సాక్షి, విశాఖపట్నం : చుర్రుమనిపించే సూరీడు.. నిప్పు సెగలు రేగుతున్న నేల. పైనా కిందా ఒకటే మంట. అయినా ఒక ఆత్మీయ చూపు కోసం నిరీక్షించారు. ఒక ఆత్మీయ పలకరింపు కోసం ఎదురు చూశారు. మనసుకు కలిగే ఆనందం ముందు మేనుకు కలిగే కష్టం ఏమాత్రమనుకున్నారు.
మండుటెండనుసైతం లెక్కచేయకుండా షర్మిల, విజయమ్మల వైఎస్సార్ జనభేరి ఎన్నికల ప్రచారానికి జనాలు పోటెత్తారు. ప్రచారం ఆరంభాన ఎంత అభిమానం చూపారో.. ముగింపు రోజున అంతకు మించిన అభిమాన సాగరంలో ముంచెత్తారు. తమ అభిమాన నేత వైఎస్సార్ సతీమణి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పార్టీ తరఫున విశాఖ ఎంపీగా ఎన్నికల బరిలో నిలిచిన వై.ఎస్.విజయమ్మకు అత్యధిక మెజార్టీతో పట్టాభిషేకం చేస్తామని చాటిచెప్పారు.
సోమవారం ఉదయం క్యాంపు కార్యాలయం నుంచి విజయమ్మతోపాటు షర్మిల భీమిలి నియోజకవర్గంలోని మధురవాడలో రోడ్ షో నిర్వహించారు. పార్టీ స్థానిక అభ్యర్థి కర్రి సీతారాం వెంటరాగా.. అక్కడ సభలో భారీగా తరలి వచ్చిన ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
అక్కడి నుంచి మళ్లీ నగరానికి చేరుకుని క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన క్రైస్తవ నాయకుల సమావేశంలో విజయమ్మ పాల్గొన్నారు.
భోజన విరామం తర్వాత విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి కోలా గురువులుతో కలిసి రోడ్ షో నిర్వహించారు. డాల్ఫిన్ హోటల్ జంక్షన్లో అశేషంగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
అక్కడి నుంచి నేరుగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ వెంటరాగా ఆరిలోవ లో రోడ్ షో నిర్వహించారు. భారీగా జనాలు బైక్ ర్యాలీలతో హోరెత్తించారు. రెండో వార్డు అంబేద్కర్ విగ్రహం జంక్షన్లో షర్మిల ప్రసంగానికి యువత ఉర్రూతలూగింది. పవన్ కల్యాణ్, బాలకృష్ణ గురించి అడిగి మరీ షర్మిల నోట కౌంటర్లు విని ఆనందించారు.
అనంతరం ఆరిలోవ నుంచి నగరంలోని పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. ఇక్కడ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కొద్దిసేపే షర్మిల మాట్లాడినా.. మీరంతా జగనన్న వదిలిన బాణాలంటూ.. వారిని అక్కున చేర్చుకున్నారు. విజయమ్మ మాట్లాడుతూ.. పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న సంక్షేమ పథకాల రూపకల్పన వెనక పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తపన, దీక్షను పథకాల వారీగా వివరించారు. మహిళల ఆదరణను చూరగొన్నారు.
రోడ్ షోలో పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, నగర అధ్యక్షుడు మళ్ల విజయ్‌ప్రసాద్, పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు తైనాల విజయ్‌కుమార్, తోట రాజీవ్, పార్టీ నేతలు కోరాడ రాజబాబు, పీలా ఉమారాణి, పసుపులేటి ఉషాకిరణ్, సత్తి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అమ్మను దీవించండి
Published Tue, May 6 2014 12:10 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement