మెకానికల్‌లో సర్టిఫికేషన్స్ ఇవే..
మెకానికల్‌లో సర్టిఫికేషన్స్ ఇవే..
Published Mon, Nov 21 2016 11:37 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM
ఇంజనీరింగ్ కోర్సులు చదువుతున్న/ఉత్తీర్ణులైన విద్యార్థులు మంచి ఉద్యోగం
సాధించాలంటే అకడమిక్ సర్టిఫికెట్లతోపాటు ఆయా బ్రాంచ్‌ల్లో సర్టిఫికేషన్
కోర్సులు కూడా పూర్తి చేయాల్సిందే. అప్పుడే కోరుకున్న ఉద్యోగం దక్కుతుందని
నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు
అందుబాటులో ఉన్న కొన్ని సర్టిఫికేషన్ కోర్సుల గురించి తెలుసుకుందాం..
మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అతి పురాతన, సంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సు. మెకానికల్‌లో డిజైన్, డెవలప్‌మెంట్, టెస్టింగ్, ఇన్‌స్టాలేషన్ తదితర విభాగాల్లో ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతిక మార్పులు వస్తున్నాయి. ఇందులో రాణించాలంటే తాజా నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి. వీటి కోసం ప్రత్యేక సర్టిఫికేషన్ కోర్సులు ఉన్నాయి. అవి..
స్టాటిస్టికల్ ప్రాసెస్ కంట్రోల్ ట్రైనింగ్ కోర్సులు: ఈ కోర్సులు గణాంక పద్ధతుల ద్వారా ఒక ఉత్పత్తిని నాణ్యతతో రూపొందించడానికి ఉపయోగపడతాయి. ఉత్పత్తి, పర్యవేక్షణ, నియంత్రణ, నాణ్యతా ప్రమాణాలు పెంపొందించడానికి సంబంధించిన నైపుణ్యాలను పొందేలా కోర్సులు ఉంటాయి.
ఎన్‌డీటీ కోర్సులు: ఉత్పత్తుల ప్రామాణికతను, నాణ్యతను పరీక్షించడానికి ఉపకరించేది ఎన్‌డీటీ (నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్) సర్టిఫికేషన్స్. ఉత్పత్తి, ప్రాసెసింగ్,
హీట్ ట్రీట్‌మెంట్, ఆటోమొబైల్ లాంటి విభాగాల్లో ఎన్‌డీటీ ఇన్‌స్ట్రక్టర్ అవసరం ఉంటుంది. చాలావరకు ఎన్‌డీటీ సర్టిఫికేషన్ ప్రోగ్రాములు మూడు స్థాయిలో లెవల్- 1, లెవల్-2, లెవల్-3గా ఉంటాయి. లెవల్-1 సర్టిఫికేషన్ చేసినవారు ఒక ప్రొడక్ట్ తయారీ క్రమంలో అనుసరించాల్సిన పలు టెస్టింగ్ అంశాలను తెలుసుకుంటారు. వీరు లెవల్-2, -3 పూర్తిచేసినవారి పర్యవేక్షణలో పనిచేస్తారు.
లెవల్-2లో స్వయంగా నిర్వహించాల్సిన టెస్టింగ్ అంశాలు ఉంటాయి. లెవల్-3 సర్టిఫికేషన్ చేసినవారు అభివృద్ధి, వివిధ విధానాలకు ఆమోదం తెలపడం వంటి విధులు నిర్వర్తించవచ్చు. మూడు దశల సర్టిఫికేషన్ చేస్తే తయారీ ప్రక్రియ నుంచి తుది రూపం వచ్చే వరకు అవసరమైన అన్ని అంశాలపై నైపుణ్యం లభిస్తుంది.
ఆటోక్యాడ్ డిజైన్ సర్టిఫికేషన్: సాఫ్ట్‌వేర్ వినియోగం పెరిగిన క్రమంలో ఆటోక్యాడ్ డ్రాఫ్టింగ్ అండ్ డిజైన్‌లో సర్టిఫికేషన్ చేసిన వారికి నియామకాల్లో ప్రాధాన్యం ఉంటుంది. దీన్ని ఉపయోగించి 2డి డిజైన్, 3డి డిజైన్ మోడలింగ్‌ల్లో ప్రావీణ్యం పొందొచ్చు. కోర్సు పూర్తి చేసినవారు నిర్మాణం, ఆర్కిటెక్చరల్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, మెకానికల్ డిజైన్, యానిమేషన్‌ల్లో రాణించొచ్చు.
మెకట్రానిక్స్ అండ్ రోబోటిక్స్: ఇది మెకానికల్ డిజైన్, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్‌వేర్, కంట్రోల్ సిస్టమ్స్ స్కిల్స్ మేళవింపు. ఇందులో మెకట్రానిక్స్-రోబోటిక్స్‌కు సంబంధించిన ఎలక్ట్రానిక్స్ అంశాలపై స్కిల్స్ నేర్పిస్తారు.
రోబోటిక్స్ కోర్సులు: ప్రొడక్ట్‌ను రిమోట్ కంట్రోల్ సహాయంతో లేదా కంప్యూటర్ సూచనల మేరకు పనిచేసే విధంగా రూపొందించడంతోపాటు ఆ ప్రొడక్ట్ సరిగా పనిచేసేలా స్కిల్స్ బోధిస్తారు.
Advertisement
Advertisement