విశాఖతో ఆత్మీయానుబంధం
- ఇక్కడి ప్రజలు విజ్ఞులు
- వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఘనవిజయం తథ్యం
- వైఎస్‌పై వారికెంతో ప్రేమానురాగాలున్నాయి
- ఆయన ఆకాంక్ష మేరకు విశాఖను అభివృద్ధి చేస్తా
- సాక్షి ఇంటర్వ్యూలో వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ
ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడం తథ్యమని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ఆశాభావం వ్యక్తపరిచారు. ఇదివరకటి వై.ఎస్. రాజశేఖరరెడ్డి స్వర్ణయుగం మళ్లీ రావాలంటే అది ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వల్లనే సాధ్యమని గట్టిగా నమ్ముతున్నారని చెప్పారు. విశాఖ కేంద్రంగా అటు ఉభయగోదావరి జిల్లాల్లో, ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అవిశ్రాంతంగా ఉవ్వెత్తున ఎన్నికల ప్రచారం సాగించిన వై.ఎస్.విజయమ్మ ప్రచారాలకు చివరి రోజైన సోమవారం సాక్షి ప్రతినిధికి చ్చిన ఇంటర్వూలో పలు అంశాలను ప్రస్తావించారు...ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
ఆ ఆత్మీయత మరువలేను...
నా ప్రచారంలో ప్రజల నుంచి అద్భుతమైన స్పందన కనిపించింది. వైఎస్ అన్న పేరు పలికినా, ఆయన పెట్టిన పథకాల గురించి చెప్పినా వారిలో కనిపించిన అనుభూతి, స్పందన మాటల్లో చెప్పనలవికాదు. ఆయన భార్యగా నన్ను చూసేందుకు ప్రతిచోట జనం చూపిన ఆతృత, ఆదరణ బాగా కదిలించింది. వారి కళ్లలోని వెలుగు చూశాక నాపై మరింత బాధ్యత పెరిగిందనిపించింది.
ఇక్కడే ఎందుకు పోటీ అంటే...
వైఎస్ రాజశేఖరరెడ్డికి ఈ ప్రాంతమంటే ఎంతో ప్రేమానురాగాలుండేవి. విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలని, అరకు, భీమిలి ప్రాంతాలను పర్యాటకంగా తీర్చిదిద్దాలని ఎప్పుడూ భావించేవారు. ఆయన ఈ ప్రాంతానికి అనేకరకాల ప్రాజెక్టులను రూపకల్పన చేయించారు. అవన్నీ కార్యరూపం దాల్చాల్సిన అవసరముంది. వైఎస్ ఉంటే పోలవరం ఈపాటికి పూర్తయ్యేదే. దీని ద్వారా విశాఖకు 25 టీఎంసీల నీరు తాగునీటి అవసరాలకు వచ్చేది.
విశాఖను మోడల్ సిటీగా తీర్చిదిద్దుతా...
ఇక్కడి ప్రజలతో నాది ఆత్మీయానుబంధం. ఈ ప్రాంతాభివృద్ధికోసం వైఎస్ అనుకున్నవన్నీ జగన్ తన మేనిఫెస్టోలో చేర్చారు. దాన్ని తప్పకుండా నెరవేరుస్తాం. కేవలం ఓటు వేయించుకొని వెళ్లిపోయే దాన్ని కాదు. ఇక్కడి ప్రజల కష్టసుఖాల్లో ఒక వ్యక్తిగా ఉంటాను. వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తాను. వారి సమస్య వ్యక్తిగతం కావచ్చు, లేదా సామాజికమైన దైనా కావచ్చు ఏ సమయంలో వచ్చి అయినా చెప్పుకోవచ్చు. మెట్రోరైలుతో పాటు అన్ని సదుపాయాలూ ఏర్పరిచి విశాఖను మోడల్ సిటీగా తీర్చిదిద్దుతాను. అరకులో పర్యటించినప్పుడు అక్కడి కొండలపై ఉన్న ప్రజల అవస్థలు నా దృష్టికి వచ్చాయి. వారందరికీ ఉచిత విద్య, వైద్యంతో సహా అన్ని ఏర్పాట్లు కల ఆదర్శగ్రామాలను ఏర్పాటు చేయించాల్సిన అవసరముంది.
ప్రజల కోసం నిలబడినందుకే దుష్ర్పచారాలు...
ప్రజలకు మేలు చేయాలని తపించినందుకే వై.ఎస్.రాజశేఖరరెడ్డిపై తెలుగుదేశం అనేక ఆరోపణలు, దుష్ర్పచారాలు చేసింది. ప్రజల కోసం నిలబడినందుకే జగన్‌నూ అధికార కాంగ్రెస్ ప్రభుత్వం టీడీపీ కుమ్మక్కు అయి ఎన్నో రకాలుగా వేధించారు. 16 నెలలు జైలులో పెట్టించారు. ప్రభుత్వ విధానాల ప్రకారమే వై.ఎస్.రాజశేఖరరెడ్డి పరిశ్రమలు తీసుకువచ్చారు. అయినా తప్పు పట్టారు. చంద్రబాబు హయాంలో రూ.లక్ష మూలధనం ఉన్న ఐఎంజీ సంస్థకు హైదరాబాద్ నగరం నడిబొడ్డున 850 ఎకరాలు ఇచ్చారు. చంద్రబాబుపై ఆరోపణలను నెలరోజుల్లోగా విచారించాలని కోర్టు ఆదేశించినా సీబీఐ తన వద్ద సిబ్బంది లేరని చేతులెత్తి మౌనంగా ఉండిపోయింది. అదే జగన్ విషయానికి వచ్చేసరికి అప్పటి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ఏకంగా కొన్ని బృందాలను రంగ ంలోకి దించి సోదాలు చేశారు.
మహిళలకు అండగా ఉంటాం
వైఎస్ మాదిరిగానే జగన్ మహిళలకు అన్ని రకాలుగా అండగా ఉంటారు. ఓదార్పుయాత్రలో వారు చూపిన ఆదరణ మరువలేనిది. అందుకే అమ్మ ఒడి, వృద్ధులకు పింఛన్ల మొత్తం రూ.700లకు పెంపు, మహిళల పేరిట ఇళ్లస్థలాలు, బ్యాంకు రుణాలు, డ్వాక్రా రుణాల రద్దు వంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు.
విశ్వసనీయతే మా బలం
ఈ ఎన్నికలు విశ్వసనీయతకు, కుళ్లు కుతంత్రాలకు మధ్య జరిగే పోరాటం. విశ్వసనీయతకు పట్టం కట్టాలని ప్రజలకు ఈ ఎన్నికల్లో విజ్ఞప్తి చేశాం. వై.ఎస్.రాజశేఖరరెడ్డి మాట ఇస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకొనే వారు. అదే స్ఫూర్తిగా ప్రజలకిచ్చిన మాటపై నిలబడడానికి జగన్ ఎన్ని కష్టాలు పడ్డారో ప్రజలందరూ చూశారు. అధికారం కోసం ఏనాడూ తాపత్రయపడలేదు. తనను నమ్ముకున్న ప్రజల కోసం పోరాడారు. అందుకే తమ సమస్యలను పరిష్కరించే సత్తా జగన్‌కే ఉందని వారు గట్టిగా నమ్ముతున్నారు.
నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణమే ప్రథమ లక్ష్యం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నవ్యాంధ్రప్రదేశ్ కోసం నవ సూత్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. రాష్ట్ర విభజన చేసింది కాంగ్రెస్ అయితే దానికి మూలకారకుడు చంద్రబాబు. జగన్ ఏనాడూ సమైక్యాన్ని వీడలేదు. జగన్ దీక్షలతో ఆయన్ను సీఎంగా ఎన్నుకుంటేనే వైఎస్ ఆశయాల సాధన సాధ్యమని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేశారు.