స్పెషల్ చిల్డ్రన్‌కు స్పెషల్ ఎడ్యుకేటర్ | Upcoming Career: Special educater for children | Sakshi
Sakshi News home page

స్పెషల్ చిల్డ్రన్‌కు స్పెషల్ ఎడ్యుకేటర్

Published Thu, Jul 31 2014 1:40 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

స్పెషల్ చిల్డ్రన్‌కు స్పెషల్ ఎడ్యుకేటర్ - Sakshi

స్పెషల్ చిల్డ్రన్‌కు స్పెషల్ ఎడ్యుకేటర్

అప్‌కమింగ్ కెరీర్ : నవమాసాలు నిండగానే పూర్తి ఆరోగ్యంగా ఉన్న పండంటి బిడ్డకు జన్మనివ్వాలని తల్లి ఆరాటపడుతుంది. పుట్టిన శిశువును చూసుకొని మురిసిపోతుంది. బిడ్డ ఎదుగుదలలో ప్రతిక్షణాన్ని ఆనందంగా ఆస్వాదిస్తుంది. తుళ్లుతూ కేరింతలు కొట్టాల్సిన తన కలలపంట పెరుగుదల సరిగ్గా లేకపోతే ఆ తల్లి మనసు విలవిలలాడుతుంది. అలాంటి శారీరకంగా, మానసికంగా పరిపక్వత చెందని ప్రత్యేక అవసరాలున్న పిల్లలను అనుక్షణం కనిపెట్టుకొని చూసి, వారికి విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులే.. స్పెషల్ ఎడ్యుకేటర్లు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఢోకా లేని కెరీర్.. స్పెషల్ ఎడ్యుకేటర్.  
 
దేశ విదేశాల్లో అవకాశాలు..
 సెరిబ్రెల్ పాల్సీ, ఆటిజం, ఇంటలెక్చువల్ ఇంపెయిర్‌మెంట్, ఫిజికల్ డిజబిలిటీస్, ఆడిటరీ ఇంపెయిర్‌మెంట్, మెంటల్ అండ్ బిహేవియరల్ డిజార్డర్స్ వంటి వాటి వల్ల కొందరు చిన్నారుల్లో ఎదుగుదల ఉండదు. వీరు సాధారణ పిల్లల్లా ఆడుతూపాడుతూ గడపలేరు. ఇలాంటి వారి అవసరాలు ప్రత్యేకంగా ఉంటాయి. తగిన శిక్షణ ఇస్తే వీరు కూడా మామూలుగానే తమ పనులు తాము చేసుకోగలుగుతారు. చదువు కూడా చక్కగా నేర్చుకుంటారు. స్పెషల్ చిల్డ్రన్‌కు విద్యాబుద్ధులు నేర్పాలంటే ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఎడ్యుకేటర్లు అవసరం. ఇలాంటి ఎడ్యుకేటర్లకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం ప్రస్తుతం నగరాలతోపాటు పట్టణాల్లోనూ స్పెషల్ లెర్నింగ్ స్కూళ్లు ఏర్పాటవుతున్నాయి. స్పెషల్ ఎడ్యుకేటర్లకు వీటిలో మంచి అవకాశాలు లభిస్తున్నాయి.
 
 ఆసక్తితోపాటు తగిన వనరులు ఉంటే సొంతంగా లెర్నింగ్ స్కూల్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. స్పెషల్ ఎడ్యుకేటర్లకు మనదేశంతోపాటు విదేశాల్లోనూ అధిక అవకాశాలు లభిస్తున్నాయి. అనుభవం ఉన్నవారికి భారీ వేతనాలు అందుతున్నాయి. కార్పొరేట్ స్కూళ్లలోనూ వీరిని నియమిస్తున్నారు. ఆకర్షణీయమైన శాలరీ ఆఫర్ చేస్తున్నారు. స్పెషల్ ఎడ్యుకేటర్‌గా వృత్తిలో మెరుగ్గా రాణించాలంటే ఓపిక, సహనం ఉండాలి. పిల్లల పరిస్థితి గురించి తల్లిదండ్రులకు అర్థమయ్యేలా వివరించేందుకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం.  
 
 అర్హతలు: మనదేశంలో స్పెషల్ ఎడ్యుకేషన్‌పై డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీయెట్ పూర్తయిన తర్వాత వీటిలో చేరొచ్చు. స్పెషల్ ఎడ్యుకేషన్‌లో బీఈడీ కూడా చేస్తే మంచి అవకాశాలు లభిస్తాయి. హోమ్‌సైన్స్, సైకాలజీ కోర్సులను చదివినవారు కూడా స్పెషల్ ఎడ్యుకేటర్లుగా పనిచేయొచ్చు.
 
 వేతనాలు: స్పెషల్ ఎడ్యుకేటర్లు ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు అందుకోవచ్చు. శిక్షణ పొందిన, గ్రాడ్యుయేట్ టీచర్లకు నెలకు రూ.30 వేల వేతనం లభిస్తుంది. సర్వ శిక్షా అభియాన్ పథకం కింద పనిచేస్తున్న కాంట్రాక్ట్ స్పెషల్ ఎడ్యుకేటర్‌కు నెలకు రూ.9 వేలు ఇస్తున్నారు. కొన్ని ఇంటర్నేషనల్ స్కూళ్లు రూ.35 వేలకు పైగానే వేతనం చెల్లిస్తున్నాయి.
 
 స్పెషల్ ఎడ్యుకేటర్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
 ఏ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ద మెంటల్లీ హ్యాండీక్యాప్డ్-సికింద్రాబాద్
 వెబ్‌సైట్: www.nimhindia.org
 ఏ లేడీ ఇర్విన్ కాలేజీ-న్యూఢిల్లీ, వెబ్‌సైట్: ఠీఠీఠీ.్చఛీడజీటఠీజీ.్ఛఛీఠ.జీ
 ఏ అమర్‌జ్యోతి ఛారిటబుల్ ట్రస్ట్,
 వెబ్‌సైట్: www.amarjyotirehab.org
 
 సంతృప్తి, సేవల కలబోత
 ‘‘కన్నవారు కూడా గుర్తించలేని అమాయక నవ్వుల ఆవేదనను అర్థం చేసుకుని స్పందించి మార్గదర్శనం చేసే అవకాశం ఈ కెరీర్‌లో లభిస్తుంది. గతంతో పోల్చితే స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులను అభ్యసించేందుకు యువతీయువకులు ముందుకొస్తున్నారు. చిన్నారులకు సేవ చేస్తున్నామనే సంతృప్తిని ఇచ్చే ఉద్యోగం స్పెషల్ ఎడ్యుకేటర్. వైద్యం, విద్య రెండింటినీ ఇక్కడ నేర్చుకోవచ్చు. కెరీర్ పరంగా మంచి అవకాశాలున్నాయి. సొంతంగా విద్యాసంస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రత్యేక విద్యనభ్యసించిన వారిని ప్రభుత్వం ఇటీవల టీచర్లుగా నియమిస్తోంది. ఓర్పు, సేవ చేయాలనే ఆశయం ఉన్నవారికి ఇది మంచి కెరీర్. సీనియార్టీ పెరిగే కొద్దీ రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకూ వేతనం లభిస్తుంది. విదేశాల్లోనూ మంచి అవకాశాలున్నాయి’’
 - డాక్టర్ పి.హనుమంతరావు,
 స్వీకార్-ఉప్‌కార్ వ్యవస్థాపకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement