- విశాఖపై జగన్ వాగ్దానాల జల్లు..
- అభివృద్ధికి విశిష్ట ప్రణాళిక
- హర్షధ్వానాల మధ్య వివరించిన జననేత
- అమ్మకు అండగా నిలవాలని వినతి
- జనసంద్రంగా మారిన బీచ్‌సభ
స్వర్ణ విశాఖ అవతరణే లక్ష్యం..హరిత నగర రూపకల్పనే ధ్యేయం..ఐటీలో మేటిగా తీర్చిదిద్దటమే సంకల్పం.. తాము అధికారంలోకి రాగానే మహా నగరాన్ని మహోన్నతంగా ఎలా తీర్చిదిద్దుతామో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వివరిస్తున్నప్పుడు జన కడలి ఆనంద తరంగితమైంది. జగన్‌మోహన్‌రెడ్డి శనివారం సాయంత్రం ఆర్కే బీచ్ వద్ద వైఎస్సార్ జనభేరి బహిరంగ సభలో చేసిన ప్రసంగానికి అద్భుత జన స్పందన లభించింది.
సాక్షి, విశాఖపట్నం : ‘విశాఖను ఒక బంగారు నగరంగా తీర్చి దిద్దుతా. విశాఖపట్నం అంటే నాకు ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంత ప్రేమ లేకపోతే ఇక్కడి నుంచి నా తల్లినే ఎంపీగా నిలబెడుతున్నా. విశాఖ అభివృద్ధి దివంగత మహానేత వైఎస్సార్ హయాంలోనే జరిగింది. గుజరాత్‌తో పోటీపడేలా విశాఖను తీర్చి దిద్దుతా. విశాఖలో అమ్మ అవసరం ఉంది’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్ జనభేరి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం విశాఖ తీరంలో రోడ్‌షో అనంతరం సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖపట్నాన్ని తాను ముఖ్యమంత్రి అయ్యాక ఏ విధంగా అభివృద్ధి చేస్తారో చెప్పారు.
వైఎస్సార్ వల్లే విశాఖ అభివృద్ధి
చంద్రబాబు చూశారు గానీ ఏనాడూ చేసింది లేదు. ఎవరేం చేసినా అది తానే చేసినట్టు చెప్పుకుంటూ.. జనాల జ్ఞాపకశక్తితో ఆడుకోవడం చంద్రబాబుకు అలవాటు. వైఎస్సార్ చెప్పేది తక్కువ.. చేసింది ఎక్కువ.
విశాఖలో విప్రో వచ్చినా.. ఐబీఎం వచ్చినా.. సెజ్ వచ్చినా అది వైఎస్సార్ చలవే. రూ.2 వేల కోట్ల మేర సాఫ్ట్‌వేర్ ఎగుమతులు, అంతర్జాతీయ స్థాయికి విమానాశ్రయం, రాత్రిపూట విమానాల ల్యాండింగ్‌కు బీజం వేసింది వైఎస్సారే.
విశాఖ విమానాశ్రయం రన్‌వే సైజ్ పెంపు, రెండో టెర్మినల్ కట్టిందీ వైఎస్సార్ హయాంలోనే.
విశాఖలో బీఆర్‌టీఎస్ ప్రారంభించి, 80 శాతం పనులు పూర్తి చేసింది వైఎస్సారే. మిగిలిన 20 శాతం పూర్తి చేసేందుకు ఈ ప్రభుత్వాలు నానా యాతనలు పడుతున్నాయి.
అపెరల్ పార్కు ఏర్పాటుతో పది వేల మందికి ఉద్యోగాలు రావడానికి వైఎస్సారే కారణమని జగన్ అన్నారు.
గ్రీన్ విశాఖ
విశాఖపట్నంలో పోర్టు కాలుష్యం, స్టీల్‌ప్లాంట్ కాలుష్యం ఎక్కువ. విశాఖలో కాలుష్యాన్ని తగ్గించి గ్రీన్ సిటీగా చేయాల్సిన అవసరం ఉంది.
విశాఖకు ఐటీ ఎగుమతుల జోన్ తీసుకొస్తాం. ఇవాళ రూ.2 వేల కోట్ల సాఫ్ట్‌వేర్ ఎగుమతులున్నాయి. రాబోయే రోజుల్లో కుప్పలుతెప్పలుగా ఐటీ ఎగుమతులు జరిగేలా చేస్తా.
పోలవరం తీసుకొచ్చి నీటి కొరత తీరుస్తాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తి చేస్తానంటూ విశాఖపై వరాల జల్లు కురిపించారు.
విశాఖ ఎంపీగా తన తల్లి విజయమ్మతోపాటు, అనకాపల్లి ఎంపీ గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్యే అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్(తూర్పు), కోలా గురువులు(దక్షిణం), చొక్కాకుల వెంకటరావు(ఉత్తరం), దాడి రత్నాకర్(పశ్చిమం), తిప్పల నాగిరెడ్డి(గాజువాక), కర్రి సీతారాం(భీమిలి), రొంగలి జగన్నాథం(ఎస్.కోట)ను ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. ఈ సమావేశంలో జగన్ వెంట పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మతోపాటు పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయ్‌ప్రసాద్, పార్టీ నేతలు కొయ్య ప్రసాద్‌రెడ్డి, తిప్పల గురుమూర్తిరెడ్డి, పసుపులేటి ఉషాకిరణ్, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ తదితరులున్నారు.