ప్రతి మలుపులో గెలుపునకు నైపుణ్యాలు.. | Intermediate, Engineering, Medicine new Course | Sakshi
Sakshi News home page

ప్రతి మలుపులో గెలుపునకు నైపుణ్యాలు..

Published Thu, Jul 10 2014 2:36 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

ప్రతి మలుపులో గెలుపునకు నైపుణ్యాలు.. - Sakshi

ప్రతి మలుపులో గెలుపునకు నైపుణ్యాలు..

ఇంటర్మీడియెట్, ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంసీఏ, ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంఏ.. ఇలా విద్యార్థులు రకరకాల కోర్సుల్లో చేరుతుంటారు. అప్పటివరకు స్కూల్ లేదంటే కాలేజీలో చదివి ఒక్కసారిగా ఉన్నత విద్యా కోర్సులు అందించే కళాశాలల్లో చేరేసరికి గందరగోళంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితి నుంచి గట్టెక్కి క్యాంపస్ లైఫ్‌ను ఉత్సాహంగా ప్రారంభించాలంటే విద్యార్థులు కొన్ని వ్యక్తిగత నైపుణ్యాలను అలవరచుకోవాలి. వీటి సహాయంతో ఒత్తిడిని దరిదాపులకు రానీయకుండా కొత్త వాతావరణంలో త్వరగా, తేలిగ్గా ఇమిడిపోగలరు.వ్యక్తిగత నైపుణ్యాలు తోడుగా
 
 కొత్తగా కాలేజీలోకి అడుగుపెట్టే సరికి వివిధ ప్రాంతాలకు చెందిన, వివిధ రకాల మనస్తత్వాలున్న విద్యార్థులు తారసపడతారు. వారందరితో కలిసిపోయి క్యాంపస్ జీవితాన్ని ఉత్సాహంగా ప్రారంభించాలంటే వ్యక్తిగత లేదా లైఫ్ స్కిల్స్‌ను అలవరచుకోవాలి. వీటి కోసం ప్రత్యేక శిక్షణ అవసరం లేదు. స్వతహాగా ప్రవర్తనా తీరును కొంత మార్చుకుంటే సరిపోతుంది.
 
 ఎదుటి వారు చెప్పిన విషయాలను జాగ్రత్తగా వినడం అనేది ఓ మంచి లైఫ్ స్కిల్. అలాంటప్పుడే వారి భావాలకు అనుగుణంగా మన అభిప్రాయాలను చక్కగా వ్యక్తపరచగలం. మన మాటలు ఎదుటివారిని ఆకట్టుకునేవిగా ఉండాలి. అనవసర పదాలు ఉపయోగించకూడదు.వ్యక్తుల మధ్య సాన్నిహిత్యం పెంచేందుకు చిరునవ్వు ఉపయోగపడుతుంది. ముఖంపై చిరునవ్వును చెదరనివ్వని వారు ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించగలుగుతారు.
 
 ఏదైనా సమస్య ఎదురైనప్పుడు సరిగా ఆలోచించకుండా బెంబేలెత్తిపోకూడదు. అసలు సమస్య ఏమిటి? సమస్య పరిష్కారానికి అందుబాటులో ఉన్న మార్గాలేమిటి? వంటి వాటిని అర్థం చేసుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది.సానుకూల దృక్పథం, ఎదుటి వారి గొప్పతనాన్ని అభినందించే గుణం, ఒత్తిడిని జయించడం వంటి నైపుణ్యాలను పెంపొందించుకుంటే కాలేజీ క్యాంపస్ లైఫ్‌లో ఎదురే ఉండదు.
 
 బిడియం వద్దు:
 కాలేజీ క్యాంపస్‌లోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో చేరిన కోర్సు, హాస్టల్, క్యాంపస్ క్లబ్‌లు, సౌకర్యాలు ఇలా వివిధ అంశాలకు సంబంధించి రకరకాల సందేహాలు వస్తాయి. వీటిని నివృత్తి చేసుకునేందుకు వెనకడుగు వేయకూడదు. బిడియం లేకుండా లెక్చరర్లు, సీనియర్లను సంప్రదించి తెలియని విషయాన్ని తెలుసుకోవాలి. అప్పుడే తేలిగ్గా కాలేజీ వాతావరణానికి అలవాటుపడగలరు. ఎవరో ఏదో అనుకుంటారని అనుమానాలను నివృత్తి చేసుకోకుండా ఉండిపోతే అవి దీర్ఘకాలంలో కెరీర్‌కు అడ్డంకులుగా మారతాయన్న విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి.
 
 స్నేహితుల విషయంలో జాగ్రత్త:
 విద్యార్థి జీవితంలో చెడిపోవాలన్నా, బాగుపడాలన్నా స్నేహితులే కారణం. అందువల్ల స్నేహితుల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యహరించాలి. స్నేహాలు ఉన్నతికి ఉపయోగపడేలా, సన్మార్గానికి దారితీసేలా ఉండాలి. కాలేజీలో ఉన్న స్పోర్ట్స్ క్లబ్‌లు, సైన్స్ క్లబ్‌లు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ వంటి వాటి గురించి తెలుసుకొని విద్యార్థులు తమకిష్టమైన వాటిలో చేరడం ద్వారా బృంద స్ఫూర్తి, సమస్య పరిష్కార నైపుణ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఇవి కాలేజీలో కోర్సును దిగ్విజయంగా పూర్తిచేసేందుకు, ఆ తర్వాత మంచి కెరీర్‌లో స్థిరపడేందుకు ఉపయోగపడతాయి.
 
  తల్లిదండ్రులు ఇచ్చే డబ్బును సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలోనూ, టైం మేనేజ్‌మెంట్‌లోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ఎవరినైనా ఇట్టే ఆకట్టుకునేలా ఆహార్యం ఉండాలి. దీనికోసం స్వీయ డ్రెస్ కోడ్ పాటించడం మంచిది. కాలేజీలో అడుగుపెట్టిన తొలిరోజు నుంచి మొదలయ్యే డ్రెస్ కోడ్ ప్రాధాన్యత జాబ్ ఇంటర్వ్యూల వరకు కొనసాగుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. క్రమశిక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడకూడదు. క్రమశిక్షణ అనేది గొప్ప అద్భుతాలకు బాటలు వేస్తుందన్న విషయాన్ని మరచిపోకూడదు.
 
 కోర్సే కేంద్రంగా:
 ఉన్నత విద్యా కోర్సుల్లో కరిక్యులం భిన్నంగా, లోతుగా ఉంటుంది. అందువల్ల కళాశాలలో అడుగుపెట్టిన తర్వాత రెండు, మూడు వారాలను మాత్రమే తోటి విద్యార్థులు, ఫ్యాకల్టీతో పరిచయాలకు కేటాయించాలి. తర్వాత దృష్టంతా చేరిన కోర్సుపైనే కేంద్రీకరించాలి. తొలుత కరిక్యులం మొత్తాన్ని పరిశీలించాలి. సీనియర్లు, ఫ్యాకల్టీ సహాయంతో అవగాహన పెంపొందించుకోవాలి. దీనివల్ల కోర్సుపై పట్టు సాధించేందుకు వీలవుతుంది.
 
 కమ్యూనికేషన్ స్కిల్స్
 ఆలోచనల కూర్పు.. వినే ఓర్పు.. పలికే నేర్పుల సమాహారమే సంభాషణ. కోర్సును దిగ్విజయంగా పూర్తిచేయడానికి, తర్వాత కెరీర్‌లో సుస్థిర స్థానం సంపాదించడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం. అకడమిక్ స్కిల్స్ బాగున్నా, సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే కెరీర్‌లో వెనక వరుసలో ఉండాల్సి వస్తుంది. కేవలం గ్రామీణ ప్రాంత విద్యార్థులేగాక సిటీ నేపథ్యంలో విద్యాభ్యాసం సాగించిన వారు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల కాలేజీలో అడుగుపెట్టినప్పటి నుంచి ఈ స్కిల్స్ పెంపొందించుకోవడంపై దృష్టిసారించాలి. ప్రస్తుతం కమ్యూనికేషన్‌లో ఇంగ్లిష్ కీలక పాత్ర పోషిస్తోంది. అందువల్ల ఇంగ్లిష్ చానళ్లను వీక్షించడం, ఆంగ్ల దినపత్రికలను చదవడం చేయాలి. రైటింగ్, ప్రెజెంటేషన్ స్కిల్స్ పెంచుకునే దిశగా కూడా విద్యార్థులు ప్రయత్నించాలి. ప్రొఫెషనల్ స్టడీస్‌లో మంచి అకడమిక్ రికార్డు సాధించడంలో ఈ రెండు స్కిల్స్ ప్రధానపాత్ర పోషిస్తాయి. కేస్ స్టడీలు రాయడం, ప్రాజెక్ట్ రిపోర్టులు రూపొందించడంలో రైటింగ్ స్కిల్స్ కీలకమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తరగతి గదిలో వచ్చిన సందేహాలను నివృత్తి చేసుకునేందుకు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉపయోగపడతాయి.
 
 పోటీతత్వం అవసరం
 విద్యార్థులు ఆహ్లాదకరమైన పోటీతత్వాన్ని అలవరచుకోవాలి. కాలేజీల్లో నిర్వహించే వివిధ పోటీల్లో పాల్గొనాలి. కోర్సు పూర్తయిన తర్వాత ఎదుర్కోబోయే పోటీ పరీక్షలకు అవసరమైన అంశాలను నేర్చుకోవాలి. జీకే, గ్రూప్ డిస్కషన్, జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, కంప్యూటర్ నాలెడ్జ్‌పై అవగాహన పెంపొందించుకోవాలి. జాబ్ మార్కెట్‌లో వస్తున్న మార్పులను నిశితంగా పరిశీలించాలి. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఇది ఎంతో అవసరం. విద్యార్థులు సంబంధిత కోర్సులతో ముడిపడిన మేగజైన్లను, పత్రికలను చదవాలి. దీనికి కాలేజీ లైబ్రరీని ఉపయోగించుకోవాలి.
 
 మేనేజ్‌మెంట్ విద్యార్థులైతే.. అనలిటికల్ స్కిల్స్ పెంచుకోవడానికి కృషి చేయాలి. మార్కెట్లో లభించే పలు బిజినెస్ మేగజీన్లను చదవాలి. వాటిలో ప్రచురించే కేస్ స్టడీలను చదివితే బిజినెస్ రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులు, కెరీర్‌లో రాణించడానికి ఉపయోగపడే మార్గాలపై స్పష్టత ఏర్పడుతుంది.
 
 విద్యార్థులు గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇలా ఏ కోర్సులో సీటు సంపాదించినా కాలేజీలోకి అడుగుపెట్టిన తొలిరోజు నుంచే మంచి భవిష్యత్తు జీవితానికి పునాదులు వేసుకోవాలి.
 
 కాలేజీ తొలి రోజుల్లో అంతా కొత్తగా ఉంటుంది. ఇలాంటి సమయంలో టీచింగ్ స్టాఫ్ మార్గదర్శకత్వంతో క్యాంపస్ జీవితానికి అలవాటు పడాలి.
 
 చెడు స్నేహాలకు దూరంగా ఉంటూ స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకొని, వాటిని చేరుకునే దిశగా శ్రమించాలి.
 
 ఒకవైపు చేరిన కోర్సులో పట్టు సాధించేందుకు కృషి చేస్తూ, మరోవైపు పోటీ పరీక్షలపై దృష్టిసారించాలి. ఉన్నత కెరీర్‌లో స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు అవసరమైన నైపుణ్యాలను అలవరచుకోవాలి.
 
 కీలకమైన కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం సంపాదించేందుకు ప్రయత్నించాలి. స్వీయ క్రమశిక్షణ గొప్ప అద్భుతాలకు బాటలు వేస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకొని అందుకు అనుగుణంగా విద్యార్థులు కాలేజీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి.
 
 ఇంజనీరింగ్
 
 ఇంజనీరింగ్ ఔత్సాహిక విద్యార్థులు ప్రస్తుత జాబ్ మార్కెట్లోని అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు ఎంతో అవసరం. అందువల్ల కోర్సులో చేరిన మొదటి రోజు నుంచే నైపుణ్యాల సాధనకు శ్రమించాలి. నైపుణ్యాలను సముపార్జించడం అనేది ఒక్క రోజులోనే సాధ్యమయ్యే పని కాదు. ఇది నిరంతరం సాగే ప్రక్రియ. ఈ క్రమంలో కమ్యూనికేషన్ స్కిల్స్, ఆర్గనైజింగ్ స్కిల్స్, బృందంగా కలిసి పనిచేసే నైపుణ్యం వంటి వాటిని పెంపొందించుకునేందుకు కాలేజీని వేదికగా చేసుకోవాలి.
 
 ప్రాక్టికల్ పరిజ్ఞానం:
 ఇంజనీరింగ్ విద్యలో లేబొరేటరీలది కీలక పాత్ర. ఎందుకంటే ఇంజనీరింగ్ ప్రాక్టికల్ ఆధారిత సబ్జెక్టు. తరగతి గదిలో చెప్పిన అంశాన్ని, ప్రాక్టికల్స్‌గా చేస్తేనే దానికి విలువ ఉంటుంది. అందువల్ల లేబొరేటరీల్లో ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. దీనివల్ల బేసిక్స్‌పై సులువుగా పట్టు సాధించవచ్చు.
 
 ఇచ్చిపుచ్చుకునే ధోరణి:
 ఇంజనీరింగ్‌లో సిలబస్ విస్తృత స్థాయిలో ఉంటుంది. మార్కుల కంటే పరిజ్ఞానానికి ప్రాధాన్యం ఉంటుంది. అందువల్ల ఇంటర్మీడియెట్ మాదిరిగా వ్యక్తిగతంగా నేర్చుకునే పద్ధతి (ఐఛీజీఠిజీఛీఠ్చ ్ఛ్చటజీజ)కి పరిమితం కాకూడదు. బృంద అభ్యసన (ఎటౌఠఞ ఔ్ఛ్చటజీజ) కూడా అవసరం. చర్చించడం వల్ల వివిధ సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. ఎక్కువ విషయాలను నేర్చుకోవడానికి వీలవుతుంది. అవసరమైతే సీనియర్లు, లెక్చరర్ల సలహాలు తీసుకోవాలి. వీలైనంత వరకు జ్ఞానాన్ని పంచుకునేందుకు (ఓౌఠ్ఛీఛీజ్ఛ జ్చిటజీజ)కు ప్రాధాన్యం ఇవ్వాలి.
 
 సందేహాల నివృత్తి:
 ఇంజనీరింగ్‌లో విద్యార్థి అలవరచుకోవాల్సిన మరో లక్షణం.. ప్రశ్నించే తత్వం. చదివే క్రమంలో వచ్చిన సందేహాలను ఎప్పటికప్పుడు లెక్చరర్లు, సీనియర్ల సహాయంతో నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే కొత్త ఉత్సాహంతో ముందుకెళ్లి సబ్జెక్టుపై పట్టుసాధించేందుకు వీలవుతుంది. లేదంటే ఆ సందేహాల పుట్ట అభ్యసనానికి ఆటంకం కలిగిస్తుంది. చదవడంపై అనాసక్తిని ఏర్పరుస్తుంది.
 
 ఎప్పటిది అప్పుడే!
 ప్రస్తుతం కంపెనీలు ఎలాంటి బ్యాక్‌లాగ్స్ లేని విద్యార్థులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నాయి. అందువల్ల మొదటి సంవత్సరం నుంచి ఏ సంవత్సరానికి సంబంధించిన పరీక్షలను ఆ సంవత్సరంలోనే మొదటి ప్రయత్నంలో పూర్తి చేయాలి. కనీస మార్కులతో ఉత్తీర్ణత అనే భావన నుంచి బయటపడి 80 నుంచి 85 శాతం మార్కుల సాధనకు కృషిచేయాలి.
 
 నోట్స్ తయారీ:
 ఇంజనీరింగ్‌లో సొంతంగా నోట్స్‌ను రూపొందించుకునే నైపుణ్యాన్ని అలవరచుకోవాలి. దీనికోసం కాలేజీ గ్రంథాలయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ఒక సబ్జెక్టుకు సంబంధించి అందుబాటులో ఉన్న పుస్తకాలను పరిశీలించి నోట్స్ తయారు చేసుకోవాలి. ఇంటర్నెట్, ఆన్‌లైన్ బ్లాగ్‌లను కూడా నోట్స్ తయారీకి ఉపయోగించుకోవచ్చు. నోట్స్‌లను ప్రభావవంతంగా వినియోగించుకోవాలి.
 
 పోటీ ప్రపంచంలో ముందుండాలంటే?
 ప్రస్తుతం కంపెనీలు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు(రాయడం, మాట్లాడటం), జట్టుగా పనిచేసే సామర్థ్యం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తున్నాయి. ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్ సముపార్జనకు ఆ్చటటౌ’ట జీఆర్‌ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. బృంద చర్చ, బృంద కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంచుకోవచ్చు. పాఠ్యేతర కార్యక్రమాలు (Extra curricular activities)లో పాల్గొనడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. వివిధ రకాల ఈవెంట్లు, టెక్నికల్ ఫెస్టివల్స్ నిర్వహించడం ద్వారా ఆర్గనైజింగ్ స్కిల్స్, జట్టుగా పని చేసే నైపుణ్యం అలవడుతుంది. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో విజయం సాధించేందుకు చివర్లో ఆదరాబాదరాగా సిద్ధమవడం కాకుండా ముందుగానే వెర్బల్ ఎబిలిటీ,
 
  లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జీడీలపై దృష్టిసారించాలి. ఇప్పుడు బహుళ జాతి సంస్థల్లో కెరీర్‌ను సుస్థిరం చేసుకోవాలనుకునే వారు ఫ్రెంచ్, స్పానిష్ తదితర భాషల్లో ఏదో ఒకదాన్ని నేర్చుకోవాలి. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికీ ఇవి ఉపయోగపడతాయి. ఉదాహరణకు మెకానికల్ ఇంజనీరింగ్‌లో పై చదువులకు జర్మనీ ఉత్తమ కేంద్రంగా ఉంది. అందువల్ల ఆ దేశానికి వెళ్లాలనుకునే వారు జర్మన్ భాషను నేర్చుకుంటే మంచిది. కంప్యూటర్‌కు సంబంధించి సీ లాంగ్వేజ్‌ను కాలేజీలో ఎలాగూ నేర్పుతారు కాబట్టి దీనికి అదనంగా బయట మార్కెట్లో జావాను కూడా నేర్చుకుంటే అదనపు ప్రయోజనం ఉంటుంది.
 - వి.ఉమామహేశ్వర్, ప్లేస్‌మెంట్ ఆఫీసర్, ఓయూ.
 
 ఇంటర్మీడియెట్
 ఇంజనీరింగ్ దిశగా కెరీర్‌ను మలచుకోవాలనుకునే వారు ఇంటర్ ఎంపీసీలో చేరుతారు. ఇందులో రాణించాలంటే గణితం పట్ల బాగా ఆసక్తి, ఒక అంశాన్ని వేగంగా అన్వయించే నైపుణ్యాలు అవసరం. ఇంటర్మీడియెట్ తర్వాత ఇంజనీరింగ్‌తోపాటు అనేక అవకాశాలు ఎంపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. నచ్చిన కాలేజీలో మెచ్చిన బ్రాంచ్‌లో సీటు సంపాదించాలంటే ప్రణాళిక ప్రకారం కష్టపడాలి. పరిశోధనలంటే బాగా ఆసక్తి ఉండి, వృక్ష, జీవశాస్త్ర సబ్జెక్టులపై ఇష్టం ఉన్నవారికి సరిపడే గ్రూప్ బైపీసీ. బైపీసీ సిలబస్ విస్తృతంగా ఉంటుంది కాబట్టి కష్టపడి చదివే తత్వం ఉండాలి. ఈ గ్రూప్‌లో ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం ఉం టుంది. అందువల్ల ఎప్పటికప్పుడు చదివిన అంశాన్ని ప్రయోగశాలలో పరిశీలించే విధంగా సన్నద్ధత కూడా అవసరం. బైపీసీ తర్వాత ఎంసెట్, ఎయిమ్స్, జిప్‌మర్ తదితర పరీక్షల్లో మంచి ఫలితాలు రావాలంటే కాలేజీలో చేరిన మొదటి రోజు నుంచే ఆ దిశగా కృషి చేయాలి. సమస్య పరిష్కార నైపుణ్యాలు, అనలిటికల్ నైపుణ్యాలు వంటి వాటిని అలవర్చుకోవాలి.
 
 ఎంపీసీ
 మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో ముఖ్యమైన కాన్సెప్ట్స్ (భావనలు)ను నేర్చుకుంటూ, అప్లికేషన్ ఓరియెంటేషన్ (అనువర్తిత పద్ధతి)లో అధ్యయనం చేయాలి. కాన్సెప్ట్‌ను నిర్వచించడం.. విశ్లేషించడం.. అనువర్తించడం విధానంలో చదవాలి.అకాడమీ పుస్తకాలు, కాలేజీ మెటీరియల్‌ను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఎవరో ఏదో చెప్పారని రకరకాల పుస్తకాలు చదవడం మంచిది కాదు. ప్రణాళిక ప్రకారం ఏ రోజు చదవాల్సిన అంశాలను ఆ రోజే చదవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకూడదు. అలా చేస్తే మున్ముందు ఒత్తిడి ఏర్పడుతుంది.
 
 మూడు సబ్జెక్టుల్లో ప్రతి చాప్టర్‌కు సంబంధించి ముఖ్యమైన సినాప్సిస్‌ను రూపొందించుకొని బాగా చదవాలి. ప్రతి పాఠంలో ఉన్న సమస్యలను.. సంబంధిత సూత్రాల సహాయంతో పరిష్కరించాలి. అవసరానికి తగ్గట్లు టిప్స్, షార్ట్‌కట్స్‌ను ఉపయోగించాలి.మొదటి ఏడాదిలోనే లాంగ్ ఆన్సర్, వెరీషార్ట్ ఆన్సర్, షార్ట్ ఆన్సర్ ప్రశ్నలతోపాటే బహుళైచ్ఛిక ప్రశ్నలపై కూడా దృష్టి సారించాలి.వారంలో వీలైన న్ని మాదిరి పరీక్షలు రాయాలి. అదేవిధంగా వారానికి ఒక గ్రాండ్ టెస్ట్‌ను రాయాలి.
 - ఎంఎన్ రావు, సీనియర్ ఫ్యాకల్టీ
 
 బైపీసీ
 విద్యార్థులు పటాలపై ఎక్కువ దృష్టిసారించాలి. వీలైనన్ని ఎక్కువ సార్లు సాధన చేసి, భాగాలను గుర్తుంచుకోవాలి. పాఠ్యాంశాల గురించి తోటి విద్యార్థులతో చర్చించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పరోక్షంగా పునశ్చరణ జరుగుతుంది. ప్రతి యూనిట్‌లోనూ అతి స్వల్ప సమాధాన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొని రాయటాన్ని అలవర్చుకోవాలి. స్వల్ప, దీర్ఘ సమాధాన ప్రశ్నలకు సమాధానాలను సమయ పాలన పాటిస్తూ అభ్యసించాలి. ప్రతి యూనిట్ పారిభాషిక పదకోశంలోని పదాల నిర్వచనాలను అధ్యయనం చేయాలి. ఇలా చేస్తే అతి స్వల్ప సమాధాన పశ్నలకు సరైన సమాధానాలు రాయడానికి, ఎంసెట్ వంటి పరీక్షలకు ఉపయోగపడుతుంది. ఒకే రకమైన సమాధానాన్ని వివరణాత్మకంగా, క్లుప్తంగా రాయగలిగే నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. తెలుగు అకాడమీ పుస్తకాల నుంచే ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి వాటిలోని అంశాలను విశ్లేషణాత్మకంగా చదవాలి. వివిధ సాంకేతిక పదాలను, సారాంశాలను వీలైనన్ని సార్లు పునశ్చరణ చేయాలి.
 - కె.శ్రీనివాసరావు, సీనియర్ ఫ్యాకల్టీ
 
 మెడిసిన్
 క్లినికల్ స్కిల్స్ ప్రధానంప్రస్తుత పరిస్థితుల్లో ఎంబీబీఎస్ తర్వాత ఆసక్తి ఉన్న స్పెషాలిటీ కోర్సులో పీజీ చేయాలి. సూపర్ స్పెషాలిటీ చేస్తే మరీ మంచిది. అప్పుడే వైద్య రంగంలో సమర్థుడైన డాక్టర్‌గా పేరు తెచ్చుకునేందుకు వీలుంటుంది. ఎంబీబీఎస్ చివరి సంవత్సరం మొదట్నుంచి పీజీ పోటీ పరీక్ష కోసం సిద్ధమవాలి. ఇష్టమైన స్పెషాలిటీ సబ్జెక్టులను మాత్రమే కాకుండా అన్ని సబ్జెక్టుల్లోనూ పరిజ్ఞానం పెంచుకోవాలి.
 వైద్యునికి కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రధానం. రోగి తాలూకు క్లినికల్ హిస్టరీ తెలుసుకోవాలంటే ఈ స్కిల్స్ తప్పనిసరి. అప్పుడే వ్యాధి నిర్ధారణ కచ్చితంగా జరుగుతుంది. మెరుగైన చికిత్సను అందించేందుకు వీలవుతుంది. రోగికి ధైర్యం చెప్పడంలోనూ కమ్యూనికేషన్ స్కిల్స్ కీలక పాత్ర పోషిస్తాయి.
 
 వైద్య విద్యలో అన్ని సబ్జెక్టులూ క్లిష్టంగానే ఉంటాయి. వీటిపై పట్టు సాధించేందుకు ఇష్టపడుతూ కష్టపడి చదవడం ఒక్కటే మార్గం. ఎలాంటి దగ్గరి దారులూ లేవు. ఎంబీబీఎస్ మొదటి ఏడాదిలో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ సబ్జెక్టులుంటాయి. తరగతులకు క్రమం తప్పకుండా హాజరుకావాలి. పరీక్షలకు రెండు నెలల ముందే సిలబస్ పూర్తిచేసి, తర్వాత పునశ్చరణ చేయాలి. ఏ విషయాన్ని చదువుతున్నా సమగ్రత అవసరం. జీవితాంతం గుర్తుండిపోయేలా వివిధ అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి.
 హౌస్ సర్జెన్సీ ద్వారా రోగులను స్వయంగా కలిసే అవకాశం లభిస్తుంది.
 
  అప్పటి వరకు చదివిన అకడెమిక్ సబ్జెక్టులను ప్రాక్టికల్‌గా అన్వయించేందుకు వీలుకల్పిస్తుంది. ఈ దశ నుంచే అంకితభావాన్ని అలవరచుకోవాలి. క్లినికల్ స్కిల్స్ సంపాదించడానికి హౌస్ సర్జెన్సీ చాలా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు రోగికి ఐవీ పెట్టడం, శ్వాసకోశనాళంలో ట్యూబ్ పెట్టడం, బేసిక్ లైఫ్ సపోర్టు (ఫస్ట్ ఎయిడ్) అందించడం, గుండెపోటు వచ్చినప్పుడు రోగికి తక్షణం అందించాల్సిన సేవలు వంటివి హౌస్ సర్జెన్సీలోనే నేర్చుకుంటారు. వైద్య వృత్తిలో క్లినికల్ స్కిల్స్ చాలా అవసరం. ఒక డాక్టర్‌గా ఓ రోగి రోగ నిర్ధరణ చేయడంలో టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తోంది. అందువల్ల ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న వైద్య సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవాలి.
 
 - డాక్టర్ ఎ.కృష్ణమూర్తి, ప్రిన్సిపాల్,
 సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement