దత్తన్నకు సికింద్రాబాద్
* బీజేపీ తెలంగాణ అభ్యర్థుల జాబితా విడుదల
* 8 లోక్‌సభ, 21 అసెంబ్లీ స్థానాలకు పేర్లు ఖరారు
* దత్తాత్రేయకు సికింద్రాబాద్ ఎంపీ సీటు
* మహబూబ్‌నగర్ నుంచి నాగం జనార్దనరెడ్డి
* నాగం కుమారుడికి నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే సీటు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో 8 లోక్‌సభ, 21 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ మంగళవారం రాత్రి అభ్యర్థులను ప్రకటించింది. వాస్తవానికి ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో సాయంత్రం అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్టు తొలుత సమాచారం ఇచ్చారు. 7 గంటలకు మీడియాతో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్ మరో పది నిమిషాల్లో జాబితాను వెల్లడిస్తామని చెప్పారు. జాబితా సిద్ధమైందని, అయితే కొన్ని స్థానాల విషయంలో టీడీపీతో చర్చలు జరుగుతున్నాయని అన్నారు.
అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ నివాసానికి వెళ్లిన జవదేకర్ టీడీపీ నేతలతో ఫోన్లో చర్చల్లో పాల్గొన్నారు. చివరకు రాత్రి 11 గంటలకు అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీతో పొత్తులో భాగంగా తెలంగాణలో బీజేపీకి 8 లోక్‌సభ, 47 అసెంబ్లీ సీట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. కాగా ఇంకా 26 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించాల్సి ఉంది.
లోక్‌సభ అభ్యర్థులు వీరే..
కరీంనగర్- సీహెచ్ విద్యాసాగర్‌రావు, నిజామాబాద్-యెండల లక్ష్మీనారాయణ, మెదక్-చాగెండ్ల నరేంద్రనాథ్, సకింద్రాబాద్- బండారు దత్తాత్రేయ, హైదరాబాద్ - భగవంతరావు, మహబూబ్‌నగర్- నాగం జనార్ధనరెడ్డి, వరంగల్ - డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్, భువనగిరి- నల్లు ఇంద్రసేనారెడ్డి.
అసెంబ్లీ అభ్యర్థులు
మంచిర్యాల- మల్లారెడ్డి, అదిలాబాద్-పాయల్ శంకర్, బోథ్ (ఎస్టీ)-మాధవీ సుమలత, ముథోల్ -డాక్టర్ రమాదేవి, ఎల్లారెడ్డి-బానాల లకా్ష్మరెడ్డి, నిజామాబాద్ (అర్బన్)-డి.సూర్యనారాయణ గుప్తా, కోరుట్ల-సురభి భూమారావు, ధర్మపురి(ఎస్సీ)-కన్నం అంజయ్య, సంగారెడ్డి-కె.సత్యనారాయణ, దుబ్బాక-రఘునందన్‌రావు, ఉప్పల్-ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, ముషీరాబాద్-డాక్టర్ కె.లక్ష్మణ్, యాకుత్‌పుర-చరమాని రూప్‌రాజా, మహబూబ్‌నగర్-యెన్నం శ్రీనివాసరెడ్డి, నాగర్‌కర్నూల్-నాగం శశిధర్‌రెడ్డి, కల్వకుర్తి-అచారి, షాద్‌నగర్-ఎన్.శ్రీవర్ధన్‌రెడ్డి, మునుగోడు-గంగిడి మనోహర్‌రెడ్డి, అలేరు-డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, జనగామ-కొమ్మూరి ప్రతాపరెడ్డి, పినపాక-చందా లింగయ్య దొర .