నడిరోడ్డుపై బ్యాలెట్ పత్రాలు
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా కృష్ణాయపాలెం ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓటు వేసిన 15 బ్యాలెట్ పత్రాలు నడిరోడ్డుపై దర్శనమిచ్చాయి. ఇక్కడ ఎంపీటీసీ పదవికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాపాక వీరవెంకటకృష్ణ, టీడీపీ తరఫున మిరియాల చినవెంకట్రావు పోటీపడగా, టీడీపీ అభ్యర్థి వెంకట్రావు 5 ఓట్ల తేడాతో విజయం సాధించినట్టు ప్రకటించారు. పోలైన ఓట్లలో 24 చెల్లలేదని పేర్కొన్నారు.
అయితే, కృష్ణాయపాలెం ఎంపీటీసీ స్థానం పరిధిలోని రామన్నపాలెంలో గురువారం ఉదయం 15 బ్యాలెట్ పత్రాలు రోడ్డుపై పడివున్నాయి. వీటిని గ్రామానికి చెందిన మూగ వ్యక్తి ఏరుకుని వెళ్తుండగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తరఫు వ్యక్తులు చూసి అవాక్కయ్యారు. పరిశీలించగా ఆ 15 బ్యాలెట్ పత్రాలపై ఓటు ముద్రవేసి ఉంది. వీటిని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఏలూరు తీసుకువెళ్లి కలెక్టర్‌కు అందజేశారు. ఈ వ్యవహారంపై విచార ణ జరిపి న్యాయం చేయాలని అభ్యర్థి వెంకటకృష్ణ కలెక్టర్‌ను కోరారు.