ఇంజనీరింగ్.. పలకడానికి అయిదు అక్షరాలే. కాని దీని పరిధి ఎంతో విస్తృతం, బహుముఖం. ఇంజనీరింగ్ అంటే.. ప్రపంచంలో తనదైన ముద్రవేయాలనే వినూత్న ఆలోచనతోపాటు, అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం సంపాదించడమే అంటారు ఓ విద్యావేత్త! మానవ జీవన నాణ్యతను, ప్రమాణాలను పెంచాలన్నా.. ఆర్థిక ప్రగతికి ఊతం ఇవ్వాలన్నా.. ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకం. ఇంజనీరింగ్ కోర్సులు పూర్తిచే సుకొని, నైపుణ్యాలు సొంతం చేసుకున్న వారికిజాబ్ మార్కెట్‌లో భారీ డిమాండ్. అందుకే ఇంజనీరింగ్ కోర్సులు ఎవర్ గ్రీన్. ఏటా వందల కొద్దీ కళాశాలల నుంచి లక్షల మంది పట్టాలతో బయటికి వస్తున్నా... ఇంజనీరింగ్ కోర్సులపై క్రేజ్ ఏమాత్రం తగ్గడంలేదు. దేశవ్యాప్తంగా ఇంజనీంగ్‌లో చేరేవిద్యార్థుల సంఖ్య లక్షల్లోనే! విద్యార్థి లోకంలో ఇంతటి క్రేజ్ ఉన్న ఇంజనీరింగ్ కెరీర్ స్కోప్‌పై నిపుణుల విశ్లేషణ...
‘‘ఒక దేశ అభివృద్ధిలో ఇంజనీరింగ్ రంగం ఎంతో కీలకం. కొత్త ఉత్పత్తులు/సేవల ఆవిష్కరణకు ఇంజనీరింగ్ నైపుణ్యాలు తప్పనిసరి’’- స్థూలంగా ఇంజనీరింగ్ రంగం ప్రాముఖ్యాన్ని సూచించే మాటలివి! వేలల్లో ఉన్న కాలేజీల నుంచి లక్షల్లో బయటికొస్తున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో.. 22 శాతం మందికే ఉద్యోగ నైపుణ్యాలు ఉంటున్నాయి. దాంతో కంపెనీల్లో మానవ వనరుల కొరత ఏర్ప డుతోంది. ఇంజనీరింగ్ రంగంలో మానవ వనరుల డిమాండ్-సప్లయ్‌కు ఎంతో వ్యత్యాసముందనడానికి నిదర్శనమిది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో బీటెక్‌లో అడుగుపెట్టే విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే అద్భుత అవకాశాలు అందుకోవచ్చు.
సర్వత్రా డిమాండ్
ఇంజనీరింగ్‌లో కోర్ బ్రాంచ్‌లుగా పేర్కొనే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ మొదలు గత దశాబ్దకాలంగా వెలుగులీనుతున్న సాఫ్ట్‌వేర్ వరకూ.. అన్ని రంగాల్లోనూ భవిష్యత్తు ఆశాజనకమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. చిన్న తరహా పరిశ్రమల నుంచి బహుళ జాతి సంస్థల వరకూ.. ప్రతిచోటా నిపుణులైన ఇంజనీర్ల అవసరం ఏర్పడనుంది. ఆటోమొబైల్ నుంచి హార్డ్‌వేర్ వరకు.. ఇంజనీరింగ్ రంగంలో నిపుణులకు మంచి డిమాండ్ ఉంది. ఆయా రంగాల్లో వచ్చే ఐదేళ్లలో లక్షల సంఖ్యలో ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రానున్నాయని అంచనా. ముఖ్యంగా ప్రభుత్వం చేపడుతున్న పలు కొత్త పథకాలు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు కొలువులు ఖాయం చేయనున్నాయి. సీఐఐ, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అంచనాల ప్రకారం- 2022 నాటికి అయిదు వందల మిలియన్ల స్కిల్డ్ మ్యాన్‌పవర్ అవసరం ఉంటుంది. వీరిలో 25 నుంచి 30 శాతం మంది గ్రాడ్యుయేట్ స్థాయి కోర్సుల (బీటెక్/బీఈ) ఉత్తీర్ణులు అవసరమని గణాంకాలు తెలుపుతున్నాయి.
కోర్‌దే అగ్రభాగం
ఇంజనీరింగ్ విభాగంలో అవకాశాల పరంగా.. ఇప్పటికీ కోర్ సెక్టార్‌దే పైచేయి. రానున్న రోజుల్లోనూ ఇదే పంథా కొనసాగనుంది. ముఖ్యంగా సివిల్ ఇంజనీరింగ్‌లో నిర్మాణ రంగంలో; ఉత్పత్తి రంగంలో మెకానికల్, ఆటోమొబైల్ విభాగాలు మ్యాన్‌పవర్ డిమాండ్ పరంగా ముందంజలో నిలుస్తున్నాయి. మొత్తం అంచనాల్లో దాదాపు 60 నుంచి 65 శాతం వాటా ఈ రంగాలదే. మిగతా విభాగాల్లో ఐటీ అండ్ ఐటీఈఎస్; ఎలక్ట్రానిక్స్; ఐటీ హార్డ్‌వేర్‌లు వరుసగా తర్వాతి స్థానాల్లో ఉంటాయని అంచనా.
వేతనాల పరంగానూ పెరుగుతున్న అంకెలు
ఇంజనీరింగ్ నిపుణులకు భవిష్యత్‌లో వేతనాలు ఎలా ఉంటాయో అని సందేహించాల్సిన అవసరం లేదు. బీటెక్/ఎంటెక్ ఉత్తీర్ణతతో జాబ్స్ సొంతం చేసుకున్న వారికి వేతనాలు కూడా ఏటా పెరుగుతున్నాయి. సగటున మూడు లక్షల కనీస వార్షిక వేతనంతో ఉద్యోగాలు ఖాయమవుతున్నాయి. ఏ రంగమైనా ఏటా కనీసం 30 శాతం పెరుగుదల నమోదవుతోంది. కావలసిందల్లా ‘స్కిల్స్’ అనేది నిపుణుల అభిప్రాయం. ఈ సంవత్సరం అత్యధికంగా సాఫ్ట్‌వేర్ రంగం వేతనాలు 50 శాతం మేర పెరిగాయి. మార్కెట్‌లో ఒడిదుడుకులు ఏర్పడినా.. వేతనాల పెరుగుదల శాతంలో కొద్దిగా హెచ్చుతగ్గులు నమోదైనా.. కొలువుల విషయంలో ఆందోళన చెందాల్సిన పరిస్థితులు ఉండవనేది నిపుణుల అభిప్రాయం. సుస్థిర కెరీర్, నిరంతర ప్రగతి సాధించాలంటే.. ఇంజనీరింగ్‌లో అడుగుపెట్టిన రోజు నుంచే నైపుణ్యాల సాధన దిశగా కృషి చేయాలి.
ఉజ్వల కెరీర్‌కు ఉన్నత విద్య
బీటెక్ ఏడో సెమిస్టర్‌లోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ ద్వారా జాబ్స్ ఖాయమవుతున్న పరిస్థితులున్నాయి. పేరున్న కళాశాలల్లో దాదాపు 93 నుంచి 95 శాతం ప్లేస్‌మెంట్ రికార్డ్స్ కనిపిస్తున్నాయి. కానీ విద్యార్థులు తమ కెరీర్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలంటే ఉన్నత విద్య వైపు అడుగులు వేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
గేట్‌తో ఎంటెక్/పీఎస్‌యూ జాబ్
ప్రస్తుతం బీటెక్ విద్యార్థులకు ఉన్నత విద్య పరంగా అందుబాటులో ఉన్న అవకాశం.. ఎంటెక్. ఇందుకోసం ఏటా జాతీయ స్థాయిలో నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)లో మంచి ర్యాంకు సాధించాలి. గేట్‌లో ర్యాంకు ద్వారా ప్రతిష్టాత్మక ఐఐటీలతోపాటు రాష్ట్ర స్థాయిలోని యూనివర్సిటీ క్యాంపస్‌లు, అనుబంధ కళాశాలల్లో ఎంటెక్‌లో చేరే అవకాశం లభిస్తుంది. గేట్ స్కోర్ ఆధారంగా ఎంటెక్‌లో చేరిన విద్యార్థులకు స్కాలర్‌షిప్ సదుపాయం సైతం అందుబాటులో ఉంది. ఎంటెక్ కోర్సులకు తొలి మార్గంగా నిలుస్తున్న గేట్ స్కోర్ ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల కొలువులకు సైతం ఆస్కారం కల్పిస్తోంది.
దేశ వ్యాప్తంగా పలు పీఎస్‌యూలు (ఓఎన్‌జీసీ, బీహెచ్‌ఈఎల్, బీఈఎల్ తదితర) గేట్ స్కోర్ ఆధారంగా నియామకాలు చేపడుతున్నాయి. కాబట్టి గేట్‌లో మంచి స్కోర్ సాధిస్తే విద్యార్థులు తమ వ్యక్తిగత ఆసక్తులు, అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్యలో చేరొచ్చు. లేదంటే ఉద్యోగంలోనైనా కుదురుకోవచ్చు. ఎంటెక్ చదివేందుకు ఉన్న మరో అవకాశం.. రాష్ట్రాల స్థాయిలో నిర్వహించే పీజీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌లు. వీటిలో ర్యాంకు ఆధారంగా ఆయా రాష్ట్రాల యూనివర్సిటీలు నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారా ఎంటెక్ కోర్సుల్లో అడుగుపెట్టొచ్చు. అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ సమయంలో సీట్ల కేటాయింపు పరంగా ముందుగా గేట్ ర్యాంకర్లకే ప్రాధాన్యం ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వ కొలువులు
బీటెక్ ఉత్తీర్ణులకు ఉన్నత విద్య, విదేశీ విద్య, క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌తోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కొలువులు సొంతం చేసుకునే అవకాశముంది. జాతీయ స్థాయిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్షలో మెరిట్ ఆధారంగా.. ఇండియన్ రైల్వేస్, ట్రాయ్ తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా రాష్ట్రాల స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే రిక్రూట్‌మెంట్ టెస్ట్‌లలో మెరిట్ ఆధారంగా ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్, ఆర్‌డబ్ల్యుఎస్, పంచాయతీరాజ్ తదితర శాఖల్లో అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు పొందొచ్చు.
విదేశీ విద్య
బీటెక్ తర్వాత విదేశీ విద్య వైపు చాలా మంది విద్యార్థులు దృష్టిసారిస్తున్నారు. విదేశాల్లో ఇంజనీరింగ్ పీజీ చదవాలనుకునే విద్యార్థులు గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్(జీఆర్‌ఈ)లో మంచి స్కోర్(కనీసం 160) సాధించాలి. అప్పుడే ప్రతిష్టాత్మక విదేశీ వర్సిటీల్లో చదివేందుకు అవకాశాలు మెరుగవుతాయి. జీఆర్‌ఈతోపాటు టోఫెల్, ఐఈఎల్‌టీఎస్ వంటి లాంగ్వేజ్ టెస్ట్‌లలోనూ మంచి స్కోర్లు తప్పనిసరి.
మూడో సంవత్సరానికి లక్ష్యంపై స్పష్టత
భవిష్యత్తు అవసరాలు, అవకాశాలను పరిగణనలోకి తీసుకొని బీటెక్ మూడో సంవత్సరంలో అడుగు పెట్టే నాటికి విద్యార్థులు తమ లక్ష్యంపై స్పష్టత ఏర్పరచుకోవాలి. ముందుగానే స్పష్టత సాధిస్తే లక్ష్య ఛేదనలో ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు.గేట్, జీఆర్‌ఈ వంటి వాటికి మూడో సంవత్సరం నుంచే ప్రిపరేషన్ ప్రారంభించాలి. అవసరమనుకుంటే కోచింగ్ తీసుకోవాలి. అప్పటికే ఆయా పరీక్షలకు హాజరైన సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకోవాలి.
విదేశీ విద్యను లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులు ముందుగా తాము చదవాలనుకుంటున్న దేశం, అక్కడ ఇన్‌స్టిట్యూట్‌ల నాణ్యతపై అన్వేషణ సాగించాలి. తమకు సరితూగే ఇన్‌స్టిట్యూట్‌ను ఎంపిక చేసుకున్నాక అర్హత ప్రమాణాలు గుర్తించి వాటికి తగిన విధంగా సిద్ధం కావాలి.ఈ ప్రక్రియలన్నీ మూడో ఏడాది రెండో సెమిస్టర్ నాటికి పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే.. నాలుగో సంవత్సరంలో కీలకమైన ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. దాన్ని విస్మరించకూడదు. ప్రాజెక్ట్ వర్క్‌ను ప్రత్యక్షంగా, సొంతంగా చేయాలి.
బ్రాంచ్ ఎంపికలో ఆసక్తే కీలకం
బీటెక్ దిశగా అడుగులు వేసే విద్యార్థులు ముందుగా తమ ఆసక్తికి అనుగుణంగా బ్రాంచ్ ఎంపిక చేసుకోవాలి. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే.. ఏ బ్రాంచ్ అయినా సంబంధిత సబ్జెక్ట్‌లలో నైపుణ్యం సాధిస్తే మంచి కెరీర్ అవకాశాలు ఖాయం. కాబట్టి కేవలం క్రేజ్ అనే కోణానికే పరిమితం కాకూడదు. తల్లిదండ్రులు కూడా విద్యార్థుల ఆసక్తిని గుర్తించి సంబంధిత బ్రాంచ్‌లలో అవకాశాలపై సమాచారం సేకరించాలి. ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన విద్యార్థి మానసిక పరిణతి కొంత తక్కువ కాబట్టి తల్లిదండ్రులే కీలక పాత్ర పోషించాలి.
- ప్రొఫెసర్ ఇ.శ్రీనివాస రెడ్డి, డీన్,
ఏఎన్‌యూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్
ఉన్నత విద్యతో ఉజ్వల భవిష్యత్తు
ఉన్నత విద్య అనేది ఆయా విద్యార్థుల కుటుంబ ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. అవకాశం ఉన్న విద్యార్థులు మాత్రం బీటెక్‌తో ఫుల్‌స్టాప్ పెట్టకుండా.. ఎంటెక్ దిశగా అడుగులు వేయడం ఎంతో మేలు చేస్తుంది. ఇప్పుడు అన్ని బ్రాంచ్‌లలోనూ కాంటెంపరరీ అంశాల కలయికగా స్పెషలైజేషన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. వీటి ద్వారా అడ్వాన్స్‌డ్ నైపుణ్యాలు లభిస్తాయి. ఫలితంగా భవిష్యత్తును ఉన్నతంగా మలచుకోవచ్చు.
- ఆర్. రవిచంద్రన్, వైస్ చైర్మన్,
శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ
వన్నె తగ్గని కోర్
ఇంజనీరింగ్‌లో కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌లు ఎప్పటికీ వన్నె తగ్గనివి. బీటెక్ ఔత్సాహిక విద్యార్థులు దీన్ని గుర్తించి బ్రాంచ్ ఎంపికపై కసరత్తు చేయాలి. ఇంజనీరింగ్‌లో భవిషత్తు కెరీర్ గురించి ఆందోళన అనవసరం. నైపుణ్యాలు ఉంటే.. ఏ బ్రాంచ్ అయినా ఉన్నత విద్య, కెరీర్ పరంగా చక్కటి అవకాశాలున్నాయి. ఇండస్ట్రీ కోరుకునే స్కిల్స్ పెంపొందించుకుంటే భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది.
- ప్రొఫెసర్ సీహెచ్.విజయశేఖర్,
హైదరాబాద్
కాలేజీ ఎంపికే కెరీర్‌కు ఆధారం
బీటెక్ విద్యార్థులు మంచి కెరీర్‌ను సొంతం చేసుకునే క్రమంలో ముందుగా కాలేజీ ఎంపికపై కసరత్తు చేయాలి. ఒక కాలేజీకున్న ప్రమాణాలు, పరిశ్రమ వర్గాల్లో ఉన్న గుర్తింపే విద్యార్థి భవిష్యత్తుకూ చక్కటి మార్గం వేస్తుంది. కాబట్టి తమ ర్యాంకులకు అనుగుణంగా అందుబాటులో ఉండే కాలేజీలపై అంచనాలు రూపొందించుకుని వాటిలో మంచి కళాశాలను ఎంపిక చేసుకోవాలి.
- ప్రొఫెసర్ ఎస్.బెనర్జీ,
స్కూల్ ఆఫ్ ఫిజిక్స్;
బిట్స్-పిలానీ హైదరాబాద్ క్యాంపస్
సుస్థిర కెరీర్‌కు ఇంజనీరింగ్..
Published Wed, Jun 10 2015 11:21 PM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement