విశాఖ రూరల్, పాడేరు, చోడవరం, న్యూస్‌లైన్: సుదీర్ఘ చరిత్ర కలిగిన ‘ప్రాదేశిక’ పాలనలో సింహభాగం ‘ప్రత్యేక’ పాలన సాగింది. 1959 నుంచి ఇప్పటి వరకు 16 మంది స్పెషల్ ఆఫీసర్లే పరిషత్‌ను పాలించారు. దాదాపుగా 55 ఏళ్ల చరిత్ర ఉన్న విశాఖ జిల్లా పరిషత్‌కు కేవలం ఏడుగురు మాత్రమే చైర్‌పర్సన్లుగా వ్యవహరించారు. ప్రతీ ఎన్నిక, పాలనలోను ఎన్నో ప్రత్యేకతలు, ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. 1959కి ముందు రాష్ట్రంలో జిల్లా బోర్డులు ఉండేవి. ఆ తరువాత జిల్లా పరిషత్, పంచాయతీ సమితులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
పార్టీల రహితంగా జరిగే ఎన్నికల్లో సమితి అధ్యక్షులు జిల్లా పరిషత్ చైర్మన్‌ను ఎన్నుకొనేవారు. 1985 వరకు ఇదే విధానం ఉండేది. ఆ తర్వాత అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు అధికార వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారు. పంచాయతీ సమితిల స్థానంలో మండల ప్రజా పరిషత్‌లను ఏర్పాటు చేశారు. 1985 కంటే ముందు రాజకీయ పార్టీల గుర్తులు లేకుండా ఎన్నికలు జరిగితే.. ఆ తర్వాత పార్టీ గుర్తులపై ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించే విధానం ప్రవేశపెట్టారు. జిల్లా పరిషత్ చైర్మన్‌లను మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మరికొన్ని మార్పులు చేశారు. మండల ప్రజా పరిషత్‌లు మండల పరిషత్‌లు గాను, జిల్లా ప్రజా పరిషత్‌లు జిల్లా పరిషత్‌లుగా మార్చారు. మండల పరిషత్ అధ్యక్షులతో సంబంధం లేకుండా ప్రతీ మండలానికి ఒక జిల్లా ప్రాదేశిక సభ్యుడు (జెడ్పీటీసీ)ని ఎన్నుకోవడం, అలా ఎన్నికైన జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్‌ను ఎన్నుకునే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
1959లో పరిషత్ ఏర్పాటు
రాష్ట్రవ్యాప్తంగా 1959 నవంబర్ 1న జిల్లా పరిషత్‌లు ఏర్పడ్డాయి. తొలి విశాఖ జిల్లా పరిషత్ చైర్మన్‌గా రాజా సాగి సూర్యనారాయణరాజును ప్రభుత్వం నియమించింది. ఆయన 1962 వరకు పాలన సాగించగా ఆ తరువాత తొలిసారిగా పరిషత్‌కు ఎన్నికలు నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన సాగి సీతారామరాజు చైర్మన్‌గా ఎన్నికయ్యారు. మధ్యలో స్వల్పకాలం మినహా 1976 వరకు ఆయనే జెడ్పీ చైర్మన్‌గా కొనసాగారు.
1976 నుంచి 1980 వరకు స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగింది. 1981లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నేత ద్రోణంరాజు సత్యనారాయణ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి నుంచి తొలగించారు. ఆ తర్వాతమాడుగుల నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకుడు బొడ్డేడ రామారావు చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
1987లో ప్రత్యక్ష పద్ధతిలో జెడ్పీ చైర్మన్‌ను ఎన్నుకునే పద్ధతి వచ్చాక బాకూరు చిన అప్పలరాజు తొలి చైర్మన్ అయ్యారు. అనంతరం పరోక్ష పద్ధతిలో మణికుమారి ఎన్నికైనప్పటికీ కోర్టు కేసుతో పదవిని చేపట్టలేకపోయారు. అనంతరం వంజంగి కాంతమ్మ, గొర్లె రామ్మూర్తినాయుడు చైర్‌పర్సన్ పదవులను నిర్వహించారు.
ప్రాదేశిక పాలనే ప్రత్యేకం
Published Wed, Mar 19 2014 12:47 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 AM
Advertisement
Advertisement