చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్రమోదీ శుక్ర, శనివారాల్లో జరిపే ‘అనధికార’ శిఖరాగ్ర భేటీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. మధ్య చైనాలోని వూహాన్ నగరంలో జరిగే రెండు అతి పెద్ద ఆసియా దేశాల నేతలు పాల్గొనే ఏకాంత సమావేశంలో వారు ఏం మాట్లాడతారో అధికారికంగా ప్రకటించలేదు. గత కొన్నేళ్లలో జిన్‌పింగ్, మోదీ పదిసార్లు కలిశారు. రెండు దేశాల రాజధానులతోపాటు పరస్పరం వారి సొంతూళ్లు సందర్శించారు. కాని, ఈ రెండు రోజుల భేటీని 1988లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ తొలి చైనా పర్యటనతో పోల్చడం విశేషం. 1954లో తొలి ప్రధాని నెహ్రూ తర్వాత 34 ఏళ్లకు చైనా వెళ్లిన మొదటి ప్రధానిగా రాజీవ్ పర్యటనకు ఎంతో ప్రాధాన్యం లభించింది.
మరి తరచు బహుపాక్షిక సమావేశాల్లో కూడా కలుసుకుని మాట్లాడుకున్న నేపథ్యమున్న మోదీ, జిన్‌పింగ్ ‘అనధికార’ శిఖరాగ్ర భేటీకి అధిక ప్రాముఖ్యం ఇవ్వడానికి కారణాలున్నాయి. ఇలా శక్తిమంతమైన దేశాల నేతలతో అధికారిక లాంఛనాలు లేకుండా భేటీ కావడం జిన్‌పింగ్‌కు కొత్తేమీ కాదు. ఇంతకు ముందు అధ్యక్షుడు బరాక్ ఒబామాతో అమెరికాలోని కాలిఫోర్నియా సనీలాండ్స్‌లో, ప్రస్తుత అమెరికా నేత డొనాల్డ్ ట్రంప్‌తో ఫ్లారిడాలోని ఆయన విహారకేంద్రం మార లాగోలో ఏకాంత సమావేశాలు చైనా నేత జరిపారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక మారిన అంతర్జాతీయ పరిస్థితుల్లో మోదీ, జిన్‌పింగ్ భేటీ కీలక ప్రాధాన్యం సంతరించుకుంది.
చర్చకు రానున్న ద్వైపాక్షిక సమస్యలు
కిందటేడాది వేసవిలో భూటాన్‌ను ఆనుకుని ఉన్న డోక్లామ్‌లో భారత, చైనా సేనలు మోహరించి 73 రోజులపాటు రెండు దేశాల మధ్య ఉద్రిక్తలకు కారణమయ్యాయి. వివాదం యుద్ధానికి దారితీయకపోయినా సేనల ఉపసంహరణతో శాంతి పునరుద్ధరణ జరిగింది. ఈ అంశంతోపాటు దశాబ్దాలుగా పరిష్కారం కాని సరిహద్దు వివాదం కూడా ఇద్దరు నేతల సమావేశంలో చర్చకు రావచ్చని భావిస్తున్నారు. ఇండియాతో వాణిజ్య సంబంధాలు ఎక్కువ ఉన్న మధ్య చైనాలో జరుగుతున్న ఈ సమావేశంలో భారత్‌కు అంతకంతకు పెరుగుతున్న ఎగుమతులు, ద్వైపాక్షిక వాణిజ్యంలో అసమతూకం కూడా ప్రస్తావనకు వస్తుందని అంచనా. ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్‌కు చైనా మద్దతు, చైనా పాక్ ఆర్థిక కారిడర్(సీపీఈసీ), ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వం వంటి అనేక అంశాల్లో చైనాతో విభేదిస్తూ ఇండియా దృఢ వైఖరి అవలంబిస్తోంది. సీపీఈసీ ప్రాజెక్టు పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా నిర్మిస్తున్న కారణంగా భారత్ దీనిపై తీవ్ర అభ్యంతరం ప్రకటించింది. శతాబ్దాల నాటి పాత సిల్క్ రోడ్డు నీడలో భారీ లక్ష్యాలతో చైనా ప్రారంభించిన బెల్ట్, రోడ్ మౌలికసదుపాయాల ప్రాజెక్టులో భారత్‌ను భాగస్వామిని చేయడానికి ఇప్పటి వరకూ చైనా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
ట్రంప్ పోకడలతో చైనా, భారత్ సత్సంబంధాలకు సదవకాశం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనూహ్య, అనిశ్చిత విధానాల కారణంగా చైనా, ఇండియాలు తమ విభేదాలు పక్కనబెట్టి మరింత దగ్గరయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. పశ్చిమాసియా సంక్షోభం వల్ల పూర్వపు ప్రచ్ఛన్న యుద్ధ కాలాన్ని గుర్తుచేసేలా రష్యాతో అమెరికా శత్రుత్వం పెంచుకుంటోంది. మరో పక్క వాణిజ్యరంగంలో ట్రంప్ వైఖరి చైనాకు గుబులు పుట్టించేలా ఉంది. చైనాకు నష్టదాయకంగా మారే సుంకాలు, పన్నుల విధానాన్ని ట్రంప్ అనుసరిస్తున్నారు. ఇంకా చైనా ఉపగ్రహ దేశంగా పేరున్న ఉత్తర కొరియాను తన అదుపులోకి తేవడానికి అమెరికా ప్రయత్నాలు కూడా చైనా వైఖరిలో మార్పునకు దారితీస్తున్నాయి. అందుకే ప్రాంతీయ విభేదాలు విస్మరించి జపాన్, వియత్నాంతో చైనా మెరుగైన సంబంధాలకు ప్రయత్నిస్తోంది. ఇలా ట్రంప్ దుందుడుకు విధానాలు కారణంగా భారత్‌తో చైనా స్నేహం బలపడేందుకు ఈ శిఖరాగ్ర సమావేశం ఎంత వరకు దోహదం చేస్తుందో చూడాల్సి ఉంది.
వెంట వెంటనే చైనా మోదీ యాత్రలు!
నెల రోజుల్లోనే షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సభలో పాల్గొనడానికి మళ్లీ చైనా వెళ్లనున్న భారత ప్రధాని ఇంత హడావుడిగా జిన్‌పింగ్‌తో ఏకాంత భేటీకి చైనాలో నిర్ణయం ప్రకటించడం తొలుత సంచలనం సృష్టించింది. భారత ప్రధానితో జరిపే ఈ విలక్షణ భేటీపై అంచనాలు పెరుగుతున్నాయి. అయితే, రెండు రోజుల సమావేశం ముగిశాక ముందే చెప్పినట్టు సంయుక్త ప్రకటన ఉండదు. ఇద్దరు నేతల సంయుక్త విలేఖరుల సమావేశం కూడా జరగదు. వారి చర్చల వివరాలు, ఏవైనా ఉంటే ఫలితాలను ఆ తర్వాత వెల్లడిస్తారని చైనా మంత్రి చెప్పారు.
1988 నాటి రాజీవ్, చైనా నేత డెంగ్ జియావోపింగ్‌తో జరిపిన సమావేశంతోనే గాక, 1972లో జనచైనా సందర్శనకు వెళ్లిన తొలి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఇదే వూహాన్ నగరంలోని అప్పటి చైనా విప్లవ నేత మావో జెడాంగ్ సొంతిట్లో ఆయనతో జరిపిన భేటీతో కూడా మోదీ-జిన్‌పింగ్ సమావేశాన్ని పోల్చుతున్నారు. నిక్సన్-మావో భేటీ అయినా ఈ విలాస గృహంలోనే భారత, చైనా నేతలు దౌత్యాధికారుల సహాయం లేకుండా కలుసుకుంటారని భావిస్తున్నారు. కాని, మావో-నిక్సన్ భేటీ ఫలితాలు వెంటనే కనిపించాయి. అప్పటి నుంచి పెట్టుబడిదారీ అమెరికా, కమ్యూనిస్ట్ చైనా మధ్య అంచనాలకు అందని రీతిలో వేగంగా సంబంధాలు బలపడ్డాయి. మరి మోదీ, జిన్‌పింగ్ ‘అనధికార’ సమావేశం అలాంటి తక్షణ ఫలితాలు ఇవ్వకపోయినా రెండు ఆసియా బడా దేశాల సంబంధాల దిశ, దశలను గణనీయంగా మార్చుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
- సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment