What after 10 + 2 | What after 10 + 2 | Sakshi
Sakshi News home page

What after 10 + 2

Published Thu, Apr 2 2015 2:57 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

What after 10 + 2

 ఇంజనీరింగ్
 అర్హత: బ్యాచిలర్ స్థాయిలో ఇంజనీరింగ్ కోర్సులో చేరేందుకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో 10+2 లేదా తత్సమాన అర్హత ఉండాలి.  ఇంజనీరింగ్‌లో చేరాలనుకునే అభ్యర్థులు తొలుత ఐఐటీలో సీటు పొందడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఐఐఐటీ, నిట్, బిట్స్‌లకు ప్రాధాన్యమివ్వాలి.వీటి తర్వాత విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కాలేజీలకు ప్రాధాన్యమివ్వొచ్చు. ఐఐటీలు, నిట్‌లను లక్ష్యంగా నిర్దేశించుకున్న వారు జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు సాధించాలి. బ్రాంచ్ పరంగా చూస్తే సీఎస్‌ఈ, ఈసీఈలను ఎక్కువ మంది ఎంపిక చేసుకుంటున్నారు. ఆ తర్వాత మె కానికల్, ఈఈఈ, సివిల్, కెమికల్, మైనింగ్, ఐటీ బ్రాంచ్‌లను ఆసక్తికి అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చు.
 
 కొన్ని ముఖ్యమైన బ్రాంచ్‌లు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్; కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్; మెకానికల్; ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్; కెమికల్ ఇంజనీరింగ్; సివిల్ ఇంజనీరింగ్; మెటలర్జికల్ ఇంజనీరింగ్.కెరీర్: బీఈ లేదా బీటెక్ పూర్తిచేసిన వారు యూపీఎస్సీ, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షల్లో ప్రతిభ కనబరిచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నత ఉద్యోగాలను పొందొచ్చు. సాధారణంగా ట్రైనీ ఇంజనీర్‌కు ప్రారంభం లో రూ.15 వేల నుంచి రూ.20 వేల వేతనం లభిస్తుంది.ఉన్నతవిద్య: బీఈ/బీటెక్ పూర్తయితే ఎంఎస్/ఎంటెక్ చేసి, ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. తర్వాత పరిశోధన రంగంలోకి అడుగుపెట్టొచ్చు.
 
 ఇంజనీరింగ్.. ఎవర్‌గ్రీన్
 ఇంటర్ తర్వాత అందుబాటులో ఉన్న కెరీర్ ఆప్షన్లలో మొదటి స్థానం ఇంజనీరింగ్‌దే. ఈ కోర్సు ఉత్తీర్ణత ద్వారా లభించే ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు అపారం. అయితే కోర్సులో చేరే విద్యార్థులు కేవలం పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా ప్రాక్టికాలిటీకి.. తద్వారా ఉద్యోగ నైపుణ్యాలు పెంచుకునేందుకు కృషి చేయాలి. పరిశ్రమ వర్గాలు పదేపదే ప్రస్తావిస్తున్న స్కిల్ గ్యాప్ అనే సమస్య తమలో తలెత్తకుండా కోర్సులో చేరిన తొలి రోజు నుంచే అడుగులు వేయాలి. ఇక ఉన్నత విద్య పరంగా ఎంటెక్, పీహెచ్‌డీ వంటి దీర్ఘకాలిక లక్ష్యాలు ఏర్పరచుకుంటే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించొచ్చు.
 - ప్రొఫెసర్ ఎస్.రామచంద్రం, ప్రిన్సిపాల్, ఓయూసీఈ.
 
 మెడిసిన్
 వైద్య వృత్తిలోకి ప్రవేశించాలనుకునే వారికి ఎంబీబీఎస్ తొలి మెట్టు. రాష్ట్రంలో ఎంసెట్ ద్వారా ఈ కోర్సులోకి ప్రవేశాలు కల్పిస్తున్నారు. అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ, జువాలజీ)/ బయో టెక్నాలజీ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.ప్రత్యామ్నాయ ఎంట్రన్స్‌లు: ఎంసెట్‌కు ప్రత్యామ్నాయంగా దేశంలోని పలు ప్రతిష్టాత్మక కాలేజీల్లో ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాలకు చాలా ఎంట్రన్స్‌లు అందుబాటులో ఉన్నాయి. అవి.. జిప్‌మర్ - పుదుచ్చేరి, ఎయిమ్స్, మహాత్మాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్- వార్ధా, ఏఐపీఎంటీ, మణిపాల్ యూనివర్సిటీ, సీఎంసీ- వెల్లూరు, ఎస్‌ఆర్‌ఎం, అమృత విశ్వవిద్యా పీఠం. విదేశాల్లోనూ ఎంబీబీఎస్ చేసేందుకు చైనా, ఉక్రెరుున్, రష్యా, ఫిలిప్పీన్స్, సెంట్రల్ అమెరికా, జార్జియా, రుమేనియా వంటి దేశాలు వేదికలుగా నిలుస్తున్నాయి.
 
 కెరీర్: ఎంబీబీఎస్ పూర్తిచేసిన వారు యూపీఎస్సీ నిర్వహిం చే కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో మెడికల్ ఆఫీసర్‌గా సేవలందించొచ్చు. ఇతర కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాల వైద్య విభాగాల్లో చేరొచ్చు. ప్రైవేటు ఆసుపత్రుల్లో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
 ఎంబీబీఎస్ పూర్తయ్యాక మెడికల్ పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు చేయడం ద్వారా ఉన్నత కెరీర్ సొంతమవుతుం ది. పీజీ డిగ్రీ ఇన్ జనరల్ సర్జరీ (ఎంఎస్), పీజీ డిగ్రీ ఇన్ జనరల్ మెడిసిన్(ఎండీ)/డిప్లొమా కోర్సులు చేయొచ్చు.వేతనాలు: పీజీ పూర్తిచేసిన వారికి ప్రారంభంలో రూ.70 వేల వరకు వేతనాలు వచ్చే అవకాశముంది. స్పెషలైజేషన్, ఆసుపత్రి లేదా వైద్య కళాశాల స్థితి, అవి ఉన్న ప్రాంతం తదితరాల ఆధారంగా వేతనాలు మారుతుంటాయి.
 
 కష్టపడి, ఇష్టపడి చదవాలి
 సామాజిక దృక్పథం, సేవా తత్పరత ఉన్నవాళ్లు వైద్య కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎంబీబీఎస్‌తోనే వైద్యుడిగా స్థిరపడాలనుకుంటే కుదరదు. తప్పనిసరిగా ఆసక్తి ఉన్న స్పెషాలిటీలో పీజీ చేయాలి. ఈ లక్ష్యం చేరుకోవాలంటే సహనం, శ్రమించే గుణం అవసరం. కోర్సులో చేరినప్పుడే వీటిని దృష్టిలో ఉంచుకోవాలి. వైద్య విద్యలో అన్ని సబ్జెక్టులూ కష్టంగా ఉంటాయి. వీటిపై పట్టు సాధించాలంటే ఇష్టపడుతూ, కష్టపడి చదవాలి. చదువంటే కేవలం పుస్తకాలే కాదు. బయట ప్రపంచాన్ని కూడా చూడగలగాలి. ఈ క్రమంలో కమ్యూనికేషన్ స్కిల్స్ కీలకపాత్ర పోషిస్తాయి. వైద్య వృత్తిలో క్లినికల్ స్కిల్స్ చాలా అవసరం.
 - ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.శశాంక్, ప్రిన్సిపాల్,
 సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల, విజయవాడ.
 
 వెటర్నరీ సైన్స్
 వెటర్నరీ సైన్స్‌కు సంబంధించి బ్యాచిలర్ స్థాయిలో కోర్సును బీవీఎస్సీ అండ్ ఏహెచ్ (బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ)గా పేర్కొంటారు. ఇందులో చేరేందుకు అర్హత: ఇంటర్మీడియెట్ (బైపీసీ). కోర్సు కాల వ్యవధి: ఐదున్నరేళ్ల వరకు ఉంటుంది. ఎంసెట్ ర్యాంకు, ఇంటర్మీడియెట్ మార్కులాధారంగా తుది ర్యాంకు కేటాయించి, కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.వెటర్నరీ విద్యా ప్రమాణాలను నిర్దేశించే వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(వీసీఐ) ఏటా జాతీయ స్థాయిలో ఆలిండియా ప్రీ-వెటర్నరీ టెస్ట్(ఏఐపీవీటీ)ను నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న 30కి పైగా రాష్ట్రస్థాయి వెటర్నరీ(జమ్మూ-కాశ్మీర్ మినహా) కళాశాలల్లోని బీవీఎస్సీ - ఏహెచ్ కోర్సులో 15 శాతం సీట్లను భర్తీ చేస్తారు.
 
 కెరీర్: బీవీఎస్సీ పూర్తిచేసిన వారికి పశుసంవర్థ్ధక శాఖ లో, వెటర్నరీ హాస్పిటల్స్, జులాజికల్ పార్క్స్, ఇన్సూరెన్స్ సంస్థల్లో, ఫీడ్ మెషీన్ ప్లాంట్లు, పౌల్ట్రీ పరిశ్రమ, ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలలో ఉద్యోగాలు లభిస్తారుు. సొంతంగా క్లినిక్‌లు ఏర్పాటు చేసుకోవచ్చు. పరిశోధన సంస్థల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. బీవీఎస్సీ అండ్ ఏహెచ్ తర్వాత పీజీ స్థాయిలో ఎంవీఎస్సీ (మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్) కోర్సులు చేసి, ఉన్నత అవకాశాలను అందుకోవచ్చు. ప్రత్యామ్నాయం కాదు.. ప్రధాన కోర్సుగా ఇంటర్మీడియెట్ బైపీసీ ఉత్తీర్ణుల్లో ఎక్కువగా వెటర్నరీ సైన్స్‌ను ఇప్పటికీ ప్రత్యామ్నాయ కోర్సుగానే భావిస్తున్నారు. కానీ ఈ కోర్సు ద్వారా లభించే అవకాశాలు, హోదాలపై అవగాహన ఏర్పరచుకుని తమ కెరీర్‌కు సంబంధించి ప్రధాన ఆప్షన్‌గా గుర్తించాలి. ఈ కోర్సు పూర్తి చేయడం ద్వారా కేవలం పశు వైద్యులుగానే కాకుండా కార్పొరేట్ సంస్థల్లో కొలువులు కూడా సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా డైరీ ఫార్మ్, వ్యాక్సినేషన్ ఇన్‌స్టిట్యూషన్స్‌లలో అదే విధంగా ప్రభుత్వ విభాగాల్లో పశు సంవర్థక శాఖలోనూ ఉద్యోగాలు ఖాయం.
 - డాక్టర్ కె.కొండల్ రెడ్డి, అసోసియేట్ డీన్,
 కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, హైదరాబాద్.
 
 ఫార్మసీ
 బీఫార్మసీ: ఇది నాలుగేళ్ల కోర్సు. ఈ కోర్సులో చేరడానికి అర్హత: ఇంటర్మీడియెట్(సెన్సైస్-ఎంపీసీ/బైపీసీ) లేదా డి. ఫార్మసీ. ఎంసెట్‌లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా బీ.ఫార్మసీలో ప్రవేశం కల్పిస్తారు. 50 శాతం సీట్లను ఎంపీసీ అభ్యర్థులతో, 50 శాతం సీట్లను బైపీసీ అభ్యరులతో భర్తీ చేస్తారు. ఫార్మ్-డి: డాక్టర్ ఆఫ్ ఫార్మసీ(ఫార్మ్.డి). ఫార్మ్.డి. కోర్సు దాదాపు ఎం.ఫార్మ్‌తో సమానమైందని చెప్పొచ్చు. ఈ కోర్సులో చేరడానికి అర్హత: ఇంటర్మీడియెట్ (సెన్సైస్-ఎంపీసీ/బైపీసీ) లేదా డి.ఫార్మసీ. ఎంసెట్‌లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. 50 శాతం సీట్లను ఎంపీసీ అభ్యర్థులతో, 50 శాతం సీట్లను బైపీసీ అభ్యరులతో భర్తీ చేస్తారు. ఫార్మ్-డి కోర్సు కాల వ్యవధి ఆరేళ్లు.ఉన్నత విద్య: జాతీయస్థాయిలో నైపర్ ఎంఫార్మసీ కోర్సు లో ప్రవేశాలకు ఏటా జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌ను నిర్వహిస్తుంది. హైదరాబాద్‌లో నైపర్ ఉంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు జీప్యాట్‌ను, తెలుగు రాష్ట్రాల్లో పీజీఈసెట్‌ను ఏటా నిర్వహిస్తారు.
 
 కెరీర్:
 కోర్సులు పూర్తిచేసినవారికి రెడ్డీస్ ల్యాబ్స్, నాట్కో, అరబిందో, గ్లాండ్ ఫార్మా వంటి కంపెనీలు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో బోధన, పరిశోధన రంగాల్లో అవకాశాలున్నాయి. డ్రగ్ ఇన్‌స్పెక్టర్, అనలిస్ట్, కెమికల్ ఎగ్జామినర్ వంటి హోదాల్లో ఉపాధి లభిస్తుంది.
 
 కెమిస్ట్రీ ప్రాథమిక భావనలపై పట్టు అవసరం
 దేశంలో డ్రగ్ డిస్కవరీ, డ్రగ్ ఫార్ములేషన్‌లు సొంతంగా జరుగుతుండటంతో ఫార్మసీ గ్రాడ్యుయేట్లకు అవకాశాలు మెరుగవుతున్నాయి. అయితే ఈ కోర్సులో అడుగుపెట్టే విద్యార్థులకు కెమిస్ట్రీలో ప్రాథమిక భావనలపై పరిపూర్ణ అవగాహన ఎంతో అవసరం. అప్పుడే భవిష్యత్తులో ఉన్నత విద్య, ఉద్యోగాల పరంగా ఇతరుల కంటే ముందంజలో ఉంటారు. ఫార్మసీ విద్యార్థులు కేవలం బీఫార్మసీతో తమ అకడమిక్ కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టకుండా పీజీ కోర్సులు అభ్యసించడం మరింత మేలు చేస్తుంది.
 - ప్రొఫెసర్ ఆర్.శ్యాంసుందర్, డీన్,
 కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఓయూ.
 
 బీఏఎంఎస్
 ఎంబీబీఎస్‌కు ప్రత్యామ్నాయంగా అధికమంది విద్యార్థులను ఆకర్షిస్తున్న విభాగాల్లో ఆయుర్వేదం ఒకటి. ఆయుర్వేదంలో బ్యాచిలర్ కోర్సు బీఏఎంఎస్(బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ). ఇంటర్మీడియెట్ బైపీసీ లేదా తత్సమాన అర్హత ఉన్నవారు బీఏఎంఎస్ కోర్సులో చేరేందుకు అర్హులు. ఎంసెట్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
 
 కెరీర్: ప్రభుత్వ విభాగంలో మెడికల్ ఆఫీసర్ హోదాలో ఉద్యోగ జీవితంలో అడుగు పెట్టవచ్చు. ఆయుర్వేద ఔషధ తయూరీ సంస్థలు (డాబర్, హిమాలయ తదితర) భారీగా బీఏఎంఎస్ గ్రాడ్యుయేట్లను నియమించుకుంటున్నాయి. వేతనాలు: ప్రారంభంలో రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనాలు అందుకోవచ్చు. తర్వాత అనుభవం, ఉన్నత అర్హతలతో అధిక వేతనాలను సంపాదించవచ్చు.ఉన్నత విద్య: బీఏఎంఎస్ తర్వాత పీజీ స్థారుులో ఎండీ (ఆయుర్వేద), ఎంఎస్ (ఆయుర్వేద) కోర్సులు చేయడం ద్వారా ఉన్నత కెరీర్ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.
 
 బీహెచ్‌ఎంఎస్
  బీహెచ్‌ఎంఎస్‌ను బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీగా పేర్కొంటారు. ఇంటర్ (బైపీసీ) లేదా తత్సమాన అర్హత ఉన్నవారు కోర్సులో చేరేందుకు అర్హులు. కోర్సు కాల వ్యవధి ఐదున్నరేళ్లు (ఏడాది ఇంటర్న్‌షిప్‌తో కలిపి). ఎంసెట్ ద్వారా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
 
 కెరీర్:
 బీహెచ్‌ఎంఎస్ గ్రాడ్యుయేట్లు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు; మెడికల్ కళాశాలలు; స్వచ్ఛంద సంస్థల వైద్య విభాగాలు; పరిశోధన సంస్థలు, ఔషధ సంస్థలలో హోమియోపతిక్ డాక్టర్, హోమియోపతిక్ మెడికల్ కన్సల్టెంట్, మెడికల్ ఆఫీసర్ వంటి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. సొంతంగా ప్రాక్టీస్ చేయవచ్చు. బీహెచ్‌ఎంఎస్ తర్వాత పీజీ స్థాయిలో ఎండీ (హోమియోపతి) కోర్సులు చేసి, ఉన్నత కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. వేతనాలు: బీహెచ్‌ఎంఎస్ చేసిన వారికి ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనాలు ఉంటాయి. తర్వాత అనుభవం, అర్హతల ద్వారా రూ.50 వేల వరకు వేతనాలు అందుకోవచ్చు.
 
 బీఎస్సీ అగ్రికల్చర్
  అర్హత, ప్రవేశాలు: ఫిజికల్ సెన్సైస్; బయలాజికల్ సెన్సైస్/ నేచురల్ సెన్సైస్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎం సెట్ ర్యాంకు ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. ఉన్నత విద్య: వివిధ స్పెషలైజేషన్లలో ఎంఎస్సీ (అగ్రికల్చరల్) తర్వాత ఆసక్తి ఉంటే పీహెచ్‌డీ కూడా చేయొచ్చు. కెరీర్ అవకాశాలు: బ్యాంకుల్లో ఫీల్డ్ ఆఫీసర్‌గా, రూరల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా అవకాశాలుంటాయి. పురుగుల మందులు, విత్తనాలు, ఎరువుల కంపెనీల్లో ఉద్యోగాలుంటాయి. వ్యవసాయ సంబంధ కంపెనీలకు మార్కెటింగ్ స్పెషలిస్టులుగా పనిచేయొచ్చు. వ్యవసాయ బీమా కంపెనీల్లోనూ అవకాశాలుంటాయి. ప్రారంభంలో రూ.20 వేల వరకు వేతనం లభిస్తుంది. వేతనాలు: ప్రారంభంలో రూ.20 వేల వరకు వేతనం లభిస్తుంది. తర్వాత అనుభవం, ప్రతిభ ఆధారంగా జీతాలుంటాయి.
 
 బీఎన్‌వైఎస్
 బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగిక్ సెన్సైస్ (బీఎన్‌వైఎస్). ఇంటర్మీడియెట్ (బైపీసీ) పూర్తిచేసిన వారు దీనికి అర్హులు. ఎంసెట్‌లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. గాంధీ నేచురోపతి మెడికల్ కాలేజ్-హైదరాబాద్ (ప్రభుత్వ), నారాయణ యోగా అండ్ నేచురోపతి మెడికల్ కాలేజ్-నెల్లూరు (ప్రైవేటు) ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి.కెరీర్: కోర్సు పూర్తిచేసినవారు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో అవకాశాలు పొందొచ్చు. కార్పొరేట్ ఆసుపత్రులు, వెల్‌నెస్‌కేంద్రాల్లో కన్సల్టెంట్‌గా కెరీర్‌ను ప్రారంభించవచ్చు.
 
 బీఎస్సీ  (హోంసైన్స్)
 అర్హతలు: ఇంటర్ ఎంపీసీ/బైపీసీ/ఎంబైపీసీ ఉత్తీర్ణత. ప్రవేశాలు: ఇంటర్ గ్రూపులో ఆప్షనల్ సబ్జెక్టుల్లో పొందిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. స్పెషలైజేషన్‌‌స: అపెరల్ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్; ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ మేనేజ్‌మెంట్; న్యూట్రిషన్ అండ్ డైటీటిక్స్; ఇంటీరియర్ అండ్ ఎక్స్‌టీరియర్ స్పేస్ డిజైన్ తదితరాలు.కెరీర్: హోంసైన్స్ కోర్సులు పూర్తిచేసినవారికి ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ డిజైనింగ్ సంస్థలు; అపెరల్ పరిశ్రమ; స్వచ్ఛంద సంస్థలు; డే కేర్ సెంటర్లు; ప్రీస్కూల్స్; ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో అవకాశాలుంటాయి. ప్రభుత్వ మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు లభిస్తాయి. డిగ్రీ అర్హతగా ప్రభుత్వం నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షలకు హాజరుకావొచ్చు. ప్రారంభంలో రూ.10 వేల నుంచి రూ.20 వేలు వరకు లభిస్తుంది. బ్యాచిలర్ డిగ్రీ తర్వాత వివిధ రకాల స్పెషలైజేషన్లతో పీజీ చేయొచ్చు.
 
 హోంసైన్స్ బెస్ట్ ఫర్ ఉమెన్

 న్యూట్రిషన్, హ్యూమన్ డెవలప్‌మెంట్, ఫ్యామిలీ రిసోర్స్ మేనేజ్‌మెంట్‌లు కోర్ సబ్జెక్ట్‌లుగా ఉండే హోంసైన్స్ బ్యాచిలర్ డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణత సాధించడం ద్వారా ఉన్నత విద్యతోపాటు హాస్పిటల్స్, హెల్త్‌కేర్ సెంటర్స్, న్యూట్రిషన్ అండ్ డైటిటిక్ సెంటర్స్, న్యూట్రిషన్ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్లలో కొలువులు సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా ఉన్నత విద్య పరంగా ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, హోం సైన్స్, మైక్రో బయాలజీలలో పీజీ చేయొచ్చు.
 - ప్రొఫెసర్ మహాలక్ష్మి, ప్రిన్సిపాల్,
 కాలేజ్ ఆఫ్ హోంసైన్స్, హైదరాబాద్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement