షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో)
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీవో) ఒక రాజకీయ, ఆర్థిక, సైనిక సంస్థ. ఇది 2001లో ఏర్పడింది. దీంట్లో చైనా, రష్యా, కజకిస్థాన్, కిర్గిజిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇది మొదట 1996లో ‘షాంఘై ఫైవ్’గా ఏర్పాటైంది. 2001లో ఉజ్బెకిస్థాన్ చేరడంతో షాంఘై సహకార సంస్థగా పేరు మార్చారు. దీని ప్రధాన కార్యాలయం చైనా రాజధాని బీజింగ్‌లో ఉంది. దీని ప్రస్తుత సెక్రటరీ జనరల్ రష్యాకు చెందిన డిమిత్రి మెజెంత్సెవ్. ఈ సంస్థకు భారత్, అఫ్గానిస్థాన్, ఇరాన్, మంగోలియా, పాకిస్థాన్ పరిశీలక దేశాలుగా వ్యవహరిస్తున్నాయి. ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం సభ్యదేశాలను ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం నుంచి కాపాడటం.
13వ శిఖరాగ్ర సదస్సు:షాంఘై సహకార సంస్థ 13వ శిఖరాగ్ర సదస్సు 2014, సెప్టెంబర్ 11,12న తజికిస్థాన్ రాజధాని దుషాంబేలో జరిగింది.
సదస్సుకు హాజరైన దేశాధినేతలు:
ఇమోమలీ రహమాన్ తజికిస్థాన్
జీ జిన్‌పింగ్ చైనా
వ్లాదిమిర్ పుతిన్ రష్యా
నుర్‌సుల్తాన్ నజర్‌బయేవ్ కజకిస్థాన్
అల్మాజ్‌బెక్ అతంబయేవ్ కిర్గిజిస్థాన్
ఇస్లామ్ కరిమోవ్ - ఉజ్బెకిస్థాన్
ఈ సదస్సుకు భారత్ తరఫున విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ హాజరయ్యారు. ఎస్‌సీవో 14వ శిఖరాగ్ర సదస్సు 2015, జూలై 9,10న రష్యాలోని ఉఫా నగరంలో జరగనుంది. ఈ సదస్సులో భారత్‌కు పూర్తిస్థాయి సభ్యత్వం లభించే అవకాశముంది. ఈ సమావేశాన్ని ఏడో బ్రిక్స్ సదస్సుతోపాటు నిర్వహించనున్నారు.