందడమెలా? అనే ఆందోళన నుంచి బయటకు రావాలి. ఎప్పటికప్పుడు సందేహాలు నివృత్తి చేసుకుంటూ చదివితే అదే మంచి మార్కుల సాధనకు సోపానంగా నిలుస్తుంది. అదే విధంగా స్వీయ టైం టేబుల్‌ను రూపొందించుకుని దాన్ని క్రమం తప్పకుండా అనుసరించాలి. క్లాస్‌రూం తరగతులకు అనుగుణంగా కనీసం ఆరు గంటలు స్వీయ ప్రిపరేషన్‌కు కేటాయించాలి.
- వి.రమ్య, ఏపీ ఎంపీసీ టాపర్-2015
ఇంటర్మీడియెట్ బైపీసీ ఎఫ్‌ఏక్యూస్
ప్ర:బైపీసీ విద్యార్థులు ఎలాంటి వ్యూహంతో మంచి మార్కులు పొందొచ్చు?
జ:కేవలం ఇంటర్ పబ్లిక్ పరీక్షలకయితే వెయిటేజీకి అనుగుణంగా ముఖ్యమైన చాప్టర్లను చదివితే సరిపోతుంది. కానీ ఎంసెట్ పరీక్షకు కూడా సన్నద్ధమయ్యే విద్యార్థులు ఇంటర్మీడియెట్ సబ్జెక్ట్‌ల్లోని అంశాలను, ఎంసెట్ పరీక్షలో ప్రశ్నలు అడిగే తీరుపై అవగాహన ఏర్పరచుకుంటూ, అనుసంధానం చేసుకుంటూ చదవాలి. ఈ క్రమంలో ముందుగా స్వల్ప సమాధాన ప్రశ్నలు, తర్వాత లఘు సమాధాన ప్రశ్నలు, తర్వాత దీర్ఘ సమాధాన ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి.
ప్ర:సీనియర్ ఇంటర్ బోటనీలో ముఖ్యమైన యూనిట్లు?
జ:గత ప్రశ్నపత్రాలను విశ్లేషిస్తే.. మొక్కల శరీర ధర్మ శాస్త్రం (28 మార్కులు), బయోటెక్నాలజీ (16 మా.), ప్లాంట్స్, మైక్రోబ్స్, హ్యూమన్ వెల్ఫేర్ (12 మా.); సూక్ష్మ జీవ శాస్త్రం (6 మా.); జన్యుశాస్త్రం (6 మా.)లు ముఖ్యమైన యూనిట్లుగా పేర్కొనొచ్చు.
ప్ర:జూనియర్ ఇంటర్ బోటనీలో ముఖ్యమైన యూనిట్లు?
జ:వీటిని పేర్కొనడానికి కూడా గత ప్రశ్నపత్రాల్లో వెయిటేజీనే ప్రామాణికంగా భావించాలి. ఈ క్రమంలో.. జీవ ప్రపంచంలో వైవిధ్యం(14 మార్కులు); కణ నిర్మాణం, విధులు (14 మా.); మొక్కల నిర్మాణాత్మక సంవిధానం- స్వరూపశాస్త్రం (12 మా.); మొక్కల్లో ప్రత్యుత్పత్తి (12 మార్కులు); ప్లాంట్ సిస్టమేటిక్స్ (6 మా.); వృక్ష ఆవరణ శాస్త్రం (6 మా.)లు ముఖ్యమైన యూనిట్లు.
ప్ర:సీనియర్ ఇంటర్ జువాలజీలో ముఖ్యమైన యూనిట్లు?
జ:మానవ అంతర్నిర్మాణ శాస్త్రం, శరీరధర్మ శాస్త్రం (8 మార్కులు); మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ (14 మార్కులు); జన్యు శాస్త్రం (12 మార్కులు); జీవ పరిణామం (8 మార్కులు); అనువర్తిత జీవశాస్త్రం (8 మార్కులు) వెయిటేజీ పరంగా ముఖ్యమైన యూనిట్లు.
ప్ర:జూనియర్ ఇంటర్ జువాలజీలో ముఖ్యమైన యూనిట్లు?
జ:పబ్లిక్ పరీక్షల వెయిటేజీ కోణంలో జూనియర్ ఇంటర్ జువాలజీలో ముఖ్యమైన యూనిట్లు... మానవ సంక్షేమంలో జీవశాస్త్రం (14 మార్కులు); జీవావరణం, పర్యావరణం (14 మార్కులు); జంతు దేహ నిర్మాణం (10 మార్కులు); జీవ ప్రపంచ వైవిధ్యం (6 మార్కులు); జంతు వైవిధ్యం-1 (6 మార్కులు); జంతు వైవిధ్యం-2 (ఆరు మార్కులు); బొద్దింక (12 మార్కులు).
ప్ర:బైపీసీ ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్‌లో ముఖ్య యూనిట్లు?
జ:ఎలక్ట్రో స్టాటిక్, వేవ్ మోషన్, ఆప్టిక్స్‌లు; డాప్లర్ ఎఫెక్ట్; స్థిర, అనుదైర్ఘ్య తరంగాల ధర్మాలు, వాటి భేదాలను నేర్చుకోవాలి. వేవ్ మోషన్, సెమీ కండక్టర్ డివెసైస్, న్యూక్లియర్ ఫిజిక్స్, ఎలక్ట్రో మాగ్నటిక్స్ ముఖ్యమైన యూనిట్లు.
ప్ర:బైపీసీ మొదటి సంవత్సరం కెమిస్ట్రీలో ముఖ్యమైన యూనిట్లు?
జ:రసాయన బంధం, పరమాణు బంధం, కర్బన రసాయన శాస్త్రం, ఆవర్తన పట్టికలు. వీటిలోని సమస్యలను సాధన చేస్తూ పాయింట్ల రూపంలో పొందుపర్చుకుంటే రివిజన్ సులువుగా ఉంటుంది.
ప్ర:బైపీసీ మొదటి సంవత్సరం ఫిజిక్స్‌లో ముఖ్య యూనిట్లు?
జ:లిక్విడ్, గ్యాస్, రొటేటరీ మోషన్, యాంగ్యులర్ మూమెంట్, యూనివర్సల్ గ్రావిటేషన్ లా, కైనటిక్ గ్యాస్ థియరీ, ఆర్బిటాల్ వెలాసిటీలు ముఖ్యమైన అంశాలు. అంతేకాకుండా సింపుల్ హార్మోనిక్ మోషన్‌లోని సమస్యల సాధనకు ప్రాధాన్యం ఇవ్వాలి.
ప్ర:బైపీసీ ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీలో ముఖ్య యూనిట్లు?
జ:సాలిడ్ స్టేట్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, కాంప్లెక్స్ కాంపౌండ్స్, ఆల్కహాల్స్, అమైన్స్, సాలిడ్ స్టేట్, కార్బొనిల్ కాంపౌండ్‌స, ఎలక్ట్రో కెమిస్ట్రీ, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, కాంప్లెక్స్ కాంపౌండ్స్‌లు ముఖ్యమైనవి.
ప్ర:బోటనీ, జువాలజీల్లో శ్రద్ధ చూపించాల్సిన యూనిట్లు?
జ:ప్రధానంగా బోటనీ, జువాలజీ సబ్జెక్ట్‌లకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ఎంసెట్ కోణంలో ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో బోటనీలో మొక్కల శరీరధర్మ శాస్త్రం, బయోటెక్నాలజీ యూనిట్లు; జువాలజీలో మానవ అంతరనిర్మాణ శాస్త్రం, శరీరధర్మ శాస్త్రం, మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ; జంతుదేహ నిర్మాణం; మానవ సంక్షేమంలో జీవశాస్త్రం యూనిట్లను ప్రత్యేక శ్రద్ధతో చదవాలి.
ప్ర:ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఎంసెట్ పరీక్ష కోణంలో ఎలా చదవాలి?
జ:మూల భావనలను నేర్చుకుంటూ ప్రథమ సంవత్సర పాఠ్యాంశాల ప్రిపరేషన్‌ను కొనసాగించాలి. ఇలా చేస్తే ఐపీఈతోపాటు ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రథమ సంవత్సరం జువాలజీలో మానవ సంక్షేమంలో జీవశాస్త్రం, బొద్దింక, జీవావరణం, పర్యావరణం, జంతు దేహ నిర్మాణం పాఠ్యాంశాలు ముఖ్యమైనవి.