బాలయ్య స్పీచంటే భయం భయం
'బాలయ్య బాబంటే చూడాలి. ఒక వైపే చూడాలి. ఇంకో వైపు చూస్తే ....' అనుకుంటూ వస్తున్న వారందరూ ఆయన చూయింగ్ గమ్ స్పీచ్ లతో నిరాశపడిపోయారు. దీంతో పార్టీకి కొత్త ఊపు రావడం మాట అటుంచి, నిరుత్సాహం పెరుగుతోందని పార్టీ కార్యకర్తలే అంటున్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం నియోజకవర్గాల్లో సాగిన బాలకృష్ణ చేసిన ప్రసంగంలో స్పష్టత లేకపోవడం కార్యకర్తలు నిరుత్సాహంతో వెనుదిరిగారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో లో పధకాలను, అంశాలను చెప్పడానికి కూడా బాలకృష్ణ పలుమార్లు తడబడ్డారు. అంతే కాదు. ఆయన ఎక్కడా రాష్ట్ర విభజన గురించి మాట్లాడడం లేదు.
కీలకమైన ఈ ఎన్నికల సంగ్రామంలో బాలయ్య ఎంతో అక్కరకు వస్తారని ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్న ఆ పార్టీ అభ్యర్థులు ఉసూరుమన్నారు. బా లకృష్ణ రోడ్‌షోలకు చాలా చోట్ల జనాదరణ కరవైంది. దీనికి తోడు పేలవమైన ప్రసంగాలు, నాయకుల పేర్లు తెలియక బాలయ్య తడబాటు.. వెరసి టిడిపి శ్రేణుల ఉత్సాహాన్ని పూర్తిగా నీరుగార్చాయి.
ఇప్పుడు బాలయ్య బాబు 'మీ ఇంటికొస్తా ... మీ ఊరికొస్తా... మీ నట్టింట్లోకి వస్తా....ప్లేస్ నువ్వు చెప్పినా సరే... నేను చెప్పినా సరే' అంటే చాలు కార్యకర్తలు భయపడిపోతున్నారని టీడీపీ ఆంతరంగికులు చెబుతున్నారు.