ఎన్. విజయేందర్ రెడ్డి
జనరల్ అవేర్‌నెస్ ఫ్యాకల్టీ, హైదరాబాద్.
వివిధ పోటీ పరీక్షల్లో జనరల్ నాలెడ్జ్ , కరెంట్ అఫైర్‌సలలో తప్పనిసరిగా అవార్డుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. వివిధ అవార్డులు, వీటిని ఎవరు ఏర్పాటు చేశారు? ఏ రంగంలో ఇస్తారు? ప్రథమ విజేతలు, ఇటీవల ఎవరికి లభించింది? వంటి ప్రశ్నలు అడుగుతారు. ఈ నేపథ్యంలో జాతీయస్థాయిలో వివిధ అవార్డులు గురించి తెలుసుకుందాం.
భారతరత్న
భారతరత్న భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారం. కళలు, సాహిత్యం, శాస్త్ర, సాంకేతిక రంగాలు, ప్రజా సేవల రంగాలలో అత్యున్నత కృషికి ఇస్తారు. 2011లో క్రీడలను కూడా ఈ జాబితాలో చేర్చారు. 1954లో మొదటిసారిగా ముగ్గురికి భారతరత్న లభించింది.వారు భారతదేశ చివరి గవర్నర్ జనరల్ సి.రాజగోపాలాచారి, తొలి ఉపరాష్ర్టపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, భౌతిక శాస్త్రవేత్త సర్ సి.వి.రామన్. ఇప్పటివరకు 41 మందికి భారతరత్న లభించింది.
చివరిసారిగా 2008లో పండిట్ భీమ్‌సేన్ జోషికి ప్రదానం చేశారు. ఈ అవార్డును మరణానంతరం పొందిన మొదటి వ్యక్తి భారత రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి. ఆయనకు 1966లో ఈ అవార్డు లభించింది. భారతరత్న పొందిన మొదటి మహిళ ఇందిరాగాంధీ (1971). భారతరత్న ఇద్దరు విదేశీయులకు కూడా లభించింది. 1987లో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (పాకిస్థాన్)కు, 1990లో నెల్సన్ మండేలా (దక్షిణాఫ్రికా)కు లభించింది. భారతరత్న లభించిన వ్యక్తులలో నలుగురు జీవించి ఉన్నారు. వారు.. అబ్దుల్ కలాం (1997), అమర్త్యసేన్ (1999), లతా మంగేష్కర్ (2001), నెల్సన్ మండేలా (1990).
పద్మ అవార్డులు
భారతరత్న తర్వాత అత్యున్నతమైన పౌర పురస్కారాలు వరుసగా పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. ఈ సంవత్సరం జనవరి 26న 108 మందికి పద్మ అవార్డులు బహూకరించారు. ఇందులో 24 మంది మహిళలు. 2013 విజేతలు..
పద్మవిభూషణ్: నలుగురికి లభించింది. రఘునాథ్ మహాపాత్ర (శిల్పి), హైదర్ రజా (చిత్రకళ), సైన్స్, ఇంజనీరింగ్ విభాగాల్లో యశ్‌పాల్, రొద్దం నరసింహ.
పద్మభూషణ్: 24 మందికి ప్రదానం చేశారు. కొంతమంది ప్రముఖులు: సినిమా రంగానికి చెందిన డి.రామానాయుడు, ఎస్.జానకి, షర్మిలా ఠాగోర్, రాజేష్ ఖన్నా, (మరణానంతరం), జస్పాల్ భట్టి (మరణానంతరం). భరత నాట్యకారిణి సరోజ వైద్యనాథన్, సైన్‌స విభాగంలో శివథాను పిళ్లై, విజయకుమార్ సారస్వత్, అశోక్ సేన్, బి.ఎన్. సురేష్. పరిశ్రమ రంగానికి చెందిన ఆర్. త్యాగరాజన్, ఆది గోద్రెజ్. సాహిత్యంలో మంగేష్ పడ్‌గావ్‌కర్, గాయత్రి స్పివాక్. క్రీడారంగంలో క్రికెటర్ రాహుల్ ద్రావిడ్, మహిళా బాక్సర్ మేరీకోమ్.
పద్మశ్రీ: 80 మందికి ప్రదానం చేశారు. కొంతమంది ముఖ్యులు: చలనచిత్ర రంగానికి చెందిన శ్రీదేవి కపూర్, నానా పటేకర్, బాపు, రమేష్ సిప్పీ; మన రాష్ట్రానికి చెందిన గజం అంజయ్య (చేనేత), సురభి బాబ్జీ (ఆర్‌ట), చిట్టా వెంకట సుందరరామ్ (వైద్యం), రామకృష్ణరాజు (సైన్‌స అండ్ ఇంజనీరింగ్) ఉన్నారు.
చలన చిత్ర రంగ అవార్డులు
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు: భారతదేశ అత్యున్నత సినిమా అవార్డు. భారతీయ చలనచిత్ర పితామహుడిగా పేరు పొందిన దాదాసాహెబ్ ఫాల్కే పేరిట ఈ అవార్డును భారత ప్రభుత్వం 1969లో నెలకొల్పింది. ఈ అవార్డు కింద స్వర్ణకమలం, పది లక్షల రూపాయల నగదు బహుమతిని అందజేస్తారు. తొలి విజేత 1969లో దేవికా రాణి రోరిచ్. 2012లో ఈ బహుమతిని ప్రముఖ హిందీ నటుడు ప్రాణ్‌కు ప్రదానం చేశారు.
ఇప్పటివరకు 44 మందికి లభించింది. 1971లో పృథ్వీరాజ్ కపూర్‌కు ప్రకటించారు. మరణానంతరం ఈ అవార్డు పొందిన తొలి వ్యక్త్తి పృథ్వీరాజ్ కపూర్. భారతదేశపు తొలి మూకీ చిత్రం రాజాహరిశ్చంద్రను దాదాసాహెబ్ ఫాల్కే 1913లో నిర్మించాడు. ఆ సినిమా మే 3, 1913లో విడుదలైంది. అందుకే ఈ అవార్డును, జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రతి ఏటా మే 3న ప్రదానం చేస్తారు.
60వ జాతీయ చలనచిత్ర అవార్డులు: ఈ అవార్డులను మే 3, 2013 నాడు ప్రదానం చేశారు. దేఖ్ ఇండియన్ సర్కస్ అనే హిందీ చిత్రం అత్యధికంగా నాలుగు అవార్డులను గెలుచుకున్నది. ఉత్తమ చిత్రం పాన్‌సింగ్ తోమర్ (హిందీ), ఉత్తమ బాలల చిత్రం దేఖ్ ఇండియన్ సర్కస్ (హిందీ), ఉత్తమ దర్శకుడు శివాజీ లోతన్ పాటిల్ (మరాఠీ చిత్రం దాగ్), ఉత్తమ నటులు 1) ఇర్ఫాన్ ఖాన్ (పాన్‌సింగ్ తోమర్), 2) విక్రమ్ గోఖలే (మరాఠీ చిత్రం అనుమతి). ఉత్తమ నటి ఉషా జాదవ్ (మరాఠీ చిత్రం దాగ్), ఉత్తమ సహాయ నటుడు అన్నుకపూర్ (హిందీ చిత్రం వికీడోనర్), ఉత్తమ సహాయ నటి 1) డాలీ అహ్లూవాలియా (వికీడోనర్), 2) కల్పన (మలయాళ చిత్రం తనిచళ ఎంజన్).
58వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు: ఫిల్మ్‌ఫేర్ అవార్డులను టైమ్స్ గ్రూప్ 1954లో ప్రారంభించింది. వీటిని హిందీ చలన చిత్ర రంగంలో ప్రతిభావంతులకు ఇస్తారు. 58వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులను జనవరి 20, 2013న ముంబైలో ప్రదా నం చేశారు. బర్ఫీ చిత్రానికి 7 అవార్డులు లభించాయి. ఉత్తమ చిత్రం-బర్ఫీ, ఉత్తమ దర్శకుడు- సుజయ్‌ఘోష్ (కహానీ),ఉత్తమ నటుడు-రణ్‌బీర్ కపూర్(బర్ఫీ), ఉత్తమ నటి-విద్యాబాలన్ (కహానీ), ఉత్తమ సహాయనటుడు-అన్నూ కపూర్(వికీడోనర్), ఉత్తమ సహాయ నటి - అనుష్కశర్మ (జబ్‌తక్ హై జాన్), జీవితకాల సాఫల్య పురస్కారం-యశ్ చోప్రా(మరణానంతరం).
జాతీయ క్రీడా అవార్డులు
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న: క్రీడారంగంలో అత్యున్నత పురస్కారం.1991 -92లో ప్రారంభించారు. 7,50,000 రూపాయల నగ దు బహుమతిని ఇస్తారు. మొదటి విజేత విశ్వనాథన్ ఆనంద్. 2012-13కు గానూ షూటింగ్ నిపుణుడు రంజన్ సోధికి లభించింది. 2010-11లో గగన్ నారంగ్ (షూటింగ్), 2011-12లో విజయ్‌కుమార్ (షూటింగ్), యోగేశ్వర్ దత్ (రెజ్లింగ్)లకు లభించింది. ఇప్పటివరకూ ఏడుగురు షూటర్లకు ఈ పురస్కారం లభించింది.
అర్జున: అర్జున అవార్డులను భారత ప్రభుత్వం 1961లో ప్రారంభించింది. ఐదు లక్షల నగదు బహుమతిని ఇస్తా రు. ఈ ఏడాది 14 మందికి ఇచ్చారు. వారు విరాట్ కోహ్లీ (క్రికెట్), చెక్రవోలు స్వురో (ఆర్చరీ), పి.వి.సింధు (బ్యాడ్మింటన్), కవితాచాహల్ (బాక్సింగ్), రూపేష్ షా (బిలియర్‌డ్స), అభిజిత్ గుప్తా (చెస్), గగన్‌జీత్ భుల్లార్ (గోల్ఫ్), సబా అంజుమ్ (హాకీ), రాజ్‌కుమారి రాథోర్ (షూటింగ్), జోత్స్న చిన్నప్ప (స్క్వాష్), మౌమ దాస్ (టేబుల్ టెన్నిస్), నేహారాధి (రెజ్లింగ్), ధర్మేందర్ దలాల్ (రెజ్లింగ్), అమిత్ కుమార్ సరోహ (పారా అథ్లెటిక్స్).
ద్రోణాచార్య అవార్డు: ద్రోణాచార్య అవార్డును క్రీడా శిక్షకులకు ఇస్తారు. ఈ అవార్డును 1985లో ప్రారంభించారు. రూ. 5 లక్షల నగదు బహుమతిని ఇస్తారు. 2013 సంవత్సరానిగానూ ఐదుగురు కోచ్‌లకు లభించింది. వారు పూర్ణిమా మహతో (ఆర్చరీ), మహావీర్‌సింగ్ (బాక్సింగ్), నరీందర్ సింగ్ సైనీ (హాకీ), కె.పి.థామస్ (అథ్లెటిక్స్), రాజ్‌సింగ్ (రెజ్లింగ్).
ధ్యాన్‌చంద్ అవార్డు: క్రీడల్లో జీవితకాల సాఫల్యానికి గాను ఇస్తారు. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ పేరిట ఈ అవార్డును నెలకొల్పారు. 2002లో ప్రారంభించిన ఈ అవార్డు కింద ఐదు లక్షల రూపాయల నగదు బహుమతిని ఇస్తారు. ఆగస్టు 31, 2013న ధ్యాన్‌చంద్ అవార్డును భారత రాష్ర్టపతి నలుగురికి అందజేశారు. వారు సయ్యద్ అలీ (హాకీ), మేరీ డిసౌజా (అథ్లెటిక్స్), అనిల్‌మన్ (రెజ్లింగ్), గిరిరాజ్ సింగ్ (పారా స్పోర్‌ట్స).
సాహిత్య అవార్డులు
జ్ఞాన్‌పీఠ్ పురస్కారం: ఈ అవార్డును సాహుజైన్ కుటుంబం స్థాపించిన భారతీయ జ్ఞాన్‌పీఠ్ ట్రస్ట్ ప్రతిఏటా ఇస్తుంది. రాజ్యాంగంలోని 22 అధికార భాషలకు చెందిన రచనలకు జ్ఞాన్‌పీఠ్ అవార్డును ఇస్తారు. మొదటి గ్రహీత 1965లో జి. శంకర కురూప్. ఆయన మలయాళ రచయిత. ఇప్పటివరకు 53 మందికి లభించింది. ఈ అవార్డు కింద 11 లక్షల రూపాయలను బహూకరిస్తారు.
మొదటి మహిళా గ్రహీత 1976లో ఆశాపూర్ణాదేవి. బెంగాలీ రచన ప్రథమ్ ప్రతిశ్రుతికిగాను ఆమెకు జ్ఞాన్‌పీఠ్ లభించింది. ఇప్పటివరకూ ఏడుగురు మహిళలు ఈ అవార్డు పొందారు. 2012 కు 48వ జ్ఞాన్‌పీఠ్ అవార్డు విజేత తెలుగు రచయిత రావూరి భరద్వాజ. ఆయన రాసిన పాకుడురాళ్లు నవల కు ఈ అవార్డు లభించింది. ఈ అవార్డు పొందిన మూడో తెలుగు రచయిత రావూరి భరద్వాజ. 1970లో రామాయణ కల్పవృక్షంకు విశ్వనాథ సత్యనారాయణకు, 1988 లో విశ్వంభరకు డాక్టర్ సి. నారాయణరెడ్డికి లభించింది.
మూర్తిదేవి అవార్డు: దీన్ని కూడా భారతీయ జ్ఞాన్‌పీఠ్ సంస్థ ప్రదానం చేస్తుంది. 1983లో ప్రారంభించిన ఈ బహుమతి కింద రెండు లక్షల రూపాయల నగదును ఇస్తారు. 2013 గ్రహీత హరిప్రసాద్ దాస్. ఒడియా భాషలో ఈయన రచించిన ‘వంశ’ అనే గ్రంథానికి ఈ అవార్డు లభించింది.
సరస్వతీ సమ్మాన్: 1991లో కె.కె. బిర్లా ఫౌండేషన్ వారు స్థాపించిన ఈ అవార్డును 22 భాషలలో రచనలకు ఇస్తారు. రూ. పది లక్షల నగదును ఇస్తారు. 2013లో ఈ బహుమతిని మలయాళ రచయిత్రి సుగతా కుమారికి ప్రదానం చేశారు. ఆమె రచన ‘మనలెజుతు’.
వ్యాస్ సమ్మాన్: దీన్ని కూడా 1991లో కె.కె. బిర్లా ఫౌండేషన్ స్థాపించింది. హిందీ రచనలకు మాత్రమే ఇస్తారు. 2.5 లక్షల రూపాయల నగదు బహుమతిని ఇస్తారు. 2012 విజేత నరేంద్ర కోహ్లీ. ‘నభూతో న భవిష్యతి’ అనే హిందీ రచనకు ఆయనకు ఈ అవార్డు లభించింది.
ధైర్యసాహసాలకు ఇచ్చే అవార్డులు
పరమవీరచక్ర: ఇది భారతదేశంలో అత్యున్నత సైనిక పురస్కారం. ఈ అవార్డును తొలిసారిగా నవంబర్ 3, 1947న మేజర్ సోమ్‌నాథ్ శర్మకు మరణానంతరం ప్రదానం చేశారు. పరమవీరచక్ర తర్వాత అత్యున్నత మిలిటరీ అవార్డులు మహావీర చక్ర, వీరచక్ర.
అశోక్ చక్ర: యుద్ధం జరగని సందర్భంలో, శాంతి సమయంలో అత్యున్నత ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి ఇచ్చే అత్యున్నత పురస్కారం. 2012లో ఈ అవార్డు నవదీప్‌సింగ్‌కు మరణానంతరం లభించింది. అశోక్ చక్ర తర్వాత శాంతి సమయంలో ఇచ్చే అత్యున్నత అవార్డులు కీర్తిచక్ర, శౌర్యచక్ర.
రాజీవ్‌గాంధీ జాతీయ సద్భావన అవార్డు
దీన్ని 1992లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేసింది. సద్భావన, జాతీయ సమగ్రత, శాంతిని పెంపొందించేందుకు కృషి చేసిన వారికి రాజీవ్‌గాంధీ జాతీయ సద్భావన అవార్డును ఇస్తారు. ఐదు లక్షల రూపాయల నగదు బహుమతిని ఇస్తారు. ప్రతి ఏటా రాజీవ్‌గాంధీ జయంతి అయిన ఆగస్టు 20న ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఆగస్టు 20ను సద్భావన దివస్‌గా జరుపుకుంటారు. 2013కు సరోద్ వాద్యకారుడు అంజద్ అలీఖాన్‌కు ఈ అవార్డును ప్రదానం చేశారు.
ఇందిరాగాంధీ శాంతి బహుమతి
ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతిని 1986లో ప్రారంభించారు. 25 లక్షల రూపాయల నగదు బహుమతిని ఇస్తారు. 2012 గ్రహీత లైబీరియా దేశాధ్యక్షురాలు ఎలెన్ జాన్సన్ సర్లీఫ్. ఈ అవార్డు లభించిన ప్రముఖులు రాజీవ్‌గాంధీ(1991), వాక్లెద్ హోవెల్(1993), జిమ్మీ కార్టర్ (1997), మహ్మద్ యూనస్ (1998), ఎం.ఎస్ స్వామినాథన్ (1999), కోఫి అన్నన్ (2003), హమీద్ కర్జాయ్ (2005), షేక్ హసీనా (2009), ఇలాభట్ (2011).
లతా మంగేష్కర్ అవార్డు
మధ్యప్రదేశ్ ప్రభుత్వం లతా మంగేష్కర్ సమ్మాన్ అలంకరణ్‌ను 1984 లో ప్రవేశపెట్టింది. నగదు బహుమతి రెండు లక్షల రూపాయలు. 2013 గ్రహీత ప్రముఖ గాయకుడు హరిహరన్.
కాళిదాస్ సమ్మాన్
దీన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం కళలకుగానూ ప్రదానం చేస్తుంది. 1980లో ప్రవేశపెట్టారు. 2012లో ఈ అవార్డును హిందీ నటుడు అనుపమ్‌ఖేర్ స్వీకరించారు.
టాగోర్ కల్చరల్ హార్మనీ అవార్డు
కోటి రూపాయల నగదు బహుమతిని ఇస్తారు. 2013 విజేత పాశ్చాత్య సంగీత కారుడు జుబిన్ మెహతా. ఈ అవార్డును రవీంద్రనాథ్ టాగోర్ 150వ జయంతి సందర్భంగా 2012లో ఏర్పాటు చేశారు. తొలి గ్రహీత సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్.
వివిధ ఏపీపీఎస్సీ పరీక్షల్లో జాతీయ అవార్డులపై అడిగిన కొన్ని ప్రశ్నలు
1.భారతదేశ 64వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా పద్మవిభూషణ్ పొందిన వారు?
2.భారతదేశ 64వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాహిత్యం, విద్యారంగంలో పద్మభూషణ్ అవార్డు ఎవరికి వచ్చింది?
3.2013లో కేంద్ర ప్రభుత్వం ఎంతమందికి పద్మ అవార్డులు అందజేసింది?
4.భారతరత్న అవార్డును పొందిన మొదటి భారతీయ మహిళ?
5.ఇండియాలో శాంతి సమయంలో ధైర్యసాహసాలకు ఇచ్చే అత్యుత్తమ అవార్డు?
6.జ్ఞాన్‌పీఠ్ అవార్డును మొదట అందుకున్నవారు?
7.భారతీయ జ్ఞాన్‌పీఠ్ అవార్డును ఏర్పాటుచేసిన సంవత్సరం?
8.ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతి 2011కి ఎవరు ఎంపికయ్యారు?
9.దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును మొట్టమొదట స్వీకరించింది?
10.ఇండియాలో క్రీడలలో అత్యుత్తమ గౌరవచిహ్నంగా ఇచ్చే అవార్డు?
సమాధానాలు: 1) హైదర్ రజా, 2) మంగేష్ పడ్‌గావ్‌కర్, 3) 108, 4) ఇందిరాగాంధీ, 5) అశోక్ చక్ర,
6) జి.శంకర కురూప్, 7) 1961, 8) ఇలాభట్, 9) దేవికారాణి రోరిచ్, 10) రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న.
జ్ఞాన్‌పీఠ్ అవార్డును మొదట అందుకున్నవారు?
Published Thu, Sep 19 2013 2:14 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement
Advertisement