విదేశాంగ విధానంలో మొదటినుంచీ విలక్షణ శైలిని అవలంబిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ ఈసారి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో శిఖరాగ్ర స్థాయి భేటీ జరపబోతున్నారు. అందుకోసం ఆయన శుక్ర, శనివారాల్లో ఆ దేశంలో పర్యటించబోతున్నారు. శిఖరాగ్ర సమావేశాలకు సాధారణంగా దీర్ఘకాల కసరత్తు జరుగుతుంది. ప్రస్తుత సమావేశం విషయంలో అలాంటిది లేదు. దీనికసలు నిర్దిష్టమైన ఎజెండాయే లేదు. ఆ సంగతలా ఉంచి ఆకస్మికంగా చివరి నిమిషంలో ఇరు దేశాధినేతల భేటీ గురించి ప్రకటించడం దౌత్య నిపుణులను సైతం ఆశ్చర్యపరిచి ఉంటుంది. ఏదో మేరకు సానుకూల వాతావరణం ఉన్నదని భావించడం వల్లనే ఈ శిఖరాగ్ర భేటీకి ఇరుదేశాలూ సిద్ధపడ్డాయని, ఈ చర్చల తర్వాత రెండింటిమధ్యా మరింత సాన్నిహిత్యం ఏర్పడటానికి అవకాశం ఉంటుందని సహజంగానే అందరూ ఆశిస్తారు.
ప్రధానిగా 2014 మే నెలలో ప్రమాణస్వీకారం చేసినప్పుడు నరేంద్రమోదీ ఆ కార్యక్రమానికి సార్క్ దేశాల అధినేతలను ఆహ్వానించారు. అలాగే 2015 డిసెంబర్‌లో భారత్–పాకిస్తాన్‌ల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్న సమయంలో ఆయన రష్యా పర్యటన ముగించుకుని అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ వెళ్లి అటునుంచి స్వదేశానికొస్తూ ఉన్నట్టుండి లాహోర్ వెళ్తున్నట్టు ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా అయితే దేశాధినేతల మధ్య సమావేశాలు జరగడానికి నిర్దిష్టమైన ప్రొటోకాల్ ఉంటుంది. సార్క్ దేశాల అధినేతలు ఇక్కడికొచ్చినప్పుడు, మోదీ లాహోర్ వెళ్లినప్పుడు, ప్రస్తుత చైనా పర్యటన సందర్భంలో అలాంటి కసరత్తులేమీ లేవు. అందుకే ‘ఒక పద్ధతి పాటించకుండా ఇదేం దౌత్యమ’ని గతంలో కాంగ్రెస్ ఎద్దేవా చేసింది.
అయితే చర్చలెప్పుడూ మంచివే. వాటి పర్యవసానంగా వెనువెంటనే సత్ఫలితాలు కనబడకపోయినా వాటిని స్వాగతించాల్సిందే. దీర్ఘకాలంలో వాటి ప్రయోజనం వాటికుంటుంది.
బీజింగ్‌లో మంగళవారం జరిగిన షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీవో) సభ్యదేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికెళ్లిన విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ చైనా ప్రభుత్వంలోని ముఖ్య నేతలతో భేటీ అనంతరం ఇరు దేశాల అధినేతల శిఖరాగ్ర సమావేశం గురించి ప్రకటించారు. ఇప్పుడు ఇరు దేశాధినేతల మధ్యా చర్చలు జరగబోతున్న ఉహాన్ నగరం చరిత్రలో అనేక ఘట్టాలకు వేదిక.
కొన్ని విధానాల విషయంలో కమ్యూనిస్టు పార్టీలోని పాత తరం నేతలతో వైరుధ్యాలొచ్చినప్పుడు ఆనాటి చైనా చైర్మన్ మావో జెడాంగ్ 1966లో ప్రయాణ సాధనాలనూ, అధికార లాంఛనాలనూ పక్కనబెట్టి యాంగ్సీ నదిలో 15 కిలోమీటర్ల మేర ఈతకొట్టి ఈ నగరానికి చేరుకోవడం అప్పట్లో ఒక సంచలనం. ఒక ప్రపంచ రికార్డు. అప్పటికాయన వయస్సు 73 ఏళ్లు. ఆ నగరంలోనే రెడ్‌గార్డుల ఆవిర్భావం, చైనా చరిత్రను మలుపుతిప్పిన సాంస్కృతిక విప్లవం పురుడు పోసుకున్నాయి. ఇప్పటికీ అక్కడి కమ్యూనిస్టు పార్టీ రాజకీయాల్లో ఉహాన్ నగరానికి విశేష ప్రాధాన్యత ఉంది. ప్రస్తుత శిఖరాగ్ర భేటీకి ఈ నగరాన్ని ఎంచుకోవడం మన ప్రధానికి చైనా ఇచ్చే ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.
2015లో మోదీ చైనా పర్యటనకెళ్లినప్పుడు షియాన్‌లో ఆ దేశ ప్రధాని లీ కెకియాంగ్‌తో చర్చలు జరిపారు. మోదీని ప్రత్యేకంగా కలవడానికి అప్పుడు జిన్‌పింగ్ వచ్చినా ప్రధానంగా ఇరు దేశాల ప్రధానుల మధ్యే భేటీ జరిగింది. ఇప్పుడా వైఖరిని చైనా సవరించుకుంది. రెండు దేశాల మధ్యా పరిష్కారానికి ఎదురుచూస్తున్న సమస్యలెన్నో ఉన్నాయి. ముఖ్యంగా గిల్గిత్–బాల్టిస్తాన్‌ల మీదుగా వెళ్లే చైనా–పాకిస్తాన్ కారిడార్‌కు మన దేశం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇది మన సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించడమేనని భావిస్తోంది. ఇక అణు సరఫరాదారుల గ్రూపు(ఎన్‌ఎస్‌జీ)లో సభ్యత్వం, భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం సాధించడానికి మన దేశం చేస్తున్న ప్రయత్నాలకు చైనా మోకాలడ్డుతోంది.
పాక్ ఉగ్రవాద సంస్థ నాయకుడు మసూద్ అజర్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా పరి గణించాలని ఐక్యరాజ్యసమితిని మన దేశం కోరుతుంటే దానికి చైనా అడ్డుపుల్లలేస్తోంది. బ్రహ్మపుత్ర, సట్లేజ్ నదుల్లో ప్రవహించే జలాల డేటాను ఇవ్వడాన్ని నిలిపేసింది. నాథూలా మార్గంవైపు మానస సరోవర యాత్ర జరపరాదని నిరుడు నిషేధం పెట్టింది. వీటిల్లో నదీజలాల డేటా పంచుకోవడానికి, నాథూలా మార్గాన్ని తిరిగి తెరిచేందుకు మొన్న సుష్మా స్వరాజ్ భేటీ తర్వాత చైనా అంగీకరించింది. మన నుంచి ఆ దేశం ఆశిస్తున్నవి కొన్ని ఉన్నాయి. భారత్‌లోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు... మరీ ముఖ్యంగా పోర్టులు, టెలికాం రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు తమను అనుమతించాలని అది కోరుకుంటోంది.
తమ నేతృత్వంలో ప్రారంభమయ్యే బృహత్తర ప్రాజెక్టు బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ (బీఆర్‌ఐ)పై అపోహలు విడనాడి అందులో పాలుపంచుకోవాలని కోరుకుంటోంది. ఇటు మన దేశం కూడా సరిహద్దు వివాదాల్లో చైనా సామరస్య ధోరణిలో మెల గాలని ఆశిస్తోంది. సరిహద్దుల్లో తరచు చైనా సైన్యం చేస్తున్న హడావుడి సరైంది కాదని భావిస్తోంది. అలాగే మన ఉత్పత్తులను మరింతగా దిగుమతి చేసుకోవడం ద్వారా వాణిజ్యలోటును భర్తీ చేయాలని వాదిస్తోంది. చైనా నుంచి మనం 2016–17లో 6,100 కోట్ల డాలర్ల దిగుమతులు చేసుకుంటే, అదే కాలంలో చైనా మాత్రం మన దేశంనుంచి 1,000 కోట్ల డాలర్ల దిగుమతులు చేసు కుంది.
ఈ సమస్యలన్నీ ప్రస్తుత శిఖరాగ్ర సమావేశంలోనే పరిష్కారం కాగలవని అను కోనవసరం లేదు. కానీ ఆ దిశగా ఒక ముందడుగు పడుతుంది. అయితే మనవైపు నుంచి ఒక సమస్య ఉంది. సంప్రదాయానికి భిన్నంగా, చొరవ తీసుకుని వివిధ దేశాల అధినేతలతో మోదీ చర్చలు జరిపినా వాటికి కొనసాగింపుగా జరగాల్సిన కృషి మాత్రం మందగిస్తోంది. ఆ విషయంలో లోటుపాట్లు సరిదిద్దుకుంటే చైనా దేశాధినేతతో జరగబోయే ప్రస్తుత శిఖరాగ్ర సమావేశం మెరుగైన ఫలితాలను సాధించగలదు.
Comments
Please login to add a commentAdd a comment