పంచాయతీ సెక్రటరీ..పట్టు సాధించే మార్గమిదీ! | Panchayat secretary Screening Test | Sakshi
Sakshi News home page

పంచాయతీ సెక్రటరీ..పట్టు సాధించే మార్గమిదీ!

Published Wed, Mar 15 2017 1:07 AM | Last Updated on Tue, Sep 5 2017 6:04 AM

పంచాయతీ సెక్రటరీ..పట్టు సాధించే మార్గమిదీ!

పంచాయతీ సెక్రటరీ..పట్టు సాధించే మార్గమిదీ!

పంచాయతీ సెక్రటరీ స్క్రీనింగ్‌ టెస్ట్‌.. రాష్ట్రంలో నిర్వహిస్తున్న మరో భారీ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌. దీనికి దాదాపు 5,67,798 మంది దరఖాస్తు చేసుకున్నారు. మెయిన్‌ ఎగ్జామినేషన్‌కు ఎంపికవ్వాలంటే ఇందులో చూపే ప్రతిభే కీలకం. ఏదైనా డిగ్రీ అర్హతగా పేర్కొన్న ఈ పరీక్షకు.. పీజీతో
పాటు బీటెక్‌ లాంటి సాంకేతిక డిగ్రీలు పొందిన అభ్యర్థులు సైతం దరఖాస్తు చేసుకున్నారు.
వీరి సంఖ్య 30 శాతం వరకు ఉంటుందని అంచనా. అంతేకాకుండా గ్రూప్‌–2, గ్రూప్‌–1
స్థాయి పరీక్షలకు సిద్ధమవుతున్న వారు సైతం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఇలా
అన్ని నేపథ్యాల నుంచి పోటీ నెలకొన్న తరుణంలో స్క్రీనింగ్‌ టెస్ట్‌లో రాణించడానికి
నిపుణుల సూచనలు...

ప్రణాళికతో..
పంచాయతీ సెక్రటరీ స్క్రీనింగ్‌ టెస్ట్‌కు అందుబాటులో ఉన్న సమయం దాదాపు 40 రోజులు. స్క్రీనింగ్‌ టెస్ట్‌లో పేర్కొన్న సిలబస్‌ ప్రకారం మొత్తం 13 అంశాలున్నాయి. వీటిలో పరస్పర అనుసంధానం ఉన్నవాటిని ఒకే సమయంలో.. మిగతా అంశాలను వేర్వేరు సమయాల్లో               చదివే విధంగా అభ్యర్థులు ప్రణాళిక రూపొందించుకోవాలి.

సిలబస్‌లో ఎనిమిది నుంచి పదో అంశం వరకు పంచాయతీ రాజ్‌ వ్యవస్థకు సంబంధించినవి ఉన్నాయి. వీటిని ఒక క్రమంలో చదివే విధంగా టైమ్‌ ప్లాన్‌ రూపొందించుకోవాలి.

పదకొండు నుంచి పదమూడో అంశం వరకు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, మహిళా సాధికారత తదితర అంశాలున్నాయి. వీటిని ఒక క్రమంలో చదవాలి.

ఒకటి నుంచి నాలుగో అంశం వరకు కరెంట్‌ అఫైర్స్, బేసిక్‌ జనరల్‌ సైన్స్, ఆధునిక భారతదేశ చరిత్ర, ఆర్థికాభివృద్ధి తదితరాలున్నాయి. ఆరో అంశంలో భారత రాజ్యాంగం, ఏడో అంశంలో ఆంధ్రప్రదేశ్‌ విభజన, పరిపాలన, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, న్యాయ పరంగా ఎదురైన సమస్యలకు సంబంధించినవి ఉన్నాయి. వీటికి సంబంధించిన ముఖ్యాంశాలను అధ్యయనం చేయాలి.  ఆంధ్రప్రదేశ్‌ అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి ఐదో అంశంలో పేర్కొన్న లాజికల్‌ రీజనింగ్, అనలిటికల్‌ ఎబి
లిటీ, డేటా ఇంటర్‌ప్రిటే
షన్‌కు ప్రత్యేక సమయం కేటాయించాలి.
ఇలా మొత్తం పదమూడు అంశాలను వర్గీకరించుకొని.. ప్రతిరోజూ కనీసం ఎనిమిది నుంచి పది గంటలు చదివేలా టైం టేబుల్‌ రూపొందించుకోవాలి.

ప్రాధాన్యం ఇలా
ప్రిపరేషన్‌ పరంగా అభ్యర్థులు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశాల క్రమం..
జాతీయ స్థాయిలో పంచాయతీ రాజ్‌ వ్యవస్థ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు.
73, 74వ రాజ్యాంగ సవరణలు
పంచాయతీరాజ్‌ వ్యవస్థలో విధులు–విధానాలు
కమిటీలు – సిఫార్సులు
మహిళా సాధికారత, స్వయం సహాయ సంఘాల ఏర్పాటు.
గ్రామీణాభివృద్ధి పథకాలు (డ్వాక్రా, డ్వామా, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం)
రాష్ట్ర స్థాయిలో అమలవుతున్న పథకాలు, వాటి అమలుకు సంబంధించి నిధుల కేటాయింపు గణాంకాలు.
వీటిని అధ్యయనం చేయడం ద్వారా                 పదమూడు అంశాల్లో నాలుగింటికి             సంబంధించి పూర్తి అవగాహన పొందే               అవకాశం ఉంటుంది.

జనరల్‌ స్టడీస్‌ విషయంలో..
సమకాలీనంగా ప్రాధాన్యం సంతరించుకున్న జాతీయ, అంతర్జాతీయ అంశాలపై దృష్టి సారించాలి.

చరిత్రకు సంబంధించి ఆధునిక చరిత్ర అని స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో మొదటి స్వాతంత్య్ర పోరాటం (సిపాయిల తిరుగుబాటు) నుంచి స్వాతంత్య్ర సాధన వరకు ముఖ్యమైన ఉద్యమాలు, తేదీలు, నేతృత్వం వహించిన వ్యక్తుల గురించి తెలుసుకోవాలి.

ఎకానమీకి సంబంధించి పంచవర్ష ప్రణాళికలపై దృష్టి పెట్టాలి. అదే విధంగా ఇటీవల కాలంలో ఆర్థికంగా చేపట్టిన సంస్కరణల గురించి తెలుసుకోవాలి.

రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగ రచనా కమిటీ, పీఠిక, ఆర్టికల్స్‌ గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి, సమానత్వ హక్కుకు సంబంధించిన ఆర్టికల్స్, వాటిలో పొందుపర్చిన అంశాలను ఔపోసన పట్టాలి.

లాజికల్‌ రీజనింగ్, అనలిటికల్‌ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ కోసం.. పదో తరగతి స్థాయిలోని మ్యాథమెటిక్స్‌ బేసిక్స్‌పై అవగాహన పొందడమే కాకుండా ప్రాక్టీస్‌ చేయడం ముఖ్యం.

పునర్విభజన సమస్యలపై ప్రత్యేకంగా
పంచాయతీ సెక్రటరీ స్క్రీనింగ్‌ టెస్ట్‌లో అభ్యర్థులు ప్రధానంగా దృష్టి సారించాల్సిన అంశాలు.. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన, దీనికి సంబంధించిన నేపథ్యం, ఆ తర్వాతి కాలంలో (గత మూడేళ్లలో) ఏర్పడిన పరిస్థితులు, అమలు చేస్తున్న పథకాలు.

రాష్ట్ర బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధి కోసం కేటాయించిన నిధులు, కొత్త పథకాల గురించి ప్రత్యేక దృష్టితో అధ్యయనం చేయాలి.

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన తదనంతర పరిణామాలు, పర్యవసానాల గురించి మెయిన్‌ ఎగ్జామినేషన్‌లో పొందుపర్చిన సిలబస్‌ను ఆధారంగా చేసుకుంటూ చదవడం వల్ల స్పష్టతతో ముందుకు సాగే అవకాశం ఉంటుంది. కారణం.. మెయిన్‌ ఎగ్జామినేషన్‌లో ఈ విభాగానికి సంబంధించి ఏయే అంశాలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారో సిలబస్‌లో పేర్కొనడమే (ఉదాహరణకు ఉమ్మడి సంస్థల విభజన, పునర్నిర్మాణం, ఉద్యోగుల విభజన – స్థానికత అంశాలు తదితరాలు).
రివిజన్‌ సులువుగా..
అభ్యర్థులు ప్రిపరేషన్‌ క్రమంలోనే కొన్ని వ్యూహాలతో రివిజన్‌ను సులభతరం చేసుకోవచ్చు. ఇందుకోసం అనుసరించాల్సిన వ్యూహాలు..

కమిటీలు – ఏర్పాటైన సంవత్సరాలు– నేతృత్వం వహించిన వ్యక్తులు –            సిఫార్సులను ఒక టేబుల్‌గా రూపొందించుకోవాలి.

ముఖ్యమైన రాజ్యాంగ అధికరణలు – వాటిలో పేర్కొన్న అంశాలను ఒక జాబితాగా రూపొందించుకోవాలి.

చరిత్రకు సంబంధించి ముఖ్యమైన ఘట్టాలు, ఉద్యమాలతో కూడిన జాబితా తయారుచేసుకోవాలి.

ఏకానమీ విషయంలో పంచవర్ష ప్రణాళికల లక్ష్యాలు, ప్రాధాన్య అంశాలు, సాధించిన వృద్ధిరేటు తదితరాలను వరుసగా రాసుకోవాలి.
ఆర్థిక సర్వేలో పేర్కొన్న ముఖ్య గణాంకాలు, సిఫార్సులను ఒకచోట రాసుకోవాలి.
గ్రామీణాభివృద్ధి పథకాల జాబితా మొత్తాన్ని ఒక చోట పొందుపర్చుకోవాలి.
కరెంట్‌ అఫైర్స్‌కు సంబంధించి ముఖ్య సదస్సులు – తీర్మానాలు; విదేశీ పర్యటనలు, ఒప్పందాలు, అవార్డులు – గ్రహీతలు తదితరాలను ఒక జాబితాగా రాసుకోవాలి.

స్క్రీనింగ్‌ టెస్ట్‌
పేపర్‌    ప్రశ్నలు    మార్కులు    సమయం
జనరల్‌ స్టడీస్‌    150    150    150
 పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 23, 2017
 సమయం: ఉదయం 10:00 నుంచి 12:30

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement