వివరంగా, విశ్లేషణాత్మకంగా.. జీవశాస్త్రం | detail, analytically .. biology | Sakshi
Sakshi News home page

వివరంగా, విశ్లేషణాత్మకంగా.. జీవశాస్త్రం

Published Thu, Sep 4 2014 4:30 AM | Last Updated on Sat, Sep 2 2017 12:49 PM

వివరంగా, విశ్లేషణాత్మకంగా.. జీవశాస్త్రం

వివరంగా, విశ్లేషణాత్మకంగా.. జీవశాస్త్రం

 జీవశాస్త్రం
  జీవశాస్త్రం నుంచి అడిగే ప్రశ్నలు సాధారణంగా రెండూ అంశాల చుట్టూ ఉంటున్నాయి. అవి.. మన చుట్టూ ఉన్న జీవ, నిర్జీవ అంశాలు. అంతేకాకుండా జనరల్ సైన్స్ విభాగం మొత్తంలో ఈ అంశాల నుంచే ఎక్కువ ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈ క్రమంలో మన చుట్టు ఉండే మొక్కలు, జంతువులు, వాటి స్వరూపం, రకాలు, వర్గీకరణ, విస్తరణ, ప్రత్యేక లక్షణాలు, పోలికలు మొదలైన అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలి.
 
 ప్రశ్నల సరళి:
 ప్రశ్నల సరళిని పరిశీలిస్తే.. ఇంటర్మీడియెట్ స్థాయి వరకు ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి ప్రిపరేషన్‌ను ఇంటర్మీడియెట్ స్థాయి వరకు సాగించాలి. అంటే పదో తరగతి వరకు ఉండి ఇంటర్మీడియెట్‌లో పునరావృతమయ్యే అంశాలకు మాత్రమే ప్రిపరేషన్‌ను పరిమితం చేయాలి. కొన్ని సందర్భాలలో ప్రశ్నలు నేరుగా ఒక అంశానికి మాత్రమే పరిమితమై ఉంటాయి. ఉదాహరణకు- స్కర్వీ ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది? మరికొన్ని సందర్భాలలో రెండు, మూడు సబ్జెక్ట్‌ల అనుసంధానంతో ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది.
 
 ఉదాహరణకు- మయోపియా (హ్రస్వదృష్టి) సంభవించినప్పుడు ఉపయోగించే కటకాలు ఏవి?
 సునిశితంగా పరిశీలిస్తే.. ఇందులో జీవ, భౌతిక శాస్త్ర అంశాలు ఇమిడి ఉన్నాయి. దీనికి సమాధానం గుర్తించాలంటే కంటి వ్యాధులు, వాటి నివారణకు ఉపయోగించే కటకాలపై కూడా పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే సమాధానం గుర్తించగలం.
 
 విశ్లేషణాత్మకంగా:
 మొక్కలు, జంతువులపై అడిగే ప్రశ్నలు కొంత మేరకు గందరగోళానికి గురి చేస్తాయి. ప్రత్యేకించి మొక్కలు, జంతువులు వాటి మధ్య పోలికలు, వర్గం గుర్తించమనే సందర్భంలో ఇటువంటి సందేహాలు ఎక్కవగా వస్తాయి. ఉదాహరణకు తొండ, బల్లి, ఉడుం, ఉడత-వీటిలో భిన్నమైంది? (ఈ ప్రశ్నకు సమాధానం-ఉడత. ఎందుకంటే మొదటి మూడు సరీసృపాలు, చివరిది క్షీరదం. అంటే క్షీరదాల శరీరంపై వెంట్రుకలు ఉంటాయి అనే లక్షణం తెలిస్తే సమాధానాన్ని సులువుగా గుర్తించవ చ్చు)మొక్కలు, జంతువులకు సంబంధించి సాధారణ విషయాలు మనకు తెలుసు. అంతేకాకుండా రోజూ చూస్తూనే ఉంటాం. అయినప్పటికీ వాటి మధ్య భేదం అంత తొందరగా స్ఫూరణకు రాదు. కారణం వాటిపై శాస్త్రీయ అవగాహన లేకపోవడమే. కాబట్టి వర్గీకరణ, సాధారణ లక్షణాలు, అవయవ నిర్మాణం, ఆహారపు అలవాట్లు వంటి అంశాలను విశ్లేషణాత్మకంగా చదవాలి. అప్పుడే ఇటువంటి ప్రశ్నలకు సమాధానాన్ని సులభంగా ఇవ్వొచ్చు.
 
 జంతువుల విస్తరణ:
 మరో కీలక అంశం.. జంతువుల విస్తరణ. ఈ అంశానికి సంబంధించి అడిగే ప్రశ్నలు సాధారణ స్థాయిలోనే ఉంటాయి. జంతువుల ఆవాసాలు, అవి నివసించే ప్రదేశాలపై ఎక్కువగా ఈ తరహా ప్రశ్నలు ఇస్తుంటారు. ఎందుకంటే కొన్ని జంతువులు, కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉంటాయి. కాబట్టి ఆయా అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలి. ముఖ్యంగా కంగారు, ఎకిడ్నా, ప్లాటిపస్, ఎలుగుబంటి వంటి జంతువులకు సంబంధించిన ప్రశ్నలను అడుగుతుంటారు. ఇందుకోసం వాటి అవాస ప్రాంతాలు, దేశాలను గుర్తుంచుకోవాలి. ఉదాహరణ- కంగారు అనేది ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది.
 
 కొన్ని సందర్భాల్లో ఆయా అంశాల మధ్య ఉన్న సంబంధంపై విస్తృత అవగాహనను పరీక్షించే విధంగా కూడా ప్రశ్నలు అడుగుతుంటారు.
 
 ఉదాహరణకు  పిట్యుటరీ : మెదడు :: థైమస్ : --?
 (సమాధానం: అవటు గ్రంధి)
 ఈ ప్రశ్న నియంత్రణ- సమన్వయం అనే అంశానికి సంబంధించింది. ఈ అంశాన్ని విస్తృత స్థాయిలో చదివినప్పుడే పై ప్రశ్నకు సమాధానం గుర్తించడం సాధ్యమవుతుంది. కాబట్టి మెదడు నిర్మాణం, దానిలోని భాగాలు, వాటి విధులు వంటి విషయాలపై కూడా ప్రధానంగా దృష్టి సారించాలి. అంతే విస్తృత స్థాయి ప్రిపరేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
 
 కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించి నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త ఎవరు?
 (సమాధానం: మెల్విన్ కాల్విన్)
 ఈ ప్రశ్న చూస్తే కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించింది. కాబట్టి ఈ అంశాన్ని చదువుతున్నప్పుడు ఇందులో కేవలం కిరణజన్యసంయోగ క్రియ, దానికి కావల్సిన పరిస్థితులు, ఫలితాలు వంటి వాటికే పరిమితం కాకుండా.. సంబంధిత అంశాలపై పరిశోధనలు నిర్వహించిన శాస్త్రవేత్తలు, అందుకుగాను వారికి లభించిన పురస్కారాలను కూడా గుర్తుపెట్టుకున్నప్పుడు మాత్రమే సమధానాన్ని గుర్తించగలం.
 
 గవద బిళ్లలు ఏ సూక్ష్మజీవి ద్వారా సంభవిస్తాయి?
 (సమాధానం-వైరస్)
 ఈ ప్రశ్న వ్యాధులకు సంబంధించి. వ్యాధులు, లక్షణాలు, సంక్రమణ, వ్యాప్తి, నిర్మూలన, ప్రభావిత భాగాలు మొదలైన అంశాలపై అవగాహన ఉండాలి. వ్యాధులు ముఖ్యంగా బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా, నిమటోడ్స్, ఫంగస్ వంటి సూక్ష్మజీవులతోపాటు దోమలు, ఈగలు వంటి కీటకాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతాయి. ఇవి వ్యాధులకు సంబంధించిన ప్రాథమిక భావనలు. దీనిపై పట్టు ఉంటేనే సమాధానం గుర్తించగలం.
 
 తప్పకుండా:
 మరో ప్రధాన విభాగం.. మానవ శరీర ధర్మ శాస్త్రం. ఎందుకంటే ప్రతి పోటీ పరీక్షలో ఈ అంశం నుంచి తప్పకుండా ప్రశ్నలు ఉంటున్నాయి. కాబట్టి మానవ శరీర నిర్మాణంపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. ఇందులో భాగంగా అస్థి పంజరం, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ మొదలైన అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలి. గతంలో రక్త కణాలు, ఎంజైములు, హార్మోన్స్, విటమిన్స్, మూలకాలు, పౌష్టిక ఆహారం మొదలైన అంశాలపై ప్రశ్నలు అడిగారు. కాబట్టి మన ఆహారం, ప్రాముఖ్యత, లభ్యత మొదలైన అంశాలపై కూడా ప్రధానంగా దృష్టి సారించాలి. గత ప్రశ్నపత్రాన్ని పరిశీలిస్తే శరీర రక్షణ ఆహారం ఏమిటి? అనే ప్రశ్న ఇచ్చారు. దీనికి సమాధానం-విటమిన్స్. ఇక్కడ గమనించాల్సిన అంశం.. ఏ పోటీ పరీక్షలోనైనా విటమిన్స్ గురించి తప్పనిసరిగా ఒకటి లేదా రెండు ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విటమిన్‌‌సను క్షుణ్నంగా చదవాలి.
 
 కీలకం:
 జీవశాస్త్రంలో కీలకమైన అంశం..పరిశోధనలు. ఈ అంశానికి సంబంధించి ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి జీవశాస్త్ర పరిశోధనలు, చేపట్టిన శాస్త్రవేత్తల గురించి క్షుణ్నంగా చదువుకోవాలి. బహుమతులు పొందిన అంశాలను కూడా గుర్తుంచుకోవాలి. కొన్ని సందర్భాల్లో సంవత్సరాలను కూడా అడుగుతుంటారు. కాబట్టి సంవత్సరాన్ని కూడా విస్మరించవద్దు. దేశాన్ని గుర్తుంచుకోవడం కూడా ప్రయోజనకరమే. ముఖ్యంగా జీవశాస్త్రంలో నోబెల్ గ్రహీతలు గురించి ప్రశ్నలు అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి రోనాల్డ్ రాస్, హారగోవింద్ ఖురానా, వాట్సన్, క్రిక్, స్టాన్లీవంటి శాస్త్రవేత్తలపై ప్రధానంగా దృష్టిసారించాలి.
 
 మూలకాలు ముఖ్యమే:
 మూలకాల గురించి కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఉదాహరణ- గతంలో ఇచ్చిన ప్రశ్నను పరిశీలిస్తే.. హిమోగ్లోబిన్ : ఐరన్ :: క్లోరోఫిల్ : --దీనికి సమాధానం గుర్తించాలంటే అణువుల నిర్మాణంపై అవగాహన ఉండాలి. ఇక్కడ ఈ ప్రశ్నలోని రెండు అణువుల నిర్మాణం ఒకే విధంగా ఉంటుంది. కాని దాని మధ్యలో ఉండే ముఖ్యమైన మూలకంలో తేడా ఉంటుంది. సమాధానం మెగ్నీషియం. కాబట్టి ఇటువంటి అంశాలకు సంబంధించి మొక్కలలో, జంతువులలో ఉండే మూలకాలు, వాటి ఆవశ్యకత మొదలైన అంశాల గురించి క్షుణ్నంగా తెలుసుకోవాలి. ఈ అంశానికి సంబంధించి మరో ప్రశ్న కూడా గతంలో అడిగారు. ఎముకల నిర్మాణానికి సంబంధించి కాల్షియంను నియంత్రించే హార్మోన్? దీనికి సమాధానం పారాథైరాక్సిన్. (ఈ ప్రశ్నలో హార్మోన్‌కు బదులుగా విటమిన్ ఉంటే.. దానికి సమాధానం విటమిన్-డి).
 
 చదవాల్సినవి:
 ఆయా అంశాలను అనుసరించి 6 నుంచి ఇంటర్మీడియెట్ వరకు ఉన్న జీవశాస్త్ర పాఠ్య పుస్తకాలు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement