మెకానికల్
మెకానికల్ ఇంజనీరింగ్ ఒక విస్తృతమైన విభాగం. మెకానికల్, థర్మల్ పరికరాల పరిశోధన, రూపకల్పన, అభివృద్ధి తదితర కార్యకలాపాల్లో మెకానికల్ ఇంజనీర్లు పాల్గొంటారు. కొత్త మెకానికల్ వ్యవస్థల రూపకల్పనతో పాటు వాటిని పరీక్షించడం, నిర్వహించడం, ఉత్పత్తి కూడా మెకానికల్ ఇంజనీర్ల బాధ్యతే! ఇలాంటి సంప్రదాయ విధులు నేడు నానో టెక్నాలజీ, కాంపోజిట్ మెటీరియల్స్ అభివృద్ధి, బయోమెడికల్ అప్లికేషన్స్, పర్యావరణ పరిరక్షణ వరకు విస్తరించాయి. ఆటోమొబైల్ రంగం వృద్ధి పథంలో పయనిస్తుండటం, కేంద్ర ప్రభుత్వ ‘మేకిన్ ఇండియా’లో భాగంగా దేశీయంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అభివృద్ధి చెందనుంది. 2025 నాటికి దేశ జీడీపీలో ఈ రంగం వాటా 25 శాతం-30 శాతానికి పెరగనుందని, తొమ్మిది కోట్ల ఉద్యోగాల సృష్టి జరగనున్నట్లు అంచనాల నేపథ్యంలో మెకానికల్ ఇంజనీరింగ్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని చెప్పొచ్చు.కోర్ సబ్జెక్టులు: స్టాటిక్స్ అండ్ డైనమిక్స్ కంట్రోల్, థర్మో డైనమిక్స్ అండ్ హీట్ ట్రాన్స్‌ఫర్, ఫ్లూయిడ్ మెకానిక్స్, మెషీన్ డిజైన్, స్ట్రెంథ్ ఆఫ్ మెటీరియల్స్, మెటీరియల్స్ సైన్స్, థియరీ ఆఫ్ డిజైన్ వంటివి.
అభిరుచి, నైపుణ్యాలు: మార్కెట్ అవసరాలకు తగినట్లు వినూత్న ఆలోచనలతో మెకానికల్ ఉత్పత్తులకు రూపకల్పన చేయడంనుంచి వాటిని మార్కెట్లో అమ్మేంత వరకు వివిధ దశల్లో మెకానికల్ ఇంజనీర్ల అవసరం ఉంటుంది. అందువల్ల యంత్ర పరికరాలపై ఆసక్తితో పాటు సృజనాత్మకత, కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, సమస్య పరిష్కార నైపుణ్యాలు అవసరం. అప్పుడే మెకానికల్ ఇంజనీరింగ్ కెరీర్‌లో రాణించవచ్చు.కెరీర్: కోర్సు పూర్తయ్యాక ఆటోమోటివ్,ఏరోస్పేస్, స్టీల్, పవర్ జనరేషన్, బయో మెకానికల్, మ్యానుఫ్యాక్చరింగ్ తదితర ప్రభుత్వ/ప్రైవేటు సంస్థల్లో అవకాశాలు పొందొ చ్చు. టాటా మోటార్స్, మహీంద్ర అండ్ మహీంద్ర, హోండా, అశోక్‌లే లాండ్,డీఆర్‌డీవో, ఇండియన్ ఆయిల్ తదితర సంస్థలను టాప్ రిక్రూటర్లుగా చెప్పుకోవచ్చు.
సివిల్ ఇంజనీరింగ్
మిలిటరీ ఇంజనీరింగ్ తర్వాత అతిపురాతమైన బ్రాంచ్‌గా సివిల్ ఇంజనీరింగ్‌ను చెప్పొచ్చు. ఇది రోడ్లు, భవంతులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, వంతెనలు, కాలువలు వంటి నిర్మాణాలకు సంబంధించి ప్రణాళికల రచన, రూపకల్పన, నిర్వహణ, పర్యవేక్షణ వంటి అంశాలను వివరిస్తుంది. ఇందులో కన్‌స్ట్రక్షన్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ ఇంజనీరింగ్, కోస్టల్ అండ్ ఓషన్ ఇంజనీరింగ్, ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీరింగ్, మెటీరియల్స్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ వంటి విభాగాలున్నాయి. స్మార్ట్ సిటీలు, పునరుత్పాదక ఇంధన వ్యవస్థలు, హై స్పీడ్ రైళ్లు తదితరాల్లో భారత్‌తో భాగస్వామ్యానికి స్పానిష్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. దీంతో దేశంలో మౌలిక వసతుల రంగంలో పెట్టుబడులు పెరగనున్నాయి. ఇలాంటి వాతావరణంలో సివిల్ ఇంజనీర్లకు డిమాండ్ పెరుగనుంది.
కోర్ సబ్జెక్టులు: సర్వేయింగ్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, బిల్డింగ్ టెక్నాలజీ, స్ట్రక్చరల్ అనాలసిస్ అండ్ డిజైన్, డిజైన్ ఆఫ్ హైడ్రాలిక్ స్ట్రక్చర్స్, ఆర్కిటెక్చర్ అండ్ టౌన్ ప్లానింగ్.విధులు: ప్రాజెక్టుల రూపకల్పనకు సర్వే రిపోర్టులు, మ్యాపులు వంటి వాటిని పరిశీలించడం. ప్రమాణాల ఆధారంగా రవాణా, హైడ్రాలిక్ వ్యవస్థలు, నిర్మాణాలకు ప్రణాళికల రచన, రూపకల్పన. ప్రణాళికలకు తగినట్లే నిర్మాణాలు కొనసాగుతున్నాయా.. లేదా? అనేది చూడటం.
నైపుణ్యాలు: నిర్మాణాలపై ఆసక్తి ఉండాలి. బృంద నైపుణ్యాలు, క్రిటికల్ థింకింగ్, ఊహాత్మక శక్తి, సృజనాత్మకత, మ్యాథమెటికల్ నైపుణ్యాలు, డ్రాయింగ్ స్కిల్స్, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ స్కిల్స్, రిపోర్టింగ్ స్కిల్స్. కెరీర్: రహదారులు, భవనాల శాఖ, నీటి పారుదల శాఖ, పంచాయతీరాజ్ విభాగం, ఇండియన్ రైల్వే, నేషనల్ హైవేస్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బోర్డు, కన్‌స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ తదితర విభాగాల్లో అవకాశాలు ఉంటాయి. ఎల్ అండ్ టీ; రిలయన్స్ ఇన్‌ఫ్రా; ఎల్‌ఎన్‌జే భిళ్వారా గ్రూప్ వంటివి టాప్ రిక్రూటర్లు.
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
భారత్‌లో ఎలక్ట్రానిక్స్‌రంగం వృద్ధి పథంలో పయనిస్తోంది. 2020 నాటికి ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ వస్తువుల ఉత్పత్తి విలువ 104 బిలియన్ డాలర్లకు చేరుకోనున్నట్లు అంచనా. ఇలాంటి పరిస్థితిలో ఎలక్ట్రానిక్స్ రంగంలో నైపుణ్యవంతులైన మానవ వనరులకు డిమాండ్ పెరిగింది. దేశంలో కేబుల్ సర్వీసుల డిజిటైజేషన్, పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ హా ర్డ్‌వేర్ టెక్నాలజీ పార్కుల ఏర్పాటు, ఎఫ్‌డీఐలకు ప్రోత్సాహక వాతావరణం ఉన్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్లకు అవకాశాలు పెరుగుతున్నాయి.కోర్ సబ్జెక్టులు: ఎలక్ట్రో మ్యాగ్నటిక్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అండ్ మెషీన్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్, మైక్రో ప్రాసెసర్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఆప్టికల్ సిస్టమ్స్, వీఎల్‌ఎస్‌ఐ. విధులు: కమ్యూనికేషన్ పరికరాలు, సర్వర్ల పనితీరును, సాంకేతికత పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం. నెట్‌వర్క్‌ల ఏర్పాటు,వాటి నిర్వహణ వంటివి ముఖ్య విధులు.
నైపుణ్యాలు: ఎలక్ట్రానిక్స్ పరికరాలపై ఆసక్తితో పాటు మ్యాథమెటికల్ నైపుణ్యాలు, సృజనాత్మకత, లాజికల్ థింకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. కెరీర్: కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఏవియేషన్ అండ్ ఏవియానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, కమ్యూనికేషన్స్, ట్రాన్స్‌పోర్టేషన్, టెలీ కమ్యూనికేషన్స్, రేడియో, టీవీ, కంప్యూటర్ అప్లికేషన్స్ తదితరాలతో సంబంధమున్న సంస్థల్లో అవకాశాలుంటాయి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఇన్ఫోసిస్, టీసీఎస్, మోటరోలా, శాంసంగ్, టెక్ మహీంద్ర, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, డీఆర్‌డీవో, ఇస్రో వంటివి టాప్ రిక్రూటర్లు.
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్(సీఎస్‌ఈ).. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ ప్రక్రియలకు సంబంధించిన కంప్యూటర్ ఆధారిత సమాచార వ్యవస్థల రూపకల్పన, నిర్మాణం, నిర్వహణ వంటి వాటిని వివరిస్తుంది. నేటి సాంకేతిక ప్రపంచంలో ‘కంప్యూటర్’ ప్రజల రోజువారీ జీవితంలో భాగమైపోయింది. ఈ క్రమంలో అన్ని కంపెనీలకూ కంప్యూటర్ ఇంజనీర్ల సేవలు అవసరమవుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఐటీ, అనుబంధ సేవలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. కేంద్ర గణాంకాల సంస్థ (సీఎస్‌వో) ప్రకారం జీడీపీలో కంప్యూటర్, దాని ఆధారిత సేవల వాటా 3.3శాతం. 2013-14లో ఈ రంగం 14.4 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది.ఈ నేపథ్యంలో సీఎస్‌ఈ పాపులర్ బ్రాంచ్‌గా కొనసాగుతోంది. పరిశోధనల పరంగా విస్తృత అవకాశాలు, దేశవిదేశాల్లో ఉన్నత వేతనాల కొలువుల నేపథ్యంలో ఈ బ్రాంచ్‌పై యువత క్రేజ్ పెంచుకుంది.
సబ్జెక్టులు: కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అండ్ ఆర్గనైజేషన్; డేటాబేస్ సిస్టమ్స్; ఎలక్ట్రానిక్స్; ఆపరేటింగ్ సిస్టమ్స్; నెట్‌వర్కింగ్; ఫౌండేషన్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్స్; జావా ప్రోగ్రామింగ్ అండ్ వెబ్‌సైట్ డిజైన్; ఈ-కామర్స్-ఈఆర్‌పీ అండ్ మల్టీమీడియా అప్లికేషన్స్.ఇంజనీర్ విధులు: డేటాబేస్ మేనేజ్‌మెంట్, ఐటీ, ఎంబెడెడ్ సిస్టమ్స్, టెలీకమ్యూనికేషన్స్, సాఫ్ట్‌వేర్-హార్డ్‌వేర్, మల్టీమీడియా, వెబ్‌డిజైనింగ్, గేమింగ్.. వంటి విభాగాల్లో పనిచేయాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ రూపకల్పన, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, టెస్టింగ్ వంటి బాధ్యతలుంటాయి.
నైపుణ్యాలు: కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌పై ఆసక్తి అవసరం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజింగ్ నైపుణ్యాలు, కంప్యూటింగ్ స్కిల్స్, లాజికల్ థింకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, బృంద స్ఫూర్తి అవసరం. కెరీర్: కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, కం ప్యూటర్ హార్డ్‌వేర్ సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీలు, కంప్యూటర్ నెట్‌వర్కింగ్ కంపెనీలు, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ తదితర కంపెనీల్లో అవకాశాలుంటాయి.
టాప్ రిక్రూటర్స్: టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, అసెంచర్, కాగ్నిజెంట్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, టెక్ మహీంద్ర.
మెటలర్జికల్ ఇంజనీరింగ్
కార్లు, బైకుల దగ్గరి నుంచి విమానాల వరకు వాటికి ఉపయోగపడే లోహ ఉత్పత్తుల డిజైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఉత్పత్తులను వివరించే ఇంజనీరింగ్ విభాగం మెటలర్జికల్ ఇంజనీరింగ్. భిన్న లోహాలు.. వాటి మిశ్రమాలు, వివిధ రంగాల్లో ఆ లోహాల అనువర్తితాలకు సంబంధించిన విస్తృత పరిజ్ఞానాన్ని ఇది విద్యార్థికి అందిస్తుంది. లోహాలు, వాటి స్వభావాలను అధ్యయనం చేస్తుంది.
కోర్ సబ్జెక్టులు: మెటీరియల్ సైన్స్, ఎలిమెంట్స్ ఆఫ్ ఫిజికల్ మెటలర్జీ, మెటలర్జికల్ థర్మోడైనమిక్స్, మినరల్ బెనిఫికేషన్, మెకానికల్ బిహేవియర్ అండ్ టెస్టింగ్ ఆఫ్ మెటీరియల్స్ వంటివి ఉంటాయి. విధులు, నైపుణ్యాలు: ముడి ఖనిజాల నుంచి అవసరమైన మూలకాలను సేకరించడంలో మెటలర్జికల్ ఇంజనీర్లు కీలకపాత్ర పోషిస్తారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిశ్రమలకు అవసరమైన మెటల్స్‌ను తయారు చేయడం; లోహాలు, వాటి మిశ్రమాలను పరీక్షించడం వంటి విధులు నిర్వహిస్తారు. విశ్లేషణ సామర్థ్యం, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, జియాలజీపై పట్టు ఉండాలి. అత్యాధునిక పరికరాలపై అవగాహన తప్పనిసరి.కెరీర్: సెయిల్, విశాఖ స్టీల్ ప్లాంట్, జిందాల్ స్టీల్ వర్క్స్, టిస్కో వంటివి టాప్ రిక్రూటర్లు.
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ) అనేది ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రో మ్యాగ్నటిజం గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ఇది విద్యుదుత్పత్తికి, పంపిణీకి, యంత్రాల నియంత్రణకు, కమ్యూనికేషన్స్‌కు అవసరమైన అప్లికేషన్ల రూపకల్పనను వివరిస్తుంది. విద్యుత్ యంత్రాల నిర్వహణ, నియంత్రణలో ఎలక్ట్రానిక్స్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఈ రెండింటి సమ్మేళనంగా ఉన్న ఈఈఈ కోర్సుకు ప్రాధాన్యత ఉంది. ఇది ఐసీల డిజైనింగ్, టెస్టింగ్, ఇండక్టర్స్, కెపాసిటర్స్‌పై ప్రధానంగా దృష్టిసారిస్తుంది.
ఈ ఇంజనీరింగ్‌లో పవర్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్, మైక్రో ఎలక్ట్రానిక్స్, సిగ్నల్ ప్రాసెసింగ్, టెలీకమ్యూనికేషన్స్ వంటి విభాగాలున్నాయి. విద్యుదుత్పత్తిని 2020నాటికి 50 శాతం పెం చడం లక్ష్యంగా కేంద్రం చర్యలు తీసుకుంటున్న క్రమంలో ఈఈఈ ఇంజనీర్లకు భవిష్యత్తు ఆశాజనకమని చెప్పొచ్చు.కోర్ సబ్జెక్టులు: పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మెషీన్‌స అండ్ డిజైన్, ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలసిస్ అండ్ సింథసిస్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రోమాగ్నటిక్ ఫీల్డ్స్, కంప్యూటర్ ఎయిడెడ్ పవర్ సిస్టమ్ అనాలసిస్, యుటిలైజేషన్ ఆఫ్ పవర్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెటీరియల్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ వంటి కోర్ సబ్జెక్టులను కోర్సులో భాగంగా అధ్యయనం చేస్తారు.
నైపుణ్యాలు: అనలిటికల్ స్కిల్స్, మ్యాథమెటికల్ నైపుణ్యాలు, బృంద స్ఫూర్తి, సూక్ష్మ పరిశీలన.
కెరీర్: దేశంలో ఉత్పాదక సంస్థలు, విద్యుత్ పంపిణీ సంస్థలు, పవర్ కార్పొరేషన్లు, డిజైనింగ్ పరిశ్రమలు, నేచురల్ గ్యాస్ ప్లాంట్లు, పెట్రోలియం, స్టీల్, రసాయన పరిశ్రమల్లో అవకాశాలుంటాయి. బీహెచ్‌ఈఎల్, ఎన్‌టీపీసీ, కోల్ ఇండియా లిమిటెడ్, ఐఓసీఎల్, ఓఎన్‌జీసీ, సెయిల్, గెయిల్, బీఈఎల్, హెచ్‌ఏఎల్, బీపీసీఎల్, డీఎంఆర్‌సీ, ఎన్‌హెచ్‌పీసీ, బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్, పవర్‌గ్రిడ్ వంటివి టాప్ రిక్రూటర్లు.
విద్యార్థుల ఆలోచనా ధోరణి పరంగా.. గత రెండు, మూడేళ్ల పరిస్థితిని విశ్లేషిస్తే ఈసీఈ, సీఎస్‌ఈ, ఈఈఈ, మెకానికల్, సివిల్ బ్రాంచ్‌లు పాపులర్ బ్రాంచ్‌లుగా భావించవచ్చు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ పరంగా చూసినా, ఈ బ్రాంచ్‌ల్లో బీటెక్ పూర్తిచేసిన అభ్యర్థులకు ఉన్నత అవకాశాలు లభిస్తున్నాయి. కంప్యూటర్ సైన్స్ అభ్యర్థికి ఎలాంటి స్కిల్స్ అవసరమో, ఐటీకి కూడా దాదాపు అలాంటి నైపుణ్యాలే ఉండాలి. సిలబస్‌లో రెండు బ్రాంచ్‌ల మధ్య తేడా చాలా తక్కువ ఉంటుంది. ఈ విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు గుర్తించాలి. నియామకాల విషయంలో పెద్దగా తేడా ఉండదు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పూర్తిచేస్తున్న వారిలో గూగుల్, ఫేస్‌బుక్, ఫ్లిప్‌కార్‌ట వంటి అత్యున్నత సంస్థల్లో లక్షల వేతనాలతో ఉద్యోగాలు వస్తాయని చాలా మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తుంటారు. అయితే ఇలాంటి అవకాశాలు దక్కేది లక్షకు పదిమందికి మాత్రమే అని గుర్తించాలి. మిగిలిన వారికి ఇతర ఐటీ సంస్థల్లో అవకాశాలుంటాయి. అందువల్ల బ్రాంచ్‌ను ఎంపిక చేసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి.
కోర్ బ్రాంచ్‌లు ఎప్పటికీ వన్నె తగ్గని బ్రాంచ్‌లు. జాబ్ మార్కెట్లో వీటికి ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. సీఎస్‌ఈ లేదా ఐటీ పూర్తిచేసిన వారిలో చాలా మందికి ఏడాదికి సగటున రూ.3.5 లక్షల వేతనాలు లభిస్తుంటే, కోర్ బ్రాంచ్‌ల్లో ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారికి ప్రారంభంలో రూ.5 లక్షల వరకు వేతనాలు ఉంటున్నాయి. ఇంజనీరింగ్ ఔత్సాహికులు ఈ విషయాన్ని గుర్తించాలి. డొమైన్ నాలెడ్జ్, టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులపై అవగాహన పెంచుకుంటే ఆసక్తికి అనుగుణంగా ఏ బ్రాంచ్ తీసుకున్నా అవకాశాలు అపారమన్నది వాస్తవం! అయితే ఆ అవకాశాలను అందుకోవాలన్న తపన, సరైన కార్యాచరణ ముఖ్యం!
- వి.ఉమామహేశ్వర్, ప్లేస్‌మెంట్ ఆఫీసర్,
యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఓయూ.