నేడు ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీలో చర్చ
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ (సీమాంధ్ర) ప్రాంతంలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను పీసీసీ సిద్ధం చేసింది. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు సంబంధించి దాదాపు 50 మంది పేర్లతో తొలి జాబితాను ఒకటి రెండురోజుల్లోనే విడుదల చేయవచ్చని తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు గురువారం ఢిల్లీలో ఏఐసీసీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ భేటీ అవుతోంది. పీసీసీ అధ్యక్షుడు రఘువీరా, మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ, ప్రచార కమిటీ ఛైర్మన్ చిరంజీవి ఈ సమావే శంలో పాల్గొనేందుకు బుధవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. 32 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాలతో పాటు గతంలో పోటీచేసి ఓడిపోయినవారిలో సీనియర్ల పేర్లను కూడా తొలిజాబితాలో ప్రకటించవచ్చని చెబుతున్నారు.
తొలి జాబితాలో 8 మంది ఎంపీలు: సీమాంధ్రలోని 25 లోక్‌సభ స్థానాల్లో ఎనిమిదింటికి ప్రస్తుత ఎంపీల పేర్లనే పార్టీ అధిష్టానం ఖరారు చేయవచ్చంటున్నారు. పీసీసీ నుంచి ఆ స్థానాలకు ఒక్కొక్కరి పేర్లు సూచించింది. కిల్లి కృపారాణి (శ్రీకాకుళం), బొత్స ఝాన్సీ (విజయనగరం), వైరిచర్ల కిషోర్‌చంద్రదేవ్ (అరకు), పళ్లంరాజు (కాకినాడ), కనుమూరి బాపిరాజు (నర్సాపురం), పనబాక లక్ష్మి (బాపట్ల), కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి (కర్నూలు), చింతామోహన్ (తిరుపతి)ల పేర్లను తొలిజాబితాలో ఖరారు చేయవచ్చని తెలుస్తోంది. 15 స్థానాలకు అభ్యర్థుల పేర్లు సిద్ధంగానే ఉన్నా తొలిజాబితాలో ఈ 8మంది పేర్లే ఉండనున్నాయి.
50 మందితో ఏపీ పీసీసీ తొలిజాబితా
Published Thu, Apr 3 2014 2:30 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement