ఆనం బ్రదర్స్ గాలి ఎటు పోయిందో?
నెల్లూరు జిల్లాను తమ కంచుకోటగా భావించి.. ఇన్నాళ్లూ ఏకఛత్రాధిపత్యంగా జిల్లా రాజకీయాలను శాసించిన ఆనం సోదరులు ఎన్నడూ లేనట్లుగా ఏకంగా ఈసారి పోటీకే దూరం అవుతున్నారు. సోదరులిద్దరిలో అన్న ఆనం వివేకానందరెడ్డి ముందుగానే తాను ఎన్నికల బరిలోకి దిగకుండా.. తన పెద్ద కొడుకు ఆనం చెంచుసుబ్బారెడ్డి (ఏసీ సుబ్బారెడ్డి)ని నెల్లూరు సిటీ స్థానం నుంచి బరిలోకి దింపారు. ఇప్పుడు అన్నగారి బాటలోనే తమ్ముడు ఆనం రామనారాయణ రెడ్డి కూడా పయనిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆత్మకూరు అసెంబ్లీ స్ధానం నుంచి నామినేషన్ దాఖలు చేసిన రామనారాయణ రెడ్డి, ఇప్పుడు దాన్ని విరమించుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందని, విభజన అనంతరం సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా ఉందని, ఈసారి పోటీ చేస్తే ఓటమి తప్పదన్న భావనతోనే ఆయన ఎన్నికల బరి నుంచి తప్పుకొనే యోచనలో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది. వాస్తవానికి ఇదే ఉద్దేశంతో ఆయన ఇటీవల జరిగిన మున్సిపల్, పంచాయతీ ఎన్నికల విషయాన్ని కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. కొన్నేళ్లుగా ఆనం సోదరుల వెంట ఉన్న ప్రధాన నాయకులు చాలామంది ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. ఒకరిద్దరు తెలుగుదేశం పార్టీవైపు వెళ్లారు. దాంతో అనుచరులు లేకుండా ఎన్నికల బరిలోకి దిగడం ఆత్మహత్యాసదృశం అవుతుందని, అందుకే నామినేషన్ ఉపసంహరించుకోవాలని రామనారాయణరెడ్డి భావిస్తున్నట్లు చెబుతున్నారు. కానీ ఈసారి ఆయన పోటీ చేయకపోతే.. కాంగ్రెస్ తరఫున అభ్యర్థులు కూడా ఎవరూ ఉండేట్లు లేరు. డమ్మీలుగా నామినేషన్లు దాఖలు చేసినవాళ్లు కూడా ఉపసంహరించుకున్నారని, అందువల్ల రామనారాయణరెడ్డి బరిలో ఉండాల్సిందేనని కాంగ్రెస్ పెద్దలు ఆయనకు నచ్చజెబుతున్నట్లు సమాచారం.