సృజనాత్మకత, నవకల్పన.. ఉజ్వల కెరీర్‌కు సోపానాలు | Interview with international Advanced Research Centre for Powder Metallurgy associate director G PADMANABHAM | Sakshi
Sakshi News home page

సృజనాత్మకత, నవకల్పన.. ఉజ్వల కెరీర్‌కు సోపానాలు

Published Thu, Feb 13 2014 2:33 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

సృజనాత్మకత, నవకల్పన.. ఉజ్వల కెరీర్‌కు సోపానాలు - Sakshi

సృజనాత్మకత, నవకల్పన.. ఉజ్వల కెరీర్‌కు సోపానాలు

ఇంజనీరింగ్‌లో చేరిన ప్రతి విద్యార్థి ‘ఐ యామ్ ఇంజనీర్’ అనే ప్రాథమిక సూత్రాన్ని గుర్తుంచుకోవాలి. పుస్తక పరిజ్ఞానంతో పాటు అనుభవాల సారం ద్వారా నేర్చుకున్న వారే నిజమైన ఇంజనీర్లు.. నవకల్పన ( Innovation ), సృజనాత్మకత (Creativity).. ఈ రెండూ కెరీర్‌లోనూ, జీవిత గమనంలోనూ ముందుకు నడిపించే అద్భుత సాధనాలని, వాటిని సొంతం చేసుకునే దిశగా ఆలోచనలు సాగాలంటున్నారు ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఏఆర్‌సీఐ) అసోసియేట్ డెరైక్టర్ జి.పద్మనాభం...
 
 ఏదైనా సమస్య ఎదురైతే దాన్ని పరిష్కరించడం నా వల్ల కాదనే తత్వం ఇంజనీర్లలో ఉండకూడదు. తమదైన ఆలోచనతో ఆ సమస్యకు పరిష్కార మార్గాన్ని కనుగొనే దిశగా ఆలోచనలు సాగాలి. ప్రపంచ స్థితిగతులను మార్చగల మేధా సంపత్తిని తరగతి గదిలోనే సముపార్జించుకునేందుకు ప్రయత్నించాలి. కేవలం మెదడుకే కాదు.. చేతులకూ పనిచెప్పాలి. ఆలోచనల్ని, ఆచరణలకు చేరువచేయాలి. ఉదాహరణకు ఇంట్లో తిరిగే ఫ్యాన్‌ను గమనించండి.. అది తిరగాలంటే ఎంతటి సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలి.. పైన ఉన్న గాలిని కిందకు దింపాలి.
 
 దీనికి ఏరో డైనమిక్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. రెక్కలు తేలిగ్గా ఉండాలి కాబట్టి వీటి రూపకల్పనకు తగిన మెటీరియల్ వాడుతారు. అది అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఉండాలి. ఫ్యాన్ తిరిగేందుకు మోటార్, బిగించేందుకు హుక్ కావాలి. ఇలా ఇప్పుడున్న ఫ్యాన్లలో ఉపయోగించిన పరిజ్ఞానాన్ని పరిశీలించి, కొత్త ఆలోచనల దిశగా వెళ్తే మరింత మెరుగైన సామర్థ్యం గల ఫ్యాన్లను ఆవిష్కరించిన వారవుతారు.
 
 ప్రాక్టికల్ నాలెడ్జ్ అవసరం:
 విద్యార్జన అంటే కేవలం పుస్తక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకోవడమే కాదు.. అనుభవాల ద్వారా నేర్చుకున్న వారే నిజమైన ఇంజనీర్లు.. ప్రస్తుత విద్యా విధానంలో విద్యార్థులు అధిక సమయాన్ని తరగతిగదికే కేటాయిస్తున్నారు.
 
 ప్రాక్టికల్స్ తక్కువగా ఉంటున్నాయి. జర్మనీలో ఇంజనీరింగ్ కోర్సు ఐదున్నరేళ్లు ఉంటుంది. కోర్సు పూర్తయ్యే సరికి ఒక్కో విద్యార్థి ఒక్కో ప్రాజెక్టుతో కళాశాల నుంచి బయటకొస్తాడు. ఇంజనీరింగ్ విద్యార్థులకు తరగతి గది పరిజ్ఞానంతో పాటు అక్కడ నేర్చుకున్న అంశాలను ప్రాక్టికల్స్‌గా చేసి, నేర్చుకోవడం చాలా అవసరం. విద్యార్థులు విశ్లేషణ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. నవకల్పన, సృజనాత్మకత.. ఈ రెండూ కెరీర్‌లో, జీవితంలో మిమ్మల్ని ముందుకు నడిపించే అద్భుత సాధనాలు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం, ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీని తెలుసుకోవడం ద్వారా మంచి ఫలితాలు సాధించొచ్చు.
 
 రాబోయేది ‘టెక్’ యుగం:
 రాబోయే రోజుల్లో అపారమైన అవకాశాలున్న విభాగం మెకానికల్ ఇంజనీరింగ్. ఏ పరిశ్రమ నడవాలన్నా యంత్రాలు కావాల్సిందే. మెషిన్ డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్, థర్మల్ ఇంజనీరింగ్‌తోపాటు ఐటీ రంగంలోనూ మెకానికల్ ఇంజనీర్లకు ఉజ్వల భవిష్యత్తు ఉంది.
 
 పరిశోధనల్లోనూ పెద్దపీట:
 ఇంజనీరింగ్ పూర్త్తిచేయాలి.. అధిక వేతనాలు వచ్చే కొలువుల్లో కుదురుకోవాలి.. అనే ఒక్క కోణం నుంచే కాకుండా ఔత్సాహికులు పరిశోధన రంగం వైపు కూడా వెళ్లొచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి సబ్జెక్టులు చదివిన వారితో పాటు వివిధ విభాగాల్లో ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారు కూడా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఖ-ఈ) దిశగా అడుగులు వేయొచ్చు. దీనికి కావాల్సింది ఓర్పు. సబ్జెక్టు పరిజ్ఞానంతో పాటు సాధించాలన్న తపన ఉండాలి. కొత్తగా ఆలోచించగలిగే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. ఓ విద్యార్థి కొన్ని నెలల పాటు కష్టపడి పనిచేసిన ప్రాజెక్టు విఫలమవొచ్చు. అలాంటి పరిస్థితిలో కుంగిపోకూడదు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. ఒత్తిడిని తట్టుకొని నిలబడగలగాలి.
 
 ఇంటర్న్‌షిప్ అవకాశం:
 ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఏఆర్‌సీఐ).. మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు వేసవి ఇంటర్న్‌షిప్ అవకాశాలను కల్పిస్తోంది. ప్రాజెక్టు అవసరాలకు తగినట్లు మెటీరియల్ రీసెర్చ్‌కు సహాయపడుతున్నాం. విద్యార్థుల మినీ ప్రాజెక్టులకు సంస్థ శాస్త్రవేత్తలు సహాయసహకారాలు అందిస్తున్నారు. మెటీరియల్ ప్రాసెస్, కోటింగ్, షేపింగ్ తదితర అంశాల్లో వేసవి సెలవుల్లో ఆరు వారాల పాటు ఇంటర్న్‌షిప్ అందిస్తున్నాం. ఇంజనీరింగ్‌లో 70 శాతం మార్కులుంటే రీసెర్చ్ ఫెలోషిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement