
ఆటోమేషన్ దిశగా అడుగులు!
ఎంబీఏ హెచ్‌ఆర్..
సంస్థ నిర్వహణలో కీలకమైన మానవ వనరుల (హెచ్‌ఆర్) విభాగం నేడు కొత్త పుంతలు తొక్కుతోంది. ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ కంపెనీ వృద్ధికి దోహదపడుతోంది. ఈ క్రమంలో ఎంబీఏ హెచ్‌ఆర్ స్పెషలైజేషన్ అభ్యర్థులు..
తమ నైపుణ్యాలకు నగిషీలు దిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ముఖ్యంగా హెచ్‌ఆర్ విభాగంలో ఆటోమేషన్ పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తు హెచ్‌ఆర్ నిపుణులు మెరుగుపరచుకోవాల్సిన
స్కిల్స్‌పై ఫోకస్..
హెచ్‌ఆర్ విభాగంపై ఆటోమేషన్ ప్రభావం చాలాకాలంగానే ఉంది. అయితే ఇప్పుడు ఇది మరింత విస్తృతమవుతోంది. ప్రస్తుతం హెచ్‌ఆర్ విభాగంలో నియామకాల పరంగా ఆఫర్ లెటర్ అందజేయడం నుంచి ఉద్యోగుల అప్రైజల్స్ వరకూ అంతా ఆన్‌లైన్లోనే సాగుతోంది. హెచ్‌ఆర్ కన్సల్టింగ్ సంస్థల ద్వారా నియామకాలు చేపట్టే కంపెనీలు.. తమకు అవసరమైన సిబ్బంది సంఖ్య, వారికి ఉండాల్సిన అర్హతలు, నైపుణ్యాలు తదితర వివరాలను అందిస్తుండగా.. వీటి ఆధారంగా కన్సల్టింగ్ సంస్థలు క్లౌడ్ బేస్డ్ విధానంలో నిర్ణీత అర్హతలున్న అభ్యర్థుల జాబితాను కంపెనీల హెచ్‌ఆర్ విభాగాలకు అందిస్తున్నాయి. వాస్తవానికి ఒక సంస్థ హెచ్‌ఆర్ విభాగం ఒక ఉద్యోగాన్ని భర్తీ చేసేందుకు సగటున 40 నుంచి 45 రోజుల వ్యవధి పడుతుందని.. కానీ, కన్సల్టింగ్ సంస్థలు.. క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీ వినియోగం ఆధారంగా వారం పది రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తవుతోందని క్యాప్ జెమిని సంస్థ ఒక నివేదికలో పేర్కొంది. అదే విధంగా చాలా సంస్థల్లో సిబ్బంది హాజరు నుంచి వారి పనితీరును విశ్లేషించడం వరకు అంతర్గతంగా ఆన్‌లైన్ విధానంలో జరుగుతోంది. వీటన్నింటినీ హెచ్‌ఆర్ విభాగంలో ఆటోమేషన్ ప్రభావం పెరిగిందనడానికి నిదర్శనాలుగా చెప్పొచ్చు.
మేనేజ్.. బిగ్ డేటా
n ఇప్పటి వరకు ఈ–కామర్స్, ఇతర కస్టమర్ ఓరియెంటేషన్ కంపెనీల్లో బిగ్‌డేటా మేనేజ్‌మెంట్ ప్రాధాన్య అంశంగా ఉండేది. కానీ, ఇప్పుడిది హెచ్‌ఆర్ విభాగాల్లోనూ కీలకంగా మారుతోంది. ముఖ్యంగా వందలు, వేల సంఖ్యలో ఉద్యోగులున్న సంస్థల్లో బిగ్ డేటా అనాలిసిస్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఉద్యోగుల వివరాలను ఆన్‌లైన్ డేటాబేస్‌లో నిక్షిప్తం చేయడమే కాకుండా.. బదిలీలు, పదోన్నతుల సమయంలో ఈ సమాచార విశ్లేషణకు హెచ్‌ఆర్ సిబ్బంది.. డేటా మేనేజ్‌మెంట్‌ను ఉపయోగించుకుంటున్నారు.
n ఆటోమేషన్ విధానంగా పేర్కొనే ఎంప్లాయీ డేటా బేస్ మేనేజ్‌మెంట్, హ్యూమన్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, పే–రోల్ ప్రిపరేషన్ సాఫ్ట్‌వేర్ టూల్స్ వంటి ఆధునిక పద్ధతులను అనుసరించడం వల్ల సిబ్బంది పనితీరు, ఇతర అంశాలను బేరీజు వేయడంలో చాలా తక్కువ లోపాలు నమోదవుతాయన్నది నిపుణుల అభిప్రాయం.
విదేశాల్లో ఎప్పటి నుంచో..
అమెరికా, యూకే తదితర అభివృద్ధి చెందిన దేశాల్లో హెచ్‌ఆర్ విభాగంలో కోర్ ఆటోమేషన్ ప్రక్రియ అయిదారేళ్ల క్రితం నుంచే ప్రారంభమైంది. EHRM (Electronic Human Resource Management), HRIS(Human Resource Information System), HRIM (Human Resource Information Management), CHRIS (Computerised Human Resource Information వంటి పేర్లతో మానవ వనరుల నిర్వహణ పరంగా ఐటీ టూల్స్‌ను అక్కడి సంస్థలు వినియోగిస్తున్నాయి. వీటి అన్నిటి ఉద్దేశం ఒకటే.. ఒక ఉద్యోగికి సంబంధించి నియామకం నుంచి యాన్యువల్ అప్రైజల్ వరకు అంతా ఆన్‌లైన్లోనే నిర్వహించడం.. తద్వారా సమయం, డబ్బు రెండిటినీ ఆదా చేయడం. ఉద్యోగుల కోణంలోనూ అసంతృప్తికి స్వస్తి పలకడం.
హెచ్‌ఆర్ నియామకాలు తగ్గుతాయా?
మానవ వనరుల నిర్వహణ పరంగా ఆటోమేషన్ విధానాలను అమలు చేసినా.. వాటిని నిర్వర్తించేందుకు నిపుణులైన హెచ్‌ఆర్ సిబ్బంది అవసరం ఎప్పుడూ ఉంటుందని, ఉద్యోగాల కోత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ప్రభావం ఉన్నా అది 10–20 శాతం వరకే ఉంటుందని అంటున్నారు.
ఆందోళన అనవసరం
నేటి ఆధునిక యుగంలో సంస్థల్లో అంతర్గత విభాగాల నిర్వహణలోనూ ఆటోమేషన్ కీలకమవుతోంది. అంతమాత్రాన భవిష్యత్తు ఉద్యోగాల పరంగా కోత పడుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. హెచ్‌ఆర్ స్పెషలైజేషన్ ఔత్సాహిక విద్యార్థులు ఆధునికత దిశగా అడుగులు వేస్తే సుస్థిర కెరీర్‌కు ఢోకా ఉండదు.
భవిష్యత్తులో మానవ వనరుల విభాగంలో సుస్థిర కెరీర్‌ను సొంతం చేసుకోవాలనుకునే అభ్యర్థులు హెచ్‌ఆర్ స్పెషలైజేషన్‌లో చేరినప్పటి నుంచే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టిసారించాలి. ముఖ్యంగా పే–రోల్ ప్రిపరేషన్, టైమ్ షీట్ ట్రాకింగ్, డేటాబేస్ మేనేజ్‌మెంట్ వంటి విధులు నిర్వర్తించేందుకు ముందునుంచే సన్నద్ధమయ్యేలా శిక్షణ పొందాలి.
హెచ్‌ఆర్
ఆటోమేషన్ ఫ్యాక్ట్స్
90%
కెరీర్ బిల్డర్ నిర్వహించిన సర్వేలో హెచ్‌ఆర్‌లో బిగ్ డేటా ఆవశ్యకత ఉందని పేర్కొన్న సీఈవోలు.
35%
రానున్న రోజుల్లో
ఆటోమేషన్‌ను అమలు చేయనున్నట్లు తెలిపిన సీఈవోలు.