ఆవిర్భవించిన నాటి లక్ష్యాలు విడిచి చాన్నాళ్లుగా దారీ తెన్నూ లేకుండా మిగిలిపోయిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) రెండు రోజుల శిఖరాగ్ర సదస్సు కజఖ్‌స్తాన్‌లోని ఆస్తానాలో గురువారం ముగిసింది. ఈ సదస్సువల్ల ఇతరత్రా పెద్ద ప్రయోజనం లేకపోవచ్చుగానీ మనతోవున్న సరిహద్దు సమస్యను నాలుగేళ్లుగా దాటవేస్తున్న చైనాతో మన విదేశాంగమంత్రి జైశంకర్ భేటీ కావటం ఉన్నంతలో జరిగిన మేలు. వాస్తవానికి ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కావాల్సివుండగా ఆయన బదులు విదేశాంగ మంత్రి వెళ్లారు.
ప్రధాని ప్రసంగాన్ని చదివి వినిపించారు. మోదీ గైర్హాజరు ఆ సంస్థనుంచి భారత్ దూరం జరగటానికి సంకేతమనీ, అమెరికా ఒత్తిడే ఇందుకు కారణమనీ చైనా అనుకూల మీడియా ప్రచారం చేసుకుంది. నిరుడు భారత్ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో ఎస్‌సీఓ శిఖరాగ్ర సదస్సు జరిగినప్పుడు కూడా ఇలాంటి భాష్యాలే చెప్పారు. చైనాతో నేరుగా సమావేశం కావటం ఇష్టం లేకే ఈ లాంఛనం పూర్తిచేసిందని ఆ భాష్యాల సారాంశం. నిజమే... ప్రపంచంలో 40 శాతం జనాభాతో, ప్రపంచ జీడీపీలో 23 లక్షల కోట్ల మేర వాటాతో ఉన్న దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్‌సీఓను విస్మరించటం మంచిది కాదు. కానీ ఆ సంస్థ ఆరంభ కాలంనాటి లక్ష్యాలను గుర్తుంచుకుందా? వాటికి అనుగుణంగా పనిచేస్తున్నదా అంటే లేదనే చెప్పాలి.
వర్తక, వాణిజ్యాల్లో దాని ముద్ర లేకపోలేదు. అయితే ఆ సంస్థ పరిధిలోని ప్రాంతాల్లో ఉగ్రవాదం, మాదకద్రవ్యాల రవాణా వగైరా పోకడల గురించి అది సక్రమంగా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. మోదీ ప్రసంగంలో ఈ సమస్యలే ప్రధానంగా ప్రస్తావనకొచ్చాయి. 1996లో షాంఘై ఫైవ్‌గా ఏర్పడ్డ బృందంలో చైనా, రష్యా, కజఖ్‌స్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్‌లున్నాయి. 1991లో సోవియెట్ యూనియన్ కుప్పకూలాక ఆ ప్రాంతంలో తెగల ఘర్షణలు పెచ్చుమీరటంతో భద్రతాపరమైన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి ఈ బృందం ఆవిర్భవించింది.
అంతర్జాతీయ సంస్థగా మలచాలన్న లక్ష్యంతో 2001లో దీన్ని ఎస్‌సీఓగా మార్చారు. మన దేశానికి సభ్యత్వం ఇవ్వాలన్న రష్యా ప్రతిపాదనను అంగీకరిస్తూనే 2017లో తనకు అనుకూలంగా ఉన్న పాకిస్తాన్‌ను ఇందులో చేర్చింది చైనాయే. కానీ ఉగ్రవాదులకు సాయం చేస్తున్నట్టు వెల్లడై అనేకసార్లు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల అభిశంసనకు గురైన పాక్‌ను దారి మార్చుకోవాలని చెప్పటంలో చైనా విఫలమైంది.
అలాగే పాకిస్తాన్‌లో తలదాచుకున్న ఉగ్రవాదుల జాబితాను మన ప్రతిపాదన పర్యవసానంగా భద్రతామండలి చర్యలు తీసుకుంటున్న తరుణంలో చైనా గండికొట్టింది. సరిగదా తన బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ (బీఆర్‌ఐ)ను పాకిస్తాన్ అధీనంలోవున్న ఆక్రమిత కశ్మీర్ గుండా వెళ్లేలా రూపొందించింది. అందుకే 2018లో ఎస్‌సీఓలో బీఆర్‌ఐను అందరూ అంగీకరించినా మన దేశం వ్యతిరేకించాల్సి వచ్చింది. నిరుడు జరిగిన ఆన్‌లైన్ సదస్సులో కూడా మన దేశం బీఆర్‌ఐ గురించిన పేరా తొలగిస్తే తప్ప ఉమ్మడి ప్రకటనపై సంతకం చేసేది లేదని చెప్పింది.
ఆ సంగతలావుంచి ఎస్‌సీఓను అమెరికా, పాశ్చాత్య దేశాల నేతృత్వంలోని సంస్థలకు దీటుగా తీర్చిదిద్దాలనుకుంటున్న చైనా అందుకు అనుగుణమైన నడవడి కనబరచవద్దా? వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద భారీగా సైన్యాన్ని మోహరించి దురాక్రమణకు పాల్పడినప్పుడు ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. 2020లో ఘర్షణలు చెలరేగాక భారత్, చైనాల సైనికాధికారుల స్థాయిలో 20 సార్లు, దౌత్యస్థాయిలో 13 రౌండ్లు చర్చలు జరిగాక ప్యాంగాంగ్ సో సహా అయిదు చోట్ల ఇరు దేశాల సైన్యాలూ వెనక్కి తగ్గటానికి అంగీకరించాయి.
తూర్పు లద్దాఖ్‌లోని ప్రాంతాల్లో పరిస్థితి మారలేదు. దీన్ని పక్కనబెట్టి ఇరు దేశాల సంబంధాలూ సాధారణ స్థితికి తీసుకురావాలని చైనా కోరుతోంది. కానీ అక్కడ 2020 ఏప్రిల్ నాటి స్థితికి చైనా సిద్ధపడితేనే అది అసాధ్యమన్నది మన దేశం వాదన. మన సరిహద్దుకు సమీపంగా ఈ నాలుగేళ్లలో చైనా 600 ‘సంపన్న గ్రామాల’ను నిర్మించింది. మన దేశం కూడా అరుణాచల్‌లో 60 గ్రామాలు నిర్మిస్తోంది.
మున్ముందు అరుణాచల్, హిమాచల్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, సిక్కింలలో ఇలాంటివి 3,000 గ్రామాలు నిర్మించాలన్నది మన దేశం లక్ష్యం. ఇదిగాక అమెరికన్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం దలైలామాను కలవడానికి మన దేశం అంగీకరించటం, దక్షిణ చైనా సముద్రంలో చైనాతో ఫిలిప్పీన్స్‌కు వచ్చిన తగాదాలో ఫిలిప్పీన్స్‌ను సమర్థించటం చైనాకు కంటగింపుగా ఉంది. అటు చైనా మనతో స్నేహసంబంధాలున్న హిందూ మహాసముద్ర ప్రాంత దేశాలను దువ్వుతూ మనకు వ్యతిరేకంగా కూడగడుతోంది.
ఈ నేపథ్యంలో ఎల్‌ఏసీ సమస్యపై భారత్‌తో చర్చించి, దాన్ని త్వరగా పరిష్కరించుకోవాలన్న జ్ఞానం చైనాకు ఉండాలి. అసలు ఎల్‌ఏసీ మ్యాప్‌లను ఇచ్చిపుచ్చుకుందామన్న మన ప్రతిపాదనకే అది జవాబివ్వటం లేదు. ఆ పని చేస్తే తన పాపం బద్దలవుతుందని దాని భయం. వర్తక వాణిజ్యాలు ముమ్మరంగా పెరిగేలా, కట్టుదిట్టమైన భద్రత ఉండేలా ఎస్‌సీఓను తీర్చిదిద్దుతామని మాటల్లో చెబుతూనే అతి పెద్ద మార్కెట్‌గా ఉన్న భారత్‌ను విస్మరించటం ఏ రకంగా చూసినా చైనాకు తోడ్పడదు.
పొరుగుతో సఖ్యతకు రాలేని దేశం ఇటువంటి సంస్థల అభ్యున్నతికి ఏమాత్రం పాటుపడగలదన్న ప్రశ్నలు అందరిలోనూ తలెత్తుతాయి. అందువల్లే మళ్లీ చర్చల పునరుద్ధరణకు చైనా చొరవ తీసుకోవాలి. చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీ, జైశంకర్‌ల మధ్య జరిగిన భేటీ ఆ దిశగా తోడ్పడితే మంచిదే. సమస్య పరిష్కారానికి ఇరు దేశాలూ చిత్తశుద్ధితో ప్రయత్నించి సఫలమైతేనే ఎస్‌సీఓ వంటి సంస్థల నిజమైన లక్ష్యాలు నెరవేరతాయి.
Comments
Please login to add a commentAdd a comment