మొదటగా ఏ రంగంలో తమ పిల్లలకు ఆసక్తి ఉందో గమనించి ఆ దిశగా ప్రోత్సహించాలి. ఇంజనీరింగ్‌లో ఎన్నో బ్రాంచ్‌లు ఉన్నాయి. పిల్లల భవిష్యత్తుకు బాసటగా నిలిచే తల్లిదండ్రులకు వీటిపై అవగాహన అవసరం. విద్యార్థులు తమ అభిరుచి, వ్యక్తిగత సామర్థ్యం ఆధారంగా బ్రాంచ్‌ను ఎంపిక చేసుకోవాలి.
ముందే నిర్ణయించుకోవాలి
కాలేజీ కంటే బ్రాంచ్‌కే ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేర్చుకున్న ఈ విద్యే జీవితాంతం ఉంటుంది. భారతదేశంలో ఇంజనీర్లకు సంబంధించి ఒక చతురోక్తి ఉంది. దేశంలోని కొందరు విద్యార్థులు... ముందు ఇంజనీర్లుగా తయారయ్యాక తమకెందులో ఆసక్తి ఉంటుందో ఆ రంగంవైపు నడుస్తున్నారట! ఇలా ఏదో ఒక డిగ్రీ కోసం కాకుండా ఆసక్తితో ముందుకుసాగడం ద్వారా జీవితాంతం అదే రంగంలో కొనసాగవచ్చు. స్నేహితులు చేరుతున్నారనో.. తల్లిదండ్రులు చెప్పారనో బ్రాంచ్‌ను ఎంపిక చేసుకోవద్దు. ఆసక్తితో, ఇష్టంతో చేసే పనివల్ల కష్టమనిపించదు. అందువల్ల మంచి ఫలితాలు వస్తాయి. వారి భవిష్యత్తు బాగుంటుంది. ప్రణాళికతోపాటు స్పష్టమైన అవగాహనతో కార్యాచరణ ఉన్నవారికి ఆకాశమే హద్దు అవుతుంది. ఉన్నత విద్య, కోర్సు పూర్తయ్యాక లభించే ఉద్యోగావకాశాలను కూడా పరిగణనలోకి తీసుకొని బ్రాంచ్‌ను ఎంపిక చేసుకోవాలి.
మంచి కళాశాల ఎంపిక
బ్రాంచ్ ఎంపిక తర్వాత ప్రధానమైన అంశం.. మంచి కళాశాల ఎంపిక. ఇందుకోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కొంత కసరత్తు చేయాలి. కాలేజీ అంటే మంచి బిల్డింగులు, అనేక మౌలిక వసతులు ఉండటమే కాదు. నాణ్యమైన విద్య ను అందించగలగాలి. వీటన్నిటినీ బేరీజు వేసుకుంటూ కళాశాల ఎలా ఉందనే విషయాన్ని వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవాలి. కళాశాల మౌలికవసతులతో పాటు అధ్యాపక బృం దం గురించి, ప్లేస్‌మెంట్స్‌పై అవగాహన పెంచుకోవాలి.
మౌలికవసతులు
వెబ్‌సైట్లలో కళాశాల వివరాలు చూసి అందులో ప్రవేశించాలనుకున్నప్పుడు నేరుగా వెళ్లి అక్కడి పరిసరాలను గమనించడం ముఖ్యం. ల్యాబ్, లైబ్రరీ, సెమినార్ హాల్స్, టీచింగ్ టూల్స్.. ఇలా ప్రతి విషయాన్ని నిశితంగా గమనించాలి. ముఖ్యంగా తాము చేరాలనుకుంటున్న బ్రాంచ్‌కు సంబంధించిన ల్యాబ్‌లో సదుపాయాలు ఎలా ఉన్నాయనే దానిపై అవగాహన పెంచుకోవాలి. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిబంధనల ప్రకారమే ఆ కళాశాలలో సదుపాయాలు ఉన్నాయా? లేవా? అనేది చూడాలి.
కమ్యూనికేషన్ ల్యాబ్స్
ఏటా లక్షల్లో ఇంజనీరింగ్ విద్యార్థులు కాలేజీల నుంచి బయటకు వస్తున్నప్పటికీ.. కనీసం అందులో 20 శాతం మందికి కూడా ఉద్యోగాలు లభించడం లేదని పలు సర్వేలు చెబుతున్నాయి. చాలా మంది కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్ లేక జాబ్ మార్కెట్లో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల తాము ఎంపిక చేసుకున్న కాలేజీలో కమ్యూనికేషన్ ల్యాబ్స్ ఎలా ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవాలి. ఫొనెటిక్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ల్యాబ్స్ ఉన్నాయో లేదో చూడాలి. వాటిలో ఎలా శిక్షణ ఇస్తున్నారనే విషయాన్ని తెలుసుకోవాలి. శిక్షణలో ఎలాంటి కమ్యూనికేషన్ టూల్స్ ఉపయోగిస్తున్నారో చూస్తే ల్యాబ్‌లో నాణ్యతగల విద్యపై అవగాహన ఏర్పడుతుంది.
శిక్షణ.. ప్లేస్‌మెంట్స్..
విద్యార్థులు ముఖ్యంగా మూడు అంశాలపై దృష్టిసారించాలి. అకడమిక్ విద్య ఎలా ఉంటుంది? ఎలాంటి శిక్షణ అందిస్తున్నారు? ఇన్‌స్టిట్యూట్‌కు ఏ పరిశ్రమలతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? ఈ మూడు అంశాలే విద్యార్థి భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తాయి. భావి జీవితంలో ముఖ్యంగా ఉద్యోగమే విద్యార్థికి లక్ష్యంగా ఉంటుంది. అందుకే మౌలిక వసతులతోపాటు ప్లేస్‌మెంట్స్ సదుపాయం ఎలా ఉందనే దానిపై స్పష్టమైన అవగాహన అవసరం. ఏ ఏ సంస్థలు అక్కడి విద్యార్థులకు ప్లేస్‌మెంట్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి? ఇంటర్న్‌షిప్స్ ఎలాంటి సంస్థల్లో ఉంటున్నాయి? తయారీ, సేవా రంగాల నుంచి ఎలాంటి సంస్థలు ఇన్‌స్టిట్యూట్‌ను సంప్రదిస్తున్నాయి? ఇలాంటి విషయాలను తెలుసుకోవడం ద్వారా ఉద్యోగ భద్రతపై అవగాహన ఏర్పడుతుంది.
బోధనా సిబ్బంది
ఒక సంస్థకు బోధనాసిబ్బంది కీలకం. సరైన ఫ్యాకల్టీ లేకపోతే ఎన్ని మౌలిక సదుపాయాలు ఉన్నా ఉపయోగం ఉండదు. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు ఎంతమంది ఉన్నారో, ఎందరు డాక్టరేట్లు ఉన్నారో తెలుసుకోవాలి. ముఖ్యంగా స్టూడెంట్, టీచర్ నిష్పత్తి ఎలా ఉందో గమనించాలి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అక్కడి అకడెమిక్ క్యాలెండర్ల గురించి అడిగి, వాళ్లు వాటిని ఎలా నిర్వహిస్తున్నారో తెలుసుకోవాలి. ఒకవేళ కన్సార్షియం (కన్సార్షియంలో బోధనాసిబ్బంది ఒక ఇన్‌స్టిట్యూట్ నుంచి మరో ఇన్‌స్టిట్యూట్‌కు లెక్చర్స్ ఇచ్చేందుకు వెళ్తుంటారు) కాలేజీలయితే బోధనాసిబ్బంది గురించి ఆరా తీయాలి.
అక్రెడిటేషన్
ఒక సంస్థకు ప్రభుత్వ గుర్తింపు చాలా అవసరం. అఫ్లియేషన్, అక్రెడిటేషన్ ద్వారా సంస్థకు ఉన్న గుర్తింపు గురించి తెలుస్తుంది. యూనివర్సిటీ, ఏఐసీటీఈ అఫ్లియేషన్ల గురించి తెలుసుకోవాలి. కొన్ని సంస్థలు బెస్ట్ స్కూల్స్/ఇన్‌స్టిట్యూట్‌లపై సర్వే చేస్తాయి. ఆ సర్వేలో సదరు కాలేజీ ఏ ర్యాంకులో ఉందో తెలుసుకోవచ్చు. ఇన్‌స్టిట్యూట్‌లకు అవార్డులు వస్తాయి. అలాంటివేమైనా ఉన్నాయా అనే విషయాన్ని మేనేజ్‌మెంట్‌ను అడిగి తెలుసుకోవాలి. ఇన్‌స్టిట్యూట్‌లకు న్యాక్ నుంచి స్టార్ట్ వాల్యూస్ వస్తాయి. అలాంటి ర్యాంకులు ఆ కాలేజీకి వచ్చాయేమో చూడాలి.
పరిశ్రమతో అనుసంధానం
ఇన్‌స్టిట్యూట్‌లు తమ విద్యార్థులకు ఇచ్చే ఇంజనీరింగ్ సర్టిఫికెట్ ద్వారా ఎలాంటి ప్రయోజనం చేకూరదు. మంచి కెరీర్ లభించాలంటే పారిశ్రామిక అవసరాలకు తగినట్లు స్కిల్స్ పెంపొందించుకోవాడం కూడా అవసరమే. ఇలాంటి నైపుణ్యాలను అందించేందుకు ప్రయత్నిస్తున్న కాలేజీని ఎంపిక చేసుకోవాలి. పరిశ్రమతో అనుసంధానం ఉన్న వాటికి ప్రాధాన్యమివ్వాలి. ప్రాజెక్టువర్క్, సమ్మర్ ఇంటర్న్‌షిప్స్, సెమినార్స్, గెస్ట్ లెక్చర్స్.. వీటన్నిటిపై సమగ్ర సమాచారం సేకరించాలి. ఆయా సంస్థలతో ఎలాంటి అనుబంధం ఉంటుందో తెలుసుకోవాలి. ఈ అంశాల ద్వారా కళాశాలపై ఒక అవగాహన వస్తుంది.
కెమికల్ ఇంజనీరింగ్
సిరామిక్స్, ఇంధనాలు, పెట్రోకెమికల్స్, ఎరువులు, ప్లాస్టిక్స్, పేలుడు పదార్థాలు వంటి ఉత్పత్తుల తయారీలో కెమికల్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. కెమికల్ ప్లాంట్ల నిర్వహణ, రసాయన ముడిపదార్థాలను పెద్ద ఎత్తున వినియోగ వస్తువులుగా మార్చే ప్రాసెసింగ్ విధానం వంటివి ఈ ఇంజనీరింగ్ పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రసాయన అమ్మకాలు 3.4 ట్రిలియన్ డాలర్లు. పెట్రోలు, రసాయన, పెట్రోకెమ్ పెట్టుబడులను ప్రోత్సహించడానికి ప్రత్యేక ఆర్థిక మండళ్లకు రూపకల్పన జరుగుతున్న తరుణంలో వచ్చే పదేళ్లలో భారతదేశానికి 14 వేల మంది కెమికల్ ఇంజనీర్లు అవసరం. దీని అనుబంధ రంగాలను కలుపుకుంటే వచ్చే ఎనిమిదేళ్లలో 1.9 మిలియన్ల ఉద్యోగుల అవసరం ఏర్పడనుంది. కోర్ సబ్జెక్టులు: కెమికల్ ప్రాసెస్ ప్రిన్సిపుల్స్, ఇనార్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫ్లూయిడ్ అండ్ పార్టికల్ మెకానిక్స్, కెమికల్ ఇంజనీరింగ్, థర్మోడైనమిక్స్, ప్రాసెస్ డైనమిక్స్ అండ్ కంట్రోల్, బయో కెమికల్ ఇంజనీరింగ్.
విధులు, నైపుణ్యాలు: రసాయనాలపై ఆసక్తి అవసరం. వివిధ రకాల ఆర్గానిక్, ఇనార్గానిక్ రసాయనాలతో పనిచేయగల నేర్పు ఉండాలి. డిస్టిలేషన్ కాలమ్స్, ఎవాపరేటర్స్, హీట్ ఎక్స్ఛేంజర్స్, రియాక్టర్లు, పంపులు, వాల్వ్‌లు, ఇంకా ఇతర క్లిష్టమైన ఆపరేషన్లలో పాల్గొనాల్సి ఉంటుంది. పరిశోధన, ఉత్పత్తులను మిళితం చేసి ఫలితాలను విశ్లేషణ చేసేందుకు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా అవసరం.కెరీర్: ఫుడ్ ప్రాసెసింగ్, మినరల్ ప్రాసెసింగ్, ఎక్స్‌ప్లోజివ్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫెర్టిలైజర్ పరిశ్రమలు, పెయింట్లు, డైలు, ల్యూబ్రికెంట్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు అనేకం. ఐఓసీఎల్, ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్, బార్క్, డీఆర్‌డీఓ, ఇస్రో, సీఎస్‌ఐఆర్ ల్యాబ్స్, ఎన్‌పీసీఎల్, బీపీసీఎల్, ఆర్‌ఐఎల్, హిందుస్థాన్ ఫోటో ఫిల్మ్స్, ర్యాలీస్, బీఏఎస్‌ఎఫ్, నాల్కో, బాల్కో, సెయిల్, ఈఐఎల్ వంటివి టాప్ రిక్రూటర్స్.
ఏరోనాటికల్ ఇంజనీరింగ్
విమాన పరిశ్రమకు ఉపయోగపడే ప్రత్యేక ఇంజనీరింగ్ బ్రాంచ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. విమానాలు, ఇతర స్పేస్ వెహికల్స్‌కు సంబంధించి అధ్యయనం, డిజైనింగ్, నిర్మాణం తదితరాలకు సంబంధించిన విభాగమిది. భారత ప్రభుత్వ సంస్థ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్).. ప్రపంచంలోని టాప్ 100 ఏరోస్పేస్ కంపెనీల్లో 38వ స్థానంలో ఉంది. ఇస్రో అంతరిక్ష యాత్రల్లో ఇది కీలక పాత్ర పోషించనుంది. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ప్రకారం భారత ఎయిర్‌క్రాఫ్ట్ ఎంఆర్‌వో (నిర్వహణ, మరమ్మతులు, సమగ్ర పరిశీలన) రంగం 2020 నాటికి 2.6 బిలియన్ డాలర్ల మార్కెట్‌ను సొంతం చేసుకోనుంది. ఇలాంటి వాతావరణం ఉన్న దేశంలో ఏరోనాటికల్ ఇంజనీర్లకు ఉజ్వల భవిష్యత్తు ఉందని చెప్పొచ్చు.
కోర్ సబ్జెక్టులు: ఫ్లూయిడ్ డైనమిక్స్, మెటీరియల్స్ సైన్స్, స్ట్రక్చరల్ అనాలిసిస్, ప్రొపల్షన్, ఆటోమేటిక్ కంట్రోల్ అండ్ గెడైన్స్, ఎయిర్‌క్రాఫ్ట్ పెర్‌ఫార్మెన్స్ అండ్ ఎయిర్‌క్రాఫ్ట్ స్ట్రక్చర్స్.విధులు, నైపుణ్యాలు: పౌర, సైనిక విమానాలు, క్షిపణులు, ఇతర స్పేస్ వెహికల్స్‌కు సంబంధించి పరిశోధన, డిజైన్, అభివృద్ధి, టెస్టింగ్, నిర్వహణకు ఏరోనాటికల్ ఇంజనీర్లు శాస్త్రీయ, సాంకేతిక సూత్రాలను అనువర్తింపజేస్తారు. ఎయిర్‌క్రాఫ్ట్‌ల అభివృద్ధికి కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ (క్యాడ్) వంటి సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగిస్తారు. విమానాలపై ఆసక్తి అవసరం. మ్యాథమెటికల్, అనలిటికల్, సమస్య పరిష్కార నైపుణ్యాలు అవసరం.
సృజనాత్మకత, భద్రత అంశాలపై అవగాహన, కమ్యూనికేషన్ స్కిల్స్, సమయపాలన నైపుణ్యాలు, ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులను అర్థం చేసుకోవడం ముఖ్యం.కెరీర్: ఏరోనాటికల్ ఇంజనీర్స్‌కు విమానయాన సంస్థల్లో, విమానాల తయారీ విభాగాల్లో, ఎయిర్ టర్బైన్ ప్రొడక్షన్ ప్లాంట్స్, ఏవియేషన్ పరిశ్రమలో డిజైన్ అండ్ డెవలప్‌మెంట్‌లో మంచి డిమాండ్ ఉంది.టాప్ రిక్రూటర్స్: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, నేషనల్ ఏరోస్పేస్ లేబొరేటరీస్, సివిల్ ఏవియేషన్ డిపార్ట్‌మెంట్, డీఆర్‌డీవో, ఇస్రో, ఎయిరిండియా, జెట్ ఎయిర్‌వేస్, స్పైస్‌జెట్.
సరైన బ్రాంచ్, కాలేజీ ఎంపిక ఎలా?
Published Wed, Jun 10 2015 11:30 PM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement
Advertisement