వైద్యవిద్యకు జాతీయ మార్గం... | preparation plan for medicine | Sakshi
Sakshi News home page

వైద్యవిద్యకు జాతీయ మార్గం...

Published Thu, Nov 13 2014 12:33 AM | Last Updated on Tue, Oct 16 2018 3:25 PM

వైద్యవిద్యకు జాతీయ మార్గం... - Sakshi

వైద్యవిద్యకు జాతీయ మార్గం...

డాక్టర్.. ఇంటర్మీడియెట్‌లో బైపీసీ గ్రూపు తీసుకున్న ప్రతి విద్యార్థి కల.. ఇందుకోసం కోర్సులో చేరిన మొదటి రోజు నుంచే శ్రమిస్తుంటారు.. గతంతో పోలిస్తే మెడికల్ సీట్లు పెరగడం.. సిలబస్‌లో చెప్పుకోదగ్గ వ్యత్యాసం లేకపోవడంతో.. ఎంసెట్ నుంచి ఎయిమ్స్ ఎంట్రెన్స్ టెస్ట్ వరకు.. రాష్ర్టంతోపాటు జాతీయ స్థాయి వైద్య కళాశాల్లో సీటే లక్ష్యంగా సన్నద్ధం అయ్యే విద్యార్థులు ఎందరో.. ఈ నేపథ్యంలో ఏయే పరీక్షలకు ఏవిధంగా సిద్ధం కావాలి? దృష్టిసారించాల్సిన అంశాలు? అనుసరించాల్సిన వ్యూహాలు? తదితరాలపై విశ్లేషణ..
 
సిలబస్ ఒకటే:
ఇన్‌స్టిట్యూట్ ఏదైనా.. ప్రవేశ పరీక్షలోని బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీల సిలబస్ దాదాపుగా ఒకే విధంగా ఉంటుం ది. ప్రశ్నించే విధానం, క్లిష్టతలో మాత్రమే కొద్ది తేడాను గమనించవచ్చు. ఈ పరీక్షల్లో అధిక శాతం ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ పద్ధతిలోనే ఉంటాయి. వీటితోపాటు మ్యాచ్ ది ఫాలోయింగ్, కరెక్ట్/ఇన్‌కరెక్ట్ స్టేట్‌మెంట్స్, చూస్ ది ఆడ్ వన్ వంటి ప్రశ్నలు కూడా అడుగుతారు.
 
జనరల్ నాలెడ్జ్/జనరల్ ఎబిలిటీ/ఇంగ్లిష్:
కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు మాత్రం అకడమిక్ సబ్జెక్టులతోపాటు ఇంగ్లిష్, లాజికల్ రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్ వంటి విభాగాలపై కూడా అభ్యర్థుల సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నాయి. అవి.. ఎయిమ్స్ ఎంట్రెన్స్‌లో జీకేపై 20 ప్రశ్నలు ఉంటాయి. సీఎంసీ-వెల్లూరు ప్రవేశ పరీక్ష.. రెండో పేపర్లో రీజనింగ్, ఇంగ్లిష్, కరెంట్ టాపిక్స్‌పై 120 ప్రశ్నలు ఉంటాయి.

ఇవి వేగం, కచ్చితత్వాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించినవి. ఎంజీఐఎంఎస్-వార్థా ఇతర ఇన్‌స్టిట్యూట్‌లకు భిన్నంగా గాంధీ ఆలోచనలపై ప్రత్యేకంగా ఒక పేపర్‌నే కేటాయించింది. గాంధీ ఆలోచనలకు సంబంధించి అడిగే ప్రశ్నలకు నిర్దేశిత బుక్‌లెట్‌లో ఎస్సే/షార్ట్ ఆన్సర్స్ పద్ధతిలో సమాధానాలను రాయాలి. జిప్‌మర్‌లో అభ్యర్థి ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ఈ విభాగానికి 40 మార్కులు కేటాయించారు.
 
సులభమే:
సబ్జెక్ట్‌లకు భిన్నంగా జనరల్ నాలెడ్జ్, ఇంగ్లిష్ విభాగాల్లో ప్రశ్నలు అడుగుతున్నప్పటికీ.. వాటి క్లిష్టత సులభంగానే ఉంటుంది. ఓ సాధారణ విద్యార్థి కూడా సమాధానాలు గుర్తించే విధంగా ఉంటాయి. కాబట్టి సంబంధిత మాక్ టెస్ట్‌లను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. బేసిక్ గ్రామర్‌పై పట్టు ఉంటే ఇంగ్లిష్‌లో చక్కని స్కోర్ చేయొచ్చు. ముఖ్యంగా కరక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, స్పాటింగ్ ద ఎర్రర్, ప్యాసేజ్ కొశ్చన్స్ వంటి అంశాలు ఉంటాయి. దీని కోసం మార్కెట్లో దొరికే ఏదైనా ప్రామాణిక పుస్తకాన్ని చదవడం లాభిస్తుంది.

జనరల్ నాలెడ్జ్ విషయానికొస్తే.. చరిత్ర, రాజ్యాంగం, స్వాతంత్య్రోద్యమం, తదితర అంశాలకు సంబంధించిన ప్రధాన ఘట్టాలపై క్షుణ్నమైన అవగాహన ఉండాలి. కరెంట్ అఫైర్స్ కోసం.. పరీక్ష జరిగే తేదీకి ముందు సంవత్సర కాలంలో జరిగిన ప్రధాన అంశాలను (సదస్సులు, సమావేశాలు, ఒప్పందాలు, వ్యక్తులు, విజయాలు, అవార్డులు వంటివి) తెలుసుకోవాలి. ఇందుకోసం దినపత్రికలను, కాంపిటీటివ్ మ్యాగజీన్లను చదవాలి. జనరల్ ఆప్టిట్యూడ్ కోసం బ్యాంక్ పరీక్షలకు ఉయోగపడే పుస్తకాల అధ్యయనం మేలు.
 
సబ్జెక్ట్‌ల వారీగా సిద్ధం ఇలా

ఫిజిక్స్
ఎంసెట్, జాతీయ స్థాయి మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్‌ల్లో మెరుగైన ర్యాంక్ సాధనలో ఫిజిక్స్ పాత్ర కీలకం.
ఎంసెట్‌తో పోల్చితే జాతీయ స్థాయి పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు సులువుగా ఉంటాయి.
జాతీయ స్థాయి పరీక్షలో ఇంటర్మీడియెట్ మార్కులకు వెయిటేజీ లేదు. కాబట్టి అన్ని పాఠ్యాంశాలను కాన్సెప్ట్‌ల వారీగా ప్రిపేర్ కావడం ప్రయోజనకరం.
{పథమ సంవత్సరంలో గతిశాస్త్రం, ఉష్ణం, ఉష్ణగతికశాస్త్రం వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. ఉష్ణగతిక శాస్త్రంలో గ్రాఫ్‌లకు సంబంధించిన ప్రశ్నలను సాధన చేయాలి.
ద్వితీయ సంవత్సరంలో ద్వంద్వ స్వభావం, కాంతి విద్యుత్ ఫలితం, అర్ధ వాహకాలలోని ప్రాథమిక అంశాలను క్షుణ్నంగా చదవాలి.
పాఠ్యాంశాలను చదివేటప్పుడు ముఖ్యాంశాలు, ఫార్ములాలతో కూడిన నోట్స్‌ను రూపొందించుకోవాలి. దీని వల్ల పునశ్చరణ సులువవుతుంది.
{పతి విభాగం నుంచి సిద్ధాంతపరమైన ప్రశ్నలతోపాటు ప్రథమ, ద్వితీయ స్థాయి ప్రశ్నలను అభ్యసించాలి.
కొన్ని పరీక్షల్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి కచ్చితంగా తెలిసిన ప్రశ్నలకే సమాధానం ఇవ్వాలి.
 
-పి.కె.సుందర్ రావు, సీనియర్ ఫ్యాకల్టీ.
 
కెమిస్ట్రీ
ఎంసెట్‌తోపాటు జాతీయ స్థాయిలో నిర్వహించే అన్ని రకాల మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్‌లకు సమగ్ర ప్రిపరేషన్ సాగించాలి.
కెమిస్ట్రీలో ప్రాథమిక భావనలపై పట్టు మెరుగైన మార్కులకు దోహదం చేస్తుంది. మొదటి ఏడాది నుంచి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. అంతేకాకుండా గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడంతోపాటు మాక్ టెస్ట్‌లు/మోడల్ టెస్ట్‌లకు తప్పకుండా హాజరు కావాలి. తద్వారా బలాలు, బలహీనతలు తెలుస్తాయి. పరీక్షల్లో సమయపాలనపై అవగాహన కూడా ఏర్పడుతుంది.
{పస్తుతం సాంకేతిక, ఆర్ అండ్ డీ (రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్) రంగంలో చోటు చేసుకుంటున్న నూతన పరిశోధనలపై ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బయో మాలిక్యూల్స్, పాలిమర్స్, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీ డే లైఫ్, ఆర్గానిక్ కెమిస్ట్రీపై దృష్టి సారించాలి.
అన్ని నేమ్డ్ రియాక్షన్స్, వాటి వ్యవస్థలు (రీజెంట్స్‌తో కలిపి), ఇంటర్ కన్వర్షన్స్, ఆల్కహాల్-ఫినోల్స్-కార్బక్సిలిక్ యాసిడ్స్ ్కఓ్చ విలువలు, అమైన్స్ తదితరాల ్కఓఛ విలువలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి.
ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఫార్ములాలతో సంబంధం ఉండే సమస్యలపై ఎక్కువగా దృష్టి సారించాలి.
ఇనార్గానిక్ కెమిస్ట్రీలో హైడ్రైడ్స్, ఆక్సైడ్స్, హలైడ్స్, ఆక్సీ యాసిడ్స్ వంటి వాటి ప్రతి సమూహ లక్షణాలు, ఉపయోగకర సమ్మేళనాలు, తయారీ సంబంధిత అంశాలను ఎక్కువగా సాధన చేయాలి.
పరీక్షల్లో విభిన్నమైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సంబంధిత అంశంపై అవగాహనతో ఉండడం ప్రయోజనకరం.
కొన్ని పరీక్షల్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి తెలిసిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వడం ఉత్తమం.
 
-ప్రసాద్ రావు గర్లపాటి, సీనియర్ ఫ్యాకల్టీ.
 
బోటనీ
జాతీయ స్థాయి వైద్య విద్య ప్రవేశ పరీక్షల విషయంలో సిలబస్‌కు సంబంధించి కొద్దిపాటి తేడా మినహా చెప్పుకోదగ్గ స్థాయిలో మార్పులుండవు.
బోటనీ విషయంలో సిలబస్ దాదాపుగా ఒక్కటే. కానీ యథాతథంగా ఉండదు. ఎందుకంటే ప్రశ్నల క్లిష్టత, ప్రశ్నించే పద్ధతి, పరీక్ష విధానం వేర్వేరుగా ఉంటాయి.
{పిపరేషన్‌లో యూనిట్లు/చాప్టర్ల వారీగా హాజరవుతున్న పరీక్షను దృష్టిలో ఉంచుకుని మోడల్ టెస్ట్ రాయడం ప్రయోజనకరం. తద్వారా పరీక్షా విధానం, ప్రశ్నల క్లిష్టతపై అవగాహన ఏర్పడుతుంది.
ఏఐపీఎంటీ, కేఎంసీ వంటి పరీక్షల్లో డయాగ్రమ్ ఆధారంగా కూడా ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి విద్యార్థులు ఈ అంశంపై కూడా దృష్టి సారించాలి. చిత్రాలను, భాగాలను గుర్తించడం వంటి వాటిని ప్రాక్టీస్ చేయాలి.
ఎయిమ్స్ వంటి పరీక్షల్లో అసెర్షన్-రీజనింగ్ వంటి ప్రశ్నలు ఎదురవుతాయి. కాబట్టి ఒక అంశానికి సంబంధించిన ప్రాథమిక భావనలపై పట్టు సాధించడం కీలకం. తద్వారా ఇటువంటి ప్రశ్నలకు తేలిగ్గా సమాధానం గుర్తించవచ్చు.
కేఎంసీ మినహా మిగతా పరీక్షలన్నీ దాదాపుగా ఎం సెట్ తర్వాతే ఉంటాయి. కాబట్టి ఆయా పరీక్షల సిలబస్‌లో ఉండి, ఎంసెట్‌లో లేని అంశాలపై ఎంసెట్ పరీక్ష తర్వాత దృష్టి సారించడం ప్రయోజనకరం.
 
-బి. రాజేంద్ర, సీనియర్ ఫ్యాకల్టీ.
 
జువాలజీ
గతంలో జాతీయ స్థాయి పరీక్షలకు మన సిలబస్‌కు మధ్య చాలా వ్యత్యాసం ఉండేది. ఎన్‌సీఈఆర్‌టీకి అనుగుణంగా జువాలజీ సిలబస్‌ను మార్చిన తర్వాత కొన్ని అంశాల సిలబస్ ఒకే విధంగా ఉందని చెప్పొచ్చు.
పశ్నించే విధానం, ప్రశ్నల క్లిష్టతలో తేడా ఉంటుంది.
సీనియర్ విద్యార్థులు మన సిలబస్‌కు అదనంగా జాతీయ స్థాయి పరీక్షల్లో అదనంగా ఉన్న అంశాలపై ప్రిపరేషన్‌కు సంబంధించి మొదటి దశ కోసం ప్రస్తుత సమయాన్ని కేటాయించాలి. తర్వాత ఐపీఈ, ఎంసెట్ కోసం సన్నాహాలు సాగించాలి.
ఎంసెట్ తర్వాత జాతీయ స్థాయి పరీక్షలకు ప్రిపరేషన్ సాగించాలి.
జాతీయ స్థాయి పరీక్షలను దృష్టిలో ఉంచుకుని డయాగ్రమ్, అసెర్షన్-రీజనింగ్ ప్రశ్నలను ఎక్కువగా సాధన చేయాలి.
 
-కె.శ్రీనివాసులు, సీనియర్ ఫ్యాకల్టీ.
 
గుర్తుంచుకోవాల్సినవి
జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ ఎంట్రెన్స్‌లు జ్ఞాపకశక్తి కంటే అవగాహనకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
గతంలో సీబీఎస్‌ఈ సిలబస్‌కు మన సిలబస్‌కు మధ్య వ్యత్యాసం ఉండేది. ఇప్పుడు ఆ సమస్య అంతగా లేదు. కాబట్టి జాతీయ స్థాయి పరీక్షలకు ప్రత్యేక ప్రిపరేషన్ అవసరం లేదు. ఆయా పరీక్షలను అనుసరించి సబ్జెక్ట్‌లు కాకుండా అదనంగా ఉండే ఇంగ్లిష్, జీకే అంశాలపై దృష్టి సారిస్తే సరిపోతుంది.
సంబంధిత ఎంట్రెన్స్‌కు సంబంధించి సాధ్యమైనన్ని మాక్ టెస్ట్‌లు రాయాలి. దీని వల్ల సమస్య పరిష్కారంలో వేగంతోపాటు కచ్చితత్వం అలవడుతుంది.
ముఖ్య ఫార్ములాలు, కీలక పాయింట్లపై క్రమ పద్ధతిలో అవగాహన పెంచుకోవడం మంచిది.
సెక్షన్ల వారీగా సమయ విభజన చేసుకోవాలి. విరామం, మైండ్ రిలాక్స్ కోసం 10 నిమిషాలు కేటాయించుకోవాలి. విపరీతమైన పోటీ ఉండే ఈ ఎంట్రెన్స్‌లలో ఈ పద్ధతి ఎంతో లాభం చేకూరుస్తుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
కాన్సెప్ట్ బేస్డ్‌గా ఉండే ప్రశ్నలను ముందు ఎంచుకోండి. వీటి పరిష్కారానికి తక్కువ సమయం పట్టడమే కాకుండా ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. మిగతా విభాగాలను ఆత్మవిశ్వాసంతో చేయడానికి ఇది ఉపకరిస్తుంది.
 
రిఫరెన్స్ బుక్స్:

 
సబ్జెక్ట్‌ల వారీగా ఎన్‌సీఈఆర్‌టీ 11,12 తరగతి పుస్తకాలు,చాంద్ పబ్లికేషన్స్,మల్హోత్ర పబ్లికేషన్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement