
రైల్వే బోర్డును ఏర్పాటు చేసిన సంవత్సరం?
బ్రిటిష్ ఇండియా - పారిశ్రామిక అభివృద్ధి
ప్రాచీన కాలం నుంచే భారతదేశం పరిశ్రమలకు ప్రసిద్ధి గాంచింది. పారిశ్రామికాభివృద్ధి కోసం నియమించిన కమిషన్ తన నివేదికలో ‘పశ్చిమ దేశాల నుంచి మొదటిసారి వ్యాపారులు ఇక్కడకు వచ్చినప్పుడు, భారతదేశంలో పారిశ్రామికాభివృద్ధి ఏవిధంగానూ అభివృద్ధి చెందిన దేశాలకు తీసిపోనివిధంగా ఉంది’ అని వ్యాఖ్యానించింది. భారత్‌లో తయారైన పారిశ్రామిక ఉత్పత్తులు, సహజసిద్ధంగా లభించే ముత్యాలు, సుగంధ ద్రవ్యాలను విదేశాలకు ఎగుమతి చేసేవారు. బంగారం, రాగి, జింకు, తగరం, సీసం, మత్తుపానీయాలు, గుర్రాలను ప్రధానంగా దిగుమతి చేసుకునేవారు.
దిగు మతుల కంటే ఎగుమతులే ఎక్కువగా ఉండేవి.
పత్తి, సిల్క్, ఉన్ని నాటి ముఖ్యమైన పరిశ్రమలు. బెంగాల్‌లోని అనేక ప్రాంతాలు, లక్నో, అహ్మదాబాద్, నాగ్‌పూర్, మధుర పత్తి పరిశ్రమకు పేరుగాంచాయి. పంజాబ్, కాశ్మీర్‌లో నాణ్యమైన కంబళ్లు ఉత్పత్తి చేసేవారు. భారతదేశం అంతటా ఇత్తడి, రాగి, బెల్‌మెటల్ ఉత్పత్తయ్యేవి. వీటికి బెనారస్, తంజావూరు, పుణె, నాసిక్, అహ్మదాబాద్ ముఖ్యమైన కేంద్రాలు. ఆభరణాల తయారీ, బంగారు, వెండి నగిషీ పనులు, చందనం, దంతపు, గాజు పరిశ్రమలు కూడా ఉండేవి. వ్యాపారాన్ని ఎక్కువగా భారతీయులే నిర్వహిస్తుండేవారు.
18వ శతాబ్దం ప్రారంభం వరకు నౌకా నిర్మాణ పరిశ్రమ ఇంగ్ల్లండ్ కంటే భారతదేశంలోనే అధికంగా ఉండేది. భారతదేశ వస్త్ర పరిశ్రమాభివృద్ధి బ్రిటిష్ ఉత్పత్తిదారుల అసూయకు కారణమైంది. 19వ శతాబ్దం అర్ధ భాగం నాటికి భారతదేశంలో చాలా పరిశ్రమలు గడ్డు పరిస్థితిని ఎదుర్కున్నాయి. తక్కువ ధరకు లభించే యంత్రాల ద్వారా ఉత్పత్తి అయ్యే వస్తువులు, భారతీయ కళలను ప్రోత్సహించే ఉద్దేశం బ్రిటిష్ ప్రభుత్వానికి లేకపోవడం దీనికి ప్రధాన కారణాలు. అందువల్ల భారతదేశంలో వ్యాపార వాణిజ్యాలు దాదాపుగా అంతరించిపోయాయి.
ఆధునిక పారిశ్రామికాభివృద్ధి
భారతదేశంలో ఆధునిక పారిశ్రామికాభివృద్ధి లేదా భారీ పరిశ్రమల స్థాపన 19వ శతాబ్దపు రెండో భాగంలో ప్రారంభమైంది. 1850 ప్రాంతంలో నూలు దుస్తులు, జనపనార మిల్లులు, గనుల నుంచి బొగ్గు తవ్వి తీసే పరిశ్రమలతో భారత్‌లో యంత్ర యుగం ప్రారంభమైంది. ఈ పరిశ్రమల్లో ఎక్కువ భాగం బ్రిటిషర్లే పెట్టుబడి పెట్టారు. అందువల్ల ఇవి వారి ఆధిపత్యం కిందే ఉండేవి. అధిక లాభాలు ఆర్జించే అవకాశాలు కనిపించడంతో భారతదేశంలో పరిశ్రమల స్థాపనకు విదేశీ పెట్టుబడిదారులు ఆకర్షితమయ్యారు. కార్మికులు చౌకగా దొరకడం, ముడిసరుకుల సరఫరాకు కొదవ లేకపోవడం, ఉత్పత్తులకు దేశంలో గిరాకీ ఉండటం వీరికి కలిసి వచ్చింది.
వాస్తవానికి బ్రిటన్‌లో మిగులు మూలధనం ఉండి, దాన్ని విదేశాల్లో పెట్టుబడి పెట్టాలనే అభిప్రాయం ఏర్పడిన సమయంలో ఇక్కడ పారిశ్రామికాభివృద్ధి ప్రారంభమైంది.
మొదటి ప్రపంచ యుద్ధం భారతదేశంలో పారిశ్రామికాభివృద్ధికి ఒక చక్కటి అవకాశం కల్పించింది. యుద్ధకాలంలో విదేశీ పోటీ లేకపోవడం వల్ల అవసరమైన ప్రతి వస్తువును ఇక్కడే ఉత్పత్తి చేయాల్సి వచ్చింది. ఈ అవకాశం ఎంతో కాలం కొనసాగలేదు. యుద్ధానంతరం ఏర్పడిన ప్రపంచ ఆర్థిక మాంద్యం ప్రభావం భారతదేశంపై కూడా పడింది. రెండో ప్రపంచయుద్ధం ఒక కొత్త పారిశ్రామిక ఘట్టాన్ని ఆవిష్కరించింది. దిగుమతులు పరిమితమ య్యాయి. యుద్ధానికి సంబంధించిన వస్తువుల గిరాకీ బాగా పెరిగిపోయింది. ప్రభుత్వం చాలా పరిశ్రమలకు యుద్ధం ముగిసిన తర్వాత కూడా రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చింది.
వస్త్ర పరిశ్రమ
భారతీయ వ్యాపారస్థులు మొదటిసారిగా 1818లో కలకత్తాలో పత్తి, తర్వాత బొంబాయి ప్రాంతంలో వస్త్ర పరిశ్రమను స్థాపించారు. ‘కౌస్జీ నానాభాయి’ 1853లో బొంబాయిలో మొదటి దుస్తుల మిల్లును నెలకొల్పాడు. 1879 నాటికి మనదేశంలో 56 వస్త్ర పరిశ్రమలు ఉండేవి. వీటిలో 43 వేల మంది కార్మికులు పనిచేసేవారు. 1851లో బొంబాయిలో నూలు మిల్లులను స్థాపించారు. వీటిలో వడకటం, నేతపని రెండూ జరిగేవి. 1861 నాటికి 12 మిల్లులు వచ్చాయి. 1860-70 దశాబ్దంలో ఈ పరిశ్రమకు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. అమెరికా అంతర్యుద్ధం వల్ల ముడి పత్తి ధర పెరిగింది. ఇది చేనేత పరిశ్రమను, దానిపై ఆధారపడి ఉన్న ఇతర రంగాలను దెబ్బతీసింది. రవాణా ఖర్చులు, దిగుమతి సుంకాలు పెరిగాయి. 1934 కాటన్ టెక్స్‌టైల్స్ యాక్ట్ ద్వారా బ్రిటిష్‌యేతర దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ప్రభుత్వం సుంకాలను పెంచింది.
జౌళి
ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఆది నుంచే జనపనార పరిశ్రమకు ప్రాధాన్యం ఉండేది. 1830 వరకు ‘కిత్తనార’ సంచులు, జనపనార గుడ్డ, బెంగాల్ చేనేత పనివాళ్ల సొంత వ్యవహారంగా ఉండేవి. భారతదేశంలో తొలి జనపనార మిల్లును 1854లో స్థాపించినా, 1863 -64 వరకు ఆ పరిశ్రమ అభివృద్ధి చెందలేదు. 1882 నాటికి భారతదేశంలో 20 జనపనార మిల్లులు ఉండేవి. వీటిలో ఎక్కువగా బెంగాల్‌లోనే ఉండేవి. దేశీయంగా మార్కెట్ లేకపోవడంతో పత్తి, జనపనార పరిశ్రమలు ఎగుమతులపైనే ఆధారపడేవి. పత్తి కంటే జనుము వ్యాపారంలో అస్థిరత్వం ఎక్కువ. 1895 -96లో 28 జనపనార మిల్లులుండగా.. 1913-14 నాటికి 64కు, 1947 వరకు 113కు పెరిగాయి.
తేయాకు టీ తోటలు:
బ్రిటిష్ పాలనలో దీనికి అత్యంత ప్రాధాన్యం ఉండేది. 19వ శతాబ్దపు చివరి 30 ఏళ్లలో నిరంతరాభివృద్ధి చెందిన ఒకే ఒక పరిశ్రమ ఇదే. టీ తోటల వైశాల్యం 1885లో 2 లక్షల 84 వేల ఎకరాలు ఉండగా 1896 నాటికి 4,33,133 ఎకరాలకు విస్తరించింది. 1896 నాటికి బ్రహ్మపుత్ర, సుర్మా నదుల లోయల ప్రాంతంలో 67.4 శాతం టీ సాగులో ఉంది. దీంట్లో ఎక్కువ భాగం అస్సాంలో ఉండగా, బెంగాల్ వాటా 27.4 శాతం. పంజాబ్, హిమాలయ పర్వతాలు, దక్షిణాదిన నీలగిరిలోనూ ఈ తోటలను సాగు చేశారు. భారతదేశం, శ్రీలంక, తూర్పు ఇండియా దీవులు 1933 నుంచి టీ ఉత్పత్తి చేసే ముఖ్యమైన ప్రాంతాలుగా పేరుగాంచాయి.
కాఫీ తోటలు:
కాఫీ సాగు కూర్‌గ, మైసూర్, మలబారు ప్రాంతాలకే పరిమితమైంది. 1879 వరకు ఈ పరిశ్రమ లాభసాటిగానే ఉంది. 1889 తర్వాత బాగా దెబ్బతింది.
బొగ్గు పరిశ్రమ
ఇది 1880లో ఒక చిన్న పరిశ్రమగా ప్రారంభమైంది. 1886 తర్వాత రైల్వేల వ్యాప్తితో అభివృద్ధి చెందింది. 1885లో బొగ్గు ఉత్పత్తి 1,294,221 టన్నులు ఉండగా, 1894 నాటికి 2,800,562 టన్నులకు పెరిగింది.
ఇనుము-ఉక్కు
భారతదేశంలో ఇనుము-ఉక్కు ఉత్పత్తి 19వ శతాబ్దంలోనే ప్రారంభమైంది. 1830లో ‘హీత్’ ఆధునిక పద్ధతుల్లో ఇనుము-ఉక్కు పరిశ్రమలను స్థాపించడానికి ప్రయత్నించాడు. 1875లో దుక్క ఇనుము ఉత్పత్తి కర్మాగారాన్ని స్థాపించారు. 1907 నాటికి సంవత్సరానికి 50 వేల టన్నుల దుక్క ఇనుము ఉత్పత్తి అయ్యేది. జంషెడ్‌జీ టాటా 1907లో ఉక్కు కర్మాగారాన్ని స్థాపించారు. ఇదే టాటా - ఉక్కు కర్మాగారంగా ప్రసిద్ధి చెందింది. దీంట్లో 1913లో ఉక్కు ఉత్పత్తి ప్రారంభమైంది.
ఇతర పరిశ్రమలు
ఇతర పరిశ్రమల్లో పంచదార, నూనెగింజలు, తోలు, మాంగనీస్, పెట్రోలియం, అభ్రకం ముఖ్యమైనవి. వీటిలో కొన్ని విదేశీ మార్కెట్‌ను కూడా సంపాదించాయి. బ్రిటిషర్లు భారతదేశం నుంచి వెళ్లేనాటికి ఈ పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందాయి.
మాదిరి ప్రశ్నలు
1. రైల్వే బోర్డును ఏర్పాటు చేసిన సంవత్సరం?
1) 1905 2) 1906
3) 1907 4) 1908
2. భారతదేశంలో మొదటిసారిగా 1818లో పత్తి మిల్లును ఎక్కడ స్థాపించారు?
1) బొంబాయి 2) కలకత్తా
3) సూరత్ 4) మద్రాస్
3. బొంబాయిలో ఏ సంవత్సరంలో మొదటి పత్తి మిల్లును స్థాపించారు?
1) 1882 2) 1863
3) 1880 4) 1854
4. ‘స్వదేశీ ఉద్యమం’ ద్వారా భారతదేశంలో ఏ పరిశ్రమ అభివృద్ధి చెందింది?
1) పత్తి 2) వస్త్ర
3) తేయాకు 4) బొగ్గు
5. మొదటిసారిగా బెంగాల్‌లో జనపనార పరిశ్రమ స్థాపించిన సంవత్సరం?
1) 1853 2) 1855
3) 1854 4) 1856
6. 1899లో భారతీయుడి సగటు తలసరి జాతీయ ఆదాయం ఎంత?
1) రూ. 39 2) రూ. 25
3) రూ. 36 4) రూ. 30
7. దాదాబాయ్ నౌరోజీ అండ్ కంపెనీని ఎప్పుడు స్థాపించారు?
1) 1867 2) 1868
3) 1869 4) 1870
8. తిలక్ ఏ పరిశ్రమలో భాగస్వామిగా ఉండేవారు?
1) కాటన్, జిన్నింగ్ పరిశ్రమలు
2) తేయాకు
3) ఇనుము - ఉక్కు
4) బొగ్గు పరిశ్రమ
9. {పయాగ చక్కెర కంపెనీ యజమాని ఎవరు?
1) నెహ్రూ
2) లాలా లజపతిరాయ్
3) తిలక్
4) మదన్‌మోహన్ మాలవ్య
10. కాఫీలో భారత్‌తో పోటీ పడిన దేశం?
1) రష్యా 2) చైనా
3) బ్రెజిల్ 4) అమెరికా
సమాధానాలు:
1) 1; 2) 2; 3) 4; 4) 1; 5) 2;
6) 1; 7) 3; 8) 1; 9) 4; 10) 3.