పింప్రి, న్యూస్‌లైన్: పుణే లోక్ సభ నియోజక వర్గంలో వేలాది మంది పేర్లు ఓటర్ల లిస్టు నుంచి గల్లంత య్యాయని ఆరోపిస్తూ బీజేపీ అభ్యర్థి అనిల్ శిరోలే శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరాహారదీక్షకు కూర్చున్నారు. ఈ సందర్భంగా శిరోలే మాట్లాడుతూ.. ఓటర్ల పేర్ల గల్లంతుపై పలు అనుమానాలున్నాయన్నారు. ముఖ్యంగా సొసైటీల్లో నివసించేవారి పేర్లు గల్లంతు కావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, ఈ విషయమై కలెక్టర్ సౌరభ్‌రావ్ స్పందిస్తూ పేర్లు గల్లంతైన ఓటర్లు ఉదయం 11 గంటల్లోపు లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేయాలని కోరారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఇదే విషయమై సమాచారం పంపించామన్నారు. అంతకుముందు తమ పేర్లు ఓటర్ల లిస్టు నుంచి గల్లంతయ్యాయని ఆరోపిస్తూ కౌన్సిల్ హాల్ ముందు జిల్లా కలెక్టర్ సౌరభ్ రావును బీజేపీ ఆధ్వర్యంలో వందలాది మంది ఓటర్లు ఘెరావ్ చేశారు. అనిల్ శిరోలే దీక్షాశిబిరంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి సుభాష్ వారే కూడా కనిపించారు.
శిరూర్‌లోనూ 40 వేల ఓట్లు గల్లంతు
శిరూర్ నియోజక వర్గంలో సుమారు 40 వేల ఓట్లు గల్లంతైనట్లు శివసేన కార్పొరేటర్ సులభ ఉభలే ఆరోపించారు. ఓట్లు గల్లంతైన వారికి తిరిగి ఓటుహక్కు వినియోగించుకునేందుకు అవకాశమివ్వాలని ఎన్నికల అధికారి గణేష్ పాటిల్‌ను కోరారు. శిరూర్ నియోజక వర్గంలో సుమారు 40 నుంచి 45 వేల మందికి ఓటింగ్ కార్డులున్నాయని, గత రెండు మూడు ఎన్నికల్లో ఓట్లు వేశారని, అయినప్పటికీ వీరి పేర్లను తొలగించడంపై ఎన్నికల సంఘం జవాబు చెప్పాలన్నారు. ఓవైపు ఓటింగ్ శాతం పెంచడానికి జన జాగృతి కల్పిస్తూ మరోపక్క ఓటర్లను తొలగించడం ఎంత వరకు సబబు అని ఆయన ప్రశ్నించారు.
పుణే బీజేపీ అభ్యర్థి ఆమరణదీక్ష
Published Fri, Apr 18 2014 10:58 PM | Last Updated on Sat, Sep 2 2017 6:12 AM
Advertisement
Advertisement