‘రాయల్ కమిషన్’ను నియమించిన రాజప్రతినిధి? | who established the royal commission? | Sakshi
Sakshi News home page

‘రాయల్ కమిషన్’ను నియమించిన రాజప్రతినిధి?

Published Sun, Aug 10 2014 2:39 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

‘రాయల్ కమిషన్’ను నియమించిన రాజప్రతినిధి? - Sakshi

‘రాయల్ కమిషన్’ను నియమించిన రాజప్రతినిధి?

బ్రిటిష్ పాలనలో వ్యవసాయ ‘వ్యాపారీకరణ’ ప్రారంభమైంది. వారి పరిశ్రమలకు తగిన ముడిసరుకు కోసం వ్యవసాయాన్ని వ్యాపార స్థాయిలో కొనసాగించారు. బ్రిటన్, ఇతర ఐరోపా దేశాల కంటే భారత్ పారిశ్రామికంగా వెనుకబడి ఉండేది.

బ్రిటిష్ ఆర్థిక విధానం
 
వ్యవసాయ వ్యాపారీకరణ:
బ్రిటిష్ పాలనలో వ్యవసాయ ‘వ్యాపారీకరణ’ ప్రారంభమైంది. వారి పరిశ్రమలకు తగిన ముడిసరుకు కోసం వ్యవసాయాన్ని వ్యాపార స్థాయిలో కొనసాగించారు. బ్రిటన్, ఇతర ఐరోపా దేశాల కంటే భారత్ పారిశ్రామికంగా వెనుకబడి ఉండేది. యూరప్, అమెరికా మార్కెట్లలో వాణిజ్య లాభాలు పొందడానికి బ్రిటిష్ పరిశ్రమల్లో ఇక్కడి ఉత్పత్తులను ఉపయోగించేవారు. మాంచెస్టర్‌లోని పత్తి సరఫరా సంఘం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, వ్యవసాయ శాఖను ఏర్పాటు చేయించింది. 1869లో రాయల్ కమిషన్ పత్తి పంట అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రతి రాష్ర్టంలోనూ ఒక ప్రత్యేక వ్యవసాయ శాఖను ఏర్పాటు చేయాలని కోరింది.
 
పారిశ్రామిక విప్లవం తర్వాత బ్రిటన్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న వస్త్ర పరిశ్రమకు నాణ్యమైన ముడి పత్తి అవసరమైంది. బ్రిటిషర్లు భారత్‌లో నీలిమందు, తేయాకు, కాఫీ తోటల సాగును ప్రోత్సహించారు. ఈ ఉత్పత్తులకు విదేశాల్లో మంచి మార్కెట్ ఉండేది. ఈ తోటలన్నీ బ్రిటిషర్ల ఆధీనంలోనే ఉండేవి. జౌళి ఉత్పత్తిని కూడా ప్రోత్సహించారు. దీనికి అమెరికాలో మంచి డిమాండ్ ఉండేది. ఇలా బ్రిటిషర్లు వారి పరిశ్రమలకు కావాల్సిన, వ్యాపారపరంగా అధిక లాభం ఉన్న వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇచ్చేవారు.
 
 వ్యవసాయ వ్యాపారీకరణ వల్ల బ్రిటిషర్లతో పాటు కొంత మంది భారతీయ వ్యాపారులు, రుణదాతలకు ప్రయోజనం చేకూరింది. దీనివల్ల కొన్ని పరిశ్రమల స్థాపనకు వీలు కలిగింది. ప్రారంభంలో పరిశ్రమలు స్థాపించింది బ్రిటిష్ పెట్టుబడిదారులే. వీరి విధానం వల్ల భారత ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఆహారపంటల కింద ఉండే భూమి తగ్గిపోయింది. వ్యవసాయ శాఖ వాణిజ్యపంటల అభివృద్ధికే కృషి చేసింది.
 
1892-93 నుంచి 1919-20 ఏళ్ల మధ్య వ్యవసాయ పంటల కింద ఉన్న భూమి 7 శాతం మాత్రమే. వ్యవసాయేతర పంటల కింద పెరిగిన భూమి 43 శాతం. తిరిగి 1934-35 నుంచి 1939-40 మధ్య వ్యవసాయేతర పంటల కింద భూమి 1.6 మిలియన్ల ఎకరాలు పెరిగింది. ఆహార పంటల కింద భూమి 1.5 మిలియన్ల ఎకరాలకు పడిపోయింది. ముడి పత్తి ఎగుమతి 1900-01లో 1,78,000 టన్నులుండగా 1936-37కి 7,62,133 టన్నులకు పెరిగింది. అంటే.. ఈ పెరుగుదల 328 శాతం.

1939-40లో అది 5,26,411 టన్నులుగా ఉంది. తేయాకు ఎగుమతులు 1900-01లో 190 మిలియన్ పౌండ్లు ఉండగా 1939-40 లో 359 మిలియన్ పౌండ్లకు పెరిగింది. నూనె గింజలు 1900-01లో 5,49,000 టన్నులుండగా 1938-39లో 11,72,802 టన్నులకు పెరిగింది. బ్రిటిషర్లు కేవలం వాణిజ్య పంటలకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల భారత్‌లో జనాభాకు సరిపోయే ఆహార ధాన్యాలు ఉత్పత్తి కాలేదు.
 
జనాభా పెరిగే కొద్దీ ఈ పరిస్థితి విషమించింది. వ్యవసాయంపై ఆధారపడటం పెరిగే కొద్దీ భూకమతాలు తరిగిపోయాయి. 1914లో ధరల విచారణ సంఘం పేర్కొన్న వివరాలు కూడా ఇదే విషయాన్ని ప్రస్ఫుటం చేశాయి. భారత్‌లో వ్యవసాయానికి కావాల్సిన ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టలేదు. ఈ విధానాలు పేద ప్రజలను నష్టపర్చాయి. కనీస ఆహారాన్ని సమకూర్చుకోవడం కూడా వారికి కష్టమైంది.
 
గ్రామీణ రుణాలు:
బ్రిటిషర్లు అనుసరించిన రెవెన్యూ విధానం వల్ల ప్రభుత్వానికి, రైతులకు మధ్య అనేక దళారులు పుట్టుకొచ్చారు. భూమి చిన్న చిన్న కమతాలుగా మారింది. రైతులు కఠిక దారిద్య్రంలో కూరుకుపోయారు. రుణభారం వ్యవసాయానికి ఒక పెద్ద సమస్యగా తయారైంది. ఈ సమస్యలన్నీ 1870కి పూర్వమే అంటే జనాభా విస్ఫోటనానికి ముందే ఉత్పన్నమయ్యాయి. 1921లో జనాభా పెరుగుదల అధికమవడంతో ఈ సమస్యలు మరింత తీవ్రరూపం దాల్చాయి.
 
ఆర్థికంగా లాభంలేని భూకమతాలు, వ్యవసాయ నీటిపారుదల తక్కువగా ఉండటం, వ్యవసాయాన్ని ఆధునికీకరణ చేయకపోవటం లాంటి అంశాలు తక్కువ దిగుబడికి కారణాలయ్యాయి. దీనికితోడు వసూలు చేసే రెవెన్యూ మొత్తం చాలా ఎక్కువగా ఉండేది. రైత్వారీ, మహల్వారీ విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత కూడా మధ్యవర్తులను తొలగించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అస్సాం లాంటి ప్రాంతాలు మినహా మిగిలినచోట్ల ప్రభుత్వం 19వ శతాబ్దం నుంచే రెవెన్యూ వసూలు ధనరూపంలోనే చేయడం ప్రారంభించింది.
 
దీన్ని ఒక నిర్ణీత తేదీలోపు వసూలు చేసేవారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు వ్యాపారుల నుంచి ఎక్కువ వడ్డీలకు ధనాన్ని తీసుకురావాల్సి వచ్చేది. పేద రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు తప్పుడు లెక్కలు చూపడం, దొంగ సంతకాలు లాంటివి చేసేవారు. జమీందారీ విధానం అమల్లో ఉన్నచోట రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉండేది. అక్రమంగా పన్ను వసూలు చేసేవారు. రైత్వారీ, మహల్వారీ ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం జమీందార్ల స్థానాన్ని ఆక్రమించి పండిన పంటలో 1/2వ వంతు లేదా 1/3వ వంతు పన్ను నిర్ణయించేది. మధ్యవర్తుల కారణంగా రైతులపై అదనపు భారం పడేది. ప్రభుత్వం, రైతుల మధ్య ఉండే దళారుల సంఖ్య విపరీతంగా పెరిగింది.
 
అనేక సందర్భాల్లో రైతులు భూమిలో కొంత భాగాన్ని అమ్ముకోవడమో, పంటను తక్కువ ధరకు స్థానిక వ్యాపారస్థులకు విక్రయించడమో జరిగేది. సరైన మార్కెట్ విధానం లేకపోవడం, వ్యవసాయ వ్యాపారీకరణ పెరగడం వల్ల స్థానిక వ్యాపారస్థులకు రైతులను దోచుకోవడం సులభమైంది. రుణ సౌకర్యం పొందే అవకాశంలేక తప్పనిసరి పరిస్థితుల్లో స్థానిక వడ్డీ వ్యాపారుల వద్దకే వెళ్లాల్సి వచ్చేది. దీనివల్ల రైతులు రుణభారంతో కుంగిపోయేవారు. ప్రభుత్వం వడ్డీ వ్యాపార వ్వవస్థకు ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేయలేదు. రైతుల బాధలను తొలగించడానికి కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అవి విజయవంతం కాలేదు.
 
రుణాల విషయంలో గరిష్ఠ పరిమితి వడ్డీని నిర్ణయిస్తూ ప్రభుత్వం ్ఖటఠటజీౌఠట ఔౌ్చట అఛ్టిను అమలు చేసింది. 1918-26లో ఈ చట్టాన్ని సవరించినప్పటికీ వడ్డీ వసూలు విషయంలో ఫలితాలను సాధించలేకపోయింది. 1904లో సహకార సంఘాల చట్టాన్ని రూపొందించి, రుణభారాన్ని తగ్గించడానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నించింది. 1939-40 నాటికి 60 లక్షల మంది సభ్యులతో 1,37,000 సంఘాలను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ ఈ సమస్యను పరిష్కరించలేకపోయింది. పంజాబ్‌లో సహకార సంఘాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 10.2 శాతం కుటుంబాలు లబ్ధి పొందగా, ఇతర రాష్ట్రాల్లో ఈ సంఖ్య 4 శాతంగానే ఉండేది.
 
1936 తర్వాత రాష్ట్రాల్లో ఏర్పడిన ప్రభుత్వాలు కూడా కొన్ని శాసనాలు చేసినప్పటికీ అవి సమస్యకు పరిష్కారాన్ని కనుక్కోలేకపోయాయి. 1931లో కేంద్రబ్యాంకు విచారణ కమిటీ తన నివేదికలో బ్రిటిష్ ఇండియా రాష్ట్రాల్లో మొత్తం గ్రామీణ రుణభారం తొమ్మిది వందల కోట్ల రూపాయలని తెలిపింది. వ్యవసాయంపై వేసిన రాయల్ కమిషన్ గ్రామ ప్రాంతాల్లో రుణాలను నియంత్రించాలని సూచించింది. వడ్డీ వ్యాపారులకు లెసైన్సులివ్వాలని కొన్ని రాష్ర్ట బ్యాంకింగ్ ఎంక్వయిరీ కమిటీలు ప్రతిపాదించాయి.
 
భూమి మార్పిడిని తగ్గించడానికి లాండ్ ఎలినేషన్ యాక్ట్ (ఔ్చఛీ అజ్ఛ్చ్టీజీౌ అఛ్టి)ను అమల్లోకి తెచ్చారు. పంజాబ్‌లో వ్యవసాయేతరులు వ్యవసాయదారుల వద్ద నుంచి భూమిని కొనుగోలు చేయడం గానీ, తాకట్టు పెట్టుకోవడం గానీ చేయకూడదని ప్రభుత్వం ఈ చట్టం ద్వారా శాసించింది.
 
 మాదిరి ప్రశ్నలు

 1.    వ్యవసాయంపై ‘రాయల్ కమిషన్’ను నియమించిన రాజప్రతినిధి ఎవరు?
     1) కర్జన్    2) హార్డింగ్
     3) ఇర్విన్    4) రిప్పన్
 సమాధానం: 3
 వివరణ: వ్యవసాయంపై మెక్‌డొనాల్డ్ కమిషన్‌ను కర్జన్  నియమించాడు. హార్డింగ్ పత్రికలపై ఎమర్జెన్సీ చట్టం ప్రవేశపెట్టాడు. ఇర్విన్ 1926లో వ్యవసాయంపై రాయల్ కమిషన్‌ను నియమించాడు. రిప్పన్ ‘స్వపరిపాలన పితామహుడు’గా ప్రసిద్ధి చెందాడు.
 2.    కేంద్ర బ్యాంకింగ్ ఎంక్వయిరీ కమిటీ ఏర్పడిన సంవత్సరం?
     1) 1929    2) 1935
     3) 1930    4) 1931
 సమాధానం: 4
 3.    లార్‌‌డ కర్జన్ వ్యవసాయ కళాశాలను ఎక్కడ స్థాపించాడు?
     1) కలకత్తా    2) కటక్
     3) పూసా    4) పైవన్నీ
 సమాధానం: 3
 4.    పంజాబ్‌లో వ్యవసాయేతరులు వ్యవసాయదారుల నుంచి భూమిని కొనడం,  తాకట్టు పెట్టుకోవడాన్ని నిషేధించింది?
     1) ల్యాండ్ ఎలినేషన్ యాక్ట్
     2) ‘లీ’ కమిషన్ 3) మెక్‌డొనాల్డ్ కమిషన్
     4) మెక్లాన్‌గన్ కమిటీ
 సమాధానం: 1
 5.    {ఫెడరిక్ నికాల్సన్ నివేదిక ప్రకారం సహకార సంఘాలను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
     1) 1904    2) 1905
     3) 1903    4) 1902
 సమాధానం:1
 6.    ‘ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ’ గ్రంథ రచయిత?
     1) జె.ఎస్. మిల్    2) రికార్డో
     3) ఆడమ్ స్మిత్
     4) దాదాబాయ్ నౌరోజీ
 సమాధానం: 1
 7.    ‘ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ అండ్ టాక్సేషన్’ గ్రంథ రచయిత?
     1) రమేష్ చంద్రదత్
     2) అంబేద్కర్    3) రికార్డో
     4) గున్నార్ మిర్దాల్
 సమాధానం: 3
 8.    మహల్వారీ విధానాన్ని ఎవరి సిఫారసుల మేరకు ఏర్పాటు చేశారు?
     1) థామస్ మన్రో    2) హాల్డ్ మెకంజీ
     3) జాన్ షోర్    4) బర్‌‌డ
 సమాధానం: 2
 9.    1900-01లో భారత  తేయాకు ఎగుమతులు ఎన్ని మిలియన్ పౌండ్లు?
     1) 120    2) 190
     3) 210    4) 350
 సమాధానం: 2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement